స్కూళ్లకు వెళ్లే పిల్లలు బుద్ధిగా ఓ చోట కూర్చోమంటే ఎందుకు ఉంటారండి! చిరుతిళ్లు తింటూ టీచర్‌కి దొరికి పోవడమో, పెన్సిల్ దొంగతనం చేయడమో, క్లాస్ ఎగ్గొట్టడమో, పరీక్షలు బాగా రాయకపోవడమో.. ఒకటేమిటి అన్నీ చేస్తారు! ఆనక టీచర్ ఇచ్చే పనిష్‌మెంట్లు తీసుకోవడం.. ఇంట్లో టీచర్‌పై పిర్యాదులు చేయడం ఇది మామూలే! ప్రతి స్కూల్లో జరిగేదే. ఐతే చైనాలో ఒక టీచర్ ఇచ్చిన పనిష్‌మెంట్‌కు ఓ విద్యార్ధిని శాశ్వతంగా అంగవైకల్యురాలైంది. అసలేంజరిగిందంటే..
చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌కు చెందిన హై స్కూళ్లో చదివే 14 యేళ్ల విద్యార్ధిని వసతి గృహంలో తన బెడ్ పక్కన ఉన్న స్నాక్స్ గురించి టీచర్ ప్రశ్నించిందట. ఐతే బాలిక తనవి కావని బుకాయించిందట. దీంతో ఆగ్రహించిన టీచర్ 300 గుంజిళ్లు తీయమని పనిష్‌మెంట్ ఇచ్చింది.
ఆ తర్వాత వచ్చిన టీచర్‌కి బాలిక సక్రమంగా గుంజిళ్లు తీస్తుందో లేదో పర్యవేక్షించే బాధ్యతలు అప్పగించి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఐతే గతంలొనే బాలిక కాలి గాయంతో బాధపడుతుందన్న విషయం తెలిసినా ఎవ్వరూ శిక్షను రద్దు చేసే ప్రయత్నం చేయలేదు. దీంతో 150 గుంజిళ్లు తీశాక, బాలిక పరిస్థితి విషమించడంతో సమీప ఆసుపత్రికి తరలించారు. బాలికను పరీక్షించిన డాక్టర్లు ఇక మీదట మామూలుగా నడవలేదని, ఊత కర్రల సాయంతోనే నడవవల్సి ఉంటుందని చెప్పాడు. దీంతో తీవ్ర షాక్‌కు గురైన బాలిక డిప్రెషన్‌లోకి వెళ్లింది.
స్థానిక మీడియా కథనాల ప్రకారం ఈ సంఘటన గురించి తెలిసిన స్కూల్ యాజమాన్యం సదరు టీచర్‌ను విధుల నుంచి సస్పెండ్ చేసింది. అంతేకాకుండా బాలికకు రూ. 13 లక్షలు నష్టపరిషారం ఇవ్వడానికి కూడా ముందుకు వచ్చినట్టు సమాచారం. ఐతే బాలిక తల్లిదండ్రులు దానిని నిరాకరించారట. ఇది గత యేడాది జూన్ 10న జరిగినట్లు బాలిక తల్లి జోవూ స్థానిక మీడియాకు తెల్పింది. తాజాగా వెలుగులోకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment