World Cancer Day 2022: How to Cook Food Avoid Cancer Risk by Experts - Sakshi
Sakshi News home page

Health Tips: మాంసాహారం డీప్‌ ఫ్రై లేదా రోస్ట్‌ చేస్తున్నారా.. ‘హెటెరోసైక్లిక్‌ అరోమాటిక్‌ అమైన్స్‌’ వల్ల..

Published Fri, Feb 4 2022 5:01 PM | Last Updated on Sat, Feb 5 2022 8:11 AM

World Cancer Day 2022: How To Cook Food Avoid Cancer Risk By Experts - Sakshi

చెడు వినకు, చూడకు, మాట్లాడకు అని నీతి చెప్పే మూడు కోతి బొమ్మలు అందరికీ తెలిసినవే. అలాంటి ముఖ్యమైన మూడు నీతి వాక్యాలే... క్యాన్సర్‌ను ‘‘వండుకోకండి, నిల్వ చేసుకోకండి, తినకండి’’ అనే మాటలు! ఇలా క్యాన్సర్‌ను వండటం, నిల్వచేయడం, తినడం ఎలా జరుగుతుందో చూద్దాం, దానికి దూరంగా ఉందాం. ప్రతి వ్యక్తీ బతికి ఉండటానికి ఆహారం తీసుకుంటాడు.

ఇందుకోసం ప్రతి ఒక్కరూ ఆహారపదార్థాలను తినడం, వాటిని వండుకోవడం, నిల్వ చేసుకోవడం చేస్తుంటారు. అప్పుడు సరిగా వండుకోకపోయినా, నిల్వ చేసుకోకపోయినా, తినకపోయినా క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. వాటిని నివారించడానికి అనుసరించాల్సిన మార్గాలివే... 

‘క్యాన్సర్‌ వంట పద్ధతులు’ వద్దు...   
ఓ పదార్థాన్ని వండుతున్నామంటే... దాన్ని క్యాన్సర్‌ను రాని రీతిలో వండటం ముఖ్యం. వంటలో మనం ఉడికించడం, వేయించడం, డీప్‌ ఫ్రై లేదా రోస్ట్‌ చేయడం లాంటి ప్రక్రియలను అనుసరిస్తుంటాం. వీటన్నింటిలోనూ ఉడికించడం అనేది క్యాన్సర్‌ను దూరంగా ఉంచే ఆరోగ్యకరమైన ప్రక్రియ. వేపుళ్లు, రోస్ట్‌ చేయడం అనారోగ్యకరమైన పద్ధతులు. ఉదాహరణకు మాంసాహారం లేదా కొన్ని శాకాహారాల్లో డీప్‌ ఫ్రైలు, రోస్ట్‌లు చేయడం క్యాన్సర్‌కు కారణం కావచ్చు.

ఎందుకంటే... ఇలా డీప్‌ ఫ్రై లేదా రోస్ట్‌ చేసే సమయంలో ఆహార పదార్థాల్లోంచి ముఖ్యంగా మాంసాహారం నుంచి ‘హెటెరోసైక్లిక్‌ అరోమాటిక్‌ అమైన్స్‌’ (హెచ్‌ఏఏ) అనే క్యాన్సర్‌ కలిగించే హానికరమైన రసాయనాలు వెలువడవచ్చు. అందుకే ఎప్పుడో ఓసారి చాలా కొద్దిమోతాలో జిహ్వను సంతృప్తిపరచేందుకు తప్ప... అతిగా వేయించే వేపుళ్లు, రోస్ట్‌లకు వీలైనంత దూరంగా ఉండటమే మంచిది. 

క్యాన్సర్ల ‘నిల్వ’ వద్దు ...
తినే పదార్థాలను నిల్వ చేసుకుని, అవసరం ఉన్నప్పుడల్లా వినియోగించుకోవడం అనాదిగా మనమంతా పాటిస్తున్న పద్ధతే. ఉదాహరణకు పచ్చళ్లు, బేకరీ పదార్థాలు, ఫాస్ట్‌ఫుడ్‌ను ఎక్కువగా నిల్వ చేస్తుంటారు. చాలాకాలం పాటు తినేపదార్థాలు నిల్వ ఉంచడం కోసం కొన్ని రసాయనాలు వాడుతుంటారు.  వెన్న, నెయ్యి చాలాకాలం పాటు ఉంటే చెడిపోతాయి. అలాగే వాటితో చేసిన పదార్థాలూ చాలాకాలం నిల్వ ఉంటే పాడైపోతాయి. అందుకే ‘మార్జరిన్‌’ అనే పదార్థాన్ని నూనె, వెన్న, నెయ్యికి ప్రత్యామ్నాయం గా వాడుతుంటారు.

కానీ మార్జరిన్‌ చెడు కొవ్వులను పెంచి మంచికొవ్వులను బాగా తగ్గిస్తుంది. అలాగే నిల్వ ఉంచేందుకు తోడ్పడే అనేక రసాయనాల్లో దేహానికి హానిచేసే పదార్థాలు ఉంటాయి. దాదాపు ఇవన్నీ క్యాన్సర్‌ ముప్పును పెంచుతాయి. ఇక మాంసాహారాన్ని చాలాకాలంపాటు నిల్వ ఉంచేందుకు ‘స్మోకింగ్‌’ అనే ప్రక్రియను అనుసరిస్తారు. ఇలా చేసేప్పుడు ‘పాలీ సైక్లిక్‌ అరోమాటిక్‌ హైడ్రోకార్బన్స్‌’  (పీఏహెచ్‌స్‌) అనే రసాయనాలు ఏర్పడతాయి. ఇవి కూడా క్యాన్సర్‌ కారకాలే. మనం పెట్టుకునే ఊరగాయల్ని ఏడాదంతా నిల్వ ఉంచడానికి ఎక్కువ మోతాదులో ఉప్పు వాడతారు.

దాంతో కడుపు లోపలి పొరలు ఒరుసుకుపోవడం, అలాగే ఆ భాగాల్లో నైట్రేట్ల దుష్ప్రభావంతో క్యాన్సర్‌కు అవకాశాలెక్కువ. కడుపులోని యాసిడ్‌ అన్నింటినీ చంపేసినా ‘హెలికోబ్యాక్టర్‌  పైలోరీ’ అనే సూక్ష్మక్రిమిని మాత్రం చంపలేదు. ‘హెచ్‌. పైలోరీ’ వల్ల పొట్టక్యాన్సర్లు వచ్చే ముప్పు ఎక్కువ. అందుకే వంటచేయడం, నిల్వచేయడం, తినడం... ఈ మూడు పద్ధతుల్లోని ఆరోగ్యకరమైన మార్గాలు క్యాన్సర్‌ నివారణకు చాలా ముఖ్యమని తెలుసుకోవడం అందరికీ అవసరం.

-డాక్టర్‌ సీహెచ్‌. మోహన వంశీ
చీఫ్‌ సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌, ఒమేగా హాస్పిటల్స్‌, హైదరాబాద్‌
Ph: 98480 11421, 
Kurnool 08518273001

చదవండి: Badam Health Benefits: రాత్రంతా నీళ్లలో నానబెట్టి బాదం పొట్టు తీసి తింటున్నారా? వేటమాంసం తిన్న తర్వాత వీటిని తిన్నారంటే..
Jeedipappu Health Benefits: జీడిపప్పును పచ్చిగా తింటున్నారా..! సంతానలేమితో బాధపడే వారు పిస్తాతో పాటు వీటిని తింటే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement