5జీ టెక్నాలజీతో దూసుకుపోతున్నా ఇప్పటికీ మూఢనమ్మకాలు మనల్ని వెనక్కి లాగుతూనే ఉన్నాయి. ఆకాశంలో విహరిస్తున్నా ఇప్పటికీ పిల్లి ఎదురుపడితే అపశకునం అని, రాత్రిపూట గోళ్లు కత్తిరిస్తే అరిష్టం అని, పగిలిన అద్దం వాడిదే దరిద్రమని నమ్మేవాళ్లు బోలెడుమంది ఉన్నారు. టెక్నాలజీ ఎంత డెవలప్ అయినా, ఎన్ని సౌకర్యాలు అందుబాటులోకి వచ్చినా ఇప్పటికీ మూఢనమ్మకాలు,ఆచారాలను పాటించేవాళ్లు చాలామంది ఉన్నారు. పెద్దవాళ్లు చెప్పారంటే ఏదో ఒక కారణం ఉండే ఉంటుందన్న గుడ్డి నమ్మకంతో కొన్నింటిని ఫాలో అవుతుంటాం. ఇది ఒక్క మనదేశంలోనే కాదండోయ్, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయి. అలాంటి వింతైన మూఢనమ్మకాలు మనల్ని కశ్చితంగా ఆశ్చర్యపరుస్తాయి.
♦ నైజీరియాలో పిల్లల పెదవులపై ముద్దు పెట్టరు. అలా చేస్తే పిల్లలు పెద్దవాళ్లయ్యాక వాళ్ల జీవితం నాశనం అవుతుందని నమ్ముతారట.
♦ మామూలుగా ఖాళీగా కూర్చున్నప్పుడు కాళ్లు ఊపడం చాలామందికి అలవాటు. అయితే దక్షిణ కొరియాలో మాత్రం ఈ అలవాటును అస్సలు ఒప్పుకోరట. ఖాళీగా కూర్చొని కాళ్లు కదిపితే ఆ వ్యక్తి సంపద మొత్తం పోతుందని నమ్మకం. అందుకే దక్షిణ కొరియాలో ఎవరైనా కాళ్లు కదుపుతూ ఉంటే ఆ వ్యక్తిని అసహ్యంగా చూస్తారట.
♦ ఐస్‌ల్యాండ్‌లో ఆరుబయట అల్లికలు,కుట్లు చేయరట. అలాచేస్తే చలికాలం మరింత ఎక్కువ కాలం కొనసాగుతుందని భావిస్తారు. అలసే అక్కడ మైనస్ డిగ్రీల వాతావరణం కాబట్టి ఈ పని అస్సలు చేయరు.
♦ లాటిన్ అమెరికా దేశాల్లో మంగళవారం పెళ్లి చేసుకోరు. ఒకవేళ అలా చేసుకుంటే ఆ పెళ్లి పెటాకులైనట్లేనని నమ్మకం. నిత్యం తిట్లు, గొడవలతో చివరకు విడాకులు తీసుకొని విడిపోతారట. అందుకే అక్కడి ప్రజలు మంగళవారం పెళ్లిళ్లు చేసుకోవడానికి ఇష్టపడరు. ఒకవేళ వాళ్లు చేసుకున్నా ఏదో ఒక సాకుతో జనం వెళ్లడానికి కూడా ఇష్టపడరట.
♦ జపాన్‌లో ఉత్తరం లేదా పశ్చిమం వైపు చూస్తూ ఎవరూ నిద్రపోరట. ఎందుకంటే జపాన్‌లో చనిపోయిన వారి తలలు ఉత్తరం వైపు చూస్తున్నట్లు ఉంచుతారు. ఆఫ్రికాలో పశ్చిమంవైపు చూస్తున్నట్లు ఉంచుతారు. అందుకని జపనీస్ అలా నిద్రపోరట.
♦ జర్మనీలో కొవ్విత్తితో సిగరెట్ వెలిగించకూడదు. అది సముద్ర నావికులను చెడు చేస్తుందట.
♦ ఆఫ్రికా దేశం రువాండలో మహిళలు మేక మాంసం తినకపోవడమే మంచిదట. ఎక్కువగా మేక మాంసం తింటే ముఖంపై వెంట్రుకలు వస్తాయనేది మూఢనమ్మకం.
♦ జపాన్‌లో సూర్యాస్తమయం తర్వాత చేతి గోళ్లను కత్తిరించరు. అలా కత్తిరిస్తే త్వరగా చనిపోతారని నమ్ముతారట. మన దగ్గర కూడా అరిష్టం అని రాత్రిళ్లు గోళ్లు కత్తిరించరు.
♦ వర్షం పడుతున్నప్పుడు బయటకు వెళ్లాలంటే ఏం చేస్తాం? గొడుగు తీసుకొని బయటకు వెళ్తాం. అయితే ఆ గొడుగు బయటకు వెళ్లాకే తెరవాలట. ఇంట్లో ఉన్నప్పుడు అస్సలు గొడుగు తెరవొద్దట. ఇంట్లో ఉండగానే గొడుగు తెరిస్తే దురదృష్టం వెంటాడుతుందట. అందుకే ఎంత వర్షం పడుతున్నా పూర్తిగా ఇంటినుంచి బయటకు వెళ్లిన తర్వాతే గొడుగు తెరుస్తారు.
♦ స్వీడన్‌లో మాన్‌హోల్‌పై పొరపాటున కూడా కాలు పెట్టరట. అలా చేస్తే ప్రేమ విఫలం అవుతుందని, దురవృష్టం వెంటాడుతుందని బలం నమ్ముతారు. వినడానికి విడ్డూరంగా ఉంది కదూ..
Comments
Please login to add a commentAdd a comment