లక్నో: ఒకపక్క కరోనా కేసులు పెరుగుతుంటే.. మరోక్క రంగుల పండగ హోలీ దగ్గరపడుతోంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎంతో ఇష్టంగా జరుపుకునే కలర్‌పుల్ పండగ హోలీ. మరోసారి కేసులు పెరుగుతున్న తరుణంలో హోలీ ఎలా జరుపుకోవాలి? అని బాధపడేవారందరికి తియ్యటి వార్త చెబుతున్నాడు వారణాసికి చెందిన విశాల్. హోలీ పండగ జరుపుకునేందుకు ప్రత్యేకంగా ‘యాంటీ కరోనా వాటర్ గన్’ రూపొందించిన విశాల్.. వాటర్‌గన్ ఉండగా మీకు చింతేలా అంటున్నాడు.
కరోనా భయాన్నీ పక్కనబెట్టి, ఎటువంటి ఆందోళన లేకుండా ఈ వాటర్ గన్‌తో రంగులు చల్లుకుంటూ హోలీ జరుపుకోండి అంటూ భరోసా ఇస్తున్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ పండగ జరుపుకోవాలన్నా సోషల్ డిస్టెన్స్ పాటించక తప్పదు. అయితే కొన్ని పండగల్ని డిస్టెన్స్ పాటిస్తూ జరుపుకోవచ్చు కానీ, హోలీ లాంటి వాటికి కుదరదు. అందువల్ల దీనికి పరిష్కారం కనుక్కోవాలనుకున్నాడు అశోక ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్‌లో చదువుతోన్న విశాల్ పటేల్. ఇటు కరోనాను ఎదుర్కొంటూ అటు హోలీని ఎప్పటిలాగా జరుపుకునే విధంగా ఏదైనా కొత్తగా తయారు చేయాలనుకున్నాడు.
ఈక్రమంలోనే యాంటీ కరోనా వాటర్ గన్‌ను రూపొందించాడు. ప్రత్యేకంగా రూపొందించిన ఈ గన్ ఉపయోగించి సోషల్ yì స్టెన్స్ పాటిస్తూ రంగులను చల్లవచ్చు. అయితే ఇది చేతితో పట్టుకుని షూట్ చేసే గన్ మాదిరి ఉండదు. దీనిని ఇంటిపైన అమర్చి ఉంచుతారు. ఎవరైనా వాటర్ గన్ ఉన్న ప్రాంతం వైపు వచ్చినప్పుడు వెంటనే.. గన్‌లో ఉన్న సెన్సర్లు యాక్టివేట్ అయ్యి వారి మీద రంగులు చిమ్ముతుంది. ఒకవేళ గన్ పరిసరప్రాంతాల్లో ఎవరూ రాకపోతే గన్ ఇన్‌యాక్టివ్‌గా ఉంటుంది.
ఇవేగాక ఈ గన్‌కు మరో ప్రత్యేకత కూడా ఉంది. దీనిలో కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొనే పిచికారీ కలపడం వల్ల ఇది మంచి శానిటైజర్‌గా కూడా పనిచేస్తుంది. ఒకేసారి ఎనిమిది లీటర్ల రంగును గన్‌లో నింపవచ్చు. గన్‌లో 12 ఓల్టుల బ్యాటరీతోపాటు ఇన్‌ఫ్రారెడ్ సెన్సర్, అల్ట్రాసోనిక్ సెన్సర్ స్విచ్, ఎల్‌ఈడీ లైటు ఉంది. ఇన్ని హంగులున్న వాటర్ గన్‌ను విశాల్ పదిహేను రోజుల్లో తయారు చేయడం విశేషం. దీని ధర దాదాపు రూ.750 మాత్రమే.
బనారస్ హిందూ యూనివర్సిటీ కోఆర్డినేషన్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ బిహేవియర్ ఆర్ట్స్ సెంటర్‌కు చెందిన మనీష్ అరోరా మాట్లాడుతూ.. వాటర్ గన్ వినూత్న ఆలోచన అని, సురక్షితంగా హోలీ జరుపుకోవడానికి బాగా ఉపయోగపడుతుందని ప్రశంసించారు. రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ డెవలప్‌మెంట్ సెల్ ఇన్‌చార్జ్ శ్యామ్ ఛౌరాసియా మాట్లాడుతూ.. ఈ సమయంలో ఇటువంటి టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడుతుందని, విశాల్ పటేల్ వాటర్ గన్ రూపొందించి గొప్ప పనిచేశాడని అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment