Urmila Rosario: అవును... మన అమ్మాయే! | Who Is Urmila Rosario, The Karnataka Woman Who Is Behind Australia World Cup Success, Know About Her In Telugu - Sakshi
Sakshi News home page

Who Is Urmila Rosario: అవును... మన అమ్మాయే!

Published Thu, Nov 23 2023 4:15 AM | Last Updated on Thu, Nov 23 2023 12:10 PM

Urmila Rosario: The Karnataka woman behind Australia World Cup success - Sakshi

ఫైనల్‌ మ్యాచ్‌లో మన జట్టు ఓటమి చెందిన బాధలో ఆమె పెద్దగా ఎవరికంటా పడలేదుగానీ... ఆ తరువాత మాత్రం ‘ఎవరీ అమ్మాయి?’ అనుకున్నారు చాలామంది. గెలుపు తరువాత ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టు పక్కన ప్రముఖంగా కనిపించిన ఆ అమ్మాయి పేరు... ఊర్మిళా రోసారియో.

ఎవరీ ఊర్మిళ?
ఊర్మిళా రోసారియో ఆస్ట్రేలియన్‌ క్రికెట్‌ టీమ్‌ మేనేజర్‌. ఆమె తల్లిదండ్రులు ఐవీ, వాలెంటైన్‌ రోసారియోలది కర్ణాటకలోని మంగళూరుకు సమీపంలోని కిన్నిగోలి ప్రాంతం. ఐవీ, వాలంటైన్‌లు ఖతార్‌లోని దోహాలో ఉద్యోగం చేస్తున్న కాలంలో ఊర్మిళ జన్మించింది.

ఊర్మిళకు చిన్నప్పటి నుంచి ఆటలు అంటే చాలా ఇష్టం. స్కూలు రోజుల్లో క్రికెట్‌ కంటే బాస్కెట్‌బాల్, టెన్నిస్‌ బాగా ఆడేది. బంగీ జంపింగ్‌ అంటే ఇష్టం. ఖతార్‌ టెన్నిస్‌ ఫెడరేషన్‌లో మూడు సంవత్సరాలు పనిచేసింది.

కార్నెగీ మెలన్‌ యూనివర్శిటీ లో బీబీఏ చేసిన ఊర్మిళ ఆ తరువాత ఆస్ట్రేలియా మహిళా క్రికెట్‌ జట్టుకు మేనేజర్‌గా పనిచేసింది. ఒక నాన్‌–ఆస్ట్రేలియన్‌కు టీమ్‌ మేనేజర్‌ బాధ్యతలు అప్పగించడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ నేపథ్యంలో క్రికెట్‌ నుంచి కొన్ని నెలల పాటు విరామం తీసుకొని ఖతార్‌లో ఫుట్‌బాల్‌ స్టేడియం నిర్వాహణ బాధ్యతలు చూసుకుంది. ఆ తరువాత మళ్లీ ఆస్ట్రేలియాకు వచ్చింది.
 
ఆస్ట్రేలియా మహిళా క్రికెట్‌ జట్టు మేనేజర్‌గా ఊర్మిళ పనితీరు, హిందీ, కన్నడ, కొంకణి... మొదలైన భారతీయ భాషలలో నైపుణ్యం వరల్డ్‌కప్‌ టూర్‌లో ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టు మేనేజర్‌గా ఎంపిక చేయడానికి కారణం అయింది.
ఏడు సంవత్సరాల క్రితం ఊర్మిళ తల్లిదండ్రులు దోహా నుంచి మన దేశానికి వచ్చారు. కాఫీ ఎస్టేట్‌ కొనుగోలు చేసి కర్ణాటకలోని సకలేష్‌పూర్‌లో స్థిరపడ్డారు.

‘క్రికెట్‌తో ఒకప్పుడు నాకు పెద్దగా పరిచయం లేదు. అలాంటి నాకు క్రికెట్‌తో ఇంత అనుబంధం ఏర్పడడం ఆశ్చర్యంగా ఉంది’ అని నవ్వుతూ అంటుంది ఊర్మిల.
నవ్వడం సరే, క్రికెట్‌ టీమ్‌ మేనేజర్‌ అంటే మాటలా?
ఒక్కమాటలో చెప్పాలంటే... ‘రెస్పాన్సిబుల్‌ ఫర్‌ ఎవ్రీథింగ్‌’ దీనిలో వందకు వంద మార్కులు కొట్టేసింది ఊర్మిళ.

ఊర్మిళ గత మార్చిలో తల్లిదండ్రులను చూడడానికి మనదేశానికి వచ్చింది. ఊర్మిళ ఇక్కడ ఉంటే కాఫీ ఎస్టేట్‌లో చిన్న చిన్న పనులు కూడా చేస్తుంది. ఆమె పక్కన ఉంటే తల్లిదండ్రులకు పండగే. కూతురి ఉన్నతి గురించి పెద్దగా మాట్లాడకపోయినా ‘ఫైనల్‌ మ్యాచ్‌ చూడడానికి అహ్మదాబాద్‌కు వెళ్లాలనుకున్నాం. దురదృష్టవశాత్తు మా ఎస్టేట్‌ దాటి వెళ్లలేకపోయాం’ అంటున్నారు ఊర్మిళ తల్లిదండ్రులు.

ఫైనల్‌ మ్యాచ్‌ మిస్‌ అయితే ఏమిటి?  ఏదో ఒకరోజు కాఫీ ఎస్టేట్‌కు ఊర్మిళ వస్తుంది కదా! ఆ మ్యాచ్‌ను కళ్లకు కడుతుంది కదా! ఇక దిగులెందుకు!!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement