Story of Right Arm Medium Pacer Shabnam - Sakshi
Sakshi News home page

WPL 2023- Shabnam MD- GG: క్రికెట్‌.. బిర్యానీ.. అంతే..!: విశాఖ క్రికెటర్‌ షబ్నమ్‌

Published Wed, Mar 8 2023 12:27 AM | Last Updated on Wed, Mar 8 2023 9:49 AM

Story of Right arm medium pacer Shabnam - Sakshi

WPL 2023- Shabnam- Gujarat Giants: ఎనిమిదేళ్ళవయసులో సరదాగా తండ్రితో గ్రౌండ్‌కు వెళ్ళేది. అక్కడ కొంతమంది అమ్మాయిలు క్రికెట్‌ ఆడుతుంటే ఎంతో ఆసక్తిగా చూసేది. ఓ రోజు తనకూ క్రికెట్‌ ఆడాలనివుందనే అభిలాషను వ్యక్తపరిచింది. తల్లిదండ్రులుప్రోత్సహించడంతో క్రికెట్‌ బాల్‌ అందుకుంది. నేడు ఏకంగా ఆంధ్రప్రదేశ్‌ తరపున ఉమెన్‌ ప్రీమియర్‌ లీగ్‌ స్థాయికి ఎదిగిపోయింది.

ఇటీవల అండర్‌19 టీ20 వరల్డ్‌కప్‌ను భారత్‌ సొంతం చేసుకున్న జట్టుకు ఆడింది. ఆరేళ్లలోనే తన మీడియం పేస్‌తో ప్రత్యర్థుల్ని బెంబెలెత్తించే స్థాయికి చేరుకుంది విశాఖ ఉమెన్‌ క్రికెటర్‌ షబ్‌నమ్‌ మహ్మాద్‌ షకీల్‌. ఆటే శ్వాసగా రాణిస్తున్న రైట్‌ ఆర్మ్‌ మీడియం పేసర్‌ షబ్‌నమ్‌ మహిళా దినోత్సవసందర్భంగా తన అంతరంగాన్ని సాక్షితో పంచుకుంది.


క్రికెట్‌ ప్రస్థానం ఎలా ప్రారంభమైంది...
2017లో క్రికెట్‌ సంఘం ఆధ్వర్యంలో జరిగిన వేసవి శిబిరాల్లో పా ల్గొన్నాను. నాకు మొదట్నించీ బ్యాటింగ్‌ కంటే బౌలింగ్‌లోనే ఇష్టం ఉండేది. రెండేళ్ళలో మీడియం పేసర్‌గా ఎదిగాను. పేస్‌లో వేరియేషన్స్‌తో బంతులు విసురుతుండటంతో అండర్‌ 16 జిల్లా జట్టుకు ఎంపిక చేశారు. అనతికాలంలోనే ఆంధ్రజట్టుకు ఆడాను.

రైల్వేస్‌ జట్టుతో ప్రాక్టీస్‌లో నెట్‌బౌలర్‌గా సీనియర్స్‌తో ఎలా ఆడాలో నేర్చుకున్నాను. అనంతరం ఏకంగా ఉమెన్‌ అండర్‌ 19 వరల్డ్‌కప్, జాతీయ జట్టుకు ఎంపికయ్యాను. ప్రస్తుతం ఉమెన్‌ ఐపీఎల్‌లో గుజరాత్‌ జెయింట్స్‌కు ఆడుతున్నాను.

చదువెలా సాగుతోంది...
పదో తరగతి చదువుతున్నాను. ఏప్రిల్‌లో పరీక్షలున్నాయి. ఉమెన్‌ ఐపీఎల్‌ పూర్తికాగానే పరీక్షలు రాస్తాను. మా టీచర్లు ఓ ప్రత్యేక గ్రూప్‌ ఏర్పాటు చేశారు. సబ్జెక్ట్‌ డౌట్స్‌ వివరిస్తుంటారు. ప్రాక్టీస్, పా ఠాలు ఏకకాలంలో సాగుతున్నాయి. ప్రస్తుతం ఉమెన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో గుజరాత్‌ జెయింట్స్‌ తరపున ఆడుతూ ముంబయ్‌లో ఉన్నాను. ఇటీవలే అండర్‌ 19 ఉమెన్‌ వరల్డ్‌ కప్‌లోనూ ఆడాను. 

ప్రస్తుత లక్ష్యం...
సీనియర్‌ ఉమెన్‌ జట్టులో ఇండియా తరపున ఆడటమే నా లక్ష్యం. అండర్‌–19 వరల్డ్‌కప్‌కు ఆడిన జట్లలో నేనే చిన్నదానిని. ఇప్పుడు ప్రీమియర్‌ లీగ్‌లోనూ చిన్న దాన్ని. ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఉమెన్‌ ఐపీఎల్‌కు ఎంపికైన తొలి క్రికెటర్‌ను. పదినేహేళ్ల ప్రాయంలోనే ఇది సాధ్యపడటం చాలా సంతోషాన్నిచ్చింది.

జూనియర్‌ వుమెన్‌ టీ20 వరల్డ్‌కప్‌లో...
జూనియర్స్‌ వరల్డ్‌కప్‌ ఆడుతున్నప్పుడు, సీనియర్ల నుంచి చాలా సలహాలు తీసుకున్నాను. కోచ్‌లు నీనియర్‌ సభ్యులు ఎక్కువ మ్యాచ్‌లు ఆడాలని, అప్పుడే ఎక్స్‌పోజర్‌ వస్తుందని సూచించారు. ముందు మన బలహీనతలు తెలుసుకుని, వాటి ని అధిగమించాలని కూడా చె΄్పారు. అందుకు తగినట్టు గానే మ్యాచ్‌ల్లో సీనియర్స్‌ను జాగ్రత్తగా గమనిస్తున్నాను. అందరిలోకి చిన్నదాన్ని కావడంతో ఎంతో ఆప్యాయత చూపిస్తున్నారు.

ఇన్‌స్పిరేషన్‌ ఎవరు...
జులన్‌ గోస్వామి ఆట తీరును జాగ్రత్తగా గమనిస్తుంటాను. ఫాస్ట్‌ బౌలింగ్‌లో ఆమె నా స్ఫూర్తి.

ఏ రంగంలో స్థిరపడాలనుకుంటున్నారు?
యూనిఫామ్‌ వేనుకునే జాబ్‌ చేయాలనేది నా ఆకాంక్ష. దేశం పట్ల నాకు చాలా గౌరవం. డిఫెన్స్, పోలీస్‌ లాంటి రంగాల్లో పని చేయాలని ఉంది.

మీ హాబీలేంటి?
నాకు చిన్నప్పటి నుంచి క్రికెట్‌ అంటేనే ఇష్టం ఏర్పడటంతో మిగిలిన విషయాల పట్ల పెద్దగా ఆసక్తి కలగలేదు. అందుకే హాలిడే ఎంజాయ్‌ చేయాలని, ఏవైనా కొత్త ప్రదేశాలకు వెళ్లాలనే ఆలోచన కూడా రాలేదు. నాన్న షకీల్‌ తన జట్టుకు ఆడుతుంటే సరదాగా చెల్లెలు షాజహానాతో కలిసి కామెంటరీ చెప్పేదాన్ని.

అలా సరదాగా ప్రారంభమైన నా క్రికెట్‌ కెరీర్‌ నేడు ప్రీమియర్‌ లీగ్, జూనియర్‌ వరల్డ్‌ కప్‌ ఆడేస్థాయికి చేరింది. మ్యాచ్‌లలో భాగంగా ఆయా ప్రాంతాలకు వెళ్ళాను తప్ప ప్రదేశాలను చూడడం కోసం ఎక్కడికీ వెళ్లలేదు.
 
ఏ రంగు ఇష్టం?
నీలం రంగు అంటే ఇష్టం. లాంగ్‌ ఫ్రాక్స్‌ వేసుకుంటూ ఉంటాను. ఇక బాగా ఇష్టమైనది నిద్ర. ఖాళీ దొరికితే ఎక్కువగా పడుకుంటాను. సరదాగా మ్యాచ్‌లు చూసే స్థాయి నుంచి సీరియస్‌గా మ్యాచ్‌లాడే స్థాయికి ఎదగడంతో తీరిక అనేది ఉండటం లేదు. ఈ నెల 27న  తిరిగి విశాఖ చేరుకోగానే పరీక్షలపై దృష్టి పెట్టాలి. చెస్, బ్యాడ్మింటన్‌ సరదాగా ఆడుతుంటాను.

డైట్‌ ఎలా?
నాకు బిరియానీ అంటే ఇష్టం. అమ్మ రాత్రికి పుల్కాల్లో రకరకాల వంటలు చేస్తుంది. డైట్‌ పట్ల చాలా శ్రద్ధ వహిస్తాను. ఆహారసూచనలను పా టిస్తాను. డ్రైప్రూట్స్‌ ఎక్కువగా తీసుకుంటాను. స్వీట్స్‌ జోలికి వెళ్ళను. 

ఎలాంటి సినిమాలిష్టం?
సినిమాల పట్ల పెద్దగా ఆసక్తి లేదు. ఇప్పటివరకు ఆట, చదువే నా లోకం. కానీ ఆటల మీద వచ్చిన సినిమాల్ని చూస్తాను. ఉదయాన్నే ఐదుగంటల కల్లా ప్రాక్టీస్‌ చేసుకోవడానికి గ్రౌండ్‌కు వెళ్తాను. కోచ్‌లు చెప్పిన వాటిని తూచ తప్పకుండా ఆచరించడం. వీలు దొరికినప్పుడల్లా సబ్జెక్ట్‌ బుక్స్‌ ముందేసుకు కూర్చోవడమే ప్రస్తుత నా దినచర్య.

– డాక్టర్‌ ఎ. సూర్యప్రకాశరావు మాడిమి,  విశాఖపట్నం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement