అస్వతంత్ర స్వతంత్రుడు | Bandaru Srinivasa Rao Article On Konijeti Rosaiah | Sakshi
Sakshi News home page

అస్వతంత్ర స్వతంత్రుడు

Published Sun, Dec 5 2021 2:53 AM | Last Updated on Sun, Dec 5 2021 2:53 AM

Bandaru Srinivasa Rao Article On Konijeti Rosaiah - Sakshi

తొలిసారి చంద్రబాబు నాయుడు ముఖ్య మంత్రి అయినప్పుడు, మళ్ళీ తరువాత రోశయ్య ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించి నప్పుడు, వారికి ముందున్న ముఖ్య మంత్రులు– అంటే నందమూరి తారక రామా రావు, రాజశేఖరరెడ్డి ఇరువురు కూడా ప్రజల మనస్సులను ముందు గెలుచుకుని తరువాత ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చినవారే. ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిన పథకాలే కాకుండా, అధికారంలోకి వచ్చిన తరువాత కూడా అనేక ప్రజాకర్షక పథకాలను ప్రకటించి, అమలు చేసిన ఘనత వారిది. తాము మాత్రమే వాటిని అమలు చేయగలరన్న విశ్వాసాన్ని ప్రజల్లో కలిగించి, పార్టీ శ్రేణుల్లో ఆత్మ విశ్వాసాన్ని రగిలించి అధికార పీఠం అధిరోహించిన చరిత్ర కూడా వారిదే.

పోతే, ఇక ప్రస్తుతానికి వస్తే, ఒక విపత్కర, అనూహ్య దారుణ సంఘటన కారణంగా రాష్ట్రం యావత్తూ చేష్టలుడిగివున్న పరిస్థితిలో కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం, హెలికాప్టర్‌ దుర్ఘటనలో మరణించిన రాజ శేఖరరెడ్డి స్థానంలో, వయస్సు పైబడుతున్న కారణంగా క్రమేపీ రాజకీయాల నుంచి తప్పుకోవాలన్న నిర్ణయానికి ఏనాడో వచ్చి, ఆ దృష్టి తోనే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా శాసన మండలికి పరిమితమై మంత్రిమండలిలో సీనియర్‌ సభ్యుడిగా కొనసాగుతున్న రోశయ్యను ముఖ్యమంత్రిగా నామినేట్‌ చేసింది. ఈ విషయంలో ఆయన ఎంతో అదృష్టవంతుడైన కాంగ్రెస్‌ నాయకుడనే చెప్పాలి.

ఎందుకంటే, రాజకీయాల్లో ఈనాడు ఎంతో ప్రధానంగా పరిగణిస్తున్న కులం, ధనం, వర్గం వీటిల్లో ఏ కోణం నుంచి చూసినా, ఏ రకమయిన ప్రాథమిక అర్హతా లేకుండా, రోజు రోజుకూ మీదపడుతున్న వయస్సు ఒక అడ్డంకి కాకుండా, అధిష్ఠాన దేవతలను ప్రసన్నం చేసుకునేందుకు ఛోటా మోటా కాంగ్రెస్‌ నాయకులందరూ హస్తిన చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన సంప్రదాయం బలంగా వేళ్ళూనుకునివున్న పార్టీలో ఉంటూ కూడా, ఢిల్లీలో ఒక్క మారు కూడా కాలుపెట్టకుండా ముఖ్య మంత్రి పీఠం ఎక్కగలిగారంటే ఆయనకు వున్న సీనియారిటీకి తోడు అదృష్టం కూడా కలిసివచ్చిందనే అనుకోవాలి. ఈ వాస్తవాన్ని బయట వారు కాకుండా ఆయనే స్వయంగా పలుమార్లు ప్రస్తావించడం గమనార్హం. 

ఇటు ప్రభుత్వాన్నీ, అటు పార్టీ అధిష్ఠానాన్నీ తన కనుసన్నల్లో ఉంచుకోగల శక్తియుక్తులు, ప్రతిభా సామర్థ్యాలు కలిగిన రాజశేఖర రెడ్డి వారసుడిగా పాలన సాగించడం అంటే కత్తి మీద సాము అన్న వాస్తవం తెలిసిన మనిషి కనుక, పార్టీలో ఎవరు ఏమిటీ? అన్న విష యాలు పుక్కిట పట్టిన దక్షుడు కనుక, అధిష్ఠానం మనసెరిగి మసలుకునే తత్వం ఒంటబట్టించుకున్న వ్యవహారశీలి కనుక, బలం గురించి బలహీనతల గురించి స్పష్టమయిన అంచనాలు వేసుకోగలి గిన సమర్థుడు కనుక, అన్నింటికీ మించి రాజకీయాలలో ‘కురు వృద్ధుడు’, ‘పెద్దమనిషి’ అన్న ముద్ర ఉన్నవాడు కనుక పరిశీలకులు తొలినాళ్ళలో ఊహించిన స్థాయిలో ఆయన పట్ల వ్యతిరేకత పెద్దగా వెల్లువెత్తలేదు.

కాకలు తీరిన నాయకులకు ఏ మాత్రం కొదవలేని కాంగ్రెస్‌ పార్టీలోని సహజసిద్ధ వర్గ రాజకీయాలు సైతం, రోశయ్య ముఖ్య మంత్రిత్వానికి ఎవరూ ఎసరు పెట్టకుండా కాపాడుకుంటూ వచ్చాయి. మూన్నాళ్ళ ముఖ్యమంత్రి అనీ, మూన్నెళ్ల ముఖ్యమంత్రి అనీ ఎవరెన్ని రాగాలు తీసినా, మంత్రులను మార్చకుండా, వైఎస్సార్‌ పథకాలను ఏమార్చకుండా గుంభనగా నెట్టుకొస్తూనే వచ్చారు. కనీవినీ ఎరుగని ప్రకృతి వైపరీత్యాలు, ప్రాంతీయ ఉద్యమాలు రాష్ట్రాన్ని చుట్టు ముట్టినా, ఆయన తనదైన శైలిలో నిబ్బరంగా పాలనపై క్రమంగా పట్టుబిగించే ప్రయత్నం చేశారు. 

వై.ఎస్‌. మరణం తర్వాత ముఖ్యమంత్రిగా రోశయ్య చేసిన నియామకాలు వేళ్ళమీద లెక్కపెట్టదగినవే. కానీ వాటి విషయంలో ఆయన ఎవరినీ సంప్రదించి చేసిన దాఖలాలు లేవు. ఉదాహరణకు ప్రెస్‌ అకాడమి చైర్మన్‌గా తిరుమలగిరి సురేంద్రను, సాంస్కృతిక మండలి అధ్యక్షునిగా రమణమూర్తిని, ఏపీఐఐడీసీ అధినేతగా శివ సుబ్రమణ్యంను నియమిస్తూ జారీ చేసిన ఆదేశాలు ఈ కోవలోకే వస్తాయి. అలాగే, జర్నలిస్టు సంఘాలన్నీ ముక్తకంఠంతో వద్దన్నప్పటికీ విజయవాడ పోలీసు కమిషనరుగా పీఎస్సార్‌ ఆంజనేయులును బదిలీ చేసిన తీరును కూడా ఈ సందర్భంలో గుర్తుచేసుకోవచ్చు.

ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగాలని కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా రోశయ్య పల్లెత్తు మాట అనకుండా సుశిక్షితుడైన పార్టీ కార్యకర్తగా ఆ ఆదేశాన్ని ఔదల దాల్చారు. బహుశా ఆయనలోని ఈ సుగుణాన్ని గుర్తించే కాబోలు తమిళనాడు వంటి ప్రధానమైన రాష్ట్రానికి గవర్నర్‌గా నియమించారు. కేంద్రం మీద కాలు దువ్వే తత్వం కలిగిన నాటి ముఖ్యమంత్రి జయలలితతో ఎలాంటి పొరపొచ్చాలకూ తావు రాకుండా చూసు కుంటూ, పదవికి మాట రాకుండా పదవీ కాలాన్ని జయప్రదంగా పూర్తి చేయడం ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవానికి అద్దం పడుతుంది. దాదాపు నలభై ఏళ్ళపాటు సన్నిహిత  పరిచయం వున్న రోశయ్య మరణం నాకు తీరని బాధ కలిగిస్తోంది.


భండారు శ్రీనివాసరావు,
సీనియర్‌ పాత్రికేయులు
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement