Telugu Girls Selected For Women's U-19 T20 World Cup - Sakshi
Sakshi News home page

టీ 20 అండర్‌ 19 వరల్డ్‌ కప్‌లో మన చిచ్చర పిడుగులు

Published Wed, Dec 7 2022 5:14 AM | Last Updated on Wed, Dec 7 2022 9:19 AM

Telugu Girls selected for T20 Under 19 World Cup - Sakshi

త్రిష, షబ్నమ్‌

త్రిష, షబ్నమ్‌... ‘తెలుగుతేజాలు’ అంటూ వార్తల్లో పతాక శీర్షికలో వెలుగుతున్న క్రీడాకారిణులిద్దరూ. మహిళల అండర్‌ 19 కేటగిరీలో టీ 20 వరల్డ్‌ కప్‌ క్రికెట్‌కు ఎంపికైన ఇండియా జట్టులో స్థానం సంపాదించుకున్న తెలుగమ్మాయిలు వీళ్లు. త్రిష భద్రాచలం అమ్మాయి, షబ్నమ్‌ వైజాగ్‌ అమ్మాయి.

నేను భద్రాచలంలో ఫిట్‌నెస్‌ కోచ్‌గా ఉండేవాడిని. త్రిష మాకు ఏకైక సంతానం. త్రిష అమ్మ తనకు కావల్సిన పోషకాహారంపై దృష్టి పెడితే, నేను తను క్రీడల్లో శిక్షణ ఎలా ఉందో చూసేవాడిని. తనని మంచి క్రీడాకారిణిగా చూడాలనుకున్నాను. ఇంకెన్నో విజయాలు సాధించాలన్నదే మా కల.  
– గొంగడి రామిరెడ్డి 

ఇటీవల ముగిసిన దేశవాళీ క్రికెట్‌ టోర్నీల్లో తన బ్యాట్‌తో అందరినీ ఆకట్టుకున్న హైదరాబాద్‌ క్రికెటర్‌ త్రిష దక్షిణాఫ్రికాలో జనవరి 14 నుంచి 29 వరకు జరగనున్న టీ 20 ప్రపంచకప్‌లో పాల్గొనే భారత అండర్‌ –19 మహిళల క్రికెట్‌ జట్టుకు ఎంపికైంది.  

డిసెంబరు 17 నుంచి దక్షిణాఫ్రికాతో జరిగే టీ 20 సీరీస్‌లో పాల్గొనే జట్టులో కూడా  చోటు దక్కించుకుని తెలంగాణ నుంచి మరో మిథాలీ రాజ్‌ అంటూ ప్రశంసలు అందుకుంటోంది త్రిష. ఈ సందర్భంగా తన ఆనందాన్ని ‘సాక్షి’తో పంచుకుంది.  
 
తండ్రే గురువు 
వృత్తిరీత్యా ఫిట్‌నెస్‌ కోచ్‌ అయిన తండ్రి నుంచి త్రిష క్రికెట్‌లో ఓనమాలు దిద్దింది. భద్రాచలంలో తండ్రి రామిరెడ్డి ద్వారా మూడేళ్ల వయసులో క్రికెట్‌కు పరిచయమైన త్రిష ఎనిమిదేళ్ల వయసులో హైదరాబాద్‌ అండర్‌ –16 జట్టులో చేరింది. ఆమెలోని ప్రతిభను గుర్తించిన తల్లిదండ్రులు హైదరాబాద్‌ సెయింట్‌ జాన్స్‌ క్రికెట్‌ అకాడమీలో ఆమెను చేర్చారు, అక్కడ ఆమె కోచ్‌లందరినీ ఆకట్టుకుంది. సెయింట్‌ జాన్స్‌లో కోచ్‌ ఆధ్వర్యంలో తనను తాను మేటి క్రీడాకారిణిగా తీర్చిదిద్దుకుంది. ఆమె తన 12 సంవత్సరాల వయస్సులో సీనియర్స్‌ రాష్ట్ర జట్టులో చేరింది.  
 
మిథాలీకి అభిమానిని..  
‘భారత జట్టులో చోటు దక్కించుకోవడంతో సంతోషిస్తున్నాను. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నా..’ అని ఆనందాన్ని వ్యక్తం చేసింది ఈ ఓపెనింగ్‌ బ్యాట్‌ ఉమెన్, లెగ్‌ స్పిన్నర్‌. కిందటి నెలలో విశాఖపట్నంలో జరిగిన క్వాడ్రాంగులర్‌ సిరీస్‌లో స్థానం దక్కించుకుంది. 

వెస్టిండీస్, శ్రీలంక, ఇండియా ‘ఎ’ , ఇండియా ‘బి’ జట్లతో కూడిన సిరీస్‌లో ఇండియన్‌ జెర్సీ ధరించడం చాలా థ్రిల్లింగ్‌గా ఉంది అంటోంది త్రిష. ‘‘తొలి మహిళా క్రికెట్‌ సంచలనం మిథాలీ రాజ్, ఎం.ఎస్‌ ధోనీకి పెద్ద అభిమానిని. వారి నుంచే ఎంతో నేర్చుకున్నాను. వారి వల్లే నా ఆటను అద్భుతంగా మార్చుకునే ప్రయత్నం ఎప్పుడూ చేస్తుంటాను. ఉదాహరణకు ఒక విషయం చెబుతాను... ఒకరోజు మిథాలీని ఓ అబ్బాయి ప్రశ్నిస్తూ గ్రౌండ్‌లో ఎవరు బౌలింగ్‌ చేస్తుంటారని అడిగాడట.

ఎవరు బౌలింగ్‌ చేస్తున్నారో తాను ఎప్పుడూ చూడనని, తన వద్దకు వచ్చే బంతిని మాత్రమే చూస్తానని మిథాలీ అతనితో చెప్పారట.. ఈ విషయం ఆమే చెప్పారు. ఇలాంటి సంఘటనలు ఎంతో స్ఫూర్తినిస్తాయి. ఆమెను చూసి నేను నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది’’ అంటున్న త్రిష... తన దృష్టి మొత్తం ప్రపంచకప్‌లో రాణించడంపైనే ఉందని తెలిపింది. తన విజయంపై ఆమె దృష్టి మాత్రమే కాదు తెలుగు మహిళల అందరి దృష్టీ ఉందని చెబుతూ బెస్టాఫ్‌ లక్‌.   
– నిర్మలారెడ్డి

ఫాస్టెస్ట్‌ బౌలర్‌గా నిలవాలి...
టీ 20 వరల్డ్‌ కప్‌కు ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. క్రీడాకారులు ఎప్పుడూ ప్రాక్టీస్‌లోనూ, మ్యాచ్‌ పెర్ఫార్మెన్స్‌లోనూ కాంప్రమైజ్‌ కాకూడదు. మన హండ్రెడ్‌ పర్సెంట్‌ ఇవ్వాలి. అప్పుడే లక్ష్యాన్ని చేరుకోగలుగుతామనేది నా నమ్మకం. ఆడేటప్పుడు మ్యాచ్‌ని ఎంజాయ్‌ చేయాలి. ప్రెషర్‌ తీసుకోకూడదు. ప్రతి రోజూ మన బెస్ట్‌ కాకపోవచ్చు. కానీ మనం అంకితభావంతో ఆడడమే మనవంతు. ఫాస్ట్‌ బౌలర్‌గా... ఫాస్టెస్ట్‌ బౌలర్‌గా నిలవడం నా లక్ష్యం. 
– షబ్నమ్, క్రికెట్‌ క్రీడాకారిణి 

2016లో ఎనిమిదేళ్ల వయసులో క్రికెట్‌ ప్రాక్టీస్‌ మొదలు పెట్టిన షబ్నమ్‌ 2019లో స్టేట్‌ని రిప్రజెంట్‌ చేసింది. చాలెంజర్స్‌ ట్రోఫీ, జడ్‌సీఏ, ఎన్‌సీఏ హై పెర్ఫార్మెన్స్‌ క్యాంప్, రంజీట్రోఫీలో ఒక మ్యాచ్‌లో రెండు వికెట్‌లు తీసుకున్న షబ్నమ్‌కి బౌలింగ్‌ ఇష్టం. న్యూజిలాండ్‌ సీరీస్‌లో మూడు వికెట్‌లు తీసుకుంది. ఆమె110– 115 స్పీడ్‌తో బౌలింగ్‌ చేస్తుంది, బౌలింగ్‌కి 20 మీటర్స్‌ నుంచి రన్‌ అప్‌ తీసుకుంటుంది.

క్వాడ్రాంగులర్‌ సీరీస్‌లో శ్రీలంక, వెస్ట్‌ ఇండీస్‌ దేశాలతో ఆడిన షబ్నమ్‌ నిన్నటి వరకు (డిసెంబర్‌ 6) టీ20 సీరీస్‌లో న్యూజిలాండ్‌తో ఆడింది. వరల్డ్‌ కప్‌కి ఎంపిక అయిన సందర్భంగా ఆమె ముంబయి నుంచి సాక్షితో తన సంతోషాన్ని పంచుకుంది.

 ప్రాక్టీస్‌ మానదు 
షబ్నమ్‌ క్రికెట్‌ జర్నీ గురించి ఆమె తల్లి ఈశ్వరమ్మ మాట్లాడుతూ ‘‘మా పెద్దమ్మాయి. తను రోజూ ఉదయం ఐదున్నర నుంచి ఎనిమిదిన్నర వరకు, సాయంత్రం ఐదున్నర నుంచి ఎనిమిదిన్నర వరకు ప్రాక్టీస్‌ చేస్తుంది. క్రికెట్‌ ప్రాక్టీస్‌ కాక ఫిట్‌నెస్‌ కోసం మరో గంట వర్కవుట్‌ చేస్తుంది. ఏడాదిలో 365 రోజులూ ఇదే తన డైలీ రొటీన్‌. ఒక్క రోజు కూడా ప్రాక్టీస్‌ ఆపదు. వైజాగ్, ఎన్‌ఏడీ అకాడమీలో మొదలైన ప్రాక్టీస్‌ వీడీసీఏ, ఏసీఏలో కొనసాగుతోంది.

తనిప్పుడు టెన్త్‌ క్లాస్‌. షబ్నమ్‌ కోసం స్కూల్‌ వాళ్లు ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహిస్తూ సహకరిస్తున్నారు. అండర్‌ 19, టీ 20 వరల్డ్‌ కప్‌కు ఆడే అవకాశం రావడం కీలకమైన సోపానం. సీనియర్‌ కేటగిరీలో మనదేశం తరఫున ఆడడం తన లక్ష్యం. ఆ లక్ష్యాన్ని చేరడానికి మధ్య ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకుంది. ఇక నుంచి ఇంకా దీక్షగా ప్రాక్టీస్‌ చేయాల్సి ఉంటుంది. తనకు ఫాస్ట్‌ బౌలింగ్‌ ఇష్టం. 

నేను ఎంపైర్‌ని 
పిల్లలు ఏదైనా సాధించాలంటే పేరెంట్స్‌ సహకారం చాలా అవసరం. మేమిద్దరం డిఫెన్స్‌ ఉద్యోగులమే. ఆయన లీడింగ్‌ ఫైర్‌మ్యాన్, నేను ఆఫీస్‌ క్లర్క్‌ని. మా వారికి క్రికెట్‌ చాలా ఇష్టం. అప్పట్లో తనకు అంత సహకారం, ప్రోత్సాహం లేకపోవడంతో విశాఖపట్నానికే పరిమితమయ్యారు. పిల్లలను క్రీడాకారులుగా తయారు చేయాలనే కోరిక మా వారిదే. చిన్నమ్మాయి షాజహానాబేగం కూడా క్రికెట్‌ ప్రాక్టీస్‌ చేస్తోంది.

ముగ్గురూ ప్రాక్టీస్‌ చేస్తుంటే ఎంపైర్‌గా వ్యవహరిస్తూ ఆటను ఎంజాయ్‌ చేయడం నా వంతు. మాకు వేడుకైనా, పిక్‌నిక్‌ అయినా క్రికెటే. బంధువుల ఇళ్లలో వేడుకలకు వెళ్లే అవకాశం ఉండదు. షబ్నమ్‌ ఎక్కడ ఆడుతుంటే ఫ్యామిలీ మొత్తం అక్కడికి వెళ్లిపోతాం. మాకదే పిక్‌నిక్‌’’ అన్నారు షబ్నమ్‌ తల్లి ఈశ్వరమ్మ. 
– వాకా మంజులారెడ్డి  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement