వృషభ రాశి
ఆదాయం–2, వ్యయం–8, రాజయోగం–7, అవమానం–3.
కృత్తిక 2,3,4 పాదములు (ఈ, ఊ, ఏ)
రోహిణి 1,2,3,4 పాదములు (వో,వా,వీ,వూ)
మృగశిర 1,2 పాదములు (వే,వో)
గురువు మే 1 వరకు మేషం (వ్యయం)లోను తదుపరి వృషభం (జన్మం)లోను సంచరిస్తారు. శని కుంభం (దశమం)లోను రాహువు మీనం(లాభం)లోను కేతువు (పంచమం)లోను సంచరిస్తారు. రోజువారీ కార్యక్రమాలలో నూతనోత్సాహంతో పనులు చేస్తుంటారు. భోజనం, నిద్ర, వస్త్రధారణ వంటి నిత్యకృత్యాలు బాగా సానుకూలమై ఆనందిస్తారు. అన్ని కార్యములలో ధనవ్యయం అధికమవడం, విఘ్నాలు రావడం జరిగినా, చివరకు కార్యవిజయం సాధిస్తారు. విజ్ఞాన విషయాలు తెలుసుకోవడంలో కాలక్షేపం బాగా జరుగుతుంది. విహార యాత్రలు, వినోద కార్యక్రమాలు నిర్వహించడం వంటివి చేస్తుంటారు. ఏది ఏమైనా ఆనందంగా కాలక్షేపం చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఉద్యోగ విషయాలలో ప్రతి ప్రయత్నంలోనూ శ్రమ, విఘ్నాలు ఉంటాయి. అయితే తెలివిగా, ధైర్యంగా నిర్ణయాలు చేసి సమస్యలను అధిగమించగలుగుతారు. అధికారుల నుంచి వచ్చే ప్రతిఘటనలను చక్కగా ఓర్పుగా సరిచేయగలుగుతారు.
వ్యాపారులకు ప్రభుత్వ పాలసీలు, అధికారుల ప్రవర్తన కొంచెం చికాకులు స్పష్టిస్తాయి. తరచుగా బుద్ధి భ్రంశానిరి లోనయినా, మళ్లీ త్వరగా తేరుకుంటారు. నూతన ప్రయత్నాలలో చాలా సానుకూల ఫలితాలు అందుకుంటారు. మంచికాలమే! కుటుంబ విషయాలు చూస్తే పెద్దగా ఇబ్బందులు ఉండవు. సాధారణ స్థాయి ఫలితాలు అందుతాయి. పెద్దల ఆరోగ్యస్థితి బాగుంటుంది. పిల్లల అభివృద్ధి వార్తలు వింటారు. కుటుంబపరంగా చేయవలసిన శుభ, పుణ్యకార్యాలు అన్నీ జరుగుతుంటాయి. బంధుమిత్రుల రాకపోకలు ఎక్కువ అవుతాయి. బంధు మిత్రులతో కలసి శుభ కార్యాలు, పుణ్యకార్యాలు, కులాచార కార్యాలు చేస్తారు. సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక విషయాలు పరిశీలిస్తే ఆదాయం మందగమనంగా ఉంటుంది. అయితే ఖర్చులకు తగిన ఆదాయం అందుతుంది. ఋణాలు ఇచ్చి పుచ్చుకునే విషయంలో ఇబ్బందులు ఉండవు.
ఖర్చులను సరైన పద్ధతిలో నియంత్రించగలుగుతారు. మితభాషణ, ఓర్పుగా ఆలోచించడం, దూకుడుతనం అనేవి ఖర్చుల విషయంలో విడనాడటం మంచిది. మీరు అందరికీ బాగా సహకారం చేస్తారు. ఆరోగ్య విషయంగా పెద్దగా ఇబ్బందులు ఉండవు. అయితే పాత సమస్యలు తరచుగా తిరగబడే అవకాశం ఉంటుంది. అయినా బహు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెడతారు. మంచి కాలక్షేపం జరుగును. ఈ రాశికి చెందిన స్త్రీలకు ఉద్యోగ నిర్వహణ, కుటుంబ నిర్వహణ కష్టసాధ్యంగా అనిపించినా తెలివిగా ఓర్పుగా వ్యవహరించి ముందుకు సాగుతారు. ప్రత్యేక గుర్తింపు మాత్రం ఉండదు. గర్భిణీ స్త్రీల విషయమై మీ దగ్గర నుంచి కాలం అనుకూలంగా ఉన్నది. ఇబ్బందికర ఘటనలు ఉండవు. షేర్ వ్యాపారులకు క్రమక్రమంగా లాభమార్గం వైపు ప్రయాణం సాగుతుంది. సమస్యల నుంచి బయటపడతారు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి చక్కటి సలహాలు అందుతాయి.
కార్యవిజయం లభిస్తుంది. కోర్టు వ్యవహారాలలో ఉన్నవారికి ఏదో ఒక రూపంలో విజయం సాధించే అవకాశం ఉన్నది. మంచికాలం. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఉన్నవారికి శుభ పరిణామాలు ఉంటాయి. అంతటా సహకరించేవారు ఉంటారు. విద్యార్థులకు ఆశించిన స్థాయి ఫలితాలు రావు కానీ, మొత్తం మీద సానుకూల ఫలితాలే ఉంటాయి. రైతుల విషయంలో అంతా శుభ ఫలితములే! జంతువులు, పక్షులు పెంచేవారికి లాభదాయకం.
కృత్తిక నక్షత్రం వారికి ధైర్యం బాగా ఉంటుంది. సకాలంలో పనులు చేసినా రావలసిన గుర్తింపు రాదు. వృత్తిరీత్యా ఇబ్బంది ఉండదు. రోహిణి నక్షత్రం వారికి తరచుగా వృత్తి మార్పు విషయంగా ఆలోచనలు పెరుగుతుంటాయి. వృత్తిపరంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. స్థిరాస్తుల లావాదేవీల్లో ఇబ్బందులు పడతారు. మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారికి విచిత్ర స్థితి నెలకొని ఉంటుంది. అనవసర వాగ్యుద్ధాలు జరుగుతుంటాయి. కొన్నిసార్లు మొండిగా, కొన్నిసార్లు శాంతంగా ప్రవర్తిస్తుంటారు. వాహన చికాకులు తప్పవు.
శాంతి మార్గం: తరచుగా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ చేయండి. రోజూ శివాలయంలో ప్రదోష కాలంలో 11 ప్రదక్షిణలు చేసి లక్ష్మీనృసింహ కరావలంబస్తోత్ర పారాయణ చేయండి. గోపూజ, గురు జపం, దానం చేయించండి.
ఏప్రిల్: తెలివిగా ఆర్థిక లావాదేవీలు సాగిస్తారు. సంకల్పించిన పనులు వేగంగా జరుగుతాయి. కుటుంబ జీవనం బాగుంటుంది. వృత్తి ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు వచ్చి, మంచి ప్రతిభ చూపిస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి. పుణ్యక్షేత్ర సందర్శన, నదీస్నానం చేస్తారు. ఆరోగ్య విషయంలో తెలివిగా ఉండి రక్షణ పొందుతారు. షేర్ వ్యాపారులకు కాలం అనుకూలం. విద్యా వ్యాసంగంలో ఉన్నవారికి మంచి కాలం.
మే: కుజ– బుధ– శుక్రుల అనుకూల సంచారంతో మొదటి రెండు వారాలు అత్యంత అనుకూలం. విందు వినోదాలు, విహారయాత్రలు ఉంటాయి. ద్వితీయార్ధంలో శారీరక అలసట, కొన్ని వివాదాల వల్ల సమస్యలు ఉంటాయి. రవి, శివారాధన శుభప్రదం. మాసారంభం అనుకూలం. సమస్యలను తెలివిగా సాధించుకుంటారు.
ఆరోగ్య, ఋణ విషయాల్లో జాగ్రత్త ప్రదర్శిస్తారు. విదేశీ ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో మొదటి రెండు వారములు అనుకూలం. షేర్ వ్యాపారులు, మార్కెటింగ్ ఉద్యోగులకు మంచి ఫలితాలు. కుటుంబ పెద్దల ఆరోగ్యం బాగుంటుంది. విద్యార్థులకు అనుకూలం.
జూన్: వ్యయ కుజ, ద్వితీయ రవి సంచారం వలన తరచు సమస్యలు, పని ఒత్తిడి ఎక్కువగా ఉంటాయి. శుభకార్యాలు, స్త్రీల నిమిత్తం ఖర్చులు పెరుగుతాయి. శివ–సుబ్రహ్మణ్య ఆరాధన శుభప్రదం. 8వ తేదీ నుండి మృగశిర నక్షత్రం వారికి స్వల్ప ఆరోగ్య చికాకులు ఉంటాయి. కొత్త ప్రయోగాలు చేస్తుంటారు. భక్తి, కాలక్షేపం ఎక్కువ అవుతుంది. విద్యార్థులకు, రైతులకు అనుకూలం. అలంకరణ వస్తువుల కొనుగోలులో అధిక ధనవ్యయం అవుతుంది.
జులై: ప్రథమార్ధం మిశ్రమ ఫలితాలు. ద్వితీయార్ధంలో ఖర్చులు పెరుగును. మనోధైర్యంతో పనులు చక్కబెడతారు. పనిలో గుర్తింపు పొందుతారు. అధికారయోగం ఉంది. వివాదాలు సర్దుకుంటాయి. కుజస్తోత్ర పారాయణం చేయాలి. ఆరోగ్య జాగ్రత్తలు అవసరం. అనవసర ప్రయాణాలను విరమించండి. షేర్ వ్యాపారులకు అనుకూలం. విద్యార్థులకు, రైతులకు సాధారణ ఫలితాలు ఉంటాయి.
ఆగస్ట్: కొంత ఒదిగి ఉండటం శ్రేయస్కరం. పని ఒత్తిడి వల్ల చురుకుదనం తగ్గుతుంది. స్థిరాస్తి వ్యవహారాలలో సమస్యలు ఎదురవుతాయి. 2వ వారంలో శుభవార్త ఆనందం కలిగిస్తుంది. నవగ్రహారాధన శుభప్రదం. 15వ తేదీ వరకు రోహిణీ నక్షత్రంతో కుజుడు జాగ్రత్తలు అవసరం. షేర్ వ్యాపారులకు మంచి ఫలితాలు. చాలా సమస్యలను తెలివిగా పరిష్కరించుకోగలుగుతారు. విద్యార్థులకు, రైతులకు అనుకూలం.
సెప్టెంబర్: సంతానం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. పెద్దల అనుగ్రహంతో సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. పని ఒత్తిడి పెరుగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. రవి– కుజ– శుక్రులకు శాంతి, శివకుటుం ఆరాధన శుభప్రదం. ఉద్యోగులకు అధికారుల అండదండలు ఉంటాయి. ధనవ్యయం అధికం అవుతుంది. షేర్ వ్యాపారులకు అనుకూలం. పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు.
అక్టోబర్: ఈ నెల అంతా శుభప్రదం. శత్రు, ఋణ బాధల నుంచి ఉపశమనం. ఉన్నతాధికారుల సందర్శన, స్థానచలనం, అధికారయోగం. రాజకీయ రంగంలో విశేష జనాకర్షణ. స్త్రీలతో స్వల్ప సమస్యలు ఉంటాయి. కుజ శాంతి, లక్ష్మీ–లలితా స్తోత్ర పారాయణ శుభప్రదం. షేర్ వ్యాపారులకు సాధారణ స్థాయి అనుకూలం. రైతులకు, విద్యార్థులకు కూడా సానుకూలం. ప్రమోషన్, ట్రాన్స్‌ఫర్ విషయాలలో అనుకూలత ఉంటుంది. వ్యాపారులు లాభాలు అందుకుంటారు. ఆరోగ్యం అనుకూలం.
నవంబర్: ప్రయాణ లాభం. మనోధైర్యం పెరుగుతుంది. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. కోర్టు సమస్యలు తగ్గుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. కాలభైరవారాధన శుభప్రదం. ఆర్థిక కార్యకలాపాలు స్వయంగా చూసుకుంటూ సమస్యల నుంచి బయటపడతారు. షేర్ వ్యాపారులకు, ఫైనాన్స్ వ్యాపారులకు అనుకూలం. విద్యార్థులకు, రైతులకు మంచి ఫలితాలు. కోర్టు వ్యవహారాలు పరిష్కారమవుతాయి.
డిసెంబర్: మానసిక ఆందోళన పెరుగుతుంది. అధిక ఖర్చులు. గతంలో చేసిన అశ్రద్ధ వలన ఇప్పుడు సమస్యలు ఎదురవుతాయి. రుద్రాభిషేకం చేయుట మంచిది. ఉద్యోగంలో తోటివారి సహకారం బాగుంటుంది. పిల్లల అభివృద్ధి వార్తలు అందుతాయి. షేర్ వ్యాపారులకు అనుకూలం. విదేశీ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో సత్ఫలితాలు.
జనవరి: ప్రయాణమూలక ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఉమామహేశ్వర స్తోత్రపారాయణ మంచిది. వైద్య ఖర్చులు పెరుగుతాయి. విద్యార్థులు ప్రశాంతంగా ఉండడానికి ప్రత్యేక ప్రయత్నాలు చేసుకోవాలి. రోహిణీ నక్షత్రం వారికి మాత్రం లాభాలు అధికం. షేర్ వ్యాపారులు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత లాభం. ఫైనాన్స్ వ్యాపారులు మొండి బాకీలు వసూలులో జాగ్రత్తపడాలి. ఫిబ్రవరి: దైవానుగ్రహంతో సమస్యలు తీరుతాయి. పూర్వం నుంచి చేసిన శ్రమకు తగిన ప్రతిఫలం దొరుకుతుంది. వృత్తిలో గుర్తింపు, విశేష కీర్తి కలుగుతాయి. అధికారయోగం. బంధుమిత్రుల రాకపోకలు పెరుగుతాయి. భక్తి కార్యక్రమాలలో పాల్గొంటారు. షేర్ వ్యాపారులకు అనుకూలం. విద్యార్థులకు, రైతులకు శ్రమతో కూడిన లాభం. ఫైనాన్స్ వ్యాపారులకు, విదేశీ ప్రయత్నాలలో ఉన్నవారికి అనుకూలం. మార్చి: పనులు లాభదాయకంగా ఉంటాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. అధికారిక గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు, బదిలీలు అనుకూలం. ఋణ సమస్యలు తగ్గుతాయి. నూతన కనక–వస్తు–వాహన కొనుగోలు అనుకూలం. శుభకార్యాలు జరుగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment