మొదట శర్మ, తర్వాత పూజ, ఇప్పుడు రేఖ..  | Transgender Celebrity Pooja Sharma Rekha Become an Internet Sensation | Sakshi
Sakshi News home page

Pooja Sharma Rekha: ఒక్కరోజులో ఎలా సెలబ్రిటీ అయ్యారు?

Published Wed, Mar 31 2021 5:40 PM | Last Updated on Wed, Mar 31 2021 8:17 PM

Transgender Celebrity Pooja Sharma Rekha Become an Internet Sensation - Sakshi

ప్రారంభోత్సవానికి పూజ

ముంబై లేడీస్‌ స్పెషల్‌ లోకల్‌ ట్రైన్‌లో రోజూ రాకపోకలు సాగించే వారికి నత్య పరిచయస్తురాలైన ట్రాన్స్‌ఉమన్‌ పూజాశర్మ రేఖ దగ్గర ‘శుభములనివ్వుమమ్మ’ అంటూ దేశ విదేశాల్లోని వారు కూడా నేరుగానో, వీడియో కాల్‌లోనో దీవెనలు అందుకుంటూ ఉంటారు. నటి రేఖ పోలికలు, కవళికలు ఉంటాయని అంతా అంటుండే పూజ ఎక్కడివారు? మొదట శర్మ, తర్వాత పూజ, ఇప్పుడు రేఖ..  ఎలా అయ్యారు?

మొదట మీరు చీరకట్టులో సినీనటి రేఖ ఎలా ఉంటారో ఊహకు తెచ్చుకోండి. ఒక్క కట్టే కాదు.. రేఖ బొట్టు, రేఖ ధరించే ఆభరణాలు, రేఖ నవ్వు, ఆ మాట తీరు, ఆ హుందాతనం అన్నీ కలిపి సృష్టికి పరిపూర్ణతలా ఎలాగైతే ఉంటాయో సరిగ్గా అలాగే ఉంటారు పూజాశర్మ. రేఖను తీసి రేఖను పెట్టినట్లుగా!! ఇంతకీ ఈ పూజ ఎవరంటే.. ముంబైలో ఉదయం పూట పట్టాల మీదకు వచ్చే లేడీస్‌ స్పెషల్‌ లోకల్‌ ట్రైన్‌ సెలబ్రిటీ. సోషల్‌ మీడియాలో లక్షా యాభై వేల మందికి పైగా ఫాలోవర్స్‌ ఉన్న ‘ఇన్‌ఫ్లుయెన్సర్‌’. ఇంత నిండైన మనిషిలోని మిగతా ప్రత్యేకతలన్నీ తెలుసుకున్నాక మాత్రమే ఆమె ట్రాన్స్‌ ఉమన్‌ అని చెప్పుకుండే చెప్పుకోవచ్చు


పూజ ట్రైన్‌ డాన్స్‌
లోకల్‌ ట్రైన్‌లో పూజ డాన్స్‌ చేస్తారు. చక్కటి మాటల్తో మోటివేట్‌ చేస్తారు. అసలు ఆమెను చూడగానే నమస్కరించేవారు, నమస్కరించాలని అనిపిస్తుంది అనేవారు కూడా ఉన్నారు. ఆఫీసు వేళల కోసం నడిచే ఉమెన్‌ స్పెషల్‌ ట్రైన్‌ వెళ్లిపోయాక.. ప్లాట్‌ఫామ్‌ మీద పూజ ఒక్కరే నిలబడిపోతారు. ఆ తర్వాత ఆమె పండ్లే అమ్ముతారో, స్త్రీల లోదుస్తులు విక్రయించే దుకాణాలకు కాపలాదారుగా ఉంటారో, బంగారు ఆభరణాల షాపులో సహాయకారిలా ఉంటారో లేక వస్త్ర ఉత్పత్తుల కర్మాగారం ఆఫీస్‌ ప్యూన్‌గా వెళతారో, అపార్ట్‌మెంట్‌లకు ఇస్త్రీ బట్టలనే బట్వాడా చేస్తారో.. అది ఆమెకు దొరికిన పనిని బట్టి ఉంటుంది. ఆమె అనుదిన జీవనయానం ప్రారంభం అయ్యేది మాత్రం మహిళల లోకల్‌ ట్రెయిన్‌ ఫస్ట్‌ ట్రిప్‌లోనే. అది ఆమెకు మనోల్లాసాన్ని మాత్రమే కాదు, గుర్తింపునూ ఇస్తుంది. యాచన ఉండదు. ఇస్తే వద్దనీ అనరు. ఇచ్చేవారు గౌరవం కొద్దీ ఇస్తే, వారి గౌరవం కొద్దీ వద్దనకుండా తీసుకుంటారు పూజ. ‘రేఖలా ఉన్నావు’ అని అందరూ అంటుంటే తనూ రేఖలా రూపాంతరం చెందుతూ వచ్చిన పూజ ముంబై అమ్మాయి కాదు. కలకత్తా నుంచి ముంబై వచ్చిన అమ్మాయి. అమ్మాయి కూడా కాదు. అబ్బాయి. ఆ అబ్బాయి పేరే శర్మ. 

ఇప్పుడు ముంబైలో చేస్తున్న పనులనే ఆమె కలకత్తా లోనూ చేసేవారు. పురుషుడి దేహాన్ని కలిగి ఉన్న తన స్త్రీ మనసును గేలి చేయడం తట్టుకోలేక అక్కడి నుంచి పారిపోయి ముంబై వచ్చారు. ముంబై ఆమెను ఆదరించింది. పూజ అందమైన స్వభావం వల్ల, ముంబైకి గ్లామర్‌ సెన్స్‌ ఎక్కువ కనుకా బహుశా ఆమెకు ఆదరణ లభించి ఉండాలి. అసలైతే ఆమె డాన్సర్‌ కాదు. ముంబై లో అంతా తన రూపలావణ్యాలను చూసి రేఖ అనడంతో, రేఖ అవడం కోసం ఆమె డాన్స్‌ ప్రాక్టీస్‌ చేశారు. వచ్చే కాస్త డబ్బుతోనే మోడర్న్‌ డ్రెస్‌లు వేసుకున్నారు. మంచి చీరలను కొనుక్కున్నారు. ముంబైలోని ఒక జాతీయ దినపత్రిక జర్నలిస్టు.. ఇంటర్వ్యూ కు ఆమెను ఒప్పించేందుకు ఆమెతో మాటలు కలుపుతూ ఉన్నప్పుడు అతడితోపాటు వచ్చిన ఫొటోగ్రాఫర్‌ ఆమెకు తెలియకుండా ఫొటో తీసి, సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి ఆమె గురించిన వివరాలను ఇవ్వడంతో ఒక్కరోజులో పూజ సెలబ్రిటీ అయ్యారు. చాలాకాలం కిందటి సంగతి అది. మార్చి 8 న మహిళా దినోత్సవం రోజు ‘రేఖ’ అనే పేరున ఉన్న ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌కు వేల ప్రశంసలు వచ్చాయి. ముంబై ఆమెను పూర్తి మహిళగా స్వీకరించింది. 


రేఖలా పూజా! 
తర్వాతి నుంచీ పూజే తన వీడియోలను అప్‌లోడ్‌ చేయడం మొదలు పెట్టారు. బిడ్డల్ని ఎత్తుకుని వచ్చి ఆమె ఆశీస్సులను కోరుతున్న తల్లులు, ప్రారంభోత్సవాలకు ఆమెను ఆహ్వానిస్తున్న వ్యాపారాల యజమానులు, పరీక్షలకు వెళ్లే ముందు బ్లెస్‌ చేయమని వచ్చి అడిగే విద్యార్థులు, ఉద్యోగాల ఇంటర్వ్యూలకు వెళ్లే అభ్యర్థులు.. వీళ్లంతా ఉన్న వీడియోలను చూసి విదేశాల నుంచి కూడా ఆమె దీవెనల కోసం అభ్యర్థనలు రావడం మొదలైంది! ఆ సమయంలో కనుక పూజ ట్రైన్‌లో ప్రయాణిస్తూ ఉంటే.. తన సెల్‌ఫోన్‌లోనే వారిని, వారిని పిల్లల్ని దీవించినట్లుగా వారి తలపై చెయ్యి ఉంచుతారు. మరి ఆమెను దేవుడు గానీ, మరెవరు గానీ దీవించలేకపోయారా! ‘‘మనుషులంతా మంచివాళ్లు. దేవుడు శక్తిమంతుడు. ఆ మంచితనం, ఆ శక్తి నన్ను నడిపిస్తున్నాయి. దేనికీ లోటు లేకుండా జీవిస్తున్నాను’’ అంటారు. 

పేరుకు మాత్రమే ఆమె పూజ కాదు. నిత్యం దైవారాధన చేస్తారు. ఆ తర్వాత ఆమె పొందే శక్తితో ఆమె ప్రయాణించే రైలు నడుస్తూ ఉన్నట్లుగా ఉంటుంది! మనసు లోపల ఎన్నో ఆలోచనలు, ఎన్నో ఒత్తిళ్లతో ప్రయాణిస్తుండే మహిళల్ని ఆ కొద్దిసేపూ పూజ పలకరింపు, పూజ అభినయం సేద తీరుస్తాయి. ‘అసలు ఆమెను చూడగానే మనసుకు ఎక్కడ లేని సత్తువ వచ్చేస్తుంది’ అనేవారూ ఉన్నారు. పూజ పోస్ట్‌ చేసిన ఒక వీడియోను చూసి.. ‘‘పూజా.. నువ్వు చాలా చాలా అందంగా ఉన్నావు. బాహ్యంగా, అంతర్లీనంగా కూడా’’ అని ప్రముఖ టీవీ నటి అంకితా లొఖాండే ఇటీవల కామెంట్‌ పెట్టడం పూజను ఎంతగానో సంతోషపరచిందట. ‘నువ్వు బాగున్నావు’. ‘నువ్వు చేసిన పని బాగుంది’ అనే మాటలు బతుకులోని చేదును తగ్గిస్తాయని పూజ అంటారు. ఆమె బాల్యం ఒక చేదు జ్ఞాపకం. ఆమె వర్తమానం ఆ చేదును మరిపిస్తున్న తియ్యదనం. 

ఇక్కడ చదవండి:
పాలు పోయడానికి వచ్చా.. ఓట్లివ్వండి

తన కల కోసం కూలీగా మారింది!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement