Stress Relief: Top Best 14 Foods That Can Be Stress Relievers - Sakshi
Sakshi News home page

Stress Relief:: నువ్వులు.. గుడ్లు.. శనగలు..షెల్‌ఫిష్!

Published Fri, May 28 2021 2:30 PM | Last Updated on Fri, May 28 2021 7:41 PM

These Food Items Can Help You To Stress Relief - Sakshi

ఒత్తిడి ఎదుర్కోని మనిషి ప్రస్తుత సమాజంలో కనిపించడం అరుదు. ఆధునిక సాంకేతికత కొత్త పుంతలు తొక్కి మనిషి జీవితం ఉరుకులు పరుగుల మయం అయ్యాక ఎన్నో శారీరక, మానసిక సమస్యలు విజంభిస్తున్నాయి. అలాంటి వాటిలో ఒత్తిడి(స్ట్రెస్‌) ఒకటి. ఆఫీసులో అప్పగించిన పనిని సకాలంలో పూర్తిచేయాలని టార్గెట్లు పెట్టడం, పోటీ రంగంలో ఇతరులు ముందుకు దూసుకెళ్లుతుండడం, అనుకున్న లక్ష్యాల్ని చేరుకొనే క్రమంలో ఆలస్యం కావడం వంటివి ఒత్తిడికి కారణమవుతున్నాయి.

ఫలితంగా హృద్రోగాలు, బీపీ, మధుమేహం వంటివి చుట్టుముడుతున్నాయి. ఇంకా చెప్పాలంటే ఒక్కోసారి ఈ ఒత్తిడి డిప్రెషన్‌గా మారి బలవన్మరణాలకు సైతం ప్రేరేపిస్తోంది. అందువల్ల శారీరక మానసిక ఆరోగ్యంతో ఉండాలంటే ఒత్తిడిని దరిచేరనీయకపోవడం అత్యుత్తమం. దీనికోసం తోడ్పడే కొన్ని రకాల ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం... 

చిలగడ దుంపలు
ఇందులో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. ఒత్తిడికి కారణమయ్యే కార్టిసోల్‌ హార్మోన్‌ స్థాయిని ఇవి తగ్గిస్తున్నట్లు ఓ పరిశోధనలో తేలింది. ఊబకాయం, అధిక బరువుతో ఉండే కొందరు మహిళలను ఎంచుకొని వారికి కొన్ని రోజుల పాటు చిలగడ దుంపలను ఆహారంగా ఇచ్చారు. అనంతరం వారికి పరీక్షలు చేసినప్పడు అంతకుముందుతో పోలిస్తే కార్టిసోల్‌ స్థాయిలు తగ్గినట్లు గుర్తించారు. చిలగడ దుంపల్లో ఉండే విటమిన్‌ సి, పొటాషియం ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కొంటున్నట్లు కనుగొన్నారు. 

మచా పొడి
గ్రీన్‌ టీ ఆకులతో చేసే ఈ పొడి జపాన్‌లో చాలా ప్రసిద్ధి. ఇందులో ఎల్‌–థియానిన్‌ అనే ప్రొటీనేతర అమైనో ఆమ్లం ఎక్కువ పాళ్లలో ఉంటుంది. ఇది ఒత్తిడిని సమర్థంగా తగ్గిస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. దీనికోసం కొంతమందిని ఎంచుకొని వారికి రోజుకు 4.5గ్రాముల మచా పొడి ఉన్న బిస్కెట్లను 15 రోజుల పాటు ఆహారంగా ఇచ్చారు. ఆ తర్వాత పరీక్షించగా వారిలో ఒత్తిడి చాలా వరకు తగ్గినట్లు గుర్తించారు. కాగా, ఈ పొడి తయారీకి గ్రీన్‌ టీ ఆకులను ఒక ప్రత్యేక పద్ధతిలో సేకరిస్తారు.  

షెల్‌ఫిష్‌
అంటే రక్షణ కవచాలు ఉన్న నత్తలు, ఆల్చిప్పలు, మస్సెల్స్‌ వంటివి. వీటిలో అమైనో ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ప్రత్యేకంగా మనసును ఉల్లాసంగా ఉంచగలిగే టారిన్‌ ఎక్కువగా ఉంటుంది. దీనితోపాటు ఉండే డోపమైన్‌ ఒత్తిడి నిరోధకంగా పనిచేస్తున్నట్లు అనేక సర్వేలు వెల్లడించాయి. 

స్విస్‌ చార్డ్‌
సాధారణంగా శరీరంలో మెగ్నీషియం ఉండాల్సిన స్థాయి కంటే తక్కువ ఉన్నప్పుడు ఆందోళన, ఒత్తిడి లక్షణాలు కనిపిస్తాయి. దీనికి విరుగుడుగా స్విస్‌ చార్డ్‌ అనే వంటకం సమర్థంగా పనిచేస్తున్నట్లు వైద్య నిపుణులు గుర్తించారు. స్విస్‌ చార్డ్‌ అంటే క్యాబేజీని తలపించే ఒక దుంప చెట్టు. దీని ఆకుల్లో ఒత్తిడితో పోరాడే పోషకాలున్నాయి. ప్రత్యేకంగా మెగ్నీషియం పాళ్లు కొంచెం అధికం. 175 గ్రాముల స్విస్‌ చార్డ్‌ ఆకులను కూరగా వండినప్పుడు అందులో 36శాతం మెగ్నీషియం ఉంటుంది. ఇది శరీరంలో ఒత్తిడి తగ్గేందుకు ఉపయోగపడుతుంది. 

ఆర్గాన్‌ మీట్‌
అంటే అవయవ మాంసం. కోళ్లు, పొట్టేళ్లు, మేకలు వంటి జంతువుల గుండె, కాలేయం, మూత్రపిండాలతో చేసే వంటకాల్లో బి12, బి16, రైబోఫ్లవిన్, ఫ్లోట్‌ వంటి విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఒత్తిడిని తగ్గించడంలో సమర్థంగా పనిచేస్తాయి. దాదాపు 18 సర్వేలు దీనిని రుజువు చేశాయి. 

అసిరోలా చెర్రీ పొడి
ఎర్రటి రేగు పండ్లలా అనిపించే అసిరోలా అనే ఒక రకం చెర్రీ పొడి ఒత్తిడి నివారణకు ఉపయోగపడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ చెర్రీలలో విటమిన్‌ సి అధికంగా ఉంటుంది. సిట్రస్‌ జాతి రకాలైన నిమ్మ, నారింజ, బత్తాయి వంటి వాటికంటే ఇందులో 50 నుంచి 100శాతం విటమిన్‌ సి అధికంగా ఉంటుంది. అసిరోలా పండ్లు, లేదా పొడిని తిన్నప్పుడు అందులోని విటమిన్‌ సి ఉల్లాసంగా ఉంచడంతో డిప్రెషన్, కోపం తగ్గిస్తోందని గుర్తించారు. 

పొద్దుతిరుగుడు విత్తనాలు
వీటిలో విటమిన్‌ ‘ఇ’ అధిక స్థాయిలో ఉంటుంది. ఇది మానసిక ఆరోగ్యం మెరుగుపరచడంలోనూ సమర్థంగా పనిచేస్తుంది. విటమిన్‌ ‘ఇ’ తక్కువ పాళ్లలో ఉన్నవారిలో డిప్రెషన్‌ ఉన్నట్లు గుర్తించారు. 

ఫాటీ ఫిష్‌
ఒమెగా 3 ఆమ్లాలు, విటమిన్‌ డి అధికంగా ఉండే చేపలను ఆహారంగా తీసుకోవడం వల్ల అవి ఒత్తిడి స్థాయిలను తగ్గించడంతోపాటు మనసును ఉల్లాసంగా చేస్తున్నట్లు తేలింది. సాధారణంగా మెదడు ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడే ఒమేగా–3 ఆమ్లాలు ఒత్తిడిని తగ్గించడంలోనూ సమర్థంగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఇంకా చెప్పాలంటే ఒమేగా–3 తగినంత స్థాయిలో లేకపోవడం వల్లే ఆందోళన, డిప్రెషన్‌కు గురయ్యే వారి సంఖ్య పశ్చిమ దేశాల్లో ఎక్కువగా ఉంటోన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. 

కిమ్‌చి
ఇది క్యాబేజీ, ముల్లంగితో తయారుచేసే ఒక రకం ఆవకాయ. దీనిని ఎక్కువగా ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, జపాన్‌ దేశాల్లో తయారుచేస్తారు. ఇందులో ప్రొబయాటిక్స్, విటమిన్స్, మినరల్స్, యాంటీఆక్సిడెంట్స్‌ అధికస్థాయిలో ఉంటాయి. ఇవి ఒత్తిడిని తగ్గించడంలో సమర్థంగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. దీనికోసం వివిధ రకాల ఒత్తిళ్లతో బాధపడే 710 మంది యువతను ఎంచుకొని ఓ సర్వే నిర్వహించారు. వీరూ రోజూ తీసుకునే ఆహారంలో కిమ్‌చి తప్పనిసరిగా ఉండేట్లు చేశారు. కొన్ని రోజుల తర్వాత వీరికి పరీక్షలు జరిపినప్పుడు ఒత్తిడిని కలిగించే మూలకాలు అతి తక్కువ ఉన్నట్లు గుర్తించారు. 

వెల్లుల్లి
వెల్లుల్లిలో సల్ఫర్‌ సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. ఇవి గ్లటాథియోన్‌ అనే యాంటీ ఆక్సిడెంట్‌ను ఉత్పత్తిచేస్తాయి. ఇది ఒత్తిడిని ఎదుర్కొనే రక్షణఛత్రంలో మొదటి మూలకంగా పనిచేస్తుంది. అనేక ప్రయోగాల్లో ఇది రుజువైంది. 

చమోమిలే టీ
చమోమిలే(సీమ చేమంతి) టీని తాగడం ద్వారా మంచి నిద్ర రావడంతోపాటు ఒత్తిడిని తగ్గిస్తున్నట్లు వైద్యనిపుణులు గుర్తించారు. సీమ చేమంతి పూలను ఎండబెట్టి ఆ పొడిని బాగా మరిగించిన ఓ గ్లాసు నీళ్లలో వేసి మూడు నిమిషాలు  కలియబెట్టాలి. ఆ తర్వాత కొద్దిగా తేనె కానీ నిమ్మరసం కానీ అందులో పిండితే చమోమిలే టీ సిద్ధం. 45 మందికి రోజూ 1.5 గ్రాముల పొడి వేసి ఇచ్చిన చమోమిలే టీని 8 వారాల పాటు ఇచ్చి పరిశీలించగా వారిలో ఒత్తిడిని కలిగించే కారిస్టోల్‌ హార్మన్‌ గణనీయంగా తగ్గినట్లు తేలింది. 

నువ్వులు
నువ్వులతో తయారుచేసే పిండి ముద్దల్లో ఎల్‌–ట్రిప్టోపాన్‌ అనే అమైనో ఆమ్లం పాళ్లు ఎక్కువ. ఇది మనసును ఉల్లాసంగా ఉంచే డోపమైన్, సెరటోనిన్‌ ఉత్పత్తిలో ఉపయోగపడుతుంది. అలాగే డిప్రెషన్, ఒత్తిడిని తగ్గించేందుకు తోడ్పడుతుంది. 25 మంది యువకులకు నాలుగు రోజుల పాటు నువ్వుల పిండి ముద్దలను ఆహారంగా ఇచ్చి పరిశీలించినప్పుడు వారిలో ఆందోళన, ఒత్తిడి స్థాయిలు గణనీయంగా తగ్గినట్లు ఓ సర్వేలో తేలింది. 

గుడ్లు
గుడ్లలో పోషకాలు పుష్కలం అనే విషయం తెలిసిందే. వీటిలో విటమిన్లు, మినరల్స్, అమైనో ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్స్‌ సంతప్త స్థాయిలో లభిస్తాయి. ప్రత్యేకంగా ఇందులో చోలిన్‌ అనే పోషకం పుష్కలంగా ఉంటుంది. ఇది మెదడు ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడుతోందని, అలాగే ఒత్తిడి నివారణకు సమర్థంగా పనిచేస్తోందని వైద్యులు గుర్తించారు. 

శనగలు
ఒత్తిడిని తగ్గించడంలో కీలకపాత్ర పోషించే మెగ్నీషియం, పొటాషియం, బి విటమిన్స్, జింక్, మాంగనీస్, సెలినియం, కాపర్‌ మూలకాలు శనగల్లో అధిక స్థాయిలో ఉంటాయి. అలాగే ఎల్‌–ట్రిప్టోపాన్‌ సైతం ఎక్కువగానే ఉంటుంది. ఇవన్నీ మనిషిని ఉల్లాసంగా ఉంచడంతోపాటు ఒత్తిడి తగ్గేందుకు దోహదం చేస్తున్నట్లు పరిశోధనల్లో తేలింది.   

చదవండి: నోటి దుర్వాసనా.. ఇలా దూరం చేసుకోండి!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement