మార్చి 21... సూర్యుడు సూర్యుడిని పలకరించే రోజు. సెప్టెంబర్ 21... సూర్యుడు సూర్యుడిని పలకరించే మరో రోజు. సూర్య కిరణాలు సూర్యుడి విగ్రహాన్ని తాకే రోజులివి. మొధేరా సూర్యదేవాలయం విశిష్టత ఇది.
సూర్యదేవాలయంలోని సూర్యుడు... ఉదయించే సూర్యుడిని చూడడానికా ఉన్నట్లు తూర్పు దిక్కును చూస్తూ ఉంటాడు. ఆలయానికి ఎదురుగా విశాలమైన ఒక దిగుడు బావి. అది పేరుకే బావి, చెరువంత ఉంటుంది. ఆ బావి మెట్ల మీద నూట ఎనిమిది చిన్న చిన్న దేవాలయాలు, అందులో విగ్రహాలుంటాయి. ఉదయించే సూర్యుడి ప్రతిబింబం ఈ బావిలో నుంచి పైకి వస్తున్నట్లు భ్రమను కల్పిస్తుంది. ఈ బావిలో తాబేళ్లు ఉండడంతో నీరు పరిశుభ్రంగా ఉంటుంది. సూర్యమండపంలో మొత్తం 52 స్తంభాలుంటాయి. ఇవి ఏడాదిలో 52 వారాలకు ప్రతీకలు. ఈ స్తంభాల మీద రామాయణ, మహాభారత, కృష్ణ లీలలను కళ్లకు కట్టే శిల్పాలున్నాయి. ఆ గ్రంథాలు చదవడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి శిల్పకారులు గ్రంథాలను గోడల మీదకు తెచ్చారు. ఈ విగ్రహాలను చూస్తే రాతిని చెక్కారా లేక మైనాన్ని కరిగించి మూసలో పోశారా అనిపిస్తుంది. గుజరాత్, మొధేరాలోని సూర్యదేవాలయంలో స్వయంగా వీక్షించి పరవశించాల్సిన శిల్పచాతుర్యం ఇది.
ఊరంత ఆలయం
మనకు బాగా తెలిసిన సూర్యదేవాలయం ఉత్తరాంధ్రలో ఉన్న అరసవెల్లిలో ఉంది. మరొకటి పేరులోనే సూర్యుడిని నింపుకున్న కోణార్క సూర్యదేవాలయం బంగాళాఖాతం తీరాన ఒడిషాలో ఉంది. వీటికి దీటుగా పశ్చిమాన అరేబియా సముద్రానికి సమీపంలో కూడా అంతకంటే గొప్ప నిర్మాణ కౌశలం ఉంది. అది మొధేరా సూర్యదేవాలయం. దేవాలయం అంటే ఊరిలో ఉండే ఒక ప్రదేశం. అయితే మొధేరా సూర్యదేవాలయం అలా కాదు. ఆలయమే ఒక ఊరంత ఉంటుంది. దీనిని పదకొండవ శతాబ్దంలో సోలంకి రాజవంశానికి చెందిన మొదటి భీమదేవుడు నిర్మించాడు. సోలంకి రాజులు సూర్యవంశీకులు. తమ వంశీకుడి గౌరవార్ధం చిరస్థాయిగా నిలిచిపోయే నిర్మాణం చేపట్టాలనే ఆకాంక్షతో ఈ దేవాలయాన్ని నిర్మించాడు భీమదేవుడు. ఈ ఆలయాన్ని ధ్వంసం చేయడానికి మహమ్మద్ గజనీ, అల్లావుద్దీన్ ఖిల్జీలు తీవ్రంగా ప్రయత్నించారు. వారి దాడిలో ధ్వంసమైన వాటిని పునరుద్ధరించి పూర్వ రూపం తీసుకురావడంలో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తీవ్రంగా శ్రమించింది.
రేఖామార్గం
కర్కాటక రేఖ మనదేశంలో ఈ పశ్చిమం నుంచి ఈ తూర్పు వరకు మొత్తం ఎనిమిది రాష్ట్రాలను పలకరిస్తూ సాగిపోతోంది. పశ్చిమాన గుజరాత్‌తో మొదలై రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర, మిజోరాం రాష్ట్రాల మీదుగా కర్కాటక రేఖ వెళ్తుంది. గుజరాత్‌లోని మొధేరా సూర్యదేవాలయం కర్కాటక రేఖ ప్రయాణమార్గంలో నిర్మించారు.
సూర్యయానం ఇలా
సూరుడు ఏడాదిలో ఒకసారి దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి, అలాగే ఉత్తరాయణం నుంచి దక్షిణాయనం లోకి మారుతుంటాడు. సంక్రాంతి రోజు మకర సంక్రమణంతో ఉత్తరాయణం మొదలవుతుంది. తొలి ఏకాదశి రోజు నుంచి దక్షిణాయనం మొదలవుతుంది. ఈ ప్రయాణంలో సూర్యుడు కచ్చితంగా తూర్పు దిక్కున ఉండేది ఏడాదిలో రెండు రోజులు మాత్రమే. ఆ రెండు రోజుల్లో ఒకటి మార్చి 21, మరొకటి సెప్టెంబరు 21. ఆ రోజుల్లో సూర్యుడి కిరణాల ప్రసారదిశకు అనుగుణంగా ఆలయాలను నిర్మించారు. ఇది మాటల్లో వివరించడానికి సాధ్యం కానంత గొప్ప ఖగోళ పరిజ్ఞానం. ఎంత పెద్ద భూకంపం వచ్చినా సరే ఇక్కడ నేల కంపనానికి గురి కాదు. రిక్టర్ స్కేలు మీద సాధారణ స్థాయులు దాటి తీవ్రత పెరిగినప్పటికీ ఇక్కడ భూమి అతి స్వల్పంగా కొద్దిపాటి ప్రకంపనలకు మాత్రమే గురవుతుంది. నేల కుంగిపోవడం, కట్టడాలు నేల కూలడం వంటి విలయాలుండవు.
ఆ పేరు ఇలా వచ్చింది!
రాముడు మొధేరాలో యజ్ఞం చేశాడని స్కంద పురాణం చెబుతోంది. రామరావణ యుద్ధం ముగిసింది. రాముడు పరివారంతోపాటు అయోధ్యకు ప్రయాణమయ్యాడు. రామదండు విజయోత్సాహంతో గెంతులు వేస్తోంది. కానీ రాముడికి మనసు మనసులో లేదు. ‘ఇది నిజంగా విజయమేనా’ అనే సందేహం బాధించసాగింది. రావణుడు పరమ నిష్ఠాగరిష్టుడైన బ్రాహ్మణోత్తముడు. అలాంటి రావణుడిని సంహరించడం ధర్మమేనా అనే శంకను వశిష్ఠునితో చెప్పాడు. ఆ పాప నివారణ కోసం ఒక యజ్ఞం చేయమని సూచించాడు వశిష్ఠుడు. ధర్మారణ్యంలో ఒక ప్రదేశాన్ని ఎంచుకుని యజ్ఞం చేశాడు. యజ్ఞ నిర్వహణ కోసం ఆ ప్రదేశంలో చిన్న గ్రామం వెలిసింది. ఆ గ్రామానికి సీతాపూర్ అని పేరు పెట్టాడు రాముడు. ఆ గ్రామంలో రాముడు చేసిన యజ్ఞంలో పాలుపంచుకున్న మో«ద్ బ్రాహ్మణులు స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. తర్వాత ఆ ఊరికి మొధేరా అనే పేరు స్థిరపడింది.
Comments
Please login to add a commentAdd a comment