వసంతం తెచ్చిన చివురులతో అడవిలోని చెట్లు రకరకాల వర్ణాలతో పురుడు పోసుకుని వున్నాయి. పూలు పరిమళాలతో తేనెలూరుతూ వున్నాయి. ఆ అడవి మీదుగా ఆకాశంలో విహరిస్తూ వెళ్తూ వున్న మేఘనా«థుడు తన ప్రేయసి వనదేవతను చూసి మదిలో శాశ్వతంగా నిలిచిపోయే జ్ఞపకాలను మోసుకొనిపోతూ వున్నాడు. ఊరును దాటి ఆ అడవిలోనే పండు వెన్నెలంత వర్ణంలో ఉన్న ఒక ఆవు ఒంటరిగా గడ్డి మేస్తూ వుంది. అలా ఒంటరిగా గడ్డి మేస్తూ ఆ ఆవు అడవిలో చాలా దూరమే ప్రయాణించింది. ఇంతలో బాగా ఆకలిగా వున్న ఓ పెద్దపులి వేట కోసం వెదుకుతూ అటుగా వచ్చి ఆవును చూసింది. పులి అలికిడి విన్న ఆవు పులి కళ్లలోని ఆకలిని చూసి వెనువెంటనే ‘ఆగు పులిరాజా ఆగు.. ఒక్కమారు నా మాట ఆలకించు’ అంది.
‘నీ మాటలు ఆలకించే స్థితిలో లేను. ఈరోజు నిన్ను తిని నా ఆకలి బాధ తీర్చుకుంటాను’ అంటూ పులి తన పంజా విసిరింది. పులి పంజా నుండి తప్పించుకున్న ఆవు ‘అయితే తినే ముందు నా చివరి కోరిక తీర్చు’ అంది. ‘ఏమిటా కోరిక?’ ‘ఓ పులిరాజా.. నాకు ఓ యజమాని ఉన్నాడు. అతడు లోకం తెలియని వట్టి అమాయకుడు. కడు బీదవాడు. అతనికి నేనే జీవనాధారం. ఒకవేళ నేను ఇంటికి తిరిగిపోని యెడల అతడు నాపై దిగులుతో దుఃఖిస్తూ మరణిస్తాడు. కావున నేను ఇంటికి వెళ్లి నా యజమానికి ౖధైర్యం చెప్పి మరోవిధంగా జీవనాన్ని వెతుక్కోమని చెప్పి తిరిగి వస్తాను.’ ఆవు మాటలు విన్న పులి ఒక్కసారిగా పగలబడి నవ్వుతూ ‘నేనేమన్నా వెర్రిదాన్ననుకున్నావా.. నీ కల్లబొల్లి మాటలు విని దొరికిన ఆహారాన్ని విడిచిపెట్టడానికి?’ అంది.
‘అయ్యో రాజా.. ఇవి మాటలు కావు.. పరమ సత్యాలు. పరుల కొరకు జీవించని జన్మ దాహార్తికి పనికి రాని కడలి వంటిది. నీ ఆకలిని తీర్చబోయే నా దేహం నా జన్మకు కలిగిన గొప్ప వరమే. కాని ఈలోపు ఈ విషయం నా యజమానికి చెప్పడం నా బాధ్యత’ అంది.
ఆవు పలికిన మాటలకు పులి ఒక్క క్షణం మౌనంగా ఆలోచించి ‘శిశిరం చేసిన గాయాలకు ఓర్చి వసంతం కోసం ఎదురు చూసే వనంలా నీ కోసం ఎదురుచూస్తూ ఉంటాను. వెళ్ళి త్వరగా తిరిగి రా’ అంటూ ఆవుకు ఇంటికి వెళ్ళడానికి అనుమతి ఇచ్చింది. పులి మాటలకు సంతోషించిన ఆవు దానికి కృతజ్ఞతలు చెప్పి తన యజమాని వద్దకు బయలుదేరింది.
ఇంటి వద్ద గుడిసె ముందు ఒంటిపైన చొక్కా లేకుండా మొలకు చిన్న గుడ్డతో ఒంటరిగా కూర్చొని నులకతాడు పేనుకుంటూ వున్న యజమాని వేళకాని వేళలో దూరంగా వస్తూవున్న ఆవును చూసి ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత ఆవు అడవిలో జరిగినదంతా చెప్పాక ఒక్క క్షణం మౌనంగా వుంటూ ఏదో గుర్తుకు వచ్చిన వాడిలా తలను నెమ్మదిగా ఊపి ‘నువ్వు వెళ్ళి రా నీకు ఏమీ కాదు!’ అంటూ ఆవుకు ధైర్యం చెప్పాడు. ఆవు తన యజమాని సంయమనానికి సంతోషించి తిరిగి అడవికి బయలుదేరింది.ఇంటి బయట జరుగుతున్నదంతా ఇంటి లోపల నుండి గమనిస్తూ వున్న యజమాని భార్య వేగంగా భర్త వద్దకు వచ్చి ‘నీకేమన్నా మతిగాని పోయిందా? ఎవరైనా ఆవును పులి వద్దకు పంపుతారా సావడానికి! అసలే దానికి పుట్టిన లేగదూడ సచ్చిపోయె. ఇపుడు దాని పాలే మనకు జీవనాధారం’ అంటూ భర్తను కోప్పడింది.
‘ఓసి పిచ్చిదానా! నేనేమన్నా వెర్రివాడిననుకున్నావా? వెనకటికి మా తాతకి కూడా ఇదే విధంగా ఓ ఆవు ఉండేది. అయితే దానికి లేగదూడ కూడా ఉండేది. ఒకరోజు ఆ ఆవు మేత కోసం అడవికి వెళ్ళి పులికి చిక్కింది. అయితే ఆ ఆవు తనకు ఓ బిడ్డ ఉందని, అది మరీ పసిదని దానికి చివరిసారి పాలు ఇచ్చి తిరిగి వస్తానని పులిని బతిమిలాడి తన బిడ్డకు పాలు ఇవ్వడానికి ఇంటికి వచ్చింది. అయితే వేళకాని వేళలో ఇంటికి వచ్చిన ఆవును చూసిన మా తాత ‘ఏమయి ఉంటుందా?’ అని ఆలోచిస్తూ ఆవు వెనకాలే వెళ్ళాడు. అక్కడ ఆ ఆవు నిజాయితీకి మెచ్చి తినకుండా వదిలేసిన పులిని చూసి ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఆ ఆవుకు జరిగింది ఇప్పుడు తన మనవరాలుకు జరుగుతుంది. అదే తిరిగి వచ్చేస్తుందిలే’ అంటూ నులక తాడు పేనే పనిలో నిమగ్నమయ్యాడు.
యజమాని నుండి శాశ్వతంగా సెలవు తీసుకుని తనకు తానుగా పులికి ఆహారంగా మారడానికి అడవిలోకి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తూ వుంది ఆవు. ఆ అడవిలోనే ఓ కోయిల అక్కడి ప్రకృతి సౌందర్యానికి పరవశిస్తూ తన్మయత్వంలో మధురమైన రాగాలను ఆలపిస్తూ కొమ్మ నుండి కొమ్మకు దూకుతూ విహరిస్తూ ఆవును చూసింది. ‘ఓ అందగాడా.. నడిజాములో ఆ దివి నుండి ఈ భువిపై దిగిన జాబిల్లిలా ఉన్నావు. నన్ను ప్రేమించవూ?!’ అంటూ పలికింది. కోయిల మాటలు విన్న ఆవు మౌనంగా పక్కకు తప్పుకొని ఒంటరిగా ముందుకు నడుచుకుంటూ వెళ్తూ వుంది.
కోయిల ఎగరకుండా ఆవుతో పాటుగా నడుస్తూ వెళ్తూ వుంది. అలా అడవిలో చాలా దూరం ప్రయాణం చేశాయి. అప్పుడే ఓ నిండైన కారుమబ్బు ఆకాశంలో వెళ్తూ వుండటాన్ని చూసిన కోయిల రివ్వున ఎగురుకుంటూ వెళ్ళి అ మేఘాన్ని తన ఒంటికంతా పులుముకుని వేగంగా వచ్చి ఆవుపై వాలి తన రెండు రెక్కలను వింజామరలను విసిరినట్టు ఆవు మొహం మీద ఊపుతూ వుండగా కోయిల ఒంటికి పులుముకున్న మేఘం ముత్యపు చినుకులుగా ఆవు పై పడుతూ వుండగా ‘నింగీ నేలా సాక్షి.. నన్ను ప్రేమించవూ?!’ అంది కోయిల.
ఆవు మారుమాటలాడక కోయిల వంక కనురెప్పయినా వేయకుండా మౌనంగా ముందుకు నడుచుకుంటూ వెళ్తూ వుంది. కోయిల ఎగరటం మరచి ఆవుతోపాటు పక్కనే నడుస్తూ వుంది.
ఆ అడవిలో అవి రెండూ వేటికవే ఆలోచనల ప్రవాహంలో ఒంటరిగా సాగిపోతూ వున్నాయి. ఆ అడవిలోనే ఓ సెలయేరు గలగలలతో అడవి గుండె చప్పుడును లయబద్ధం చేస్తూ ప్రవహిస్తూ వుంది. దాని గట్టున ఆవు ఆగి ప్రవహిస్తూ వున్న ఆ సెలయేటిలో ప్రకృతిలోని నిత్య నూతనత్వాన్ని చూస్తూ వుంది. అలా ఆ ఆవును చూసిన కోయిల అలలు అలలుగా కదలిపోతూ వున్న యేటి వయ్యారాన్నంతా ఒంపుగా చేసుకొని నడుస్తూ ‘అలలనేం చూస్తావోయీ.. అలల మాటున దాగిన మనసు ఊసును చూడు. ఆకాశమంతా చినుకయి పోయి అవనిని ముద్దాడిన ప్రేమను చూడు. నా ప్రేమను చూసి నన్ను ప్రేమించవూ!?’ అంది కోయిల.
సూర్యుడు పడమటి కొండలను ముద్దాడుతూ దోబూచులాడే పనిలో వున్నాడు. ఇంతలో ఓ పచ్చని చిలుక అటుగా ఎగురుకుంటూ వచ్చి ఓ చెట్టు పై వాలి చుట్టూ చూస్తూ ఉంది. కొంత దూరంలో ఆవుతో పాటు పక్కనే నడుస్తూ వెళ్తూ వున్న కోయిలను చూసి దానికి ఆశ్చర్యం వేసింది ‘ఏమయి ఉంటుంది?!’ అని ఆవు కోయిలకు తెలియకుండా వాటి వెనకాలే ఎగురుకుంటూ వాటిని వెంబడించసాగింది.
రాత్రవుతూ ఉండగా పైన చెట్ల కొమ్మల మాటున నల్లని ఆకాశంలో పండు వెన్నెల, మిరుమిట్లు గొలిపే నక్షత్రాలు.. వాటి నుండి వస్తున్న కాంతిలో అడవిలో ముందుకు సాగిపోతూ వున్నాయి ఆవూ కోయిలా. చివరకు కోయిల ఆవుకు ఎదురుగా వచ్చి నిలబడి ‘నేను నల్లగా వున్నాననా నన్ను ప్రేమించడంలేదు!?’అంది.
‘లంగరు లేని ఒంటరి పడవ పయనం నా జీవితం. తీరం లేని ప్రవాహంలో కొట్టుకొని పోతున్నాను. తిరిగి రాలేను. నీవు అందమైన దానవు. కాలం చేసిన గాయాలు మాన్పి కొత్త చిగురులను పూయిస్తావు. ప్రపంచంలోని దుఃఖాన్నంతటినీ ఒంటికి పులుముకొని నూతన రాగాలతో కొత్త ఉషస్సును వెలిగిస్తావు’ అంటూ ఆవు అదే తొలిసారిగా అదే చివరిసారిగా కోయిలపై తనకున్న భావాన్ని చెప్పి, కోయిల నుండి సెలవు తీసుకుని ఒంటరిగా ముందుకు పయనమైంది. కోయిల ఒంటరిగా ఆవుని అలా చూస్తూ ఉండిపోయింది. ఇదంతా చెట్టు పై నుండి గమనిస్తూ వున్న చిలుక ఎగురుకుంటూ కోయిల ముందుకు వచ్చి వాలి ఎక్కడో దూరాన కనుమరుగౌతూ వున్న ఆవును చూస్తూ ‘ప్రేమ అందంగా ఉంటుంది కదూ’ అంటూ పలికింది. కోయిల చిలుక వైపు చూసి ‘ప్రేమ ఎప్పుడూ అందంగానే ఉంటుంది. కాని ప్రేమ కోసం చేసే నిరీక్షణలో ఆ ప్రేమ మరింత అందంగా ఉంటుంది’ అంది.
తన గమ్యానికి చేరే దారిలో అడ్డుపడే బంధాలు, మోహించే కోరికలను దాటుకుని ఆవు.. పులి ఉండే చోటుకు దగ్గరగా వెళ్తూ వుంది. ఇంతలో హఠాత్తుగా ఆకాశంలో పక్షులు భయంతో అరుచుకుంటూ ఎగురుతూ ఆవును దాటుకుని ముందుకు పరుగులు తీయసాగాయి. ఆవు వెళ్ళే దారిలో అడవి అంతా అలజడిగా మారింది. అడవిలోని జంతువులన్నీ ప్రాణభయంతో పరుగులు తీస్తూ, ఆవును దాటుకొని వేగంగా ముందుకు వెళ్తూ వున్నాయి. అక్కడి వాతావరణం వెచ్చగానూ దట్టమైన పొగతోనూ నిండి ఉంది. ఏమి జరుగుతున్నదో ఆవుకు ఏమీ అర్థం కాలేదు. అడవిలోని క్రూర జంతువులన్నీ తమకన్నా బలహీనమైన జంతువులతో ఉండే వైరాన్ని మరచి వాటిపై జాలి చూపుతూ అడవిని దహించి వేస్తూ తరుముకొస్తూ వున్న అగ్నిని చూపుతూ ‘తప్పించుకొని పారిపోండి... తప్పించుకొని పారిపోండి’ అంటూ అరుస్తూ ఉన్నాయి.
సరిగ్గా ఆ సమయంలో ఆవు పులికి ఎదురుగా వచ్చి నిల్చుంది. పులి ఆశ్చర్యపోయి ఆవును చూస్తూ ఉంది. ‘పులిరాజా! ఇక వచ్చి నన్ను తిని నీ ఆకలి తీర్చుకో’ అంది ఆవు.‘ఇచ్చిన మాటకు, చేసిన ప్రమాణానికి కట్టుబడి ఉండే నీలాంటి మిత్రుడిని కలుసుకున్నందుకు చాలా ఆనందంగా వుంది. నీలాంటి వారిని చంపి ఆకలి బాధ తీర్చుకునే కన్నా పస్తులతో మరణించడం మంచిది. మిత్రమా ఇక నువ్వు సంతోషంగా నీ యజమాని వద్దకు వెళ్ళి హాయిగా జీవించు’ చెప్పింది పులి. అప్పటికే మంటలు అడవినంతటినీ చుట్టుముట్టాయి. పులికి కొన్ని అడుగుల దూరంలో మంటలు నాలుకలు చాచి తరుముకుంటూ రావడం చూసిన ఆవు ‘రాజా ఏమిటిది? ఎవరు చేశారు ఇదంతా?’ అడిగింది.
‘మిత్రమా.. మనిషి! మనిషి చేశాడిదంతా! ఈ అడవిలో నగరాన్ని నిర్మిస్తాడట. అందుకే అగ్గి రాజేశాడు. ఈ అందమైన అడవి.. మన అడవి... ఆకలికి తప్ప అత్యాశకు చోటులేని అడవి.. ప్రేమను కోరే అడవి.. పరవశాల అడవి.. ఈ అడవిలో మనిషికి భాగం ఉండొచ్చుగాని పెత్తనం ఉంటుందా? అడవికి రాజైనా నేను పెత్తనం చేయనే! ఈ మనిషెంత పతనశీలి? మనల్ని ఖాళీ చేయించడానికి నిప్పు పెట్టాడు. త్వరపడు మిత్రమా త్వరపడు! ఇక్కడి నుండి బయటపడు’ అంటూ ఆవును త్వరపెడుతూ చుట్టూతా చూసింది పులి.మంటలు కమ్ముకున్నాయి. ‘అయ్యో.. మంటలు మనల్ని చుట్టుముట్టాయి. ఇక మనం తప్పించుకొని పోలేం. క్షమించు మిత్రమా.. నీ దుస్థితికి కారణం అయినందుకు!’ అంటూ ఆవుని క్షమాపణలు కోరింది పులి. తనకు దగ్గర పడుతున్న మంటలను చూసి ‘నీలాంటి మంచి మిత్రుడిని కలుసుకున్నందుకు సంతోషంగా వుంది’ అంది ఆవు పులితో.
‘నీలాంటి మిత్రుడితో కలసి ఈ క్షణాన్ని పంచుకుంటున్నందుకు గొప్ప సంతోషంగా ఉంది!’ అంది పులి ఆవుతో. మనిషి రాజేసిన అగ్ని అడవిని, అడవిలోని జంతువులతోపాటు ఆ ఇరువురినీ బూడిద చేసింది.ఆకాశంలోని సూర్యుడు దట్టంగా వ్యాపించి వున్న నల్లని పొగ మాటున చావు దుప్పటి కప్పుకుని తెల్లగా పాలిపోయి నిశ్చలంగా వేలాడుతూ ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment