బాధ పడితే బాధ మాత్రమే మిగులుతుంది. అలా కాకుండా రూల్స్ బ్రేక్ చేసి నవ్వితే ఏమవుతుంది? ‘అలా ఎలా కుదురుతుంది? బాధ బాధే, నవ్వు నవ్వే’ అని గట్టిగా అనుకున్న బాధాసర్పదష్టులు కూడా వీరి హాస్యం ముందు మౌనంగా ఉండలేకపోయారు. హాయిగా నవ్వేసి ఆ కొద్ది సమయమైనా బాధ నుంచి విముక్తి పొందారు. యువతరం ఎక్కడ ఉంటుందో నవ్వు అక్కడ ఉంటుంది. ఆ నవ్వునే పెట్టుబడిగా పెట్టి యువతరంలో ఎంతోమంది కామెడీ కంటెంట్ క్రియేటర్‌లుగా కీర్తి, డబ్బు సంపాదిస్తున్నారు. ఒకరిని చూసి మరొకరు అన్నట్లుగా కొత్త వాళ్లు నవ్వుల రంగస్థలంపై మెరుస్తున్నారు. తమదైన హాస్యాన్ని పరిచయం చేస్తున్నారు...
సోషల్ మీడియాలోని రకరకాల విభాగాల్లో కామెడీ అగ్రస్థానంలో ఉంది. మిథిక ద్వివేది, రాజ్ గ్రోవర్, సలోని గౌర్, విష్ణు కుషాల్‌లాంటి యంగ్ కామెడీ కంటెంట్ క్రియేటర్‌లు దూసుకుపోతున్నారు. వీరిలో ఎక్కువ మంది లాక్‌డౌన్ టైమ్‌లో ఫేమస్ అయిన వారు. అప్పటి రోజుల్లో నుంచే కడుపుబ్బా నవ్వించే షార్ట్–ఫామ్ వీడియో స్పూఫ్‌లను రూపొందించారు. బ్రాండ్ ప్రమోషన్‌లలో కామెడీ ఇన్‌ఫ్లూయెన్సర్‌లను ఏరి కోరి ఎంపిక చేసుకుంటున్నారు. ‘కామెడీ ఇన్‌ఫ్లూయెన్సర్‌లు సత్తా ఉన్న రచయితలు. ఆడియెన్స్‌ను ఎలా ఆకట్టుకోవాలో వారికి బాగా తెలుసు. ప్రమోషన్స్‌కు ఎంటర్‌టైన్‌మెంట్‌ను సృజనాత్మకంగా జోడిస్తున్నారు’ అంటున్నాడు సోషల్ సమోస సీయివో హితేష్ రజ్వానీ.
ఒకప్పటి టీవీ సీరియల్ ‘కస్తూరీ జిందగీ’లోని పాపులర్ పాత్రను చిన్నప్పుడు అనుకరిస్తూ అందరినీ నవ్వించేది కరిష్మా గంగ్వాల్. తాను ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ కామెడీని కెరీర్‌గా తీసుకుంటానని ఎప్పుడూ అనుకోలేదు. డిగ్రీ పూర్తి చేసిన తరువాత రేడియో వేదికగా తన టాలెంట్‌ను శ్రోతలకు పరిచయం చేసింది. అప్పటి వరకు తన గొంతునే పరిచయం చేసిన కరిష్మ ప్రేక్షకులకు ముఖ పరిచయం చేయాలనుకుంది. కోవిడ్ టైమ్‌లో కంటెంట్ క్రియేషన్‌కు శ్రీకారం చుట్టింది. అత్తా–కోడళ్ల సంభాషణతో తొలిసారిగా ఒక ఫన్నీ వీడియో చేసింది. ‘ప్రేక్షకులు ఏమనుకుంటారో ఏమో’ అని సందేహించింది. అయితే తన సోదరి సలహాతో సోషల్‌మీడియాలో పెట్టింది. ఆ ఫన్నీ వీడియో 1.3 మిలియన్‌ల వ్యూస్‌ను దక్కించుకొని కరిష్మలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది.
కరిష్మకు ఇన్‌స్టాగ్రామ్‌లో 6.4 మిలియన్‌ల ఫాలోవర్స్ ఉన్నారు. జమ్మూలో పుట్టి పెరిగింది కరిష్మ. డాక్టర్లు, ఇంజనీర్‌ల కుటుంబం వారిది. తాను కూడా డాక్టరో, ఇంజనీరో కావాల్సిందే అన్నట్లుగా ఉండేది పరిస్థితి. అయితే తల్లిదండ్రులను ఒప్పించి కామెడీనే తన కెరీర్ చేసుకుంది.తన మిమిక్రీ స్కిల్స్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోంది చాందిని భాబ్డ. ‘ఆలియాభట్‌ను అనుకరించాలంటే చాందిని మాత్రమే’ అన్నంతగా పేరు తెచ్చుకుంది. చిన్నప్పుడు తన ఉపాధ్యాయులు, చుట్టాలు పక్కాలను కెమెరా ముందు అనుకరిస్తూ అందరినీ తెగ నవ్వించేది చాందిని. ఇరవైనాలుగు సంవత్సరాల చాందిని 2016లో కామెడీ కంటెంట్ క్రియేషన్ ప్రారంభించింది.
న్యాయశాస్త్రం చదివిన చాందిని అమెజాన్ మినీ టీవీ కామెడీ షో ‘కానిస్టేబుల్ గిర్పాడే’లో నటించింది.తీరిక సమయంలో సలోని గౌర్ ఫన్నీ వీడియోలు బాగా చూసేది. ‘నీలో నవ్వించే టాలెంట్ ఉంది’ అని ఫ్రెండ్స్ తరచుగా అనడంతో ‘ఒకసారి ట్రై చేసి చూద్దాం’ అంటూ రంగంలోకి దిగింది. తక్కువ టైమ్‌లోనే కామెడీ కంటెంట్ క్రియేటర్‌గా సక్సెస్ సాధించింది. సలోనికి 1.3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. మధ్యతరగతి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన సలోని అబ్జర్వేషనల్ కామెడీని తన బలంగా చేసుకుంది. ఇరవై సంవత్సరాల వయసులో సోనీ లివ్‌లో ‘అన్‌కామన్ సెన్స్ విత్ సలోని’ పేరుతో సొంత షో స్టార్ట్ చేసింది.
‘ఒక్కరోజు నవ్వకపోయినా ఆ రోజు వృథా అయినట్లే’ అంటాడు చార్లీ చాప్లిన్.అయితే నవ్వడం ఎంత వీజియో, నవ్వించడం అంత కష్టం. ఆ కష్టాన్ని ఇష్టంగా భుజాల కెత్తుకుంటున్నారు కామెడీ కంటెంట్ క్రియేటర్‌లు. ఒకవైపు సీనియర్‌ల వీడియోలు చూస్తూ ఎంజాయ్ చేస్తూనే మరోవైపు సృజనాత్మక ఆలోచనలతో తమదైన కామెడీ కంటెంట్‌ను క్రియేట్ చేస్తున్నారు.‘ప్రేక్షకుల అర క్షణం నవ్వు చాలు వెయ్యి ఏనుగుల బలం తెచ్చుకోవడానికి’ అంటుంది లక్నోకు చెందిన 19 సంవత్సరాల మిథిక ద్వివేది. ఈ కామెడీ కంటెంట్ క్రియేటర్‌కు వేలాదిమంది ఫాలోవర్‌లు ఉన్నారు.
నవ్వడం అదృష్టం...
నవ్వించడం అంతకంటే అదృష్టం ‘లా’లో మాస్టర్స్ డిగ్రీ చేసినప్పటికీ నా ఆలోచనలన్నీ కంటెంట్ క్రియేషన్ చుట్టే తిరుగుతుంటాయి. ఎవరో చెప్పింది వినడం కంటే మనసు చెప్పింది వినడమే మంచిదని నా నమ్మకం. ఐడియాల కోసం కొన్నిసార్లు ‘ఇలా అయితే ఎలా ఉంటుంది’ అంటూ కసరత్తులు చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు మాత్రం స్పాంటేనియస్‌గా వస్తుంటాయి. నా బెస్ట్ కంటెంట్‌లో ఎక్కువ శాతం స్పాంటేనియస్‌గా వచ్చిందే. నవ్వడం అదృష్టం. నవ్వించగలగడం అంతకంటే అదృష్టం.
– చాందిని, కామెడీ కంటెంట్ క్రియేటర్
కంటెంట్ కోసం...
కామెడీ అయినా సరే కంటెంట్ అనేది నేల విడిచి సాము చేయకూడదు. సహజంగా ఉండాలి. ప్రేక్షకులు దానితో రిలేట్ కావాలి. కంటెంట్ కోసం ఎక్కడికో వెళ్లనక్కర్లేదు. మన ఇంట్లో కావచ్చు, పక్కింట్లో కావచ్చు. వెళ్లిన ఫంక్షన్ కావచ్చు....మనకు కావాల్సిన కంటెంట్ దొరుకుతుంది. దాన్ని మన స్టైల్లో ఎలా ప్రెజెంట్ చేస్తున్నామనేదే ముఖ్యం.
– సలోని గౌర్, కామెడీ కంటెంట్ క్రియేటర్
కొత్తదనం కావాలి
కామెడీ పుస్తకాలు చదివీ, సీరియల్స్ చూసి కామెడీని సృష్టించలేం. జనాల్లోకి వెళ్లి పరిసరాలను గమనించాల్సిందే. ఆసక్తికరమైన సంభాషణలు, పదాలు విన్నప్పుడు పెన్ను పేపర్ తీసుకొని స్క్రిప్ట్ రాస్తుంటాను. ఆ తరువాత షూట్స్, ఎడిట్స్, అప్‌లోడ్స్‌కు వెళతాను. ఎప్పటికీ ఒకే విధంగా కాకుండా కొత్తదనం ఉండేలా జాగ్రత్త పడాను.
– కరిష్మ గంగ్వాల్,
కామెడీ కంటెంట్ క్రియేటర్
Comments
Please login to add a commentAdd a comment