ఒక విజయం కోసం 105 రోజుల ఎదురుచూపు, రోజూ పిల్లలాటలు, కుమ్ములాటలు. అలకలు, బుజ్జగింపులు, ఎలిమినేషన్‌లు, వైల్డ్‌కార్డ్ ఎంట్రీలు... కొన్ని రాజీల మధ్య బిగ్‌బాస్ నాలుగో సీజన్ కూడా పూర్తయింది. విజేత అభిజీత్. కంటెస్టెంట్‌లందరూ ఇన్ని రోజులు ప్రేక్షకుల ఇళ్లలో ఒకరిగా కలిసిపోయారు. ఒక్కో కంటెస్టెంటూ వెళ్లిపోతుంటే హౌస్‌లో ఉన్న తోటి కంటెస్టెంట్‌లతోపాటు ప్రేక్షకులు కూడా బాధపడ్డారు. ఇన్ని అడ్డంకులనూ దాటుకుని విజేతగా నిలిచిన అభిజీత్‌కు తెర ముందు కనిపించే ప్రశంసలతోపాటు తెర వెనుక కూడా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ విజయం అందరిదీ
అదృష్టం అనాలో దేవుడి రాత అనాలో తెలియదు కానీ, నా ప్యాషన్‌ని ప్రదర్శించడానికి మంచి అవకాశం వచ్చింది. మనకేది ఇష్టమో అదే చేయాలి. ఆ పనిని పర్‌ఫెక్ట్‌గా చేయాలి. బిగ్‌బాస్ హౌస్‌లో ఉండగలగడం అంత సులభం ఏమీ కాదు. సవాళ్లతో కూడుకున్న పని, చాలా కష్టమైన విషయమే, అయితే ఇది చాలా మంచి అనుభవం. హౌజ్‌లో ఉన్నంత కాలం ఇంట్లో వాళ్లందరూ గుర్తుకువచ్చారు. ఫ్రెండ్స్ గుర్తొచ్చారు. నేను విజేతగా నిలవడానికి నాకు తెలియని వాళ్లు కూడా సహాయం చేశారు. అందరికీ కృతజ్ఞతలు.
– అభిజీత్
బిగ్‌బాస్ 4 విజేత తనే అవుతాడని అభిజీత్ అనుకున్నాడో లేదో కానీ, వాళ్ల అమ్మ లక్ష్మీప్రసన్న మాత్రం బలంగా నమ్మారు. ఎందుకంటే అతను హౌస్‌లోకి వెళ్లిన కొద్దిరోజులకే ‘మా అబ్బాయిని 105 రోజులపాటు మిస్ అవుతున్నాం’ అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ‘హౌస్‌లోకి వెళ్లేటప్పుడే విజేతగా తిరిగి వస్తాడని ఊహించా’నని ఇప్పుడు చెప్పారు లక్ష్మీ ప్రసన్న. అభిజీత్ విజేతగా నిలవడంతో అతని గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి అందరిలోనూ పెరిగిపోయింది.
బ్యూటిపుల్ లైఫ్
అభిజీత్... మదనపల్లెలోని రిషీవ్యాలీ స్కూల్‌లో చదివాడు. హైదరాబాద్‌లోని లిటిల్ ఫ్లవర్స్ జూనియర్ కాలేజ్ తరవాత జేఎన్‌టీయూలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్‌లో చేరాడు. క్యాంపస్ ప్లేస్‌మెంట్‌తో ఉద్యోగంలో చేరి ఉంటే అభిజీత్ అనే ఒక నటుడు తెలుగు తెరకు పరిచయమయ్యే వాడే కాదేమో! ఫైనల్ ఇయర్‌లో ఉండగానే ఫ్రెండ్‌తో కలిసి సరదాగా ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ ఆడిషన్‌కెళ్లాడు. శేఖర్ కమ్ముల అంచనా తప్పలేదు. స్పార్క్ ఉన్న కుర్రాడిని చేజార్చుకోలేదతడు. అలా తెర మీదకొచ్చాడు అభిజీత్. ఇదంతా జరిగింది 2012లో. ఆ సినిమా పూర్తయిన తర్వాత తిరిగి చదువుకోసం అమెరికాకి వెళ్లాడు. మసాచుసెట్స్, నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ మేనేజ్‌మెంట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు అభిజీత్. ఆ తర్వాత మళ్లీ ‘రామ్‌లీలా, మిర్చిలాంటి కుర్రాడు’ సినిమాలు చేశాడు. మూడేళ్ల కిందట వెబ్ సీరీస్ ‘పెళ్లిగోల’లో నటించాడు. అవి మూడు సీజన్‌లు పూర్తయ్యాయి. అంతలో బిగ్‌బాస్‌లో సహజ నటనకు తెరతీశాడు. ఇక ఆ తర్వాత అభిజీత్ అందరికీ తెలిసిన వాడయ్యాడు.
(చదవండి: అఖిల్ నిజంగానే బకరా అయ్యాడా?!)
ప్రిన్సిపల్ నుంచి ఫోన్
అభిజీత్ గురించి ఎవరికీ తెలియని ఓ సరదా సంఘటన రిషీవ్యాలీ స్కూల్‌లో ఉన్నప్పుడు జరిగింది. పిల్లల్లో ఓ కుర్రాడు ‘ఎవరికైనా ధైర్యం ఉంటే ఆ పోల్ ఎక్కగలరా’ అన్నాడు. ఆ చాలెంజ్‌ని స్వీకరించి స్తంభాన్ని ఎక్కేశాడు అభిజీత్. అది ప్రిన్సిపల్‌కి తెలిసింది. తల్లిదండ్రులకు ఫోన్ వచ్చింది. ‘మీ వాడిని చదువు విషయంలో తప్పుపట్టడం లేదు. కానీ అల్లరి ఎక్కువ. ఇలా చేస్తుంటే కష్టం’ అన్నారు. పిల్లల చురుకుదనం తల్లిదండ్రులకు సంతోషాన్నిస్తుంది. కానీ మరీ ఇంత చురుగ్గా ఉంటే సంతోషంతోపాటు భయం కూడా వెంటాడుతుంటుంది. ‘‘మా అభి సవాళ్లను స్వీకరించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. గెలవాలనే ఆకాంక్ష మెండు. అతడు హౌస్‌లోకి వెళ్లేటప్పుడే విజేతగా తిరిగి వస్తాడని ఊహించాను. నా మనసుకు అలా అనిపించింది’’ అన్నారు లక్ష్మీ ప్రసన్న.
స్కూల్ నేర్పిన పరిణతి
‘‘రిషీవ్యాలీ హాస్టల్‌లో ఉన్నప్పుడు కూడా రోజూ ఫోన్‌లో మాట్లాడేదాన్ని. యూఎస్‌లో ఉన్నన్ని రోజులు రోజూ వీడియో కాల్‌లో మాట్లాడేదాన్ని. ఇన్ని రోజులు అభితో మాట్లాడకుండా ఉన్నది ఇప్పుడే. బిగ్‌బాస్ షోలో రోజూ చూస్తూనే ఉన్నాను. కానీ మాట్లాడలేకపోవడంతో డిజప్పాయింట్‌మెంట్‌కు లోనయ్యాను. బిగ్‌బాస్ చాలెంజ్ అభికి కాదు అసలైన చాలెంజ్ నాకే’’ అన్నారు లక్ష్మీ ప్రసన్న. ‘‘అభిని నేను తీర్చిదిద్దానని చెప్పడం కంటే రిషీ వ్యాలీ స్కూలే అలా తీర్చిదిద్దింది. జిడ్డు కృష్ణమూర్తి ఫిలాసఫీని ఒంటపట్టించుకున్నాడు. స్వతంత్ర వ్యక్తిత్వంతోపాటు సరైన నిర్ణయాలు తీసుకోగలిగిన మానసిక పరిపక్వత వచ్చింది. ఆ లక్షణాలే అభిని ఈ రోజు విజేతగా నిలిపాయి’’ అన్నారామె సంతోషంగా. ‘‘తన కళ్ల ముందు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోడు. వెంటనే స్పందిస్తాడు. రోడ్డు మీద ఎవరైనా రూల్స్ పాటించకుండా వాహనం నడుపుతున్నా కూడా వెంటనే వెళ్లి వాళ్లతో ‘ఇలా చేయడం తప్పు’ అంటాడు. అలాగని ఊరికే గొడవలు పడడు. స్వతహాగా తను స్మార్ట్ బాయ్, క్వైట్ కూడా’’ అన్నారు తండ్రి మన్‌మోహన్.
(చదవండి: బిగ్‌బాస్ తీరుపై అభిమానుల ఆగ్రహం)
ఇదీ కుటుంబం
అభిజీత్ పూర్వికులు హైదరాబాద్ స్థానికులు. ముత్తాతలు చార్మినార్ నిర్మాణంలో భాగస్వాములు. తాత నాగయ్య ఆదిలాబాద్ కడెం ప్రాజెక్టు నిర్మాణంలో పాలుపంచుకున్నారు. హైదరాబాద్, దోమల్‌గూడలో తాత నాగయ్య దాదాపుగా ఎనభై ఏళ్ల కిందట కట్టిన ఇంట్లోనే ఇప్పుడు అభిజీత్ కుటుంబం నివసిస్తోంది. తండ్రి మన్‌మోహన్ భవన నిర్మాణ రంగం నుంచి వ్యవసాయరంగానికి మారారు. అభిజీత్ తమ్ముడు అభయ్ వ్యవసాయం పనులు చూస్తున్నాడు. తల్లి ప్రసన్న కేటరింగ్ అండ్ ఫుడ్ టెక్నాలజీ హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు చేశారు. కానీ కుటుంబ బాధ్యతల రీత్యా గృహిణిగా ఉండిపోయారు. అభిజిత్ పెట్ లవర్. మంచి శివభక్తుడు, పోకర్ ఆటను ఇష్టపడే అభిజీత్‌కి బైక్ రేసింగ్ అంటే మంచి సరదా.
స్థితప్రజ్ఞత
బిగ్‌బాస్ ఇచ్చిన టాస్కులో గెలవడానికి తొందరపడకపోవడం, ఎలిమినేషన్ సమయంలో ఆందోళన పడకపోవడం... ఈ రెండు లక్షణాలూ అభిజీత్‌లో కనిపిస్తాయి. ఈ లక్షణాలే అందరిలో ఒకడిగా కాకుండా అతడిని ఒకే ఒక్కడిగా నిలిపాయి. ముప్పై రెండేళ్లకు ఇంతటి స్థితప్రజ్ఞత ఎలా అలవడింది అని ముచ్చటపడేలా చేశాయి. ‘చదువుకున్నవాడినని అతడికి గర్వం ఎక్కువ’ అనే అభిప్రాయాలకు కూడా కారణమయ్యాయి. ‘ఇక్కడ అందరూ సమానమే’ అని ఒక సందర్భంలో నాగార్జున హెచ్చరించారు కూడా. అభిజీత్ నటించిన సినిమాల్లో కూడా ‘అతడు తన పాత్రకు తగినట్లు హుందాగా నటిస్తాడు. పాత్రోచిత నటనకే పరిమితమవుతాడు తప్ప సన్నివేశంలో తనను డామినేట్ చేసే ప్రయత్నం చేయడు, పాత్రను తేలిక చేయడు అని సినీ విమర్శకుల ప్రశంసలు పొందిన నటుడు అభిజీత్.
– వాకా మంజులారెడ్డి, ఫీచర్స్ ప్రతినిధి
Comments
Please login to add a commentAdd a comment