కదిలితే గెలుస్తారు.. ఆగితే అలాగే ఉండిపోతారు | Story On Yogita Raghuvanshi, Geetha Tandon Life | Sakshi
Sakshi News home page

కదిలితే గెలుస్తారు.. ఆగితే అలాగే ఉండిపోతారు

Published Tue, Mar 9 2021 11:51 PM | Last Updated on Wed, Mar 10 2021 3:10 AM

Story On Yogita Raghuvanshi, Geetha Tandon Life - Sakshi

కదిలితే గెలుస్తారు. జీవితం ఒక్కోసారి పంక్చర్‌ అవుతుంది. ఫ్లాట్‌. కదల్దు. మెదల్దు. స్నేహితులు, బంధువులు లేని కూడలిలో ఒంటరిగా వొదిలిపెడుతుంది. ఆ క్షణంలో జీవితం భయపెడుతుంది. కాని జీవితాన్ని భయపెట్టేవాళ్లు ఉంటారు. స్టీరింగ్‌ చేతుల్లోకి తీసుకుంటారు. విమెన్స్‌ డే సందర్భంగా ప్రసిద్ధ ఆయిల్‌ సంస్థ ‘షెల్‌’ స్త్రీల కోసం ఒక కాంపెయిన్‌ మొదలెట్టింది. ‘గ్రేట్‌ థింగ్స్‌ హ్యాపెన్‌ వెన్‌ వియ్‌ మూవ్‌’ దాని పేరు. జీవితం ఆగినప్పుడు వాహనాల ఆధారంగా విజయం సాధించిన స్త్రీలపై ఇన్‌స్పిరేషనల్‌ ఫిల్మ్స్‌ తీసి విడుదల చేసింది. వారిలో ఇద్దరు భారతదేశపు తొలి మహిళా ట్రక్‌ డ్రైవర్‌ యోగితా రఘువంశీ, బాలీవుడ్‌ స్టంట్‌ ఉమన్‌ గీతా టండన్‌

మానవ పురోగతి అంతా కదలడంలోనే ఉంది. జీవన పురోగతి కూడా చలనంలోనే ఉంటుంది. ఆగితే నిలువ నీరు. ఆగితే శిల. ఆగితే అసహాయత. ఆగితే దు:ఖం. ఆగితే ఓటమి. కదలడం అంటే ఏదో బస్సెక్కి కదలడం కాదు. ఆ జీవన సందర్భం నుంచి కదలడం. ఆ కష్టం నుంచి కదలడం. ఆ ప్రతిబంధకం నుంచి కదలడం. ‘ఎక్కడికైనా పారిపోవాలనిపిస్తోంది’ అంటుంటాం మనం. పారిపోకూడదు. కదలాలి. బయలుదేరాలి. పారిపోవడంలో లక్ష్యంలో లేదు. బయలుదేరడంలో ఉంది. అలా బయలుదేరి విజయం సాధించిన స్త్రీలు ఎందరో ఉన్నారు దేశంలో. వారందరి కథలూ స్ఫూర్తి నింపేవే అని భావిస్తోంది ‘షెల్‌’. ప్రఖ్యాత ఈ ఆయిల్‌ సంస్థ మొన్నటి విమెన్స్‌ డే సందర్భంగా కొన్ని ఇన్‌స్పిరేషనల్‌ ఫిల్మ్స్‌ తయారు చేసి విడుదల చేసింది. జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు వాహనాలను ఒక ఉపాధి మార్గం చేసుకుని ముందుకు సాగిన వారిపై ఈ ఫిల్మ్స్‌ తయారు చేసింది. ‘ఫొటో’, ‘యెల్లో టిన్‌ కెన్‌ ఫోన్‌’వంటి అవార్డు చిత్రాలకు దర్శకత్వం వహించిన అరుణిమ శర్మ ఈ ఫిల్మ్స్‌కు దర్శకత్వం వహించారు. తొలి విడత మూడు చిత్రాలు సిద్ధమైతే వాటిలో రెండు యోగితా రఘువంశీ, గీతా టండన్‌లపై. కదలడం వల్ల వీరి జీవితాలు ఎలా మలుపు తిరిగాయో ఈ ఫిల్మ్స్‌లో ఉంటాయి.

గీతా టాండన్‌
35 ఏళ్ల గీతా టాండన్‌ను మీరు చాలా సినిమాల్లో చూసి ఉంటారు. చూసి ఉండరు. ఎందుకంటే ఆమె హీరోయిన్లకు స్టంట్స్‌ చేసే డూప్‌ కాబట్టి. ‘ఈ స్టంట్స్‌ కంటే పెద్ద ప్రమాదాలు తెస్తుంది జీవితం’ అంటారు గీతా. ముంబైకు చెందిన గీతకు 9 ఏళ్లు ఉండగానే తల్లి మరణించింది. బంధువులు పెట్టే పెట్టని ముద్దతో ఆమెకు చిన్నప్పుడే ఆకలి తెలిసింది. ‘తల్లి లేని పిల్ల... ఒక అయ్య చేతిలో తొందరగా పెట్టెయ్‌’ అంటే కంగారు పడి తండ్రి 16 ఏళ్లకే పెళ్లి చేసేశాడు. అత్తారింట్లో భర్తే ఆమె పాలిట విలన్‌. ఇద్దరు పిల్లలు పుట్టినా ఆ ఇంట్లో నిష్కృతి లేదని పిల్లలతో పారిపోయారు. పుట్టింటికి చేరితే మింగ మెతుకు లేదు. ఆకలి. ఏ పనికి వెళ్లినా ముందు ఆమె శరీరాన్ని అడిగి తర్వాత జీతం మాట్లాడేవారు. ‘నేను ఒకటే నిర్ణయించుకున్నా. భర్త నుంచి విడిపోయిన స్త్రీ తన శరీరం ద్వారానే బతుకుతుందనే అపప్రథను తుడిచేయదలుచుకున్నా’ అంటారామె.


ఆమె చిన్నప్పటి నుంచి బాగా ఆటలు ఆడేవారు. బైక్‌ రైడింగ్‌ తెలుసు. ‘నీకు బైక్‌ నడపడం వచ్చు కదా. సినిమాలలో టై చెయ్‌’ అంటే ఆమె స్టంట్స్‌ వైపు వచ్చింది. తొలి రిస్క్‌ స్టంట్‌కు ఆమెకు వచ్చిన మొత్తం 1,200 రూపాయలు. బైక్‌ మాత్రమే కాదు కార్లు బస్సులు కూడా ఆమె చేతుల్లో పెంపుడు శునకంలా చెప్పినట్టు వింటాయి. ‘నేను చేస్తూ వెళ్లాను నా పిల్లల కోసం. ఒకసారి ముఖం కాలింది. ఒకసారి నడుము విరిగింది. అయితే ఏమిటి? నాకు నచ్చినట్టు గౌరవంగా బతకగలుగుతున్నాను. కష్టం వచ్చినప్పుడు డిప్రెషన్‌ రావచ్చు. దానిని పక్కన పెట్టండి. మరుసటిరోజు మీ కోసం మంచి అవకాశం ఎదురు చూస్తుండొచ్చు’ అంటారు గీతా టాండన్‌. అదిగో బైక్‌ మీద ఆమె దూసుకుపోతోంది. మనమెందుకు ఊరికే అలా కూచుని ఉండటం?

యోగితా రఘువంశీ
70 టన్నుల బరువు, పది చక్రాలు ఉన్న హెవీ ట్రక్‌ను నడపడం అంటే అది కేవలం మగవారి పని మన దేశంలో. దాని శక్తి కావాలి. చేవ కావాలి. చేతుల్లో బలం కావాలి. ఆ బలం నాకూ ఉంది అనుకున్నారు యోగితా రఘువంశీ. భోపాల్‌కు చెందిన ఈ 50 ఏళ్ల వనిత ఒక గొప్ప సాహసం చేశారు 2013లో. ఆ సంవత్సరం ఆమె భర్త రాజ్‌ రఘువంశీ ఒక రోడ్‌ యాక్సిడెంట్‌లో మరణించాడు. అతను అడ్వకేట్‌ అయినా ట్రక్కులతో నడిచే ట్రాన్స్‌పోర్ట్‌ సంస్థ ఉండేది. ఆ సమయానికి యోగితా కూడా లా పూర్తి చేశారు. కాని జూనియర్‌గా చేరితే చాలా తక్కువ డబ్బులు వస్తాయని అనుకున్నారు. ట్రాన్స్‌పోర్ట్‌ సంస్థను తానే నడపాలనుకున్నారు. డ్రైవర్లను మాట్లాడారు. వారితో తలనొప్పి మెల్లగా అర్థమైంది. ఒక డ్రైవర్‌ ఆమె సంస్థకు చెందిన ట్రక్కుకు యాక్సిడెంట్‌ చేసి హైదరాబాద్‌లో వదిలి పారిపోయాడు.


‘నాకు ఇక వేరే మార్గం కనిపించలేదు. నేనే డ్రైవింగ్‌ చేద్దామనుకున్నాను’ అంటారు యోగితా. పిల్లల భవిష్యత్తు కోసం స్టీరింగ్‌ అందుకున్నారు. ‘నా మొదటి ప్రయాణం భోపాల్‌ నుంచి అహమదాబాద్‌కి. అప్పటికి నాకు రోడ్లు తెలియవు. సరిగ్గా దారులు కూడా తెలియవు. అడుగుతూ అడుగుతూ గమ్యానికి చేరుకున్నాను. ధాబాల దగ్గర నన్ను చూసిన మగాళ్లు ఒక రకంగా చూసేవారు. నేను ట్రక్‌ ఎక్కి డ్రైవింగ్‌ సీట్‌లో కూచునే సరికి ఆ కళ్లల్లో గౌరవం వచ్చేసేది. వారు నన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. కాలక్రమంలో ధాబాలన్నీ నాకు చాలా ఆత్మీయంగా మారిపోయాయి’ అంటారు యోగితా. దేశంలో ఆమె తిరగని ప్రాంతం లేదు. ‘ట్రక్కు ప్రయాణంలో రక్షణకు సంబంధించి రిస్క్‌ ఉంది. భోజనం, స్నానం సమస్యలే. కాని మెల్లగా నేను వాటిని ఎలా హ్యాండిల్‌ చేయాలో తెలుసుకున్నాను. ఒక్కోసారి దారి మధ్యలో నేనే ఒండుకుంటాను’ అంటారు యోగితా. నాడు ఆమె ఏకైక మహిళా ట్రక్‌ డ్రైవర్‌. ఇవాళ ఆమె స్ఫూర్తితో ఎందరో. చలన విజయగాథ అంటే ఇదే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement