దీపం జీవితానికి ప్రతీక. ఒక దీపం ఎన్నో దీపాలను వెలిగిస్తుంది. ఆ వెలుగును ఒడిసిపట్టుకోవడం తెలిస్తే జీవితం ప్రకాశవంతమవుతుంది. సరదాగా నేర్చుకున్న క్యాండిల్ మేకింగ్‌తో జీవితాన్ని కాంతిమంతం చేసుకున్న సుజాత మేడబాల అందుకు ప్రత్యక్ష ఉదాహరణ.
లక్కీ క్యాండిల్స్... ఇది హైదరాబాద్, ప్రగతినగర్‌లో ఓ చిన్న పరిశ్రమ. పరిశ్రమ చిన్నదే కానీ, అందులో తయారయ్యే క్యాండిల్స్ మాత్రం చిన్నవి కావు. బాహుబలి సినిమాలో ప్రభాస్ శివలింగాన్ని భుజాన మోసినట్లు మోయాల్సినంత పెద్ద క్యాండిల్స్ తయారవుతాయక్కడ. రెండు అడుగుల చుట్టుకొలత, రెండున్నర అడుగుల ఎత్తున్న క్యాండిల్ అది.
అందుకే ఆ క్యాండిల్ పేరు సరదాగా బాహుబలి క్యాండిల్‌గా వ్యవహారంలోకి వచ్చేసింది. ఇంతకీ బాహుబలి క్యాండిల్ బరువు ఎంతో తెలుసా? 30 కేజీలు. ధర తెలిస్తే క్యాండిల్ వెలుగులో చుక్కలు కూడా కనిపిస్తాయి మరి. ఆ క్యాండిల్ ధర 30 వేల రూపాయలు. ఇది కస్టమైజ్‌డ్ క్యాండిల్ అని, ఒకరు ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నారని, ఈ క్యాండిల్ కోసం ప్రత్యేకంగా మౌల్డ్ తయారు చేయించాల్సి రావడంతో ఆ ధర తప్పలేదని చెప్పారు సుజాత.
ఆమె పరిశ్రమలో తయారయ్యే క్యాండిల్స్‌లో ఎక్కువ భాగం డిజైనర్ క్యాండిల్సే. పిల్లర్ క్యాండిల్, కంటెయినర్ క్యాండిల్, సెంటెడ్ క్యాండిల్, పెయింటెడ్ క్యాండిల్, ప్రింటెడ్ క్యాండిల్, ఫ్లోటింగ్, పర్సనల్ క్యాండిల్స్ కూడా ఉంటాయి. పండుగలు, ఇతర ధార్మిక వేడుకల కోసం రిచువల్స్ క్యాండిల్స్ ప్రత్యేకం. ‘‘దీపం వెలుగు మనసును ఉత్తేజితం చేస్తుంది. అందుకే సెంటెడ్, అరోమాటిక్ క్యాండిల్స్‌లో సందర్భాన్ని బట్టి ఫ్రాగ్నెన్స్‌ను ఎంచుకోవాలి. మా ప్రయోగంలో నాలుగురకాల నాచురల్ వ్యాక్స్ క్యాండిల్స్ ఉన్నాయి.
వాటిలో సోయా వ్యాక్స్, కోకోనట్ వ్యాక్స్, పామ్ వ్యాక్స్ క్యాండిల్స్... ఈ మూడు వేగన్ క్యాండిల్స్. అంటే ఈ మైనం జంతువులు, పక్షుల వంటి ఏ ప్రాణి నుంచి సేకరించినది కాదు. ఇక నాచురల్ వ్యాక్స్‌లో నాలుగవది బీ వ్యాక్స్. తేనెపట్టు నుంచి సేకరించే మైనం అన్నమాట. సాధారణంగా క్యాండిల్ తయారీలో ఉపయోగించేది పారాఫిన్ వ్యాక్స్. ఇప్పుడు నాచురల్ వ్యాక్స్ క్యాండిల్స్ మీద ఆసక్తి చూపిస్తున్నారు, ధర గురించి పట్టింపు కూడా ఉండడం లేదు. దాంతో ప్రయోగాలు చేయడానికి అవకాశం కూడా బాగా ఉంది. నేను పదేళ్లుగా ముగ్గురు ఉద్యోగులతో ఈ పరిశ్రమ నడిపిస్తున్నాను.
ముగ్గురూ మహిళలే. మహిళలనే ఎందుకు చేర్చుకున్నానంటే... ఇది భుజబలంతో చేసే పని కాదు, సృజనాత్మకంగా చేయాల్సిన పని. పైగా మొత్తం చేతుల మీద జరిగే పని. భారీ మొత్తంలో మైనాన్ని కరిగించి ఒకే మూసలో పోయడం కాదు, ప్రతిదీ ప్రత్యేకమే. మనసు పెట్టి చేయాల్సిన పని. సహనం కూడా చాలా ఉండాలి. వీటిని దృష్టిలో పెట్టుకుని మహిళలైతే బావుంటుందనుకున్నాను. అలాగే ఒక మహిళగా సాటి మహిళలకు అవకాశం ఇస్తే బావుంటుందని కూడా అనిపించింది. ముగ్గురు రెగ్యులర్ ఉద్యోగులు, భారీ ఆర్డర్ ఉన్నప్పుడు పార్ట్ టైమ్ ఉద్యోగాలు కూడా మహిళలకే’’ అన్నారు సుజాత.
వైజాగ్‌లో చిరుదీపంగా మొదలైన పరిశ్రమ, హైదరాబాద్‌లో కాంతులు విరజిమ్ముతున్న వైనాన్ని కూడా వివరించారామె. ‘‘వైజాగ్‌లో ఒక టైనింగ్ ప్రోగ్రామ్‌లో ఒకరోజు శిక్షణ తీసుకున్నాను. అది కూడా సరదాగానే. పిల్లలు పెద్దయిన తర్వాత ఖాళీ దొరికింది. దాంతో నేర్చుకున్న పనిని రకరకాలుగా కొత్తగా ఏం చేయవచ్చో ఆలోచిస్తూ పేపర్ కప్పు క్యాండిల్ చేశాను. అలా మొదలైన ప్రయోగాలను కొనసాగిస్తూ వచ్చాను. మా వారు ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యే సమయానికి క్యాండిల్ తయారీలో నాకు పూర్తి స్థాయిలో పట్టు వచ్చేసింది.
ఇక కంపెనీ రిజిస్టర్ చేసి వ్యాపారాన్ని ప్రారంభించాను. నా టైమ్‌పాస్ కోసం మొదలు పెట్టిన ఈ ఆలోచన... ఇప్పుడు మా వారికి రిటైర్‌మెంట్ తర్వాత వ్యాపకంగా మారింది. నా ఆలోచనతో రూపుదిద్దుకున్న పరిశ్రమ ఇప్పుడు ఒక ఈవెంట్‌కి రెండున్నర లక్షల రూపాయల విలువ చేసే క్యాండిల్స్‌ని సరఫరా చేసే స్థాయికి చేరింది. మాకు మంచి వ్యాపకం, మరికొందరికి ఉపాధి. నా పరిశ్రమ కాంతిమంతం చేస్తున్నది నా జీవితాన్ని మాత్రమే కాదు, వేలాది ఇళ్లను, లక్షలాది మనసులను’’ అన్నారామె వాలెంటైన్స్ డే క్యాండిల్స్ చూపిస్తూ.
– వాకా మంజులారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment