ఆరోగ్యం కోసం మంచి సమతుల్య ఆహారం తీసుకోవడమే మేలు. కానీ ఒక్కోసారి జిహ్వ చాపల్యం చంపుకోలేక ఇష్టమైన జంక్ ఫుడ్‌ని లాగించేస్తాం. పైగా ఏదో అప్పుడప్పుడే కదా అని సర్ది చెప్పుకుని మరీ తినేస్తాం. ఆ తర్వాత వర్కౌట్‌లు చేసి అదనపు కేలరీలను తగ్గించే యత్నం చేస్తాం. కానీ ఇలా తినడం వల్ల మన శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో ప్రయోగాత్మకంగా తెలియజేశాడు ఓ యూట్యూబర్. అందుకోసం అతడు ఏం చేశాడంటే..
ఫిట్‌నెస్ కంటెంట్ క్రియేటర్ అయిన 30 ఏళ్ల కెనడియన్ టెన్నిసన్ ఓ విచిత్రమైన ఫుడ్ ఛాలెంజ్‌ని తీసుకున్నాడు. ఆయన 50 గంటల ఫాస్ట్ ఫుడ్ మారథాన్ సవాలును స్వీకరించాడు. అందుకోసం తన బ్రేక్‌ఫాస్ట్ నుంచి లంచ్, డిన్నర్‌తో సహా మొత్తం ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్డ్ ఐటెమ్స్ వంటివి మాత్రేమ తీసుకున్నాడు. వాటిలో తృణధాన్యాలు, పెరుగు వంటివి కూడా ఉన్నాయి.
తొలిరోజు అలాంటి ఫుడ్ తింటూ 8 వేల కేలరీలను వినియోగించినట్లు పేర్కొన్నాడు. ఈ ఆహారం కారణంగా తన మానసిస్థితి, శక్తి స్థాయిలోని ప్రతికూల భావాలను గుర్తించినట్లు తెలిపాడు. రెండో రోజు కూడా ఇలానే తినడం వల్ల గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడ్డట్లు తెలిపాడు. ఎక్కువ మొత్తంలో కేలరీలను పెంచినప్పటికీ పోషకాహార లోపంతో ఇబ్బంది పడుతున్నట్లు వెల్లడించాడు. ఈ ఫుడ్ కారణంగా ముఖంపై మొటిమలు రావడం మొదలయ్యిందని వెల్లడించాడు.
ఆ తర్వాత కండరాలు తిమ్మిరిగా ఉండి బద్ధకంగా ఏదో తెలియని నీరసంతో ఇబ్బంది పడుతున్నట్లుగా అనిపించిందని వెల్లడించాడు. అలాగే ఈఫుడ్‌కి తగ్గట్టు చేయాల్సిన పదివేల స్టెప్స్‌కు బదులుగా తాను 4 వేల స్టెప్స్ నడిచినట్లు పేర్కొన్నాడు. ఈ రెండు రోజుల ఛాలెంజ్ తదనంతరం మూడో రోజు జిమ్‌సెషన్ అత్యంత భయంకరమైనది. ఎందుకంటే ఈ అధిక కేలరీల ఫుడ్ కారణంగా విపరీతమైన చెమట్లు పట్టి..వర్కౌట్లు చేయడం చాలా కష్టంగా అనిపించిందని చెప్పుకొచ్చాడు.
అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల కలిగే పరిణమాల గురించి తెలియజేసేందుకే ఈ 50 గంటల ఫాస్ట్ ఫుడ్ ఛాలెంజ్‌ని స్వీకరించానని యూట్యూబర్ వెల్లడించాడు. అందుకు సంబంధించిన వీడియోని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు ఆహారంతో మిళితమైన శారీరక సంబంధం గురించి చాలా క్లియర్‌గా వివరించి మరీ చెప్పారంటూ సదరు యూట్యూబర్‌ని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment