పదిహేను వేల అడుగుల ఎత్తు.
లామాలకు ఇష్టమైన ప్రదేశం.
ఎటు చూసినా మంచుకొండలు.
మంచు కరిగి నీరవుతోందా లేక...
చుట్టూ ఉన్న మంచు చల్లదనానికి నీరు గడ్డకట్టిపోతోందా?
ఏమో! రెండూ నిజమే కావచ్చు!!
స్పితిలోయలో ఏడాదిలో కొంతకాలం కొండలు కరిగి నీరవుతుంటే... మరికొంత కాలం నీరు మంచుగా మారుతుంది. కంటి ముందు మంద్రంగా ప్రవహిస్తున్న నది చూస్తూ ఉండగానే ప్రవాహం వేగం తగ్గిపోయి గడ్డకడుతుంది. ఇది హిమాలయ శ్రేణుల్లో విస్తరించిన ప్రదేశం. కులు నుంచి స్పితిలోయకు వెళ్లే దారిలో కనిపిస్తుంది కుంజుమ్ కనుమ.
శీతాకాలంలో పర్వతాలను కప్పేసిన మంచు కరిగి కుంజుమ్ కనుమ మీదుగా పల్లానికి ప్రవహిస్తుంది. అదే స్పితి నది. స్పితి లోయలో ప్రవహిస్తున్న నది. ఈ నది మరీ పెద్దదేమీ కాదు. ప్రవాహ దూరం నూటముప్పై కిలోమీటర్లు మాత్రమే. స్పితి అంటే... మధ్యనున్న నేల అని అర్థం. అటు నింగికీ– ఇటు భూమికీ మధ్యనున్న నేల కావడంతో దీనికి అదే పేరు స్థిరపడింది.
లామాల నివాసం
హిమాచల్‌ప్రదేశ్‌లోని స్పితిలోయ బౌద్ధం కొలువుదీరిన ప్రదేశం. బౌద్ధలామాలు మౌనంగా పర్వతసానువుల్లో అలవోకగా నడిచిపోతుంటారు. పదిహేను వేల అడుగుల ఎత్తు బోర్డు దాటి ముందుకెళ్లి కొండ మలుపు తిరిగితే అనేక బౌద్ధారామాలు, చైత్యాలతోపాటు ‘కీ’ మోనాస్టెరీ, టాబో మోనాస్టెరీలు కనిపిస్తాయి. ఇవి బౌద్ధం పురుడుపోసుకున్న తొలినాళ్లలో కట్టిన బౌద్ధచైత్యాలు. అందుకేనేమో ఇది దలైలామాకు అత్యంత ఇష్టమైన ప్రదేశం అయింది.
Comments
Please login to add a commentAdd a comment