2013 అక్టోబర్ 10న డెన్మార్క్‌లోని ఇంటి నుంచి బయలుదేరాడు థోర్. 3,512 రోజుల తర్వాత 203 దేశాలు చూసి మే 23, 2023న మాల్దీవుల్లో యాత్ర ముగించాడు. విమానం ఎక్కకుండా ఇలా ప్రపంచాన్ని చుట్టినవాడు ఇతడే. ‘ఇన్ని దేశాలు తిరగడం ఎందుకు?’ అనంటే ‘అన్ని దేశాలు ఉన్నాయి కనుక’ అని జవాబు. జూన్ 13న మాల్దీవుల నుంచి ఇంటికి మరలుతున్నాడు థోర్.
‘తువాలు’, ‘టోంగా’, ‘సమోవా’, ‘పలావు’, ‘నౌరు’, ‘కిరిబటి’.... ఇవేంటని అనుకుంటున్నారా? దేశాలు. ఇవి మీరు విని ఉండొచ్చు. వినకపోయి ఉండొచ్చు. ఏమంటే ఐక్యరాజ్య సమితిలో ఉన్న దేశాలు 193. ‘కాని ఇంకా ఉన్నాయి. అవి తమను తాము దేశాలుగా చెప్పుకుంటాయి. ఐక్యరాజ్యసమితి ఇంకా గుర్తించకపోవచ్చు’ అంటాడు థోర్. అందువల్ల థోర్ చుట్టి వచ్చిన దేశాల సంఖ్య అక్షరాలా 203. వీటిలో యూరప్ నుంచి 37, ఆసియా నుంచి 20, సౌత్ అమెరికా నుంచి 12, ఆఫ్రికా నుంచి 54... ఇలా ప్రపంచ పటంలోని అన్ని దేశాలు అతను చుట్టి వచ్చాడు.
► మనుషుల్ని కలవడానికి...
‘స్నేహితుడు అని ఎవర్ని అనాలంటే అప్పటి దాకా పరిచయం కాని అపరిచితుణ్ణే’ అనే స్లోగన్‌తో థోర్ తన ప్రపంచ యాత్ర మొదలెట్టాడు. డెన్మార్క్‌కు చెందిన 44 ఏళ్ల ఈ వివాహితుడు కొంతకాలం మిలట్రీలో, ఆ తర్వాత షిప్పింగ్ లాజిస్టిక్స్‌లో పని చేశాడు. దేశాలు చూడటం పిచ్చి. కొత్త మనుషుల్ని కలవడం ఇష్టం. అందుకని ప్రపంచంలోని అన్ని దేశాలు చుట్టి రావాలనుకున్నాడు. అయితే డబ్బు పరిమితుల దృష్ట్యా, ఎటువంటి సవాలుకు వీలులేని విమానయానం ద్వారా కాకుండా రైళ్లు, ఓడలు, వాహనాల ద్వారా ప్రపంచం చుట్టాలనుకున్నాడు. దాదాపు పదేళ్ల పాటు ఇంటి ముఖం చూడకుండా తిరిగేశాడు.
► రోజుకు 20 డాలర్లు
డెన్మార్క్‌కు చెందిన కొన్ని సంస్థల స్పాన్సర్‌షిప్‌తో యాత్ర మొదలెట్టాడు థోర్. ప్రయాణానికి, తిండికి, వీసా ఫీజులకు కలిపి రోజుకు కేవలం 20 డాలర్లు (1600 రూపాయలు) ఖర్చు చేస్తూ ఈ యాత్ర సాగించాలనుకున్నాడు. దొరికిన తిండి తినడం, ఫ్రీగా బస పొందడం... లాంటి పనుల ద్వారా ఇది సాధ్యమే అనిపించాడు. అతని యాత్రను బ్లాగ్‌లో, ఫేస్‌బుక్‌లో రాస్తూ వెళ్లడం వల్ల చదివిన పాఠకులు ఎప్పటికప్పుడు సహాయం చేస్తూ వెళ్లారు. దాంతో ఇన్ని రోజులు అతని విశ్వదర్శనం సాగింది. ‘ఒక్కో దేశంలో కేవలం 24 గంటలు మాత్రమే గడుపుతూ వెళ్లాను. ఎందుకంటే ఒక దేశం నుంచి ఇంకో దేశం ప్రయాణించడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఆ దారిలో మనుషుల్ని కలవడమే ఇష్టపడ్డాను’ అంటాడు థోర్. అతను తన ప్రయాణంలో భాగంగా మన దేశానికి డిసెంబర్ 12, 2018న వచ్చాడు.
► ప్రతిదీ లెక్క
థోర్ తన ప్రయాణంలో ప్రతిదీ రికార్డు చేశాడు. ఏ మోసం లేకుండా ఎక్కడికక్కడ టికెట్లు పెడుతూ వెళ్లాడు. తన మొత్తం ప్రయాణంలో 351 బస్సులు, 158 ట్రైన్లు, 43 టుక్‌టుక్‌లు (ఆటో), 37 కంటైనర్ షిప్‌లు, 33 పడవలు, 9 ట్రక్కులు, 3 సెయిల్‌బోట్‌లు, 2 క్రూయిజ్ షిప్‌లు ఉపయోగించాడు. మే 23న మాల్దీవుల్లో ఇతని యాత్ర ముగిసింది. అయితే ఇన్నాళ్లూ కుటుంబానికి దూరంగా ఉన్నాడా? లేదు. అతని భార్య అతణ్ణి వెతుక్కుంటూ వెళ్లి కలిసేది. మొత్తం ఇన్ని రోజుల్లో 27 చోట్ల 27 సార్లు కలిసిందామె.
అన్నట్టు ఈ మొత్తం యాత్ర పేరు ‘ఒన్స్ అపాన్ ఏ సాగా’.
విమానం ఎక్కకుండా ప్రపంచాన్ని చుట్టేశాడు
Published Sun, Jun 11 2023 3:32 AM | Last Updated on Sun, Jun 11 2023 3:32 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment