మీన రాశి
ఆదాయం–11 , వ్యయం–5 , రాజయోగం–2 , అవమానం–4
పూర్వాభాద్ర 4 వ పాదము (ది)
ఉత్తరాభాద్ర 1,2,3,4 పాదములు (దు, శ్య, ఝా, థా)
రేవతి 1,2,3,4 పాదములు (దే, దొ, చా, చి)
గురువు మే 1 వరకు మేషం (ద్వితీయం)లోను తదుపరి వృషభం (తృతీయం)లోను సంచరిస్తారు. శని కుంభం (వ్యయం)లోను రాహువు మీనం (జన్మం)లోను కేతువు (సప్తమం)లోను సంచరిస్తారు. రోజు వారీ కార్యక్రమాలలో సరైన నిర్ణయాలు చేయలేక ఇబ్బందికి గురవుతుంటారు. గౌరవ మర్యాదలకు ఇబ్బంది రాకుండా ఉండేలాగా మీ నడవడికను సరిచేసుకోండి. కొన్నిసార్లు దుర్మార్గులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టగలరు. జాగ్రత్తపడండి. రోజువారీ భోజనం విషయంలో కూడా మీకు సమయపాలన, సంతుష్టి ఉండవు. ప్రతిరోజూ చేయవలసిన పని వదిలి దూరంగా వెళ్ళాలి అనే కోరిక బాగా పెరుగుతుంది. నిత్య కర్మలను వాయిదా వేయవద్దు. ఏలినాటి శని ప్రథమ భాగంలో ఉన్నది. అయితే జన్మ రాహువు కూడా ఇబ్బందికరమే. ప్రతిపనీ శ్రమయుక్తమే. ఉద్యోగ విషయాలలో పని మీద ఉత్సాహం కలగక సరిగా పనిచేయరు. మీరు కుటుంబం, ఉద్యోగం తప్ప మరి ఏ ఇతర విషయాలకూ ప్రాధాన్యమివ్వ వద్దు. గుర్తింపు లేకుండా కాలక్షేపం చేయవలసి వస్తుంది.
అయినా ఓర్పు వహించండి. ప్రమోషన్ అందడం కష్టసాధనం. మీరు సరైన జాగ్రత్తలు పాటింపకపోతే అయిష్టమైన స్థానానికి స్థానచలనం కలుగుతుంది. కొన్నిసార్లు వ్యాపారులకు అనవసర విషయాల ద్వారా, అధికారుల ద్వారా, గుమస్తాల ద్వారా ప్రతికూల స్థితులు రాగలవు. మైత్రీభావం ప్రదర్శించండి. కుటుంబ విషయాలు చూస్తే ఎవరితోనూ మీకు మాట కలవదు. వీలయినంతవరకు మౌనం పాటించండి. బంధువుల విషయంగా ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కుటుంబంలోని పెద్దల ఆరోగ్య విషయంగా చాలా జాగ్రత్తలు పాటించండి. పిల్లల అభివృద్ధి విషయంలో అసంతృప్తి తప్పనిసరిగా ఉంటుంది. అయితే మీ జాగ్రత్తల వలన మీరు అన్ని రకాల సమస్యలు దాటగలరు. ఆర్థిక విషయాలు పరిశీలిస్తే తరుచుగా అవసరానికి డబ్బులు సర్దుబాటు కాని సందర్భాలు ఎన్నో ఉంటాయి. పాత ఋణాలు విషయంగా హామీ నెరవేర్చలేరు. కొత్త ఋణాలు అవసరానికి అందవు. చాలా విచిత్ర స్థితి ఒక్కసారిగా ప్రారంభం అవడంతో మీరు కూడా అయోమయంలో ఉంటారు. మీ దగ్గర డబ్బులు తీసుకున్నవారు సమయానికి తీర్చరు. ఖర్చులు నియంత్రించిన వారికి మంచి కాలం.
ఆరోగ్య విషయంగా పాత సమస్యలు తిరగపెట్టే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తలు పాటించవలసిన కాలం. వైద్య సలహాలు బాగా పాటించండి. ఆరోగ్యవంతులు కూడా ప్రతిరోజూ తగిన జాగ్రత్తలు పాటించాలి. ఈ రాశికి చెందిన స్త్రీలకు ఏదో తెలియని చికాకులు తరచుగా వస్తుంటాయి. ఈ సంవత్సరం మీరు కుటుంబ, ఉద్యోగ, వ్యాపార విషయాలలో సమన్యాయం పాటించక ఇబ్బందులు పడతారు. గర్భిణీ స్త్రీల విషయమై బహు జాగ్రత్తలు అవసరం. వైద్య సలహాలు క్రమం తప్పకుండా పాటించండి. షేర్ వ్యాపారులకు మంచి వ్యాపారం చేయలేకపోగా అనవసర సమయంలో పెట్టుబడులు పెడతారు.
విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో వున్నవారికి పనులు సరిగా కావు. అందుకోసం చింతించనవసరం లేదు. కోర్టు వ్యవహారాలలో ఉన్నవారికి అన్ని పనులూ చికాకులు సృష్టిస్తాయి. ఎవరూ సరిగా సహకరించరు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఉన్నవారికి మోసపూరిత వాతావరణం ప్రతి అంశంలోనూ ఎదురవుతుంది. విద్యార్థులకు చాలా విచిత్ర స్థితి ఉంటుంది. రాబోవు మూడు సంవత్సరాలు మీరు స్థిరబుద్ధిని బాగా ప్రదర్శించాలి. రైతుల విషయంలో కృషి సరిగా చేయకపోవడం, తప్పుడు సలహాలు అందడం వంటివి తరచుగా ఉంటాయి.
పూర్వాభాద్ర నక్షత్రం 4వ వారు మానసిక ఒత్తిడికి లోనవుతారు. పనులు మందగమనంగా ఉంటాయి. కిందస్థాయి వారితో వృత్తి నష్టాలు వస్తుంటాయి. ఉద్యోగ వ్యాపార శుభకార్యాల నిమిత్తం ప్రయాణాలు చేస్తారు. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి ఉద్యోగ వ్యాపారాలలో పనులు ఆలస్యమైనా, లాభదాయకంగా ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలలో కొత్త ప్రయోగాలకు మంచికాలం కాదు. రేవతి నక్షత్రం వారు గృహ, వ్యాపార నిర్వహణలలో పనివాళ్ల నుంచి సమస్యలు ఎదుర్కొంటారు. పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. వృత్తి విషయాలలో అధికారుల సహకారం తక్కువగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి.
శాంతి మార్గం: శని, రాహు, గురువులకు తరచుగా శాంతి చేయించడం మంచిది. రోజూ ప్రాతఃకాలంలో ఆంజనేయస్వామికి ‘శ్రీరామశ్శరణం మమ’ అని, సాయం సమయంలో శివాలయంలో ‘శ్రీమాత్రే నమః’ అని చెబుతూ 11 ప్రదక్షిణాలు చేయండి.
ఏప్రిల్: ఈ నెల ఆర్థిక సమస్యల వలన మానసిక ఒత్తిడి. ఋణం చేయవలసి వస్తుంది. పనులు ఎంత శ్రద్ధగా చేసినా, ఆశించిన ప్రతిఫలం ఉండదు. ఉద్యోగంలో పైఅధికారులతో సమస్యలు వస్తాయి. మీ పనులలో ఇతరుల ప్రమేయం వలన సమస్యలు వస్తాయి. శారీరక మానసిక ఒత్తిడి తప్పదు.
మే: పనిలో నేర్పు ప్రదర్శిస్తారు. అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు. సమస్యలను పట్టుదలతో పరిష్కరిస్తారు. ధనలాభం ఉంది. ఆరోగ్యం కొంత ఇబ్బందికరం. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. సుబ్రహ్మణ్య ఆరాధన శుభప్రదం. షేర్ వ్యాపారులు లాభాలు అందుకోలేరు. విద్యార్థులకు, రైతులకు, మార్కెటింగ్ ఉద్యోగులకు రాబోవు సంవత్సర కాలం అధిక జాగ్రత్తలు అవసరం.
జూన్: ఆర్థిక విషయాలలో క్రమశిక్షణ అవసరం, అభిప్రాయ భేదాల వల్ల మనస్తాపం ప్రయాణాలవల్ల అలసట. పెద్దల అనుగ్రహంతో పనులు పూర్తవుతాయి. షేర్, ఫైనాన్స్, వ్యాపారాలలో చిత్రమైన పరిస్థితి ఎదురవుతుంది. విద్యార్థులకు, రైతులకు చికాకులు తప్పవు. షేర్ వ్యాపారులకు అనుకూలం. నూతన వ్యాపార ప్రయత్నాలలో విఘ్నాలు ఉంటాయి.
జులై: కుటుంబ సమస్యలను తెలివితో పరిష్కరిస్తారు. మనోధైర్యం పెరుగుతుంది. పట్టుదలతో పెద్దపనులు పూర్తిచేస్తారు. ఆరోగ్యం కుదుట పడుతుంది. ఉద్యోగంలో రాణిస్తారు. భూ–వాహన–స్థిరాస్తి లాభం. ఇష్ట దైవారాధన శుభప్రదం. ధనం సర్దుబాటు కాకున్నా, కొన్ని పనులు వేగంగా సాగుతాయి. 16వ తేదీ తరువాత సానుకూలం. మాసాంతంలో కార్య విజయం. విద్యార్థులకు, రైతులకు, షేర్ వ్యాపారులకు కాలం సామాన్యం.
ఆగస్ట్: కాలం అనుకూలం. ఉద్యోగంలో శత్రు బాధలు తొలగుతాయి. ఆర్థిక లావాదేవీలు ఫలిస్తాయి. ప్రయాణాల వల్ల ఖర్చులు పెరుగుతాయి. ఋణ రోగ సమస్యలు తగ్గుతాయి. స్త్రీలతో వివాదాలకు దూరంగా ఉండండి. కుటుంబ విషయాలలో మొండి వైఖరితో సమస్యలు పెంచుకుంటారు. వృత్తి విషయాలలో కోపావేశములతో కొన్నిసార్లు ఇబ్బంది పొందుతారు. షేర్ వ్యాపారులకు అనుకూలత తక్కువ.
సెప్టెంబర్: ఈనెల గ్రహానుకూలత తక్కువ. ఎదుటివారి విషయాలకన్నా స్వవిషంపై శ్రద్ధ వహించడం శ్రేయస్కరం. ఉద్యోగ బదిలీలు అనుకూలం. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. నూతన ఉద్యోగ, వ్యాపార ప్రయత్నాలు సరిగా సాగవు. నూతన వాహన కొనుగోలు ఆలోచనలు విరమించండి. షేర్ వ్యాపారులకు అనుకూలం కాదు. విద్యార్థులకు, రైతులకు కాలం సరిగా లేదు.
అక్టోబర్: మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సమస్యలు పెరుగుతాయి. ఇంట్లో స్త్రీలకు ఆరోగ్య ఇబ్బందులు. కుజ శాంతి, సుబ్రహ్మణ్య ఆరాధన వల్ల శుభం కలుగుతుంది. విద్యార్థులకు ఏకాగ్రత లోపిస్తుంది. షేర్ వ్యాపారులు ఒత్తిడికి లోనవుతారు. రైతులకు, మార్కెటింగ్ వ్యాపారులకు అనుకూలం కాదు. ధనం వెసులుబాటు జరగదు.
నవంబర్: ఇంటా బయటా మీమాటకు విలువ తగ్గును. ఏపనికైనా పలుమార్లు చెప్పవలసి వచ్చును. పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఉద్యోగంలో సమస్యల పట్ల ఆందోళన చెందక నేర్పుతో వ్యవహరిస్తారు. పిల్లల నుంచి సహకారం తక్కువ. ఉద్యోగ కుటుంబ వ్యవహారాల నిర్వహణలో సరైన దృష్టి ఉంచలేరు. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు అనుకూలం.
డిసెంబర్: ఉద్యోగంలో పెనుమార్పులు మీకు అనుకూలిస్తాయి. ప్రతిభకు తగిన గౌరవం లభిస్తుంది. పనులన్నీ లాభదాయకంగా ఉంటాయి. రాజకీయవేత్తలకు మంచి అవకాశాలు లభిస్తాయి. శివ దర్శనం శుభప్రదం. మీ ఆరోగ్యం అనుకూలమే కానీ మానసిక స్థితి కొంచెం ఇబ్బందికరం. విద్యార్థులకు సాధారణ ఫలితాలు ఉంటాయి. రైతులకు, షేర్ వ్యాపారులకు సాధారణ స్థాయి లాభాలు ఉంటాయి. స్థిరాస్తి కొనుగోలు, అమ్మకాలు వేగం అవుతాయి. జనవరి: వృత్తిలో రాణిస్తారు. వ్యాపారం లాభదాయకం. రాజకీయవేత్తలు ప్రజల మన్ననలు పొందుతారు. అధికారయోగం ఉంది. శత్రుబాధల నుంచి విముక్తి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఉద్యోగ, వ్యాపారాలలో మీ స్థిరత్వానికి ఇబ్బంది రాకుండా జాగ్రత్తపడండి.
విద్యార్థులకు, రైతులకు, షేర్ వ్యాపారులకు, ఫైనాన్స్ వ్యాపారులకు సహకారం తక్కువ. ఫిబ్రవరి: తీర్థయాత్రలు చేస్తారు. సత్సాంగత్యం వలన లబ్ధి పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతోషాన్ని కలిగిస్తాయి. శుభకార్యాలు జరుగుతాయి. ఇష్టదైవ ధ్యానం శుభకరం. పెద్దల ఆరోగ్యం, పిల్లల అభివృద్ధి విషయంలో ఆనందకరమైన పరిస్థితులు ఉంటాయి. ఋణాలు అవసరానికి అందుతాయి. పాత ఋణ సమస్యలను తెలివిగా అధిగమిస్తారు. ఆరోగ్య జాగ్రత్తలు పాటిస్తారు. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు అనుకూలం. మార్చి: ఎన్ని సమస్యలు ఉన్నా, ఓర్పుతో వ్యవహరిస్తారు. కుటుంబ సహకారంతో పనులన్నీ వేగంగా పూర్తవుతాయి. ఉద్యోగ బదిలీల వల్ల అలసట, శారీరక శ్రమ ఉంటాయి. ఆర్ధిక విషయాలలో ఇతరులపై ఆధారపడవద్దు. మోసపూరిత పరిస్థితులు ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment