చూపులు గుమ్మం మీదే ఉండేవి. చెవులు సైకిల్ బెల్ కోసం రిక్కించేవి. ‘పోస్ట్’ అన్న పిలుపూ ఆ వెంటనే గేటు మీదుగా ఊపుగా వచ్చి పడే జాబు.. ఇవి ఎన్నో ఇళ్లను వెలిగించేవి. ఎన్నో ఇళ్లను ఓదార్చేవి. కొన్నింటిని విచారంలో ముంచేసేవి. పోస్ట్‌మేన్ వచ్చి పోతున్నాడంటే ఆ ఇల్లు సజీవంగా ఉన్నట్టు అర్థం. ప్రతి ఇంటి ఖాకీ బట్టల బంధువు పోస్ట్‌మేన్. ఆ జ్ఞాపకాలు, ఆ కథలు, అతడు ఉన్న సినిమాలు... మరపు రావు ఆ పాత రోజులు.
‘‘ఇన్ని ఇళ్లు తిరిగినా నీ గుండె బరువు దింపుకోవడానికి ఒక్క గడప లేదు... ఇన్ని కళ్లు పిలిచినా ఒక్క నయనం నీ కోటు దాటి లోపలికి చూడదు. ఉత్తరం ఇచ్చి నిర్లిప్తుడిగా వెళ్లిపోయే నిన్ను చూసినప్పుడు తీరం వదిలి సముద్రంలోకి పోతున్న ఏకాకి నౌక చప్పుడు’ అని రాశాడు కవి దేవరకొండ బాలగంగాధర తిలక్ ‘తపాలా బంట్రోతు’ కవితలో. ప్రపంచంలో అతి పెద్ద తపాలా వ్యవస్థ మన దేశంలో ఉన్నా దాని వాహకుడు మాత్రం పోస్ట్‌మేనే. పోస్టాఫీసును, పోస్టు డబ్బాను, పోస్టు కోసం ఎదురు చూసే ఇంటిని పోస్ట్‌మేనే కలుపుతాడు. కబురు తెస్తాడు. కొలువు కాగితం తెస్తాడు. క్షేమ సమాచారం తెలుపుతాడు. కాని గుక్కెడు మంచినీళ్లు కూడా తాగే తీరిక లేకుండా సైకిల్ మీద పెడల్ తొక్కుతూ మరో గడపకు చేరుకుంటాడు.
అక్టోబర్ 9 ‘ప్రపంచ తపాలా దినోత్సవం’. 1874లో అంతర్జాతీయ పోస్టల్ యూనియన్ ఏర్పడిన సందర్భంగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఇవాళ పోస్ట్‌మేన్ సేవలు మారవచ్చు. పోస్ట్‌మేన్ ప్రాధాన్యం మారవచ్చు. సెల్‌ఫోనే కలం, కాగితంగా మారాక, జనం రాయడం మర్చిపోయాక, ఉత్తరానికి ఉన్న ఆఘ్రాణింపు కరువైపోయాక పోస్ట్‌మేన్‌తో బంధం పలుచబడింది కాని ఇరవై ముప్పై ఏళ్ల క్రితం పోస్ట్‌మేన్ కబుర్ల రారాజు. ప్రతి ఇంటి దగ్గరి మనిషి. సంచినిండా జీవితాలను మోసుకుంటూ వచ్చే వాహకుడు.
పది దాటాక...
ఉదయం పది దాటాక ఎప్పుడైనా పోస్ట్‌మేన్ రావచ్చు. ఎండ కాయనీ, వాన కుమ్మరించనీ, చల్లగాలులు చిమ్ముకుంటూ తిరగనీ.. పోస్ట్‌మేన్ రావాల్సిందే. రాకపోతే ఏమవుతుంది? లోకం కదలదు. దూరాన సైన్యంలో ఉన్న కొడుకు క్షేమం తెలియదు. మెట్టినింట నెలలతో ఉన్న కూతురు ఎప్పుడు తనను తీసుకెళ్లమంటుందో తెలియదు, స్నేహితుడు పెట్టుకున్న కుమారుడి పెళ్లికబురు తెలియదు. దగ్గరి చుట్టం అవసరానికి ఏదో అడిగితే సాయం గురించి ఆలోచన చేయడం తెలియదు, మీ అమ్మాయి మాకు నచ్చింది... త్వరలోనే నిశ్చితార్థం పెట్టుకుందాం అనే మాట ఉత్తరంలో కాకుండా ఇక దేనిలో తెలుస్తుంది. పరాయి దేశం వెళ్లిన భర్తకు భార్య గురించి భార్యకు భర్త గురించి ఉత్తరమే కదా తెలిపేది. అందుకే అందరూ వీధి గుమ్మం వైపు చూసేవారు. పనులకు మగవాళ్లు వెళ్లిపోగా చేటలో బియ్యం చెరుగుతూ, స్టౌ మీద కూరను గరిటెతో కలియబెడుతూ స్త్రీలు ఒక కన్ను వీధి వైపు వేసేవారు. పోస్ట్ అన్న కేక వినగానే పెట్టే పరుగు ప్రతి ఇంటి వీధి గుమ్మానికి తెలుసు.
మని ఆర్డర్.. టెలిగ్రామ్
ఇప్పుడు ఫోన్‌పే, గూగుల్ పే, ఆన్‌లైన్ బ్యాంకింగ్.. క్షణంలో డబ్బు ట్రాన్స్‌ఫర్. కాని ‘మనీఆర్డర్’లో ఉండే మజా ఇప్పుడు ఎక్కడా? దాని కోసం ఎదురు చూస్తూ... ఇవాళ రాలేదు మాష్టారు అని పోస్ట్‌మేన్ చెప్తే నిరాశ పడుతూ... తీరా వచ్చాక అందులో నుంచి ఒక రూపాయో ఐదో పోస్ట్‌మేన్ చేతిలో పెట్టి సంతోషపడుతూ... మధురం. ఇక అర్జెంట్ కబురుకు టెలిగ్రామ్ వచ్చిందంటే అందరి గుండే గుబగుబే. టెలిగ్రామ్ ఎందుకనో దుర్వార్తకే స్థిరపడింది కాని ‘ఉద్యోగం వచ్చిందనో’, ‘మనమరాలు పుట్టిందనో’ అది మాత్రం మంచి కబురు తేలేదా?
చదువరి
పోస్ట్‌మేన్ ఈ దేశంలో కేవలం ఉత్తరం అందించి ఊరుకోలేదు. దానిని చదివి కూడా పెట్టాడు. కోట్లాదిగా ఉండే నిరక్షరాస్య భారతీయులకు పోస్ట్‌మేనే చదువరి. ‘కాస్త చదివిపెట్టు నాయనా’ అంటే వచ్చిన ఉత్తరాన్ని చదివిపెట్టేవాడు. కాస్త రాసి పెట్టు నాయనా అంటే రాసిపెట్టేవాడు. అందరి కష్టసుఖాలు అతనికి తెలుసు. ఇందరు బంధువులు ఉండే భాగ్యం ఏ వృత్తిలోనూ మరొకరికి సాధ్యం కాదు. అందరూ అతని ద్వారా తమవారి క్షేమసమాచారాలు తెలుసుకునేవారే తప్ప అతని క్షేమం గురించి ఆలోచించేవారు కాదు. దసరా పండుగనాడు రెండు రూపాయల మామూలే పోస్ట్‌మేన్‌కు పెన్నిధి.
కథలను నడిపించినవాడు
అసలు పోస్ట్‌మేన్ లేకపోతే తెలుగులో చాలా కథలు మొదలై ఉండేవి కావు. ‘పోస్ట్ అన్న కేకతో పడక్కుర్చీలోని పరంధామయ్యగారు ఉలిక్కిపడ్డారు’ అనే వాక్యంతో వందలాది కథలు మొదలవుతాయి. ఆర్.కె.నారాయణ్ ‘మాల్గుడి డేస్’లో ఆ ఇంటి ఆడపిల్లను కూతురికి మల్లే వాత్సల్యంగా చూసే పోస్ట్‌మేన్ ఆ పిల్ల పెళ్లికి రెండు రోజుల ముందు వచ్చిన బంధువు చావు వార్తను దాచేస్తాడు. పెళ్లయ్యాకే ఆ ఉత్తరం ఇచ్చి పెళ్లి మూడ్ పాడు కాకుండా చూస్తాడు. రవీంద్రనాథ్ టాగోర్ ‘ది పోస్ట్‌మాస్టర్’ కథ ప్రఖ్యాతం. అసలు పోస్ట్‌మేన్ ఉన్నాడని రాసింది తీసుకెళ్లి ఇస్తాడని ఎందరో పెద్దలు కార్డు ముక్కనో, ఇన్‌లేండ్ కవర్‌నో సాహితీ పత్రంగా మార్చేశారు.
పోస్ట్‌మేన్ చేతుల మీదుగా నడిచిన ‘లేఖా సాహిత్యం’ అపూర్వం. కందుకూరి లేఖలు, గురజాడ లేఖలు, సి.ఆర్.రెడ్డి– రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ మధ్య నడిచిన లేఖలు, త్రిపురనేని రామస్వామి చౌదరి అలనాడు ముట్నూరి కృష్ణారావుకు రాసిన లేఖలు, చలం ‘ప్రేమలేఖలు’, త్రిపురనేని గోపిచంద్ ‘పోస్ట్ చేయని ఉత్తరాలు’... ఎన్నని. ఇవాళ ఈ రాసే లేఖా సాహిత్యం అంతమైంది. పోస్ట్‌మేన్ రిక్తహస్తాలతో నిలబడ్డాడు.
మనిషి స్పర్శ
ఉత్తరం అంటే మనిషి స్పర్శ. మనిషి తాకిన లేఖను మరో మనిషి తాకుతాడు. మనిషి రాసిన రాతను మరొక మనిషి చదువుతాడు. ఈ మొత్తంలో స్పర్శ ఉంది. దగ్గరి తనం ఉంది. ఒక ఎస్.ఎం.ఎస్, ఒక వాట్సప్ మెసేజ్, ఒక ఈ మెయిల్ అందరిదీ అందరికీ ఒక్కలాగే కనిపిస్తుంది. కాని ఉత్తరం అలా కాదు. అది మనిషి మనిషికి మారుతుంది. ఆ స్పర్శ ఇవాళ మిగల్లేదు. దానికి ప్రత్యక్షసాక్షి అయిన పోస్ట్‌మేన్ ముఖం తెలియడం లేదు. ఇవాళ పోస్టాఫీసులు, పోస్ట్‌మేన్‌లు సామాన్యుల ఆర్థిక లావాదేవీలలో ఎక్కువ సేవలు అందిస్తున్నారు. మిస్సవుతున్నదల్లా ‘ఉత్తరం వచ్చిందా’ అనే ప్రశ్న... ‘పోస్ట్’ అనే పిలుపు.
– సాక్షి ఫ్యామిలీ
Comments
Please login to add a commentAdd a comment