internet sensation
-
నా గుండె బద్ధలైంది: మనికే మగే హితె సింగర్
ముంబై: శ్రీ లంకలో కొనసాగుతున్న సంక్షోభం.. నెలల తరబడి కొనసాగుతోంది. ధరలు ఆకాశాన్ని అంటడం నుంచి మొదలైన ఆర్థిక సంక్షోభం.. ఇంధన, విద్యుత్, నిత్యావసరాల కొరతతో తారాస్థాయికి చేరింది. మరోవైపు ఈ నిరసనలు లంక రాజకీయ సంక్షోభానికి దారి తీశాయి. అత్యవసర పరిస్థితి.. నిత్యం కర్ఫ్యూలతో అక్కడ పరిస్థితి రణరంగాన్ని తలపిస్తోంది. తన మాతృదేశంలో నెలకొన్న పరిస్థితులపై ఇంటర్నెట్ సెన్సేషన్ యోహాని డిలోక డి సిల్వా స్పందించింది. మనికే మగే హితె సాంగ్‌తో ప్రపంచవ్యాప్తంగా ఈ 28 ఏళ్ల సింగర్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత భారత్ నుంచి ఆమెకు అవకాశాలు రాగా.. ప్రస్తుతం ముంబైలో ఉంటూ ఇక్కడి సంగీతదర్శకులతో పని చేస్తూ.. మరోపక్క మ్యూజిక్ షోలు నిర్వహిస్తోంది. శ్రీ లంక సంక్షోభం మొదలయ్యాక.. స్వదేశానికి వెళ్లలేని పరిస్థితి ఆమెది. ఈ తరుణంలో.. అక్కడి పరిస్థితులపై ఆమె స్పందించింది. ప్రస్తుతం నా దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉంది. దానికి అందరి సాయం అవసరం. అది ఆర్థిక సాయమే అవ్వాల్సిన అవసరం లేదు. ఏ రూపంలో సాయం అందించినా చాలు.. అంటూ ఆమె ఇక్కడి ప్రజలకు పిలుపు ఇచ్చింది. నా గొంతు, నాకు దక్కిన పేరు ప్రతిష్టలతో నా దేశానికి సాయం చేయాలనుకుంటున్నా. ఈ పరిస్థితుల్లో అది ఎంతో ముఖ్యం కూడా. నా దేశం తరపున అంతర్జాతీయ వేదికలపై మౌనం వీడాలనుకుంటున్నా. నా దేశానికి మద్ధతుగా నా గళం వినిపించాలనుకుంటున్నా. అని పేర్కొందామె. నా తల్లిదండ్రులు, నా సోదరి, నా స్నేహితులు.. అంతెందుకు నా బృందం మొత్తం అక్కడే ఉంది. వాళ్ల క్షేమం కోరుకోవడం తప్పించి ఇక్కడుండి ఏం చేయలేకపోతున్నాననే బాధ ఉంది. ముఖ్యంగా లంక ప్రజలు పడుతున్న అవస్థల తాలుకా దృశ్యాలు చూస్తుంటే నా గుండె తరుక్కుపోతోంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా.. నా దేశ సంక్షేమం కోసం నా గొంతును వినిపించాలనుకుంటున్నా అంటూ ఆమె ప్రకటించింది. ఇదిలా ఉంటే.. లంక కోసం సాయం అందించేందుకు ఆమె విరాళాల సేకరణ సైతం చేపట్టింది. చదవండి: తండ్రిని గద్దె దింపిన ప్రజలే తనయుడికి పట్టం -
Gadwal Bidda: ఇంటర్నెట్ సెన్సేషన్ గద్వాల్ బిడ్డ కన్నుమూత!
Gadwal Bidda Death News Viral In Social Media: ‘నువ్వెనివో నాకు తెల్వదు..’ అంటూనే కోట్లాది మందికి పరిచయమైన చిన్నారి ‘గద్వాల్‌బిడ్డ’ ఇక లేడనే వార్త సోషల్ మీడియాలో ప్రచారం అవుతోంది. సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిన ఈ చిన్నారి.. నిత్యం వీడియోలు, మీమ్స్, స్టిక్కర్లతో ఏదో ఒక దగ్గర కనిపిస్తున్న విషయం తెలిసిందే. అలాంటి చిన్నారి హఠాన్మరణం విషయం తెలియగానే.. ఇంటర్నెట్లో చాలామంది సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అది మీమ్స్ పేజీ ఆరంభంలో ఉన్నరోజులు. ‘ఐతే ఏంటి?, సీవోసీ’ లాంటి కొద్దిపాటి పేజీలు మాత్రమే పాపులర్ అయిన సమయం. ఆ టైంలో దర్శకుడు ఆర్జీవీ ప్రకటించిన ఓ టైటిల్‌పై దుమారం రేగింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఓ చిన్నారి చేసిన వీడియో తెగ వైరల్ అయ్యింది. గద్వాల్బిడ్డగా తననుతానూ పరిచయం చేసుకుంటూ.. ఆర్జీవీని దూషిస్తూ ఓ వీడియో పోస్ట్ చేసి వైరల్ అయ్యాడు ఆ పిలగాడు. ఆపై దళితులను కించపరిచేలా వ్యవహరించాడంటూ దళిత సంఘాలు ఆ చిన్నారిపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. మైనర్ కావడంతో పోలీసుల సమక్షంలోనే అతనితో క్షమాపణలు చెప్పించగా.. ఆ సమయంలో సంభాషణలు, అతని ఏడుపు సైతం వైరల్ అయ్యింది. ఆపై చాలాకాలం ఇంటర్నెట్కు దూరంగా ఉన్నప్పటికీ ఈ చిన్నారి మీమ్స్ స్టఫ్‌గా మారాడు. ట్రోల్ వీడియోస్, మీమ్స్ టెంప్లేట్, స్టిక్కర్స్ రూపంలో వైరల్ అయ్యాడు. కొద్దిగ్యాప్ తర్వాత కారులో కునుకు తీసిన వీడియో ఒకటి, ఆపై దసరా శుభాకాంక్షలు చెప్తూ ఉన్న వీడియో సైతం వైరల్ అయ్యింది. ఈ క్రమంలో అతని హఠాన్మరణం వార్త.. ఇంటర్నెట్ను కుదిపేస్తోంది. ఆ చిన్నారి అసలు పేరు మల్లికార్జున్‌రెడ్డి అని సమాచారం. ప్రస్తుతం ఓ సినిమాలోనూ అతని నటిస్తున్నాడని, ఆస్తమాతో అతను మృతిచెందినట్లు, ఈ విషయం అతని కుటుంబ సభ్యులే స్వయంగా వెల్లడించినట్లు సౌత్ ఇండియన్ థగ్స్ అనే పేజీ నుంచి మెసేజ్ వైరల్ అయ్యింది. స్వగ్రామం జోగులాంబా గద్వాల్ జిల్లాలోని వడ్డేపల్లి మండలం జిల్లేడుదిన్నెలో గద్వాల్ బిడ్డ ‘మల్లికార్జున్’ అంత్యక్రియలు జరగనున్నట్లు సమాచారం. ‘నువ్వు ఎవనివో నాకు తెల్వదు, బండెక్కినంటే.. భయపడాలె, చూస్కోండి, ఖబడ్దార్బిడ్డా..’ డైలాగ్‌లతో గద్వాల్‌బిడ్డ పేరుతో మీమ్స్, వీడియోలు నిత్యం వైరల్ అవుతుంటాయి. ఈ తరుణంలో.. చిన్నవయసులోనే ఆ చిన్నారి లేడనే వార్త ఇంటర్నెట్లో విషాదం నింపుతోంది. మీమ్స్, వీడియోల రూపంలో బతికే ఉంటాడంటూ పలువురు కామెంట్ల చేస్తున్నారు. -
మొదట శర్మ, తర్వాత పూజ, ఇప్పుడు రేఖ..
ముంబై లేడీస్ స్పెషల్ లోకల్ ట్రైన్లో రోజూ రాకపోకలు సాగించే వారికి నత్య పరిచయస్తురాలైన ట్రాన్స్ఉమన్ పూజాశర్మ రేఖ దగ్గర ‘శుభములనివ్వుమమ్మ’ అంటూ దేశ విదేశాల్లోని వారు కూడా నేరుగానో, వీడియో కాల్లోనో దీవెనలు అందుకుంటూ ఉంటారు. నటి రేఖ పోలికలు, కవళికలు ఉంటాయని అంతా అంటుండే పూజ ఎక్కడివారు? మొదట శర్మ, తర్వాత పూజ, ఇప్పుడు రేఖ.. ఎలా అయ్యారు? మొదట మీరు చీరకట్టులో సినీనటి రేఖ ఎలా ఉంటారో ఊహకు తెచ్చుకోండి. ఒక్క కట్టే కాదు.. రేఖ బొట్టు, రేఖ ధరించే ఆభరణాలు, రేఖ నవ్వు, ఆ మాట తీరు, ఆ హుందాతనం అన్నీ కలిపి సృష్టికి పరిపూర్ణతలా ఎలాగైతే ఉంటాయో సరిగ్గా అలాగే ఉంటారు పూజాశర్మ. రేఖను తీసి రేఖను పెట్టినట్లుగా!! ఇంతకీ ఈ పూజ ఎవరంటే.. ముంబైలో ఉదయం పూట పట్టాల మీదకు వచ్చే లేడీస్ స్పెషల్ లోకల్ ట్రైన్ సెలబ్రిటీ. సోషల్ మీడియాలో లక్షా యాభై వేల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్న ‘ఇన్ఫ్లుయెన్సర్’. ఇంత నిండైన మనిషిలోని మిగతా ప్రత్యేకతలన్నీ తెలుసుకున్నాక మాత్రమే ఆమె ట్రాన్స్ ఉమన్ అని చెప్పుకుండే చెప్పుకోవచ్చు పూజ ట్రైన్ డాన్స్ లోకల్ ట్రైన్లో పూజ డాన్స్ చేస్తారు. చక్కటి మాటల్తో మోటివేట్ చేస్తారు. అసలు ఆమెను చూడగానే నమస్కరించేవారు, నమస్కరించాలని అనిపిస్తుంది అనేవారు కూడా ఉన్నారు. ఆఫీసు వేళల కోసం నడిచే ఉమెన్ స్పెషల్ ట్రైన్ వెళ్లిపోయాక.. ప్లాట్‌ఫామ్ మీద పూజ ఒక్కరే నిలబడిపోతారు. ఆ తర్వాత ఆమె పండ్లే అమ్ముతారో, స్త్రీల లోదుస్తులు విక్రయించే దుకాణాలకు కాపలాదారుగా ఉంటారో, బంగారు ఆభరణాల షాపులో సహాయకారిలా ఉంటారో లేక వస్త్ర ఉత్పత్తుల కర్మాగారం ఆఫీస్ ప్యూన్‌గా వెళతారో, అపార్ట్మెంట్లకు ఇస్త్రీ బట్టలనే బట్వాడా చేస్తారో.. అది ఆమెకు దొరికిన పనిని బట్టి ఉంటుంది. ఆమె అనుదిన జీవనయానం ప్రారంభం అయ్యేది మాత్రం మహిళల లోకల్ ట్రెయిన్ ఫస్ట్ ట్రిప్‌లోనే. అది ఆమెకు మనోల్లాసాన్ని మాత్రమే కాదు, గుర్తింపునూ ఇస్తుంది. యాచన ఉండదు. ఇస్తే వద్దనీ అనరు. ఇచ్చేవారు గౌరవం కొద్దీ ఇస్తే, వారి గౌరవం కొద్దీ వద్దనకుండా తీసుకుంటారు పూజ. ‘రేఖలా ఉన్నావు’ అని అందరూ అంటుంటే తనూ రేఖలా రూపాంతరం చెందుతూ వచ్చిన పూజ ముంబై అమ్మాయి కాదు. కలకత్తా నుంచి ముంబై వచ్చిన అమ్మాయి. అమ్మాయి కూడా కాదు. అబ్బాయి. ఆ అబ్బాయి పేరే శర్మ. ఇప్పుడు ముంబైలో చేస్తున్న పనులనే ఆమె కలకత్తా లోనూ చేసేవారు. పురుషుడి దేహాన్ని కలిగి ఉన్న తన స్త్రీ మనసును గేలి చేయడం తట్టుకోలేక అక్కడి నుంచి పారిపోయి ముంబై వచ్చారు. ముంబై ఆమెను ఆదరించింది. పూజ అందమైన స్వభావం వల్ల, ముంబైకి గ్లామర్ సెన్స్ ఎక్కువ కనుకా బహుశా ఆమెకు ఆదరణ లభించి ఉండాలి. అసలైతే ఆమె డాన్సర్ కాదు. ముంబై లో అంతా తన రూపలావణ్యాలను చూసి రేఖ అనడంతో, రేఖ అవడం కోసం ఆమె డాన్స్ ప్రాక్టీస్ చేశారు. వచ్చే కాస్త డబ్బుతోనే మోడర్న్ డ్రెస్‌లు వేసుకున్నారు. మంచి చీరలను కొనుక్కున్నారు. ముంబైలోని ఒక జాతీయ దినపత్రిక జర్నలిస్టు.. ఇంటర్వ్యూ కు ఆమెను ఒప్పించేందుకు ఆమెతో మాటలు కలుపుతూ ఉన్నప్పుడు అతడితోపాటు వచ్చిన ఫొటోగ్రాఫర్ ఆమెకు తెలియకుండా ఫొటో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆమె గురించిన వివరాలను ఇవ్వడంతో ఒక్కరోజులో పూజ సెలబ్రిటీ అయ్యారు. చాలాకాలం కిందటి సంగతి అది. మార్చి 8 న మహిళా దినోత్సవం రోజు ‘రేఖ’ అనే పేరున ఉన్న ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌కు వేల ప్రశంసలు వచ్చాయి. ముంబై ఆమెను పూర్తి మహిళగా స్వీకరించింది. రేఖలా పూజా! తర్వాతి నుంచీ పూజే తన వీడియోలను అప్లోడ్ చేయడం మొదలు పెట్టారు. బిడ్డల్ని ఎత్తుకుని వచ్చి ఆమె ఆశీస్సులను కోరుతున్న తల్లులు, ప్రారంభోత్సవాలకు ఆమెను ఆహ్వానిస్తున్న వ్యాపారాల యజమానులు, పరీక్షలకు వెళ్లే ముందు బ్లెస్ చేయమని వచ్చి అడిగే విద్యార్థులు, ఉద్యోగాల ఇంటర్వ్యూలకు వెళ్లే అభ్యర్థులు.. వీళ్లంతా ఉన్న వీడియోలను చూసి విదేశాల నుంచి కూడా ఆమె దీవెనల కోసం అభ్యర్థనలు రావడం మొదలైంది! ఆ సమయంలో కనుక పూజ ట్రైన్లో ప్రయాణిస్తూ ఉంటే.. తన సెల్ఫోన్లోనే వారిని, వారిని పిల్లల్ని దీవించినట్లుగా వారి తలపై చెయ్యి ఉంచుతారు. మరి ఆమెను దేవుడు గానీ, మరెవరు గానీ దీవించలేకపోయారా! ‘‘మనుషులంతా మంచివాళ్లు. దేవుడు శక్తిమంతుడు. ఆ మంచితనం, ఆ శక్తి నన్ను నడిపిస్తున్నాయి. దేనికీ లోటు లేకుండా జీవిస్తున్నాను’’ అంటారు. పేరుకు మాత్రమే ఆమె పూజ కాదు. నిత్యం దైవారాధన చేస్తారు. ఆ తర్వాత ఆమె పొందే శక్తితో ఆమె ప్రయాణించే రైలు నడుస్తూ ఉన్నట్లుగా ఉంటుంది! మనసు లోపల ఎన్నో ఆలోచనలు, ఎన్నో ఒత్తిళ్లతో ప్రయాణిస్తుండే మహిళల్ని ఆ కొద్దిసేపూ పూజ పలకరింపు, పూజ అభినయం సేద తీరుస్తాయి. ‘అసలు ఆమెను చూడగానే మనసుకు ఎక్కడ లేని సత్తువ వచ్చేస్తుంది’ అనేవారూ ఉన్నారు. పూజ పోస్ట్ చేసిన ఒక వీడియోను చూసి.. ‘‘పూజా.. నువ్వు చాలా చాలా అందంగా ఉన్నావు. బాహ్యంగా, అంతర్లీనంగా కూడా’’ అని ప్రముఖ టీవీ నటి అంకితా లొఖాండే ఇటీవల కామెంట్ పెట్టడం పూజను ఎంతగానో సంతోషపరచిందట. ‘నువ్వు బాగున్నావు’. ‘నువ్వు చేసిన పని బాగుంది’ అనే మాటలు బతుకులోని చేదును తగ్గిస్తాయని పూజ అంటారు. ఆమె బాల్యం ఒక చేదు జ్ఞాపకం. ఆమె వర్తమానం ఆ చేదును మరిపిస్తున్న తియ్యదనం. ఇక్కడ చదవండి: పాలు పోయడానికి వచ్చా.. ఓట్లివ్వండి తన కల కోసం కూలీగా మారింది! -
‘పిచ్చి పట్టిందా..డాక్టర్‌కు చూపించుకో’
నేటి డిజిటల్ యుగంలో చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రస్తుతం అందరూ టిక్‌టాక్ యాప్‌లో మునిగితేలుతున్నారు. ఎంతో మంది తమ ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేస్తూ సెలబ్రిటీలుగా మారుతుంటే.. కమెడియన్‌గా పేరు తెచ్చుకున్న ఓ ఒడిశా నటుడు మాత్రం తన అత్యుత్సాహం, బిత్తిరితనంతో విమర్శల పాలవుతున్నాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. రణు మొండల్ అనే ఓ సామాన్యురాలు తన అద్భుత గాత్రంతో దిగ్గజ గాయని లతా మంగేష్కర్ పాటలను ఆలపిస్తూ ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె మధురమైన గానానికి ముగ్ధుడైన బాలీవుడ్ సంగీత దర్శకుడు హిమేశ్ రేష్మియా రణు చేత ఓ పాటను రికార్డు చేయించాడు. ‘తేరీ మేరీ కహానీ’ అంటూ సాగే పాటను ఆలపిస్తున్న రణు పక్కనే ఉండి ఆమెను ఉత్సాహపరుస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ నేపథ్యంలో ఒడిశా కమెడియన్, పప్పు పామ్ పామ్‌గా ఫేమస్ అయిన తత్వా ప్రకాశ్ సతపతి ఈ వీడియోపై టిక్‌టాక్‌లో తన ‘సృజనాత్మకత’ ప్రదర్శించాడు. పాట రికార్డింగ్ సమయంలో రణు కట్టుకున్న రంగు చీరను కట్టుకుని, ఆమెలా హావభావాలు పలికిస్తూ మైక్ ముందు నిల్చుని రణును అనుకరించాడు. ఇక అదే సమయంలో మరో వ్యక్తి హిమేశ్ రేష్మియాలా పప్పును ఉత్సాహపరిచాడు. ఈ క్రమంలో రణును కించపరిచేలా ఉన్న ఈ టిక్‌టాక్ వీడియోపై నెటిజన్లు మండిపడుతున్నారు. ‘పప్పూకి పిచ్చెక్కిందేమో. మతిస్థిమితం తప్పినట్లుంది. ఒకసారి ఆయనను సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకువెళ్లాలి. తోటి కళాకారిణిని అవమానించే ముందు ఒక్కసారైనా ఆలోచించవచ్చు కదా’ అంటూ ప్రకాశ్ సతపతిని తీవ్రంగా విమర్శిస్తున్నారు. కాగా ఈ విషయంపై స్పందించిన ప్రకాశ్ అసిస్టెంట్ ఆయన సరదా కోసం మాత్రమే వీడియో చేశారని చెప్పుకొచ్చాడు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన రణు రైల్వే స్టేషనులో పాట పాడుతుండగా గమనించిన అతీంద్ర చక్రవర్తి అనే ఓ యువ ఇంజనీర్ ఆమె పాటను రికార్డు చేసి ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. దీంతో రాత్రికి రాత్రే స్టార్‌గా మారిన రణుకు హిందీ చానెల్ అవకాశమిచ్చింది. ఆమె లుక్‌ను పూర్తిగా మార్చివేసి సెలబ్రిటీగా ప్రేక్షకుల ముందు నిలబెట్టింది. ఇక ఆమెకు నేపథ్య గాయనిగా అవకాశం ఇచ్చిన హిమేశ్ మరో పాట కోసం కూడా రణునే ఎంచుకున్నాడు. -
సిల్కీ హెయిర్‌తో స్టయిలిష్ బ్లాకీ సంచలనం
మెల్బోర్న్: ఒళ్లంతా సిల్కీ సిల్కీ జుట్టుతో మెరిసిసోతూ...పట్టుకుంటే జారీపోయేలా..నల్లని జుట్టుతో మెరిసిపోతున్న ఓ శునకం తాజాగా ఇంటర్నెట్ సెన్సేషన్ గా మారిపోయింది. అఫ్ఘాన్ ఆఫ్గాన్‌హౌండ్ జాతికి చెందిన అయిదేళ్ల ఆస్ట్రేలియా డాగ్ కు సోషల్ మీడియాలో ఇతర సూపర్ మోడల్స్‌ను మించిన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను సాధిస్తోంది. ఒక్క ఫోటోతో సూపర్ మోడల్ గా మారిన ఈస్టయిలిష్ బ్లాకీ పేరు టీ. వివరాల్లోకి వెళితే.. టీ యజమాని ల్యూక్ కవనాగ్ సోషల్ మీడియాలో ఫోటోలుఅప్లోడ్ చేశాడు. అంతే మరుక్షణం ఆ ఫోటోలు వైరల్ గా మారాయి. దాని అందానికి ముగ్ధులైన ఎంతోమంది డానికి అభిమానులుగా మారిపోతున్నారు. ఫేస్బుక్, ట్విట్టర్ లో లక్షలకొద్దీ లైక్ లు షేర్లతో చక్కర్లుకొడుతోంది. దీంతో అనేక కంపెనీలు కూడా ఈ టీ కోసం క్యూ కట్టాయి. దీంతో శునకం రాజా యజమాని ల్యూక్ కవనాగ్ ,అతని కుటుంబం సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. టీ చాలా అందంగా ఉంటుంది..అందుకే దాని ఫొటోను ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేశాను.. దీంతో ఒక సూపర్ మోడల్ కంటే ఎక్కువ ఆదరణ లభిస్తోందని పేర్కొన్నారని డెయిలీ టెలీగ్రాఫ్ .కాం ఒక నివేదికలో తెలిపింది. సెలబ్రిటీ స్టేటస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. షో డాగ్ గా ఆకట్టుకున్న టీ ఇటీవల రీటైరయ్యిందట. తాజాగా యానిమల్ యాక్టర్ గా సెకండ్ కరియర్ మొదలు పెట్టింది. అయిదే ఫార్మల్ గా రిటైర్ అయిన టీ తో హాలీవుడ్ నటింప చేసే ఆలోచన ఏదీ లేదని తమకు తెలిపారని రిపోర్టు చేసింది. ఇప్పటికే ఈ శునకం ప్రముఖ శునక ఆహార కంపెనీ స్పోక్స్ డాగ్ కి ప్రచారకర్తగా డాగ్ పర్ ఫ్యూమ్ కంపెనీ హారియత్ అండ్ హౌండ్స్ యాడ్ ప్రచారంలో బిజీగామారింది. చాలామంది ఇంటర్నెట్ ప్రముఖులు కంటే ఎక్కువ సంచలనంగా మారిపోయిందని తెలిపింది. -
మోడల్ హత్య: మరో నిందితుడి లొంగుబాటు
పాకిస్థాన్ మోడల్, ఇంటర్నెట్ సెన్సేషన్ ఖందిల్ బలోచ్ హత్యకేసులో సహ నిందితుడు, ఆమె మరో సోదరుడు హక్ నవాజ్ పోలీసులకు లొంగిపోయాడు. ఈ హత్యలో అతడి హస్తం కూడా ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో అతడు పంజాబ్ రాష్ట్రంలోని డేరా ఘాజీఖాన్ వద్ద పోలీసులకు లొంగిపోయాడు. ఈ కేసులో ఇంతకుముందు బలోచ్ సొంత సోదరుడు మహ్మద్ వసీమ్‌ను పోలీసులు శనివారమే అరెస్టు చేశారు. తాజాగా నవాజ్ కూడా లొంగిపోయాడు. తాను ముందుగా డ్రగ్స్ తీసుకుని, ఆ తర్వాత పీకనొక్కి తన సోదరిని చంపినట్లు వసీమ్ ఇంతకుముందే చెప్పాడు. ఇందులో నవాజ్ పాత్ర ఎంతో తేల్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. లాహోర్‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్‌లో వసీమ్‌కు డీఎన్ఏ, పాలీగ్రాఫ్ పరీక్షలు చేయించారు. ముల్తాన్ నగరంలోని తమ ఇంట్లో బలోచ్‌ను ఈనెల 15వ తేదీన వసీమ్ హతమార్చాడు. బలోచ్ ను హత్య చేసినందుకు గర్వంగా భావిస్తున్నానని, అందుకు భావితరాలు తనను గుర్తుంచుకుంటాయని మహ్మద్ వసిమ్ అన్నాడు. తమ కుటుంబానికి తలవంపులు తెస్తున్నందుకే హత్య చేశానన్నాడు. తాను మాదక ద్రవ్యాలకు బానిసయినా, స్పృహలో ఉండే ఈ హత్య చేశానని వసీమ్ చెప్పాడు. ఖందిల్ ఇంటర్నెట్ లో అశ్లీల చిత్రాలను పోస్టు చేస్తూ తమ కుటుంబం పరువు తీస్తున్నందుకే హత్య చేశానన్నాడు. అమ్మాయిలు జన్మించేది ఇంట్లో ఉండేందుకని, వారు సంప్రదాయాలు పాటించాలని, అయితే తన సోదరి ఎప్పుడూ ఇలా ఉండలేదని చెప్పాడు.