Summer Care- Superfoods: కాలానికి అనుగుణంగా తీసుకునే ఆహారం ఇంటిని, ఒంటినీ ఆరోగ్యంగా ఉంచుతుందనేది పెద్దల మాట. ఈ మాటను అనుసరించి వేసవిలో తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. మసాలాలు, వేడిచేసే ఆహార పదార్థాలనూ తీసుకోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు వస్తాయి.
ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే వేసవిలో తేలిగ్గా జీర్ణమయ్యేవి, శరీరం నిర్జలీకరణ జరగకుండా ఉండే ఆహార పదార్థాలేమిటో తెలుసుకుందాం. వేసవిలో నీటి శాతం ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల శరీరం నిర్జలీకరణ కాకుండా ఉంటుంది. అటువంటి వాటిలో ముఖ్యమైన వాటిని చూద్దాం...
పుచ్చకాయ: ఇందులో 80 శాతం కంటే ఎక్కువ నీరు ఉంటుంది. అందువల్ల ఇది దాహాన్ని తీర్చి, డీహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది. అందుకే వేసవి రాగానే ప్రతి ఒక్కరూ పుచ్చకాయలు తింటూ ఉంటారు.
తాటిముంజలు: తాటిముంజలు తినడం వల్ల వేసవిలో దాహార్తి తీరుతుంది. చెమట కాయలు రాకుండా ఉంటాయి.
మామిడి: పండ్లకు రాజయిన మామిడిలో అధిక శాతం సి విటమిన్, ఏ విటమిన్ ఉంటాయి. కాస్త ధర ఎక్కువయినా ఆల్ఫోన్సో మామిడి మరీ మంచిది. ఇందులో పీచుపదార్థాలు, రోగనిరోధక శక్తిని పెంచే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మామిడిలో ఉండే పొటాషియం చెడుకొవ్వును తగ్గించి రక ్తప్రసరణ వేగాన్ని మెరుగుపరుస్తుంది. దానివల్ల గుండె సంబంధిత ఇబ్బందులు రాకుండా ఉంటాయి.
ఉల్లి, క్యారట్: ఎండలో పడి ఇంటికి రాగానే ఉల్లిపాయ, క్యారట్, బీన్స్, వెల్లుల్లి వంటి కూరగాయలను తినాలి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు ఎండతో వచ్చే చర్మవ్యాధుల నుంచి రక్షిస్తాయి.
సలాడ్స్: వేసవిలో కూరగాయలతో రకరకాల సలాడ్స్‌ను తయారు చేసుకోవచ్చు. గ్రిల్డ్ వెజిటబుల్స్, గ్రిల్డ్ వెజిటబుల్ పాస్తా, నూడుల్స్, గ్రిల్డ్ వెజిటబుల్ పనీర్ సలాడ్స్ వంటివి చేసుకోవచ్చు.
సూప్స్: దోసకాయతో చేసిన సూప్‌ను భోజనానికి ముందుగా తీసుకోవడం వల్ల ఆకలి పెరుగుతుంది.
హోల్ గ్రెయిన్ సలాడ్స్: మొక్కజొన్న, మొలకెత్తిన పెసలు, శనగలు, కూరముక్కలు.. వంటివాటిని కలిపి తీసుకుంటే మంచిది. అలాగే మొలకెత్తిన గింజలు, బీన్స్, తరిగిన కూరముక్కలు, పండ్లతో కలిపి సలాడ్‌లా తీసుకుంటే కాల్షియం, ప్రొటీన్లు వొంటికి అందుతాయి. ఇందులో తక్కువ క్యాలరీలున్న చీజ్‌ను తరిగిన కూరలతో కలపడం వల్ల కాల్షియం, ప్రొటీన్ల పరిమాణాన్ని పెంచవచ్చు.
వేసవి పానీయాలు:
సాధారణంగా సమ్మర్‌లో చాలామంది తియ్యగా, చిక్కగా ఉండే శీతల పానీయాలను, సోడాలను, ఐస్‌క్రీమ్‌లను తీసుకుంటూ ఉంటారు. వీటిలో కేలరీలు ఎక్కువ. ఎటువంటి ద్రవపదార్థాన్ని తీసుకున్నా తాత్కాలిక ఉపశమనమే.. అందువల్ల మజ్జిగ, లస్సీ వంటి వాటిని తాగాలి. ఇందులో కొవ్వు లేని పాలు శ్రేష్ఠం. ముఖ్యంగా మంచినీళ్లు, కొబ్బరినీళ్లు, పళ్ల రసాలు మంచిది. వీటన్నింటికంటే నిమ్మరసం తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయి.
పండ్లు, పండ్ల రసాలు: చిక్కగా ఉండే డెజర్ట్స్‌కు బదులుగా పండ్లతో తయారు చేసిన డెజర్ట్స్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. పండ్లు, బెర్రీలు, పుచ్చకాయ వంటి వాటిని తీసుకోవాలి. ఆకుపచ్చని కూరలు, టొమాటోలు, బఠాణీ వంటివి తీసుకోవడం వల్ల శరీరానికి పోషక పదార్థాలు అందుతాయి. కీరకాయను తినడం వల్ల కడుపులో చల్లగా ఉంటుంది.
వేసవిలో లభించే సీజనల్ పండ్లు తప్పకుండా తినాలి. ఇందులో బీటా కెరోటిన్, విటమిన్ సి, ఫైబర్లు ఎక్కువగా ఉంటాయి. వీటన్నింటితో పాటు అక్రోట్లను తీసుకోవాలి. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీయాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి. మాంసాహారులైతే చేపలను ఎక్కువగా తినడం మంచిది. ఉదయం పూట ఓట్స్ తినడం వల్ల శరీరానికి పీచు పదార్థాలు, ప్రొటీన్లు ఎక్కువ గా అందుతాయి. పొట్టు తీయని పప్పు ధాన్యాలు, గింజలను తీసుకుంటే చాలామంచిది.
నూనె పదార్థాలు శరీరంలోని నీటి శాతాన్ని తగ్గించేస్తాయి. అందువల్ల వేసవిలో జంక్‌ఫుడ్, వేపుళ్ల జోలికి వెళ్లకపోవడమే మంచిది. ఎరుపు, నారింజ, పసుపు రంగుల్లో ఉండే గుమ్మడి, బంగాళాదుంప, చిలగడదుంప, బెల్‌పెపర్.. వంటివాటిలో విటమిన్ ఎ, సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.
నీరు: దాహాన్ని తీర్చడానికి నీటిని మించినది లేదు. ఎండలో ఇంటికి వచ్చినప్పుడు గ్లాసుడు మంచినీళ్లు తాగితే మంచిది. మంచినీళ్లు తాగితే శరీరం ఉత్తేజితమవుతుంది. డీహైడ్రేషన్‌కు దూరంగా ఉండచ్చు.
వాల్ నట్స్: యాంటీ ఆక్సిడెంట్లు, నిద్రని రప్పించే ట్రిప్టోఫాన్ మూలకం వాల్‌నట్స్‌లో పుష్కలంగా ఉంటాయి. గింజల రాజుగా పేరొందిన వాల్ నట్లలో ఫైబర్, ఒమెగా కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి. వాల్‌నట్లను తీసుకోవడం వల్ల మనం చెమట ద్వారానూ, వాతావరణంలోని ఇతర మార్పుల మూలంగానూ కోల్పోయే ఖనిజ లవణాలను భర్తీ చేసి, శరీరానికి తగినంత శక్తి చేకూరుతుంది.
నెయ్యి: బరువు పెరుగుతున్నారని పక్కన పెడుతున్నారు కానీ, ఇందులో విటమిన్ ఏ, విటమిన్ కే2, విటమిన్ ‘ఈ’ లతోపాటూ యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేసే లినోలిక్ ఆమ్లాలు ఉన్నాయి. వీటివల్ల రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు జీర్ణక్రియ మెరుగవుతుంది.. అలాగని అధికంగా తీసుకుంటే దాహం ఎక్కువ కావడం వంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి తగిన మోతాదులో నెయ్యి తీసుకోవడం వల్ల వొంటికి తగిన మెరుపు వస్తుంది. తొందరగా అలసట కలగదు.
అంజీర( అత్తి పండ్లు): ఆపిల్, ఎండుద్రాక్షల కంటే అంజీరా చాలా మెరుగైనవి. పీచు పదార్థం ఎక్కువగా ఉన్న ఈ పండ్లను తినడం వల్ల మలబద్దకం దూరమవుతుంది. చర్మ సమస్యలు రావు. ముఖ్యంగా వేసవిలో బరువు తగ్గాలనుకునేవారు వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది..
వేసవిలో ఎటువంటి ఆహార పానీయాలు తీసుకోవాలి.. వాటివల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకున్నాం కదా, ఈ సీజన్‌లో ఇలాంటి ఆహార పదార్థాలను తీసుకుంటే ఆరోగ్యకరమైన వేసవిని ఆస్వాదించవచ్చు.
చదవండి: Muskmelon Juice Health Benefits: కర్బూజా జ్యూస్.. ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో!
Comments
Please login to add a commentAdd a comment