ఉత్తరప్రదేశ్ 10వ తరగతి పరీక్షల్లో అగ్రస్థానంలో నిలిచిన ప్రాచీ నిగమ్ ట్రోలర్స్‌కు దిమ్మదిరిగే సమాధానం ఇచ్చింది. ఎవరేమన్నా, తన విజయమేతనకు ముఖ్యమంటూ తేల్చి చెప్పింది.
"ట్రోలర్లు వారి ఆలోచనలతో వారుంటారు. నా విజయమే నా ప్రస్తుత గుర్తింపు. దీంతో నే సంతోషంగా ఉన్నాను" అని అంటూ బుధవారం తొలిసారి స్పందించింది. అలాగే తన రూపాన్ని చూసి, తన కుటుంబంగానీ, తనకు చదువు చెప్పిన ఉపాధ్యాయులుగానీ, తోటి మిత్రులు గానీ ఎన్నడూ చిన్నచూపు చూడలేదని, దీంతో తన దృష్టి అంతా తన చదువుపైనే కేంద్రీకృతమైందని చెప్పుకొచ్చింది. అసలు తన రూపం గురించి తానెప్పుడూ బాధపడలేదనీ ఇంజనీర్ కావడమే లక్ష్యమని తెలిపింది. అంతిమంగా తన విజయం తప్ప తాను ఎలా ఉన్నాను అన్నది ముఖ్యం కాదని స్పష్టం చేసింది.
విశ్వనాథన్ మద్దతు
మరోవైపు భారత చెస్ గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ప్రాచీకి మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా ఆమెను విద్యాపరమైన లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరించాలని సలహా ఇచ్చారు.
హార్మోన్ల ప్రభావం, చికిత్స ఉంది
ప్రాచీ నిగమ్‌కి సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎస్‌జీపీజీఐఎంఎస్) డైరెక్టర్ ప్రొఫెసర్ ఆర్‌కే ధీమాన్ తమ ఇన్‌స్టిట్యూట్ ఉచితంగా చికిత్స చేయనున్నట్లు వెల్లడించడం విశేషం. హార్మోన్ల ప్రభావంతో వచ్చే మహిళల్లో కనిపించే అవాంఛిత రోమాల పెరుగుదలను ఎండోక్రినాలజీ ద్వారా నియంత్రించవచ్చనీ, టీనేజ్ పిల్లల్లో సాధారణంగా కనిపించే ఈ సమస్య నెలరోజుల్లో నయమవుతుందని ధీమాన్ అన్నారు.
ఇటీవల విడుదలైన 10వ తరగతి 98.5 శాతం మార్కులతో యూపీలో టాప్‌లో నిలిచింది. ఈ సందర్భంగా ప్రాచీ నిగమ్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే 600లకు గాను 591 మార్కులు సాధించిన ఆమె ప్రతిభను చూడాల్సిన నెటిజన్లు కొంతమంది ఆమె ముఖంపై ఉన్న రోమాలను మాత్రమే చూశారు. అనుచిత వ్యాఖ్యలతో ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment