Armand Duplantis: ఎవరికీ అందనంత ఎత్తుకు.. | Success Story Of Armand Duplantis Who Won Gold Medal In Paris Olympics | Sakshi
Sakshi News home page

Armand Duplantis: ఎవరికీ అందనంత ఎత్తుకు..

Published Sun, Sep 1 2024 12:44 AM | Last Updated on Sun, Sep 1 2024 12:44 AM

Success Story Of Armand Duplantis Who Won Gold Medal In Paris Olympics

పారిస్‌లోని నేషనల్‌ స్టేడియం.. అథ్లెటిక్స్‌లో ఆ రోజుకు మిగతా అన్ని ఈవెంట్లూ ముగిశాయి. కానీ స్టేడియంలో కూర్చున్న 80 వేల మంది ప్రేక్షకులు మాత్రం ఆ వ్యక్తి కోసం, ఆ ఈవెంట్‌ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చివరగా అతను వచ్చాడు. పొడవాటి పోల్‌ను తన చేతుల్లోకి తీసుకొని గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. ఆ కార్బన్‌ ఫైబర్‌ పోల్‌ సహాయంతో ఒక్కసారిగా గాల్లోకి ఎగిరిన అతను ఆకాశంలోకి దూసుకెళ్లినట్లుగా అనిపించింది. అక్కడినుంచి బార్‌ మీదుగా అవతలి వైపు ప్యాడింగ్‌ వైపు పడే లోపే కొత్త ప్రపంచ రికార్డు.. ఒలింపిక్‌ మెడల్‌ వచ్చేసింది. హర్షధ్వానాలతో స్టేడియం హోరెత్తిపోయింది. అథ్లెటిక్స్‌ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని సృష్టించుకున్న ఆ ఆటగాడే ఆర్మండ్‌ డుప్లాంటిస్‌.

ఒకటి, రెండు, మూడు.. ఇలా ప్రపంచ రికార్డులు బద్దలవుతూనే ఉన్నాయి. అతను ఆడుతోందే వరల్డ్‌ రికార్డులు నెలకొల్పడానికి అన్నట్లుగా ఉంది పరిస్థితి. నాలుగున్నరేళ్ల వ్యవధిలో ఇలా ఏకంగా అతను 9 కొత్త ప్రపంచ రికార్డులు నెలకొల్పాడు. ఈ క్రమంలో రెండు ఒలింపిక్‌ స్వర్ణాలు  అతని ఖాతాలో చేరాయి. తాజాగా పారిస్‌ ఒలింపిక్స్‌లో కొత్త వరల్డ్‌ రికార్డుతో సాధించిన స్వర్ణం ఈ క్రీడలో డుప్లాంటిస్‌ స్థాయిని శిఖరానికి చేర్చింది. ఒలింపిక్‌ పతకం గెలిచిన రెండు వారాలకే ప్రతిష్ఠాత్మక డైమండ్‌ లీగ్‌ పోటీల్లోనూ అలవోకగా అగ్రస్థానంలో నిలిచాడు.

క్రీడాకారుల కుటుంబం నుంచి..
తల్లిదండ్రులు, ఇద్దరు అన్నలూ క్రీడాకారులే! అలా ఇంట్లో అంతా క్రీడా వాతావరణమే. డుప్లాంటిస్‌ కూడా సహజంగానే క్రీడల వైపు మళ్లాడు. అమెరికా జాతీయుడైన తండ్రి గ్రెగ్‌ పోల్‌వాల్టర్‌ కాగా, స్వీడన్‌కు చెందిన తల్లి హెలెనా హెప్టాథ్లాన్‌ ప్లేయర్‌. పెద్దన్నయ్య కూడా పోల్‌వాల్ట్‌లో అంతర్జాతీయ స్థాయికి చేరగా, రెండో అన్న పోల్‌వాల్ట్‌తోనే మొదలుపెట్టినా ఆ తర్వాత బేస్‌బాల్‌ వైపు మళ్లి జాతీయ స్థాయి వరకు ఆడాడు. తండ్రి బాటలోనే డుప్లాంటిస్‌ నాలుగేళ్ల వయసులోనే పోల్‌వాల్ట్‌పై ఆసక్తి చూపించాడు.

ఏడేళ్ల వయసులోనే అందరి దృష్టినీ ఆకర్షించిన అతను పదేళ్ల వయసులో 3.86 మీటర్లు ఎగిరి పోల్‌వాల్ట్‌లో తాను ఏ స్థాయికి చేరగలడో చూపించాడు. ఒక దశలో 7 నుంచి 13 ఏళ్ల వయసు వరకు అన్ని వయో విభాగాల్లో ప్రపంచస్థాయి అత్యుత్తమ ప్రదర్శనలన్నీ డుప్లాంటిస్‌ పేరు మీదే ఉండటం విశేషం. అమెరికాలోనే పుట్టి, అక్కడే ప్రా«థమిక విద్యాభ్యాసం చేసినా, అమ్మ పుట్టిల్లు స్వీడన్‌పైనే ఆర్మండ్‌కు అభిమానం ఎక్కువ. అందుకే క్రీడల్లో స్వీడన్‌కే అతను ప్రాతినిధ్యం వహించాడు.

రికార్డుల హోరు..
16 ఏళ్ల వయసులో డుప్లాంటిస్‌ తొలిసారి అంతర్జాతీయ వేదికపై మెరిశాడు. కొలంబియాలో జరిగిన వరల్డ్‌ యూత్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలుచుకోవడంతో పాటు కొత్త చాంపియన్‌షిప్‌ రికార్డును నెలకొల్పాడు. ఆ వెంటనే అండర్‌–16 స్థాయిలోనూ కొత్త వరల్డ్‌ రికార్డు నమోదైంది. ఆపై వరల్డ్‌ జూనియర్‌ రికార్డు కూడా దరి చేరింది. 18 ఫీట్‌ల ఇండోర్‌ పోల్‌వాల్ట్‌ ఈవెంట్‌లో పోటీ పడిన తొలి స్కూల్‌ విద్యార్థిగా డుప్లాంటిస్‌ నిలిచాడు. అండర్‌–20 విభాగంలో వరల్డ్‌ చాంపియన్‌గా నిలిచాక అంతర్జాతీయ స్థాయిలో తన తొలి సీనియర్‌ టోర్నీ యూరోపియన్‌ చాంపియన్‌షిప్‌లో అతని సత్తా ప్రపంచానికి తెలిసింది. ఈ టోర్నీలో తొలిసారి 6 మీటర్ల ఎత్తును అధిగమించిన అతనిపై అందరి దృష్టీ పడింది.

ఆపై ఎదురు లేకుండా దూసుకుపోయిన డుప్లాంటిస్‌ కెరీర్‌లో ఎన్నో అసాధారణ ఘనతలు ఉన్నాయి. యూరోపియన్‌ జూనియర్‌లో స్వర్ణం, వరల్డ్‌ యూత్‌లో స్వర్ణం, వరల్డ్‌ జూనియర్‌లో స్వర్ణ, కాంస్యాలతో అతని జూనియర్‌ కెరీర్‌లో కీలక మైలురాళ్లు. సీనియర్‌ స్థాయికి వచ్చే సరికి యూరోపియన్‌ చాంపియన్‌షిప్‌లో మూడు స్వర్ణాలు, యూరోపియన్‌ ఇండోర్‌లో స్వర్ణంతో మెరిశాడు. ప్రతిష్ఠాత్మక డైమండ్‌ లీగ్‌లో మూడు స్వర్ణాలు గెలుచుకున్నాడు. ఆ తర్వాత వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో రెండు స్వర్ణాలు, ఒక రజతం సాధించాడు. వరల్డ్‌ ఇండోర్‌ చాంపియన్‌షిప్‌లో మరో రెండు పసిడి పతకాలు అందుకొని ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. 2020 టోక్యో ఒలింపిక్స్, 2024 పారిస్‌ ఒలింపిక్స్‌లలో గెలుచుకున్న స్వర్ణాలు అతని కెరీర్‌ను సంపూర్ణం చేశాయి.

ఒక్కో సెంటీ మీటర్‌ దాటుతూ..
తొమ్మిది ప్రపంచ రికార్డులను నెలకొల్పడంలో డుప్లాంటిస్‌ ప్రస్థానం అద్భుతంగా సాగింది. ప్రతిసారీ ఒక్కో సెంటీ మీటర్‌ మెరుగైన ప్రదర్శన ఇస్తూ ముందుకు సాగాడు. 2020 ఫిబ్రవరిలో పోలండ్‌లో జరిగిన కోపర్నికస్‌ కప్‌లో 6.17 మీటర్ల ఎత్తుకు ఎగిరి అతను తొలిసారి వరల్డ్‌ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అప్పటి నుంచి 2024 పారిస్‌ ఒలింపిక్స్‌ వరకు ఇది మెరుగవుతూ వచ్చింది. వరుసగా 6.18, 6.19, 6.20, 6.21, 6.22, 6.23, 6.24, 6.25 మీటర్లతో తన రికార్డులను తానే బద్దలు కొట్టుకుంటూ పోయాడు.

ఉక్రెయిన్‌ దిగ్గజం సెర్గీ బుబ్కా తర్వాత పోల్‌వాల్ట్‌ స్థాయిని పెంచి, దానికి ప్రత్యేక ఆకర్షణ తెచ్చిన ఆటగాడిగా డుప్లాంటిస్‌ నిలిచాడు. అమెరికాను కాదని తాను ఎంచుకున్న స్వీడన్‌ కూడా అన్ని రకాలుగా అతనికి అండగా నిలిచింది. అన్నింటికి మించి తన తల్లి స్వస్థలం ఎవెస్టా మునిసిపాలిటీలో డుప్లాంటిస్‌ గౌరవ సూచకంగా ప్రభుత్వం ఒక పోల్‌ వాల్ట్‌ బార్‌ను ఏర్పాటు చేయడం అతడిని అన్నింటికంటే ఎక్కువగా భావోద్వాగానికి గురి చేసింది. – మొహమ్మద్‌ అబ్దుల్‌ హాది

ఇవి చదవండి: బడిని గుడి చేసిన గురుదేవుళ్లు..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement