అవునా! నాకు ఇంతుందా!! | Whatsapp Emoji Special Story | Sakshi
Sakshi News home page

అవునా! నాకు ఇంతుందా!!

Published Thu, Jan 7 2021 12:06 AM | Last Updated on Thu, Jan 7 2021 2:32 AM

Whatsapp Emoji Special Story - Sakshi

‘నీ మోము జాబిల్లి మోది తేనియలు.. నా నయనమ్ములు చకోరమ్ములు..’ ‘‘ఇంత అర్థం చేసుకుంటుందా ఆ అమ్మాయి?! ఏం చెబుదామని తనకి! ‘నిన్ను ప్రేమిస్తున్నా..’ అనేగా.  ఆ ఎక్స్‌ప్రెషనే ఇంకాస్త సరళంగా, తేలిగ్గా ఉండాలేమో. అసలే లవ్‌ వ్యవహారం. అర్థం కాకముందే అపార్థమైపోతే!’’

‘‘నిజమే గురూ, పోనీ ఇదెలా ఉందో చూడు?’’ ‘ఎపుడు నీ అడుగు వినబడదో.. అపుడు నా అడుగు పడదు..’! ‘‘కొంచెం నయం. రెండూ కృష్ణశాస్త్రి గారి భావకవిత్వంలోంచి తెంపుకుని వచ్చినవేగా. తలలో తరుముతానంటే, ఉరిమి చూడకుండా ఉంటుందా! ఎందుకు తెంచుకొచ్చావో, ఎందుకు తురమదలిచావో ఆ పిల్లకు తెలియొద్దా?’’
‘‘ఇంకెలా చెప్పాలి బ్రో? సింపుల్‌గా  I Love You అని పెట్టేసేదా?’’ ‘‘అన్ని అక్షరాలా!!’’
‘‘ఈ మూడు పదాల్లో ఉన్నవే ఎనిమిది అక్షరాలు. ఇంకేం తగ్గిస్తాం?’’
‘‘ప్రేమకు అక్షరాలతో, పదాలతో, వాక్యాలతో, పేరాలతో, పేజీలో పనేముంది తమ్ముడూ. చూపుల్లేవా? మీరింకా చూసుకోలేదా? కళ్లు కళ్లు కలిశాయంటే.. ఏమిటని అర్థం?!’’
‘‘కలపలేకనే కదా బ్రో..’’
‘‘అయితే నీ ఐలవ్యూను ఎమోజీగా సెండ్‌ చెయ్‌’’.
‘‘హార్ట్‌ సింబలా! నా వల్ల కాదు’’
‘‘హార్ట్‌ సింబలూ కాదు.. ముద్దు సింబలూ కాదు. ‘బాబా’ సినిమాలో రజనీకాంత్‌లా అరిచేయి తెరువు. వేళ్లన్నీ చాపు. చిటికెన వేలు, చూపుడు వేలు పైకెత్తు. మధ్యలోని రెండువేళ్లు కిందకు దింపు’’
‘‘దింపితే?’’
‘‘దింపితే అదే.. ఐ లవ్యూ! హార్ట్‌ సింబల్‌ లేకుండా ఐలవ్యూ చెప్పే ఎమోజీ’’
‘‘హృదయం, కుసుమం లేని ఆ చేతివేళ్ల గుర్తును ఆ అమ్మాయి అర్థం చేసుకుంటుందా?’’
‘‘సెండ్‌ చెయ్‌. నీకొచ్చే తిరుగు సింబల్‌ని బట్టి ఆమెకు ఏమి అర్థమైందో నీకు అర్థమౌతుంది’’
∙∙ 
ప్రేమనే ఏమిటి..? ప్రతి ఎక్స్‌ప్రెషన్‌కూ ఎమోజీలు ఉన్నాయి. కోపం, ద్వేషం, ఆవేశం, ఆవేదన, ఆశ్చర్యం, ఇష్టం, ప్రశంస, విమర్శ, తృణీకారం, హెచ్చరిక.. ప్రతి భావానికీ! మెదడుకు, మనసుకు ఎన్ని ఆలోచనలు వస్తాయో అన్నింటికీ ఒక ఎమోజీ ఉంది. పాతవి ‘ఫ్లో’లో ఉండగనే, కొత్తవి వచ్చేస్తున్నాయి. ఎమోజీలు రాక ముందు కోలన్‌ పక్కన రైట్‌ బ్రాకెట్‌ పెడితే సంతోషం. లెఫ్ట్‌ బ్రాకెట్‌ పెడితే విచారం. అలాంటివి మరికొన్ని ఉండేవి.. ప్రధానంగా వాడుకలోకి వచ్చే భావాలు. స్మార్ట్‌ ఫోన్‌లు వచ్చాక, మనుషులంతా సోషల్‌ మీడియాలోనే జీవించడం మొదలయ్యాక ఈ చుక్కలు, గీతలు వెనక్కి వెళ్లి నిండైన పసుపు పచ్చని గుండ్రటి ముఖాకృతుల ఎమోజీలు వాటి స్థానంలోకి వచ్చేశాయి. అసలివి ఎలా మొదలయ్యాయి? ఎన్ని  ఉన్నాయి? వందలా వేలా? వీటిని ఎవరు సృష్టిస్తారు? చెలామణిలోకి ఎవరు తెస్తారు? సింపుల్‌గా రెండు ముక్కల్లో చదివేద్దాం.

రానున్న ఎమోజీలు
ఫ్లేమింగ్‌ హార్ట్‌ : హృదయజ్వాల (అర్థం తెలిసిందే)
బియర్డ్‌ ఉమన్‌ : గడ్డంతో ఉన్న మహిళ (హీ–గర్ల్‌ అని)
ఇంటర్రేసియల్‌ కపుల్‌ : విజాతి జోడీ

రోజుకు 500 కోట్లు!
– ఫేజ్‌బుక్‌లో, ఫేస్‌బుక్‌ మెసెంజర్‌లో కలిపి ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం రోజుకు 500 కోట్ల ఎమోజీలు బట్వాడా అవుతున్నాయి! ఫేస్‌బుక్, ట్విట్టర్‌ లో రాజ్యమేలుతున్న ఎమోజీ ‘లాఫింగ్‌ ఫేస్‌ విత్‌ టియర్స్‌ ఆఫ్‌ జాయ్‌’. ఇన్‌స్టాగ్రామ్‌ లో మాత్రం హృదయమే (హార్ట్‌ ఎమోజీ) సుప్రీమ్‌.

మాటగా గుర్తింపు
‘ఎమోజీ’ అనే మాట తొలిసారిగా 2013లో ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీలో చోటు చేసుకుంది. 2015లో ‘వర్డ్‌ ఆఫ్‌ ది ఇయర్‌’గా ‘ఫేస్‌ విత్‌ టియర్స్‌ ఆఫ్‌ జాయ్‌’ని ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ ప్రచురణ సంస్థ ఎంపిక చేసింది.

ఎమోజీ క్రాస్‌వర్డ్‌
2020లో తొలిసారి న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక క్రాస్‌వర్డ్‌ పజిల్‌లో ఎమోజీని ఒక క్లూగా ప్రవేశపెట్టింది! 1996లో సంఖ్యలో 76గా ఉన్న ఎమోజీలు 2020 నాటికి 3,136 అయ్యాయి. 2021లో మరో 17 (ఫ్లేమింగ్‌ హార్ట్, బియర్డ్‌ ఉమన్, ఇంటర్రేసియల్‌ కపుల్‌ సింబళ్లతో కలిపి) ఎమోజీలు రాబోతున్నాయి.

ఎమోజీ మైలురాళ్లు
2010 : స్వజాతి దంపతులు, కుటుంబాలు
2014 : యాంటీ–బుల్లీయింగ్‌ ఎమోజీ
2015 : స్కిన్‌టోన్‌ మాడిఫయర్‌లు
2020 : ట్రాన్స్‌జెండర్‌ జెండా

ఎమోజీల అనుమతి
యూనికోడ్‌ కన్సార్టియం అని అమెరికాలో ఒక నాన్‌–ప్రాఫిట్‌ సంస్థ ఉంది. ఎమోజీ అనే ఈ ఎలక్ట్రానిక్‌ టెక్స్ట్‌ ప్రాసెసింగ్‌నంతా.. ఆ సింబల్స్, క్యారెక్టర్‌లు, స్క్రిప్టులు అన్నిటినీ 1991 నుంచీ ఆ సంస్థే పర్యవేక్షిస్తోంది. చెలామణి అధికారం కూడా కన్సార్టియందే.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement