ఆరోగ్యకరమైన ఆహారం లేదా పోషకాల విషయానికి వస్తే అందరికీ ముందుగా గుర్తు వచ్చేది ప్రోటీ న్లు, కాల్షియం లేదా విటమిన్లు. వీటిలో జింక్ ఒకటి. ఇది ఆహారం ద్వారా లభిస్తుంది. జింక్ లోపం ఉంటే ఆరోగ్యం దెబ్బతింటుంది. ముఖ్యంగా జుట్టు చిట్లడం, రాలడం అధికమవుతుంది. అకారణంగా జుట్టు రాలుతున్నా, జుట్టు పలుచబడుతున్నా జింక్ లోపమేమో అనుమానించాలి. ఇదే కాదు, శరీరంలో జింక్ లోపం ఉన్నప్పుడు ఇంకా ఎలాంటి లక్షణాలు ఉంటాయో, నివారణకు ఏం చేయాలో తెలుసుకుందాం.
మన శరీరానికి జింక్ చాలా అవసరం. రోగనిరోధక శక్తి, కణ విభజన, కణాల ఎదుగుదల, ప్రొటీన్లు, డీఎన్‌ఏ నిర్మాణం వంటి వాటికి దాదాపు 300 ఎంజైమ్‌లు అవసరం. ఆ ఎంజైమ్‌లను పనిచేసేలా చేయడం కోసం జింక్ అత్యవసరం. మనం తినే ఆహారంలో చాలా పరిమిత పరిమాణంలో జింక్ లభిస్తుంది. శరీరం జింక్‌ను నిల్వచేసుకోదు. అందుకే జింక్ లభించే ఆహారాన్ని రోజూ తినాలి. మగవారికి రోజూ 11 మిల్లీగ్రాముల జింక్ అవసరం అయితే, మహిళలకు 8 మిల్లీ గ్రాముల జింక్ అవసరం. అదే గర్భిణిలు, తల్లిపాలు ఇచ్చే మహిళలకు మాత్రం 12 మిల్లీ గ్రాములు అవసరం పడుతుంది. జింక్ లోపిస్తే శరీరంలో చాలా మార్పులు జరుగుతాయి. రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. జింక్ లోపాన్ని కొన్ని లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చు.
చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు, గాయాలైనప్పుడు రక్తం త్వరగా గడ్డ కట్టేలా చేసేందుకు జింక్ చాలా అవసరం. జింక్ లోపం ఏర్పడినప్పుడు గాయాలు తగిలినా అవి త్వరగా నయం కావు. అంతేకాదు ముఖంపై మొటిమలు వస్తాయి.
బరువు తగ్గడం..
జింక్ లోపం వల్ల జీర్ణశక్తిలో మార్పులు వస్తాయి. ఆకలి మందగిస్తుంది. ఆహారం తినాలనిపించదు. ఫలితంగా బరువు తగ్గిపోతారు. ఇలా పోషకాల లోపం వల్ల బరువు తగ్గడంతో అనేక ఆరోగ్యసమస్యలు ఉత్పన్నమవుతాయి.
జుట్టు రాలిపోవడం..
జింక్ లోపం వల్ల జుట్టు చిట్లడం, రాలడం అధికమవుతుంది కాబట్టి అకారణంగా జుట్టు అధికంగా రాలుతున్నా, జుట్టు పలుచబడుతున్నా జింక్ లోపమేమో అనుమానించాలి. దానికి సంబంధించిన సప్లిమెంట్స్ తీసుకుని సమస్య సద్దుమణిగితే నిశ్చింతగా ఉండవచ్చు.
తరచూ జలుబు..
జింక్ తగ్గితే రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. దాని వల్ల తరచూ జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఎక్కువ. తరచూ మీకు జలుబు చేస్తున్నా, అనారోగ్యం బారిన పడుతున్నా జింక్ లోపం ఉందేమో చూసుకోవాలి. జింక్ తగినంత అందితే జలుబు తగ్గుతుంది.
చూపు మసక బారడం..
ఆరోగ్యకరమైన చూపుకు జింక్ చాలా అవసరం. శరీరానికి తగినంత జింక్ అందనప్పుడు దృష్టి మందగిస్తుంది. మసకగా కనిపిస్తుంది. అస్పష్టంగా అనిపిస్తుంది. జింక్, విటమిన్ ఎ ఆరోగ్యకరమైన చూపును ఇస్తాయి కాబట్టి శరీరంలో జింక్ లోపిస్తే చూపు మసకబారుతుంది.
గందరగోళం..
మీకు మనసు, ఆలోచనలు గందరగోళంగా ఉన్నాయా? అయితే జింక్ లోపం ఉందేమో చూసుకోండి. జింక్ తగినంత అందకపోతే మెదడు సరిగా పనిచేయదు. పనిపై ఏకాగ్రత్ కుదరదు. జ్ఞాపకశక్తి సమస్యలకు కూడా తలెత్తుతాయి.
సంతానోత్పత్తిపై ప్రభావం..
జింక్ లోపం పురుషులకు చాలా ఇబ్బందిని కలిగిస్తుంది. దీనివల్ల పురుషుల సంతానోత్పత్తి ప్రభావితమవుతుంది. మీరు తండ్రి కావాలనుకుంటే తప్పనిసరిగా జింక్ తీసుకోవడంపై శ్రద్ధ వహించాలి. తగినంత పరిమాణంలో జింక్ తీసుకోని పురుషులు తండ్రి కావడానికి చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
రోగనిరోధక శక్తి బలహీనం..
శరీరానికి సంబంధించి అనేక విధులకు జింక్ అవసరమవుతుంది. ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. మళ్లీ మళ్లీ అనారోగ్యం బారిన పడకుండా కాపాడుతుంది. అయితే జింక్ లోపం ఉంటే అది రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది కాబట్టి లోప నివారణకు సప్లిమెంట్లు తీసుకోక తప్పదు.
ఇలా నివారించాలి..
జింక్ లోప నివారణకు శనగలు, గింజ ధాన్యాలు, పుచ్చగింజలు, జనపనార గింజలు, ఓట్స్, జీడిపప్పు, పెరుగు, డార్క్ చాకొలెట్లను తీసుకోవాలి. వైద్యుల సలహా మేరకు విటమిన్ సప్లిమెంట్లు కూడా తీసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment