
పండు వెన్నెల్లో శ్వేతవర్ణంలో వెలిగిపోయే చందమామను చూపిస్తూ అమ్మ గోరు ముద్దలు పెడుతుంటే ఆ హాయిదనం అలాగే ఉండాలనిపిస్తుంది. అమ్మ ప్రేమ ఎంత మాధుర్యమో ... అమ్మ భాష కూడా అంతే తియ్యదనం. తేనెలూరే తెలుగు భాషలో కథలను చెబుతూ అమ్మ తినిపిస్తుంటే ఊహా ప్రపంచాన్ని చుట్టి వచ్చేస్తూ ఉంటాం. అలాంటి చందమామ కథలను మళ్లీ వినాలని ఉందా.. ఆ కథలను కొత్తగా చూడాలని ఉందా. అయితే మీ ఆశ, ఆకాంక్ష తీరే రోజు దగ్గరకొచ్చేసింది.
టెక్నాలజీ పరుగులు పెడుతున్న ఈ రోజుల్లో, నాగరికత కొత్త పుంతలు తొక్కుతున్న ఈ కాలంలో .. నాటి నీతికథలు, సాహసగాథలు నేటి పిల్లలకు ఎంతో అవసరం. అందుకే అదే టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ స్వేచ్ఛ సంస్థ చందమామ కథలను ఆర్టిఫిషియెల్ ఇంటెలిజెన్స్ టూల్ ద్వారా సరికొత్తగా మనకు అందిస్తుంది. నేడు మన మొబైల్ లో వాడే తెలుగు అక్షరాలు ఈ స్వేచ్ఛ సృష్టించినవే. అదే స్వేచ్ఛ నేడు ఈ అద్భుతమైన అందమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
40 వేల కథలను ఇప్పటికే అప్ లోడ్ చేసిన స్వేచ్ఛ బృందం .. సరికొత్త కథలు వచ్చేలా టూల్ ను కూడా సిద్ధం చేసింది. అమృతగాథలను సృష్టించే ఈ వినూత్న కార్యక్రమానికి తెలుగు సాహితీవేత్తలు, రచయితలు, కవులతో పాటు, మాతృభాషపై మమకారం కలిగిన ప్రతి ఒక్కరికీ ఆహ్వానం పలుకుతున్నామని నిర్వాహకులు తెలిపారు. రేపు (శనివారం 2024 జనవరి 6వ తేదీ) ఈ ఆవిష్కరణ జరగనుంది. గచ్చిబౌలి స్వేచ్ఛ ఆఫీసులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment