సోదరుడిని హత్య చేసిన ఆరోపణల కేసులో జీవిత ఖైదు అనుభవించి శతాధికవృద్ధుడిగా జైలునుంచి విడుదలైన ఘటన వైరల్‌గా మారింది. గత నెల సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు మాల్డా కరెక్షనల్ హోం నుంచి విడుదలయ్యాడో వ్యక్తి. ఆయన పేరే 104 ఏళ్ల రసిక్ చంద్ర మోండల్. ‘‘జైలుకి ఎపుడొచ్చానో, ఎన్నేళ్లు గడిపానో గుర్తు లేదు. ఇక ఈ జీవితం ఇంతే అనుకున్నాను’’ అంటున్న రసిక్ చంద్ర మాటలు పలువురిని ఆలోచింప చేస్తున్నాయి.
పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలోని మానిక్‌చక్ నివాసి రసిక్ చంద్ర. 1988లో స్వల్ప భూవివాదంలో సోదరుడిని హత్య చేశాడనే ఆరోపణలతో అరెస్టయ్యాడు. 1992లో మాల్డాలోని జిల్లా మరియు సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది. అప్పటికి మోండల్ వయస్సు 72 సంవత్సరాలు.
కలకత్తా హైకోర్టు విచారణ సమయంలో బెయిలుపై విడుదలయ్యాడు. కానీ దిగువ కోర్టు జీవితఖైదు విధించడం,హైకోర్టు దానిని సమర్ధించడంతో తిరిగి కరెక్షనల్ హోమ్‌కు వెళ్లక తప్పలేదు. ఆ తరువాత 2020లో పేరోలు మీద బయటికి వచ్చి, మళ్లీ 2021లో కరెక్షనల్ హోమ్‌కు వెళ్లిపోయాడు. అప్పటి నుంచి 36 ఏళ్లుగా జీవిత ఖైదుగా ఉన్నాడు.
ఎలా విడుదలయ్యాడు
జీవిత ఖైదు అనుభవించిన వ్యక్తి నిర్దేశించిన శిక్షాకాలంలో ఎలాంటి అక్రమ చర్యలకు పాల్పడ కుండా, సత్ర్పర్తనతో ఉంటే, జైలు నుంచి విడుదలయ్యే అర్హత ఉంటుంది. అలా 36 ఏళ్ల జైలు జీవితం తర్వాత మాల్డా కరెక్షనల్ హోమ్ నుండి 104 ఏళ్ల వృద్ధుడిగా జనజీవితంలోకి వచ్చాడు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తన తండ్రిని విడుదల చేసినట్లు మోండల్ కుమారుడు ప్రకాష్ మోండల్ తెలిపాడు.
ఈ వయసులో కూడా మోండలు ఆరోగ్యంగా, చురుగ్గా కనిపించడం విశేషం. ఎందుకంటే మోండల్ జైలులో నిత్యం వ్యాయామం చేసేవాడట. క్రమశిక్షణతో ఉంటూ వయసుకు తగ్గట్టు ఫిట్‌నెస్ పెంచుకున్నాడు.అంతేకాదు మొక్కలను పెంచడం, తోటపనిలో బాగా పాలు పంచుకునేవాడు. బయటికి వచ్చాక తన అభిరుచికి తగట్టి తోట పని చేసుకుంటానని చెప్పాడు మోండల్. అంతేకాదు తాను నిర్దోషిని, పరిస్థితుల వల్ల తన పరిస్థితి ఇలా వచ్చిందని తెలిపారు. ఇన్నాళ్లుగాకుటుంబాన్ని, మనవలు మనవాళ్లతో గడిపేసమయాన్ని కోల్పోయాను అంటూ వాపోయాడు. అన్నట్టు మోండల్ భార్య మీనా ,ఇన్నాళ్లకు తన భర్త విడుదల కావడంపై సంతోషం ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment