పెరుగు తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే. భారతీయుల భోజనంలో పెరుగు కశ్చితంగా ఉండాల్సిందే. చాలామందికి ఎన్ని కూరలు ఉన్నా సరే చివరికి పెరుగుతోనే భోజనాన్ని ముగిస్తారు.పెరుగులో ప్రోబయోటిక్స్, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ప్రతి రోజు పెరుగు తీసుకోవడం వల్ల మనం తీసుకున్న ఆహారం తేలికగా జీర్ణం అవ్వడమే కాకుండా మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థ కూడా బలపడుతుంది.
అయితే వీటిని తగిన మోతాదులో తీసుకుంటేనే మంచిది. ఎక్కువ తీసుకుంటే కూడా నష్టమే అంటున్నారు నిపుణులు.కొన్ని రకాల సమస్యలతో బాధపడేవారు పెరుగును తినకూడదని, అలాంటి వారు పెరుగు తినడం వల్ల ఆ సమస్య మరింత తీవ్రతరం అవుతాయని హెచ్చరిస్తున్నారు.
పెరుగు ఎలా తినాలి?
పెరుగును నేరుగా తీసుకుంటే వేడి చేస్తుంది. కాబట్టి అందులో కాస్త నీళ్లు కలుపుకొని తీసుకోవాలి. అలా చేయడం వల్ల వేడి స్వభావాన్ని సమతుల్యం చేస్తుంది. ఈమధ్య దహీ కా థడ్కా, దహీ ఫ్రై పేరిట రకరకాల వంటలు అందుబాటులోకి వస్తున్నాయి. పెరుగులో తాళింపు వేసుకొని లాగించేస్తున్నారు. కానీ నిజానికి పెరుగును వేడి చేసి తినకూడదు. ఇలా చేయడం వల్ల పెరుగులోని పోషకాలన్నీ నశిస్తాయి. ఆయుర్వేదం ప్రకారం పెరుగును పండ్లలో కలిపి కూడా తినకూడదు. ఇలా చేయడం వల్ల జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
రాత్రిపూట పెరుగు తినొచ్చా?
పెరుగుకు శరీరాన్ని చల్లబరిచే గుణం ఉంది. రాత్రిపూట పెరుగును తీసుకవడం వల్ల తినడం మ్యూకస్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీంతో కఫం ఏర్పడుతుందని నిపుణులు వివరిస్తున్నారు. ముఖ్యంగా వాతావరణం చల్లపడినప్పుడు పెరుగును తింటే జలుబు, దగ్గు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ తప్పనిసరిగా పెరుగు తినాలనిపిస్తే పలుచని మజ్జిగ చేసుకొని తాగాలని సూచిస్తున్నారు. రాత్రివేళల్లో పెరుగు తింటే జీర్ణవ్యవస్థపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందట.
రోజూ పెరుగు తినడం వల్ల కలిగే నష్టాలు
► ఆస్తమాతో బాధపడుతున్న వారు, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నవారు పెరుగును కాస్త మితంగానే తీసుకోవాలి. తినాలని భావిస్తే కేవలం పగటిపూట మాత్రమే తినాలి. రాత్రిళ్లు తినకూడదు.
► చాలామంది అసిడిటీ సమస్యతో బాధపడుతుంటారు. అలాంటి వారు సైతం పెరుగుకు దూరంగా ఉండాలి.
► వర్షాకాలంలో ప్రతిరోజు పెరుగు తినడం వల్ల గొంతు సంబంధిత సమస్యలు, జలుబు వంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది.
► మీరు తరచుగా అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లయితే పెరుగుకు దూరంగా ఉంటేనే మంచిది.
► మైగ్రేన్, తలనొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతిరోజూ పెరుగును తీసుకోవద్దు. ముఖ్యంగా పుల్లటి పెరుగు తింటే తలనొప్పి మరింత బాధిస్తుంది.
► కీళ్లనొప్పులతో బాధపడేవారు రోజూ పెరుగు తినకూడదు. పెరుగు పుల్లని ఆహారం , పుల్లని ఆహారాలు కీళ్ల నొప్పులను తీవ్రతరం చేస్తాయి
► ప్రతిరోజూ ఎక్కువ మోతాదులో పెరుగు తీసుకోవడం వల్ల ఊబకాయానికి దారితీస్తుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు మితంగా తీసుకోవడం మంచిది.
Comments
Please login to add a commentAdd a comment