Raksha Bandhan 2023: సోదరుడికి ప్రేమతో... | Raksha Bandhan 2023 Special: Tollywood Movies To Watch With Your Siblings This Rakhi - Sakshi
Sakshi News home page

Raksha Bandhan 2023: సోదరుడికి ప్రేమతో...

Published Thu, Aug 31 2023 4:54 AM | Last Updated on Thu, Aug 31 2023 12:50 PM

Special Story About ten movies on the occasion of Rakhi festival - Sakshi

అన్న గుండె ఆగిపోయిన క్షణాన చెల్లెలి గుండె ఆగిపోతుంది... అందుకే వెండితెరపై అన్నాచెల్లెలి అనుబంధం అనగానే వీరి ‘రక్త సంబంధం’ గుర్తుకు వస్తుంది. ఇంకా తెలుగు తెరపై అన్నా చెల్లెళ్ల అనుబంధంతో చాలా సినిమాలు వచ్చాయి.. ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రాలు చాలానే ఉన్నాయి. ఈ రాఖీ పండగ సందర్భంగా ఓ పది సినిమాల గురించి చెప్పుకుందాం..  

రక్త సంబంధం (1962)  
ఎన్టీఆర్‌–సావిత్రి.. తెలుగు చిత్ర పరిశ్రమలో జంటగా ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న ‘హిట్‌ పెయిర్‌’. అలాంటి హిట్‌ జోడీని అన్నా–చెల్లెలిగా చూపించే సాహసం చేసి, ‘రక్త సంబంధం’ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు వి. మధుసూదనరావు. ఈ అన్నాచెల్లెలి అనుబంధానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఎన్టీఆర్, కాంతారావు, సావిత్రి, దేవిక, సూర్యకాంతం ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘రక్త సంబంధం’. తమిళంలో ఘనవిజయం సాధించిన ‘పాస మలర్‌’ సినిమాకి రీమేక్‌గా ‘రక్త సంబంధం’ రూ΄పొందింది. హీరో–హీరోయిన్లుగా అలరించిన ఎన్టీఆర్‌–సావిత్రిలు ‘రక్త సంబంధం’లో అన్నా, చెల్లెలు పాత్రల్లో జీవించారు. ఈ సినిమా క్లైమాక్స్‌లో రాజు (ఎన్టీఆర్‌), రాధ (సావిత్రి) ఒకేసారి ్రపాణాలు వదలడం ప్రేక్షకుల చేత కన్నీళ్లు తెప్పిస్తుంది. మరణం కూడా విడదీయలేనంత అనుబంధం రాజు–రాధలది. అందుకే అన్నాచెల్లెళ్ల అనుబంధం అనగానే.. ముందుగా గుర్తుకు వచ్చేది ‘రక్త సంబంధం’ చిత్రమే.  

బంగారు గాజులు (1968)
రాము (నాగేశ్వరరావు), రాధ (విజయనిర్మల) అన్నాచెల్లెళ్లు. చెల్లెలి చేతికి బంగారు గాజులు తొడగాలని రాము ఆశ పడతాడు. ఇందుకోసం డబ్బు కూడబెడుతుంటాడు. ఓ రైస్‌ మిల్లులో రాము డ్రైవర్‌గా పని చేస్తుంటాడు. అయితే ఆ రైస్‌ మిల్లు యజమాని రావూజీ కన్ను రాధపై పడుతుంది. రాధను బలవంతం చేయబోతాడు రావూజీ. ఆ సమయంలో రాధ తప్పించుకుంటుంది. ఇదే సమయంలో రాము హంతకుడనే నిందను మోపి అతన్ని జైలుపాలు చేస్తాడు రావూజీ. చెల్లెలిని వెతుక్కునే క్రమంలో రాము హైదరాబాద్‌కి వచ్చి రాధను చూస్తాడు. కానీ రాధ గుర్తు పట్టదు. దీంతో రాము ఆశ్చర్యానికి గురవుతాడు. కానీ హైదరాబాద్‌లో కనిపించిన రాధను తన చెల్లెలిగానే భావిస్తాడు, ఏదో తెలియని ఆత్మీయతతో రామును కూడా రాధ అన్నయ్యలానే భావిస్తుంటుంది. అయితే ఇద్దరు రాధలు ఉన్నారని, ఈ ఇద్దరు కవలలని, అందుకే రాముని హైదరాబాద్‌లో ఉన్న రాధ గుర్తుపట్టలేక పోయిందన్నది ట్విస్ట్‌. ఈ ఇద్దరు చెల్లెళ్లకు బంగారు గాజులు తొడుగుతాడు రాము. నాగేశ్వరరావు, విజయనిర్మల ముఖ్య తారాగణంగా భారతి, పద్మనాభం, గీతాంజలి కీలక పాత్రల్లో నటించిన ‘బంగారు గాజులు’ సినిమాకు సీఎస్‌రావు దర్శకత్వం వహించారు.

చెల్లెలి కాపురం (1971)
రాము (శోభన్‌బాబు)కు చెల్లెలు (మణిమాల) అంటే చాలా ఇష్టం. చెల్లికి పెళ్లి చేయాలని డబ్బు సంపాదించడం కోసం పట్నంలో అడుగుపెట్టిన రాముకు అతని స్నేహితుడు శ్రీరామ్‌ (నాగభూషణం) తారసపడతాడు. స్వతహాగా రచయిత అయిన రాము తన రచనలతో డబ్బులు సంపాదించాలనుకుంటాడు. కానీ రాము ఆహార్యం చూసి, అతని రచనలను అచ్చు వేసేందుకు ప్రచురణ కర్తలెవరూ ముందుకు రారు. రాము విజ్ఞప్తి మేరకు అతని స్నేహితుడైన శ్రీరామ్‌.. రాము రచనలను తన రచనలుగా పబ్లిష్‌ చేయించుకుని, కీర్తి ప్రతిష్ఠలు సంపాదిస్తాడు. ఈ క్రమంలోనే రాము చెల్లిని శ్రీరామ్‌ వివాహం చేసుకుంటాడు. ఆ తర్వాత రాము చెల్లిని ఎలాంటి కష్టాలు పెట్టాడు? ఆ కష్టాల నుంచి ఆమెను రాము, అతన్ని ప్రేమించే రాధ (వాణీ శ్రీ) ఎలా కాపాడారు? శ్రీరామ్‌ తన తప్పు తాను తెలుసుకునేలా రాధ ఏం చేసింది? అన్నదే కథ. కె. విశ్వనాథ్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూ΄పొందింది.

పల్నాటి పౌరుషం (1994)
రెండు కుటుంబాల మధ్య జరిగే కథతో రూ΄పొందిన చిత్రం ‘పల్నాటి పౌరుషం’. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృష్ణంరాజు (భీమినేని బ్రహ్మన్న), రాధిక (సీత) అన్నా చెల్లెలి పాత్రల్లో నటించారు. తనకెంతో ఇష్టమైన చెల్లిని (సీత) వేరే ఊర్లోని రాజారావ్‌ (చరణ్‌రాజ్‌)కి ఇచ్చి వివాహం జరిపిస్తాడు బ్రహ్మన్న. అయితే రాజారావ్‌ బామ్మర్ది సూరిబాబు (సురేశ్‌)కి బ్రహ్మన్న అంటే ఇష్టం ఉండదు. దీంతో కుట్రలతో ఇరు కుటుంబాల్లో కలహాలు తీసుకొస్తాడు సూరిబాబు. ఆ కలహాలకి తన భర్తే కారకుడని తెలుసుకున్న సూరిబాబు భార్య ఆత్మహత్య చేసుకుంటుంది. ఆమె మృతికి బావ బ్రహ్మన్నే కారణమని భావించి, అన్నని కలవొద్దని తన భార్య సీతకు ఆంక్ష విధిస్తాడు రాజారావ్‌. ఆ తర్వాత బ్రహ్మన్న, సీతలకు నిజం ఎలా తెలుస్తుంది? ఈ కుటుంబాలను కలపడంలో తర్వాతి తరం పాత్ర ఎంత... అన్నదే ‘పల్నాటి పౌరుషం’ కథాంశం. తమిళ హిట్‌ మూవీ ‘కిళక్కు సీమయిలే’కు రీమేక్‌ ఇది.  

హిట్లర్‌ (1997)
మాధవరావు అలియాస్‌ హిట్లర్‌ (చిరంజీవి)కు ఐదుగురు శారద (అశ్వని), అనుపమ (మోహిని), లక్ష్మి (పద్మశ్రీ), గాయత్రి (గాయత్రి), సరస్వతి (మీనాకుమారి) చెల్లెళ్లు. మాధవరావు చిన్నతనంలోనే తల్లి మరణించడం, తండ్రి జైలుపాలు కావడంతో ఐదుగురి చెల్లెళ్ల బాధ్యత అతనిపైనే పడుతుంది. చాలా కష్టపడి, వారిని పెంచి, పెద్ద చేస్తాడు మాధవరావు. తన రెండో చెల్లి మోహిని ప్రేమను మాధవరావు సరిగా అర్థం చేసుకోకపోవడం, మొదటి చెల్లి శారద కాపురంలోని ఇబ్బందులు, సవతి తల్లి ఇద్దరు కూతుళ్లను చేరదీయడం వంటి కారణాలతో మాధవరావుకు, అతని చెల్లెళ్లకు మధ్య మనస్పర్థలు వస్తాయి. మరి.. మాధవరావుకు, అతని చెల్లెళ్లకు మధ్య ఉన్న అభి్రపాయభేదాలను బాలు (మోహిని భర్త, మాధవరావు మామయ్య కొడుకు రాజేంద్రప్రసాద్‌) ఎలా పరిష్కరిస్తాడు? మాధవరావు, అతని చెల్లెళ్లు తిరిగి ఎలా కలుస్తారు? ఇందులో బుజ్జి (రంభ) పాత్ర ఏమిటన్నదే ‘హిట్లర్‌’ కథాంశం. సిద్దిఖీ దర్శకత్వంలో రూ΄పొందిన మలయాళ హిట్‌ ఫిల్మ్‌ ‘హిట్లర్‌’కు తెలుగు రీమేక్‌ ‘హిట్లర్‌’లో చిరంజీవి హీరోగా నటించారు.  ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించారు.

శివరామరాజు (2002)
పూసపాటి శివరామరాజు (జగపతిబాబు), రామరాజు (వెంకట్‌), రుద్రరాజు (శివాజీ) అన్నదమ్ములు. ఈ ముగ్గురి అన్నదమ్ములకు ఏకైక చెల్లెలు స్వాతి (మోనికా). అయితే శివరామరాజు కుటుంబంపై పగ తీర్చుకోవడం కోసం శత్రువర్గం నాటకం ఆడి స్వాతిని తమ ఇంటి కోడలుగా చేసుకుంటుంది. ఈ పెళ్లి తర్వాత శివరామరాజు, రామరాజు, రుద్రరాజు తమ ఆస్తిని కోల్పోయి పేదవాళ్లు అయిపోతారు. తనవల్ల పేదరికంలో జీవిస్తున్న అన్నలను చూసి స్వాతి కుమిలిపోతుంటుంది. స్వాతిని అత్తింటి వేధింపుల
నుంచి శివరామరాజు ఎలా కాపాడాడన్నదే చిత్రకథ. అన్నా చెల్లెళ్ల సెంటిమెంట్‌ నేపథ్యంలో వి. సముద్ర ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.

అర్జున్‌ (2004)
అర్జున్‌ (మహేశ్‌బాబు), మీనాక్షి (కీర్తి రెడ్డి) కవలలు. మీనాక్షి, ఉదయ్‌ (రాజా) ప్రేమించుకుంటారు. తనకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని మీనాక్షికి ఉదయ్‌ ఓ లేఖ రాస్తాడు. ఈ లేఖను అర్జున్‌కు చూపిస్తుంది మీనాక్షి. దీంతో ఉదయ్‌ తల్లిదండ్రులు బాలానాయర్‌ (ప్రకాష్‌రాజ్‌),
ఆండాళ్‌ (సరిత) అతనికి చేయాలనుకున్న అమ్మాయితో కాకుండా, మీనాక్షి తో వివాహం జరిగేలా చేస్తాడు అర్జున్‌. అంతా బాగానే ఉందనుకుంటున్న తరుణంలో బాలానాయర్, ఆండాళ్‌లు కలిసి మీనాక్షిని చంపి, ఉదయ్‌కు మరో అమ్మాయితో వివాహం చేయాలనుకుంటున్నారనే ఆలోచనలో ఉన్నట్లుగా అర్జున్‌కు తెలుస్తుంది. అప్పుడు మీనాక్షిని రక్షించేందుకు సోదరుడిగా అర్జున్‌ ఏం చేశాడు? మధుర మీనాక్షి అమ్మవారి సాక్షిగా మీనాక్షిని ఎలా కాపాడుకున్నాడు– అన్నదే అర్జున్‌ కథ. గుణశేఖర్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూ΄పొందింది.

‘పుట్టింటికి రా చెల్లి’ (2004)
చిన్నతనంలోనే శివన్న (అర్జున్‌) తల్లి కన్నుమూస్తుంది. దీంతో చెల్లెలు లక్ష్మి (మధుమిత) ఆలనాపాలన శివన్నపై పడుతుంది. సేద్యం చేస్తూ  చెల్లెల్ని చదివిస్తాడు శివన్న. తన చెల్లెలు ప్రేమించిన అజయ్‌ (శ్రీనాథ్‌)తోనే ఆమె వివాహం జరిపిస్తాడు. ఈ పెళ్లి ఇష్టం లేని అజయ్‌ కుటుంబ సభ్యులు లక్ష్మిని నిత్యం వేధిస్తుంటారు. అంతేకాదు.. ఎలాగైనా లక్ష్మి ఇంట్లో నుంచి వెళ్లిపోయేలా చేసేందుకు ఓ పెద్ద నింద వేస్తారు. అది నమ్మిన అజయ్‌ గర్భవతిగా ఉన్న లక్ష్మిని పట్టించుకోడు. పుట్టింటికి రమ్మని శివన్న వచ్చి లక్ష్మిని వేడుకుంటాడు. నిందతో రాను.. నిప్పులా వస్తానని అన్నకు చెబుతుంది లక్ష్మి. ఆ తర్వాత లక్ష్మిపై పడ్డ నిందని శివన్న ఎలా చెరిగిపోయేలా చేశాడు– అనే కథాంశంతో ‘పుట్టింటికి రా చెల్లి’ సినిమా రూ΄పొందింది. అర్జున్, మీనా జంటగా కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన చిత్రమిది.  



రాఖీ (2006)
అల్లారుముద్దుగా పెరిగిన తన చెల్లి చావుకి కారణమైన ఆమె అత్తింటి వారిపై ఓ అన్నగా, తోడ పుట్టకపోయినా.. సమాజంలోని కొందరు యువతులపై దౌర్జన్యం చేసినవారిపై రాఖీ బ్రదర్‌గా రామకృష్ణ ఎలా పగ తీర్చుకున్నాడు? అనే కథాంశంతో ‘రాఖీ’ సినిమా రూ΄పొందింది. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ హీరోగా నటించారు. రామకృష్ణ అలియాస్‌ రాఖీ (ఎన్టీఆర్‌)కి చెల్లెలు గాయత్రి (మంజూష) అంటే అమితమైన ప్రేమ. ఐదు లక్షల కట్నం ఇచ్చి రవివర్మతో గాయత్రి వివాహం జరిపిస్తారు రాఖీ, కుటుంబ సభ్యులు. అయితే తన కొడుక్కి కోటి రూపాయల కట్నం వస్తుందని తెలుసుకొని మూడు నెలల గర్భవతి అయిన గాయత్రిని కిరోసిన్‌ పోసి చంపేస్తారు అత్తింటివారు. కానీ, వారు నిర్దోషులంటూ కోర్టులో కేసు కొట్టేస్తారు. దీంతో తన చెల్లిని చంపిన అత్తింటి వారందర్నీ కారుతో సహా పెట్రోల్‌ పోసి తగులబెడతాడు రాఖీ. తన చెల్లెలి కేసుకు వ్యతిరేకంగా వాదించిన లాయర్‌ని, దొంగ సాక్ష్యం ఇచ్చిన డాక్టర్‌ని, పోలీసు అధికారులని కూడా పెట్రోల్‌ పోసి తగులబెడతాడు. ఆ తర్వాత ఏ
మహిళకు అన్యాయం జరిగినా అందుకు కారకులైన వారిని పెట్రోల్‌ పోసి తగులబెడుతుంటాడు. వరుస హత్యలు చేస్తున్న రాఖీని పోలీసులు పట్టుకున్నాక కోర్టు అతనికి శిక్ష విధించిందా? అన్నది ఈ చిత్ర కథాంశం.   

గోరింటాకు (2008)
అశోక్‌ (రాజశేఖర్‌)కి చెల్లెలు లక్ష్మి (మీరా జాస్మిన్‌) అంటే పంచ్రపాణాలు. చిన్నతనంలోనే తల్లితండ్రులు చనిపోవడంతో అన్నీ తానై చెల్లెల్ని పెంచి పెద్ద చేస్తాడు అశోక్‌. చెల్లికి పెళ్లి అయ్యేవరకు తాను కూడా చేసుకోకూడదనుకుంటాడు. చెల్లెలు ప్రేమించిన అబ్బాయి ఆకాశ్‌కి ఇచ్చి పెళ్లి చేస్తాడు. అయితే ఆకాశ్‌ని ఆస్తి కోసం అయినవాళ్లే మోసం చేసి, జైలుకి పంపిస్తారు. ఈ విషయాన్ని అన్నయ్యకి చెప్పి, సాయం అడుగుదామని ఇంటికి వచ్చిన లక్ష్మిని.. అశోక్‌ భార్య నందిని (ఆర్తి అగర్వాల్‌) అవమానించి పంపించేస్తుంది. భర్త జైలులో ఉండటం..అన్నయ్యను కలిసే అవకాశం లేకపోవడం.. పిల్లలు ఆకలితో అలమటిస్తుండడంతో.. ఏం చేయాలో పాలుపోని లక్ష్మి.. పిల్లలతో సహా బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. విషయం తెలిసి లక్ష్మి భౌతిక కాయం వద్ద అశోక్‌ కన్నీరు మున్నీరుగా విలపిస్తూ.. అక్కడే ్రపాణాలు విడవడం ప్రేక్షకులతో కన్నీరు పెట్టిస్తుంది. కన్నడ హిట్‌ ‘అన్న తంగి’కి రీమేక్‌గా వీఆర్‌ ప్రతాప్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూ΄పొందింది.  


కాగా, 2008 నుంచి ఇప్పటివరకు అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో పలు చిత్రాలు వచ్చాయి. ఇటీవల ‘భోళా శంకర్‌’లో చిరంజీవి, కీర్తీ సురేశ్, రెండేళ్ల క్రితం వచ్చిన ‘పెద్దన్న’లో రజనీకాంత్, కీర్తీ సురేశ్‌ అన్నాచెల్లెళ్లుగా నటించిన విషయం తెలిసిందే.              

రాఖీ స్పెషల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement