Sunita Meena: ఎన్నాళ్లుగానో వేచి చూస్తోన్న చిన్ననాటి కల.. ఏళ్ల తరువాత మధ్యవయసులో నిజం కాబోతుందన్న ఆనందంలో ఉన్న ఆమెను క్యాన్సర్ వ్యాధి కమ్ముకున్నది. అయినా ఏమాత్రం బెదరలేదు. మరింత ధైర్యాన్ని కూడగట్టుకుని ప్రాణాంతక క్యాన్సర్‌తో పోరాడుతూనే, తన కలను నిజం చేసుకునేందుకు రన్నింగ్ చేస్తోంది సునీతా మీనా. ఒకపక్క కీమో థెరపీ తీసుకుంటూనే మరోపక్క రన్నర్‌గా రాణిస్తోన్న సునీత పరుగుల ప్రయాణం ఆమె మాటల్లోనే....
‘నేను మధురలో పుట్టి పెరిగాను. చిన్నప్పటి నుంచి నాకు రన్నింగ్ అంటే చాలా ఇష్టం. రన్నింగ్ రేసుల్లో పాల్గొని విజేతగా నిలవాలని అనుకునేదాన్ని. కానీ ఇంటర్మీడియట్ పాస్ అవగానే రైల్వేలో పనిచేస్తోన్న దినేష్ కుమార్‌తో నాకు వివాహం అయ్యింది. పెళ్లి అయిన ఏడాదికే బాబు పుట్టాడు. ఇంటిపనులు, బాబుతో బిజీగా ఉన్నప్పటికీ చదువుకుంటానని మా వారిని అడిగాను. ఆయన పెద్దమనసుతో ఒప్పుకోవడంతో డిగ్రీ పూర్తిచేశాను.
ఆయన కూడా రన్నర్ కావడంతో...
స్కూల్లో ఉన్నప్పుడు క్రీడల్లో చురుకుగా పాల్గొనేదాన్ని. కానీ పెద్దయ్యాక రన్నింగ్‌లో పాల్గొనే అవకాశం వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. మా ఆయన అంతర్జాతీయ అథ్లెట్ కావడంతోపాటు, రైల్వే టీమ్‌కు కోచ్‌గా పనిచేసేవారు. రోజూ ఆయన రన్నింగ్‌కు వెళ్తూ రన్నింగ్ గ్రూప్‌తో బిజీగా ఉండేవారు. నన్ను కూడా ‘‘రన్నింగ్ చెయ్యి, ఆరోగ్యంగా ఉంటావు’’ అని చెబుతుండేవారు.
నా చిన్ననాటి కోరికే అయినప్పటికీ, పిల్లలు చిన్నవాళ్లు కావడంతో అప్పుడు వీలుపడలేదు. నా ఎత్తుకంటే, బరువు అధికంగా ఉండడం వల్ల ఎప్పుడూ నీరసంగా ఉండేది. దీనికితోడు తలనొప్పిగా అనిపించేది. ఇలా ఇబ్బంది పడుతోన్న నాకు ‘‘ఈ సమస్యలన్నింటికి రన్నింగ్ చక్కటి పరిష్కార మార్గం’’ అని ఆయన పదేపదే చెబుతుండేవారు.
పిల్లలు కూడా పెద్దవాళ్లు అవడంతో 43 ఏళ్ల వయసులో 2018లో రన్నింగ్ ప్రారంభించాను. ఒకపక్క రన్నింగ్ చేస్తూ బరువు పెంచని పోషకాహారం తీసుకుంటూ ఫిట్‌గా తయారయ్యాను.
ఆరునెలల్లో మారథాన్ రన్నర్‌గా..
తెల్లవారుజామున నాలుగంటలకే నిద్రలేచి రన్నింగ్ సాధన చేసేదాన్ని. ఇలా అక్కడక్కడ జరిగే మారథాన్‌లలో పాల్గొనేదాన్ని. ఇలా పాల్గొంటూ తొలిసారి ఢిల్లీ స్టేట్ మారథాన్‌లో పాల్గొని రెండోస్థానంలో నిలిచాను. ఈ ఉత్సాహంతో ప్రతి మారథాన్‌లో పాల్గొనేదాన్ని. రేస్‌లో ఉన్నప్పుడు నా ఛాతీలో విపరీతంగా నొప్పి వస్తుండేది.
గ్యాస్ వల్ల వచ్చే నొప్పి కావచ్చని తేలిగ్గా తీసుకున్నాను కానీ కొన్నిరోజులకు స్తనంలో వాపు కూడా రావడంతో మావారి బలవంతం మీద ఆసుపత్రిలో చూపించుకున్నాను. డాక్టర్లు పరీక్షించి క్యాన్సర్ గడ్డ ఉందని చెప్పి, వెంటనే సర్జరీ చేస్తామన్నారు. అప్పటికి సరిగ్గా వారం తరువాత రష్యాలో రన్నింగ్ రేస్‌లో పాల్గొనాల్సి ఉందని, తర్వాత చేయించుకుంటానని డాక్టర్‌కు చెప్పాను.
‘‘సర్జరీ వెంటనే చేయాలి, సర్జరీ తరువాత మీరు రన్నింగ్ రేస్‌లో పాల్గొన వచ్చు’’ అని అభయం ఇచ్చారు. సర్జరీ తరువాత కొంచం విశ్రాంతి తీసుకుని ఆయనతో కలిసి రష్యావెళ్లి రన్నింగ్‌లో పాల్గొన్నాను. రష్యా నుంచి వచ్చిన తరవాత కీమో తీసుకుంటూనే రన్నింగ్ కూడా చేసేదాన్ని. అలా ఏడు కీమోలు చేశారు.
తొలి కీమో చేసిన తరువాత నా జుట్టు ఊడడం మొదలైంది. దీంతో నాకేదో అయిపోతోందని కుంగిపోయేదాన్ని. మా ఆయన, పిల్లలు... ‘‘ఇది శాశ్వతం కాదు కొన్నిరోజులే... తరువాత మళ్లీ జుట్టు వస్తుంది’’ అని ధైర్యం చెప్పడంతో కొంచెం కుదురుకున్నాను.
భవిష్యత్‌లో మరిన్ని కిలోమీటర్లు..
‘‘రన్నింగ్‌తోపోలిస్తే కీమోథెరపీ వల్ల కలిగే బాధ తక్కువే. అందుకే నువ్వు నీ రన్నింగ్‌ను ఆపాల్సిన పనిఏమీ లేదు. నువ్వు చక్కగా పరిగెత్తవచ్చు’’ అని డాక్టర్లు ధైర్యం నూరిపోశారు. దాంతో రెట్టింపు ∙ఉత్సాహంతో కీమోథెరపీ చేసిన కొద్దిరోజుల తరువాత ఢిల్లీలో జరిగిన పది కిలోమీటర్ల మారథాన్ ను గంటా తొమ్మిది నిమిషాల్లో పూర్తిచేశాను.
ఆ తరువాత లద్ధాఖ్‌లో జరిగిన ఏడు కిలోమీటర్ల మారథాన్‌లో పాల్గొన్నాను. ఈ ఏడాది జూన్‌లో వడోదరలో జరిగిన జాతీయ మాస్టర్స్ అథ్లెట్ చాంపియన్ షిప్‌లో పాల్గొని ఆరోస్థానంలో నిలిచాను. ఇప్పటికీ నేను కేవలం పదికిలోమీటర్ల రేసుల్లోనే పాల్గొంటున్నాను. భవిష్యత్ లో 21 కిలోమీటర్లు దూరం కూడా ప్రాక్టీస్ చేస్తాను.
శరీరంలో క్యాన్సర్ మహమ్మారి ఆనవాళ్లు ఉన్నాయంటేనే జీవితం అయిపోయిందనిపిస్తుంది. అలాంటిది తన శరీరంలో క్యాన్సర్ ఉన్నప్పటికీ ‘‘... అయితే ఏంటి ..నా పరుగుని అది ఏం చేయలేదు’’ అని 47 ఏళ్ల వయసులో ధైర్యంతో ముందుకు సాగుతూ ఎంతోమంది క్యాన్సర్ రోగులకు స్ఫూర్తిగా నిలుస్తోంది సునీతామీనా.
చదవండి: Pihu Mondal: నరకపు నీడ నుంచి వెలుగుల వైపు
నవ్విన జనమే నీరాజనం పట్టారు! మొక్కల నుంచి పర్యావరణానికి మేలు చేసే పదార్థం!
Comments
Please login to add a commentAdd a comment