Kerala Trio Sisters Successful Journey In Telugu: డిగ్రీ చదువులు పూర్తయ్యాక ఉద్యోగాన్వేషణలో ఉంటారు చాలా మంది. కానీ, కేరళలో ఉంటున్న ఈ ముగ్గురు అక్కచెల్లెళ్లు మాత్రం సొంతంగా ఏదైనా సాధించి చూపాలనుకున్నారు. ఆహారపదార్థాల తయారీలోకి వాడే దినుసులు తమ వ్యాపారానికి ఎలా ఉపయోగపడతాయో రకరకాల ప్రయత్నాలు చేశారు.
అందులో భాగంగా మూడేళ్ల క్రితం ఇంగువ వ్యాపారాన్ని ప్రారంభించి నేడు నెలకు పాతిక లక్షలకు పైగా సంపాదిస్తున్నారు. అందరి చేత ‘శభాష్’అనిపించుకుంటున్నారు. ఎంతో మంది యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఎంబీయే చేసిన వర్షాప్రశాంత్ మూడేళ్ల క్రితం ఏదైనా వ్యాపారం చేయాలనుకుంది. అందుకు ఆమె ఇద్దరూ చెల్లెళ్లూ విస్మయ, వ్రిందా కూడా చేయి కలిపారు. 3వీస్ పేరుతో ఒక సంస్థను ప్రారంభించి, ఇంగువను మార్కెట్ చేయడం మొదలుపెట్టారు.
ఘాటైన వ్యాపారం
అసాఫోటిడా (ఇంగువ) అనేది ఫెరులా మొక్కల వేర్ల నుండి సేకరించిన గమ్. ఎండబెట్టిన తర్వాత దీనిని ఔషధంగా ఉపయోగిస్తారు. ఇది ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్‌లో విస్తృతంగా పెరిగినప్పటికీ ఇది ఎక్కువగా భారతీయ వంటకాల్లో కనిపిస్తుంది. ఆయుర్వేదంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. దక్షిణ భారతీయ వంటకాలలో ముఖ్యంగా సాంబార్ తయారీలో ఇంగువ ఘాటైన వాసన స్పష్టంగా తెలుస్తుంది.
‘ఆహార పదార్థాల ఉత్పత్తి యూనిట్ ఆలోచన మా ఇంట్లో చేసినవాటినుంచే ఎంచుకున్నాం. ఇంగువతో బాగా పేరు వచ్చాక ఆ తర్వాత్తర్వాత 30 రకాల ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకువచ్చాం’ అని వివరిస్తారు ఈ సోదరీమణులు. కంపెనీ తయారీ యూనిట్ ఎర్నాకులంలోని కలమస్సేరిలో ఉంది. వర్ష రోజువారీ కార్యకలాపాలను చూస్తుండగా, చార్టర్డ్ అకౌంటెంట్ విద్యార్థి విస్మయ ఆర్థిక వ్యవహారాలను చూసుకుంటుంది. బిబిఎ పూర్తయిన వ్రిందా డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. ఈ అక్కాచెల్లెళ్లను కన్న తల్లిదండ్రులు సరళ, ప్రశాంత్ లు కూడా తమ కూతుళ్లకు మద్దతుగా పనులు పంచుకుంటున్నారు.
మొదట బాగోలేదన్నవారే...
‘కంపెనీ మొదట్లో సాధారణంగా ఒక్కదాన్నే ప్రారంభించినా, నా చెల్లెళ్లిద్దరూ పూర్తిగా భాగస్వాములు కావడంతో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చేశాను. ఇప్పుడు మా దగ్గర 30 మంది ఉద్యోగలు పనిచేస్తున్నారు’ అని చెప్పే వర్ష ముద్రారుణం, రూ.2 లక్షల చిన్న పెట్టుబడితో ఈ కంపెనీని ప్రారంభించింది. దీనికి ముందు ఉత్పత్తికి సంబంధించిన మొత్తం ప్రక్రియను అర్థం చేసుకోవడానికి అగ్రోపార్క్ నుండి శిక్షణా కోర్సు పూర్తి చేసింది వర్ష. ఆ తర్వాత తమిళనాడులోని కొన్ని తయారీ యూనిట్లను సందర్శించింది.
‘ట్రయల్ రన్ సమయంలో ప్రజలు సాధారణంగా ఉపయోగించే దానికి భిన్నంగా ఇంగువ రుచి, వాసనలో మార్పు గురించి మాకు ఫిర్యాదు చేశారు. ముందు మా ఇంగువ అంత బాగోలేదన్నారు. దీంతో తయారీలో మార్పులు చేసుకొని, సరైనదానిని ప్రజల ముందుకు తీసుకువచ్చాం. ఇప్పుడు ఇ–కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కూడా మంచి విక్రయాలు జరుగుతున్నాయి’ అని డిజిటల్ మార్కెటింగ్ చూసే వ్రిందా వివరిస్తారు. తమ అద్దె ఇంటిలోని చిన్న గదిలో ప్రారంభించిన ఈ సంస్థ ఇప్పుడు రూ.50 లక్షల విలువైన యంత్ర సామగ్రితో నడుస్తోంది.
రాష్ట్ర వ్యాప్తంగా ..
‘ఎర్నాకులం, అళప్పుఱ, పాథానంతిట్ట వంటి ఇతర జిల్లాలలో డైరెక్ట్ సేల్స్ ద్వారా ఆర్డర్లు నెమ్మదిగా వచ్చాయి. కేరళ రాష్ట్ర పౌర సరఫరాల కార్పోరేషన్‌తో కలిసి పనిచేయడం ద్వారా అమ్మకాలు పెరిగాయి. ‘మూడేళ్ల క్రితం వరదల సమయంలో కార్పొరేషన్‌కు ఉత్పత్తులను సరఫరా చేయడం ప్రారంభించాం. దీనిని ఇప్పటికీ కొనసాగిస్తున్నాం. ఇది ఈ మూడు నాలుగు నెలలుగా పాతిక లక్షల మార్జిన్‌ను చేరుకోవడానికి మాకు సహాయపడింది’ అని మేనేజింగ్ డైరెక్టగా ఉన్న వర్ష వివరిస్తుంది.
పసుపు, కారం, కొత్తిమీర, సాంబార్, మిరియాలు, చికెన్.. మసాలా పొడులను కూడా ఈ సంస్థ నుంచే విక్రయిస్తున్నారు. కేరళలోని రెండువేలకు పైగా అవుట్‌లెట్లకు తమ వస్తువులను అందించడానికి అనుమతి తీసుకున్నప్పటికి, అమ్మకాలను మాత్రం కొన్నింటికే పరిమితం చేశారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మరికొంతమంది పంపిణీదారులను వెతుకుతున్నారు.
ఇంగువను తయారు చేయడానికి ముడిపదార్థాలు ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చి ముంబైలోని డీలర్లద్వారా వారికి చేరుకుంటాయి. ‘రాబోయే నాలుగేళ్లలో మా సంస్థను అంతర్జాతీయ బ్రాండ్‌గా మార్చాలని ప్లాన్ చేస్తున్నాం. అందువల్ల, లాభంలో ఎక్కువ భాగం మార్కెటింగ్‌కే వెళుతుంది’ అని సిఎ చదువుతున్న విస్మయ వివరిస్తుంది. ఈ త్రయం 20లలోనే బాధ్యతాయుతమైన వ్యాపార పద్ధతులు, నైపుణ్యాలను చూపుతూ తమకై తాము ఓ కొత్త సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. ‘ఇష్టం వున్న ప్రయాణాన్ని కొనసాగిస్తే విలువైన ప్రదేశానికి చేరుకుంటారు’ అంటున్న వీరికి ఆల్ ద బెస్ట్ చెబుదాం.
చదవండి: వ్యాయామం.. కదలికలు మంచికే..
Comments
Please login to add a commentAdd a comment