అసాధారణమైన దృశ్యాలు కానీ.. శాస్త్రం తేల్చలేని సంఘటనలు కానీ.. ఎప్పటికీ మిస్టరీలుగానే మిగులుతాయి.
మహారాష్ట్ర, శివపురిలోని హజ్రత్ ఖమర్ అలీ దర్వేష్ దర్గాలో కూడా అలాంటి మిస్టరీనే దాగి ఉంది. ఆ దర్గాలో ఉన్న ఓ 90 కేజీల రాయి.. కేవలం పదకొండు మంది చూపుడు వేళ్ల మీద నిలబడిపోతుంది. ఆ తర్వాత గాల్లోకి తేలుతుంది.
‘దర్వేష్ అలీ సాహెబ్’ అనే ఒక ముస్లిం సాధువు.. ఎక్కడి నుంచో ఆ ప్రదేశానికి వచ్చి.. కొంత కాలం అక్కడే జీవించి, అక్కడే సజీవ సమాధి అయ్యారనేది స్థానికుల కథనం. నిజానికి ఆ దర్గాను ముస్లిమ్‌ల కంటే హిందువులే ఎక్కువగా ఆరాధిస్తుండటం విశేషం. మరీ ముఖ్యంగా హిందువుల్లో కురుమ, యాదవులు తమ పెంపుడు జీవులైన గొర్రె జాతి వృద్ధి చెందాలని, అందుకు దర్వేష్ స్వామి ఆశీస్సులు ఉండాలని.. మొక్కుబడులు కట్టి, స్వామి పేరిట ప్రతి ఏడాది ఒక పొట్టేలును విడిచిపెడతారు.
సంవత్సరం పాటు దాన్ని మేపి, ఉర్సు సందర్భంగా ఆ మొక్కు చెల్లించుకుంటారు. ఈ దర్గాను ‘దర్శెల్లి’ అని కూడా పిలుస్తారట. స్థానిక హిందువులు ఎంతో భక్తితో ఈ దర్గా స్వామి పేర్లను తమ పిల్లలకు పెట్టుకుంటారు. అందుకే అక్కడ ఎక్కువగా దర్శం,దర్శెల్లి అనే పేర్లు వినిపిస్తుంటాయి. ఈ అనవాయితీ నేటికీ కొనసాగుతూనే ఉంది. ఇక్కడ మొక్కితే కోరిన కోరికలు తీరతాయని నమ్ముతారు చాలామంది.
ఇక ఆ రాయి విషయానికి వస్తే.. అది చూడటానికి సాధారణంగానే కనిపిస్తుంది. కానీ చేతి వేళ్ల సాయంతో ఆ బండ ఎలా గాల్లోకి లేస్తుంది? అనేది మాత్రం ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. కండలు తిరిగిన ఆజానుబాహులు కొందరు ఆ బండను బలవంతంగా లేపి.. తమ ప్రతాపాన్ని చూపిస్తూ ఉంటారు. కానీ ఎవరైనా పదకొండు మంది కలసి.. ‘దర్వేష్ అలీ బాబా’ నామాన్ని భక్తితో జపిస్తూ ఆ బండరాయిని లేపితే.. కేవలం వేళ్లపైనే.. అది తేలికగా పైకి లేస్తుంది. ఇది ఎలా సాధ్యమో నేటికీ మిస్టరీనే!
సంహిత నిమ్మన
(చదవండి:
Comments
Please login to add a commentAdd a comment