
వచ్చే పోయే జనాలతో, బస్సులతో బస్టాండ్ సందడిగా ఉంది. ఎండ చుర్రున కొడుతోంది. వైజాగ్ వెళ్లవలసిన బస్ కోసం వెయిట్ చేస్తూ నిలబడ్డాను. ‘ప్రయాణికులకు గమనిక’ అంటూ ఒకపక్క అనౌన్స్‌మెంట్, మరోపక్క టీవీలో ప్రకటనల హోరు. కలగాపులగంగా సంభాషణల జోరు. మొత్తానికి అక్కడ అంతా జాతరలా ఉంది. అరిగిపోయిన గ్రామ్‌ఫోన్ రికార్డ్‌లా ఉంది. విరిగిపోయిన కడలి అలల సద్దులా ఉంది. ‘అయ్యా! ఆకలేస్తుందయ్యా.. ధర్మం సేయండయ్యా’ హృదయ విదారకమైన వేదన విని తలతిప్పి చూశాను.సుమారుగా ఓ ముప్పై, ముప్పయి ఐదు సంవత్సరాలు ఉంటాయేమో ఆమెకు. జుట్టంతా తైలసంస్కారం లేక రేగిపోయి చిందర వందరగా ఉంది. మాసిపోయి, అక్కడక్కడ చిరుగులున్న చీర, స్నానం చేసి ఎన్నాళ్లయిందో అనేలా శరీరం మట్టి కొట్టుకుపోయి ఉన్నాయి.
కళ్ళలో దీనత్వం, జోడించిన చేతుల్లో వినయం. ‘అయ్యా, ఆకలేస్తుందయ్యా’ నాభిలోంచి వస్తున్న ఆ చిన్న అరుపు గుండెను పట్టి పిండేస్తుంది అనడంలో సందేహమే లేదు. ‘అయ్యా ..’ మరోసారి ఆ బిచ్చగత్తె ప్రార్థనకు ఆలోచనలు ఆపి, ప్యాంట్ వెనుక జేబులో చెయ్యి పెట్టి చేతికి దొరికిన నాణెం తీసి ఆమె చేతిలో వేశాను. ఆమె ఆ నాణెం వైపు చూసి ‘వద్దయ్యా! ఆకలేస్తుందయ్యా, తినడానికి ఏమైనా పెట్టండయ్యా’ నా కాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నం చేసింది.నా హృదయం ఒక్కసారిగా భారమయ్యింది. ఒక మనిషి మరో మనిషి కాళ్ళు పట్టుకోవడం అంటే ఎంత కష్టం వచ్చుండాలి. ఆత్మాభిమానం చంపుకోవాలి కదా.బస్టాండ్‌లో పక్కనే ఉన్న హోటల్‌పై నా దృష్టి పడింది. ‘పదమ్మా, టిఫిన్ కొనిస్తా’నంటూ దారి తీశాను.
‘టిఫిన్ వద్దయ్యా’ మెల్లగా, నీరసంగా అందామె. ‘మయూరోటల్లో బిర్యానీ కావాలేమో మేస్టారూ..’ ఆ పక్కనే బెంచిపై కూర్చొని మమ్మల్నే గమనిస్తున్న ఆసామి పెద్దగా నవ్వుతూ అన్నాడు. ఆయన మాటలకు కిసుక్కున నవ్వారు మరికొందరు.ఆ ఆసామి మాటలకు ఆమె తల మరింతగా భూమిలోనికి వంగిపోయింది.నాకు చాలా బాధేసింది. సాయం చెయ్యకపోయినా ఫర్వాలేదు గాని, ఇలా వెటకారం చేసే వారంటేనే నాకు ఒళ్ళు మంట. సగటు మనిషిని కదా. కోపం నాలోనే అణచుకొని ‘ఏం కావాలో చెప్పమ్మా’ ఆప్యాయంగా అడిగాను.బస్ కోసం వేచి ఉన్న జనాలకు ఇదో కాలక్షేప వ్యవహారం అయ్యింది. మన గురించి కాకుండా పక్కవారి బాగోగులు, యోగక్షేమాలు, ఏం చేస్తున్నారో? నవ్వుతున్నారా? అయితే ఎలా ఏడిపించాలి? ఏడిస్తే, నిజంగానే ఏడుస్తున్నారా? అనే ఆరాటం లేకపోతే మనం మనలా ఎలా ఉంటాం? ‘బిస్కట్టులు కావాలయ్యా’ మొహమాటం ఆమె కోరికలో.‘పదమ్మా కొంటాను..’
నా మాటలకు ఆమె ముఖం ఒక్కసారిగా వెలిగిపోయింది. దీనుల ముఖంలో ఆ వెలుగు చూస్తే నాకు తెలియని ఆనందం, మనసు నిండా తృప్తీ! చుట్టూ ఉన్న కొంతమంది జనాల కళ్ళల్లో మెచ్చుకోలు. అదే నాకు తెలియని మత్తునిస్తుంది.అంతమంది అక్కడ ఉండగా ఒక ముష్టిదానికి నేనొక్కడినే దానం చెయ్యాలి అనుకోవడం నా మంచి మనసుకు తార్కాణం అని అక్కడ ఉండేవారు గుర్తించే ఉంటారు కదా. ఎందుకు గుర్తించరు? తప్పకుండా గుర్తిస్తారు. ఆమె ఆ పక్కనే ఉన్న షాప్ దగ్గర ఆగింది.‘ఆ ఐదు రూపాయల బిస్కట్ ప్యాకెట్ ఇవ్వండి’ షాపతన్ని అడిగాను.ఆమె ముఖంలో వెలుగు ఒక్కసారిగా తగ్గిపోవడం చూసి, ఆకలి ఎక్కువగా ఉంటే ఆ చిన్న బిస్కట్ ప్యాకెట్ ఏమూలకు సరిపోతుంది అనిపించింది.
‘అది వద్దు, ఆ పది రూపాయలది ఇవ్వండి’ పది రూపాయలు నోటు అందిస్తూ ఆమె వైపు చూశాను.ఆమె ముఖం ఇంకా దిగులుగా ఉండటం చూసి ‘ఏం కావాలమ్మా నీకు?’ తెలియకుండానే విసుగు నాలో.చెయ్యెత్తి చూపించింది ఆమె. షాపతను నేను అడగకుండానే ఆ బిస్కట్ ప్యాకెట్ తీసి ఆమె చేతిలో పెట్టాడు.‘ఇంకో పదివ్వండి సార్, ఆ ప్యాకెట్ ఇరవై రూపాయలు.’పాపం ఆ ప్యాకెట్ తినాలని ఆశ గాబోలు అనుకుంటూ మరో పది అందించి ‘తినమ్మా, పాపం ఎప్పుడు తిన్నావో ఏమిటో..’ నా జాలి గుండె మాటలు. చెప్పాకదా నా మనసు వెన్న అని. ‘ఊహూ, అటెల్లి తింటాను’ ఆమె బస్టాండ్ వెనుక వైపు చూపించి అటు నడవసాగింది.బహుశా ఆమె పిల్లలు అక్కడ ఉండి ఉంటారు గాబోలు. తనకు ఆకలేస్తున్నా తినకుండా పిల్లల కోసం తీసుకెళ్ళడం నన్ను కుదిపివేసింది.
అందుకే అంటారు ఈ ప్రపంచంలో తల్లి ప్రేమకు ఏదీ సాటి రాదని! పిల్లలు చిన్నవాళ్ళా? పెద్దవాళ్ళా? ఆ ప్యాకెట్ వారికి ఏం సరిపోతుంది? ఆలోచనలతో పాటు కుతూహలం వెంటరాగా ఆమె వెళ్ళిన దిశకు వ్యతిరేక దిశలో బస్టాండ్ వెనుక వైపు వెళ్ళాను.జనసంచారం పెద్దగా లేకపోవడం వలన గాబోలు అక్కడంతా చెత్త చెత్తగా ఉంది. ముక్కు బద్దలవుతున్న వాసనలు. పిల్లల జాడ ఎక్కడా కనబడలేదు. ఆమెకు కనబడకుండా ఒక చెట్టు చాటు నుండి చూడసాగాను. గోడ వెనక్కి వచ్చిన ఆమె అటూ ఇటూ చూసి ఒక్కసారిగా తన చీరను కాస్తా పైకి లేపింది.
సిగ్గుతో తలతిప్పుకొని అక్కడ నుండి రాబోయాను. కానీ నా కళ్ళకు ఏదో అసహజంగా అనిపించి తలతిప్పి చూశాను. ఆమె చీర కింద లంగాపై సంచుల్లాంటివి వేలాడుతున్నాయి. వాటినిండా బిస్కట్ ప్యాకెట్లు. నా కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి.నేనిచ్చిన ప్యాకెట్‌ని కూడా వాటిలో పెట్టింది. చీరను కిందకి దించి సర్దుకొని అటువైపు ఆగి ఉన్న బస్సుల వద్దకు నడవసాగింది. బహుశా నాలాంటి బకరాని వెతకడానికి గాబోలు. ఉండేలు దెబ్బతిన్న కాకిపిల్లలా విలవిలలాడిపోయాను. ఇంత చదువుకొని కూడా అంత సులభంగా ఎలా వెధవనయ్యానో?గుండె మండిపోతుండగా ఆమెను నిలదిద్దామనేంత ఆవేశం వచ్చింది. చెడామడా కడిగేయాలన్నంత కోపం వచ్చింది. కానీ, అటువంటి వారితో గొడవపడటం సభ్యత కాదు, తన పాపానికి తనే పోతుందని తిట్టుకున్నాను. గుండెమంటతో నోరు ఎండిపోయినట్లు అనిపిస్తే, ఆ బిస్కట్ల షాప్ దగ్గరకు వెళ్ళి వాటర్ బాటిల్ కొనుక్కున్నాను.
‘రాములమ్మ మీలాంటి మెతకోరిని చూసి, నవరసాలు ఒలికించి నా షాప్‌లో బిస్కట్ ప్యాకెట్లు పెద్దవి కొనిపిస్తుంది. సాయంత్రమయ్యేసరికి ఆ బిస్కట్ ప్యాకెట్లను నాకే సగం ధరకు అమ్మేస్తుంది.’ మనసు ఇంకా ఉడికిపోసాగింది. ఇద్దరూ కలిసి ఇంత మోసం చేస్తున్నారా?
షాపతను నన్ను చూసి జాలి పడుతున్నట్లు అనిపించింది. ఎదుటివారిపై జాలి చూపడం నాకు అత్యంత ఇష్టమైనది. కానీ నన్ను చూసి జాలి పడితే భరించలేను. ఆయన పెదవులపై ఎందుకనో కాస్త నవ్వు విరిసింది అసంకల్పితంగా. ‘ఎందుకు నవ్వుతున్నారు?’ ఆగలేక అడిగేశాను అప్పటికే మనసు కుతకుతలాడుతోంది మోసపోయాను అన్న భావనతో.‘ఏం లేద్సార్, మీరు రాములమ్మను అనుసరిస్తూ వెళ్ళడం గమనించాను. అక్కడ ఏం చూసుంటారో ఊహిస్తే నవ్వొచ్చింది అంతే. నేను మీకు తెలియకపోయినా మీరు నాకు బాగా తెలుసు. అందుకే చనువుగా నవ్వాను.’నిర్ఘాంత పోయాను. ఓహో ఆ మోసగత్తే పేరు రాములమ్మన్నమాట.
‘అంటే మీకు ముందే తెలుసా ఇలా చేస్తుందని’ విస్మయం నాలో.‘రాములమ్మ మీలాంటి మెతకోరిని చూసి, నవరసాలు ఒలికించి నా షాప్‌లో బిస్కట్ ప్యాకెట్లు పెద్దవి కొనిపిస్తుంది. సాయంత్రమయ్యేసరికి ఆ బిస్కట్ ప్యాకెట్లను నాకే సగం ధరకు అమ్మేస్తుంది.’మనసు ఇంకా ఉడికిపోసాగింది. ఇద్దరూ కలిసి ఇంత మోసం చేస్తున్నారా?నా ముఖంలో మారుతున్న రంగులను అణచుకుంటూ ‘మా దగ్గర డబ్బులే అడగొచ్చుకదా. ఎందుకిలా డొంకతిరుగుడు బిస్కట్ల వ్యవహారం?’ ఏదో తెలియని కుతూహలం నాతో అడిగించింది.చిన్న నవ్వు నవ్వి ‘మళ్ళేమైనా అంటే మీకు పుసుక్కున కోపం ఒచ్చేస్తాది గానీ మీరు ముష్టి వేస్తే రూపాయో, రెండ్రూపాయలో వేస్తారు. మహా అయితే ఐదు వేస్తారు. అంతేకదా..!’మౌనంగా తలూపాను.
‘సాయంత్రం అయ్యేసరికి కనీసం పదిహేను, ఇరవై ప్యాకెట్లయినా నాదగ్గర మార్చుకొని రెండొందల వరకు తీసుకొని వెళ్తుంది. మధ్య మధ్యలో చిల్లర వేసేవారు ఎలాగూ ఉంటారు.’అంటే రూపాయికి రూపాయి లాభం. ఎంత దగా! పది రూపాయలకు కొని, ఇరవై రూపాయలకు అమ్మడం. ఛ! ఈ ప్రపంచంలోని మోసం అంతా ఈ బస్టాండ్‌లోనే ఉందనిపించింది. అంతలోనే నాకొక సందేహం తలెత్తింది.. అడగనా వద్దా? అనే సంశయంలో ఉండగానే..‘ఏదో అడగాలని తెగ మొగమాటం పడిపోతున్నారు. అడిగేయండి, పర్లేదు’ అభయం ఇచ్చాడా నవ్వులరేడు. ‘మరేం లేదు, మీరే అమ్మి, మీరే కొనడం వలన మీకేంటి లాభం? తర్వాతవి అమ్ముడవకపోతే?’ సంశయిస్తూనే అడిగేశాను. ఒక్కసారిగా మౌనం వహించాడతను. అతని కళ్ళల్లోకి చూస్తున్న నా ముఖాన్ని ఒకసారి పరిశీలించి, అటూ ఇటూ చూసి ‘మీరెవ్వరికీ చెప్పనంటే చెప్తాను’ లోగొంతుతో అన్నాడు.
‘ఇక్కడ జరిగిందంతా ఇప్పుడే మర్చిపోతాను’ మాట ఇచ్చాను. ‘ఇంకేటీ లేదు. అవన్నీ పాడయిపోయిన బిస్కట్ ప్యాకెట్లు. అదేలెండి ఎక్స్‌పైర్ అయిపోయినవి. ఎట్లాగూ బయటపడేయ్యాలి. అవే రాములమ్మకు ఇస్తాను. వేరేవారికి అమ్మను. ఆ ప్యాకెట్లు తను ఎట్లాగూ తినదు, నాకే తిరిగిస్తుంది. ఆ ప్యాకెట్లు ప్రతిరోజూ నాకు డబ్బులు తెస్తున్నాయి. ఈ విషయం రాములమ్మకు కూడా తెలియదు.’
విస్తుపోయాను.. కంటికి కనబడకుండా పన్నిన వల తెలిసి! ఏ బిజినెస్ మేనేజ్‌మెంట్ యూనివర్సిటీల్లో కూడా నేర్పని పాఠం. వ్యాపారంలో మెలకువలు ఉంటాయని తెలుసు గాని, ఒక చిన్న బస్టాండ్‌లో, అతి చిన్న దుకాణంలో, పెద్దగా చదువుకోని వ్యక్తి అంత చక్కగా ఆర్థిక వలనేయగలడు అని ఊహించలేదు.
రాగాలాపన ఆపి, మరో డైలాగ్ చెప్పేలోపల ‘వన్స్ మోర్’ గట్టిగా వినబడిన ప్రేక్షకుల అరుపులకు పాడిన పద్యమే మరోసారి శ్రుతి తగ్గకుండా పాడటం ప్రారంభించాను.పద్యం ఆపగానే ‘ శ్రీకృష్ణుని పాత్రధారుని అభినందిస్తూ కనకారావు గారు పదిరూపాయలు చదివించారు. వారికి, వారి కుటుంబానికి ఆ పైడితల్లెమ్మ దీవెనలు అందివ్వాలి’ మైక్‌లో ఆర్గనైజర్ కంఠం వినయంగా పలికింది.
నా ఆలోచనలను చెదరగొడుతూ అతని మాటలు వినిపించాయి. ‘మరోమాట సార్, పాపం రాములమ్మ భర్త రోగంతో మంచాన పడితే, పిల్లలతో పాటుగా మొగుడ్ని కూడా చంటిబిడ్డలా సాకుతూ, కుటుంబ పోషణ కోసం ఇలా చేస్తోంది. అందుకే నేను కూడా నావంతుగా ఇలా సాయపడుతున్నాను..’షాపతని మాటలు నన్ను ఆవేశంలోంచి ఆలోచనలోకి పడేశాయి. ఆర్థిక మోసానికి మానవత్వపు పూత.గీతా రహస్యం బోధించిన వాడిలా చిద్విలాసంగా నవ్వాడు షాపతను.∙∙ ‘బావా! ఎప్పుడు వచ్చితీవి? సుఖులే బ్రాతల్, సుతుల్, చుట్టముల్?
నీ వాల్లభ్యము పట్టు కర్ణుడును మున్నీలున్ సుఖోపేతులే?’తన్మయత్వంతో తారస్థాయిలో రాగాలాపన చేస్తున్నాను. తలపై నెమలి పింఛంతో కిరీటం, ముఖానికి, మెడకు చిక్కని నీలపు రంగు మేకప్‌తో, మెడలో పూలహారంతో చేతిలో ముచ్చటైన పిల్లనగ్రోవితో మేకప్‌లో అచ్చం కృష్ణుడిలా ఉంటానని అందరూ అంటారు.
నా గొంతు నాకొక వరం. మేకప్‌లో నన్ను చూసినవాళ్ళు నన్ను ఫలానా అని గుర్తుపట్టడం కష్టం. అంతగా కృష్ణుని పాత్రలో ఒదిగి పోతాను అని మా నాటకబృందం కితాబు. వందలమంది ప్రేక్షకులు నాటకంలో లీనమయి ఉన్నారు. మా వూరు పైడితల్లి అమ్మవారి జాతర సందర్భంగా ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసినట్లే ఈ ఏడాది కూడా బుర్రకథలు, హరికథలు, నాటకాలు జరుగుతున్నాయి.
రాగాలాపన ఆపి, మరో డైలాగ్ చెప్పేలోపల ‘వన్స్ మోర్’ గట్టిగా వినబడిన ప్రేక్షకుల అరుపులకు పాడిన పద్యమే మరోసారి శ్రుతి తగ్గకుండా పాడటం ప్రారంభించాను.పద్యం ఆపగానే ‘ శ్రీకృష్ణుని పాత్రధారుని అభినందిస్తూ కనకారావు గారు పదిరూపాయలు చదివించారు.
వారికి, వారి కుటుంబానికి ఆ పైడితల్లెమ్మ దీవెనలు అందివ్వాలి’ మైక్‌లో ఆర్గనైజర్ కంఠం వినయంగా పలికింది.మరో ఇద్దరు ముగ్గురు చెరో పది, ఇరవై రూపాయలు కానుకగా అందించారు. ప్రేక్షకుల చప్పట్లు, అభినందనల మధ్య రెట్టించిన ఉత్సాహంతో, ఉవ్వెత్తునలేచిన కడలి తరంగంలా పాత్రలో లీనమయిపోయా. నాటకం రసవత్తరంగా సాగుతోంది. ‘మా మధ్యమ పాండవుని విక్రమంబు ఎట్టిదంటిరేని..’‘జెండాపై కపిరాజు ముందు సిత వాజి శ్రేణియుం గూర్చి నేదండంబున్ గొని తోలు స్యందనము మీదన్ ..’రాగం ఆపగానే ఆర్గనైజర్ గారి కంఠం మైకులో వినిపించసాగింది.
‘శ్రీకృష్ణుని పాత్రధారిని ఆశీర్వదిస్తూ కళాభిమానులందరి తరుపున అని చెప్పమంటూ మంచి మనసుగల ఒక తల్లి వంద రూపాయలను బహుమతిగా ఇచ్చారు. వారిని, వారి కుటుంబాన్ని ఆ చల్లని తల్లి పైడితల్లెమ్మ కరుణతో చూడాలని కోరుకుంటున్నాము.’
నాకొక్కసారిగా ఆశ్చర్యం కలిగింది. అందరూ పదులు, ఇరవైలు చదివిస్తుంటే ఒక్కసారిగా వందరూపాయలు చదివిస్తూ కూడా తన పేరు చెప్పకోకుండా అందరి తరుపున అన్న ఆ గొప్ప వ్యక్తి ఎవరా? అని చూశాను.ఫ్లడ్ లైట్ల వెలుగులు నా కంటికి అడ్డం పడ్డాయి. చెయ్యి అడ్డుపెట్టుకొని మరీ చూశాను. ఒక్కసారిగా నిర్ఘాంతపోయాను.. ఆర్గనైజర్‌కు డబ్బులు అందించిన ఆమెను చూసి! ఆ మధ్య బస్టాండ్‌లో నన్ను మోసం చేసిన బిచ్చగత్తే రాములమ్మ.
ముష్టి ఎత్తి కుటుంబ పోషణకు సంపాదించిన డబ్బును, కళాపోషణకు ఇస్తూ, కనీసం తన పేరు కూడా చెప్పని ఆ నిరాడంబరత నా వీపున ఛెళ్ళున కొరడా దెబ్బ వేసింది. నాలో నాకే తెలియని మానసిక సంఘర్షణ. వృత్తికి, ప్రవృత్తికి మధ్యగల తేడాను, స్పష్టతను, నిర్మలత్వాన్ని, సున్నితత్వాన్ని , కళాపోషణను, కళారాధనను తెలుసుకోగలిగాను.తెలియకుండానే నా కన్నులు చెమ్మగిల్లుతుండగా రెండు చేతులు జోడించి ఆమెకు వందనం చేశాను.