bandaru srinivasarao
-
జేమ్స్ బాండ్ సినిమా తరహాలో ప్రతీకారం తీర్చుకున్న అమెరికా
అల్‌ఖైదా అగ్రనేత అల్ జవాహిరీని అమెరికా వేటాడి, వెంటాడి ప్రాణాలు తీసిన వార్త కొంచెం ఆలస్యంగా వెలుగు చూసింది. గురికి బారెడు దూరంలో ఉన్న ఆస్తులకు, మనుషులకు ఏమాత్రం హాని కలిగించకుండా కేవలం లక్ష్యాన్ని మాత్రమే చేధించగల ఆధునిక క్షిపణి సాయంతో, అఫ్గానిస్తాన్‌లో తలదాచుకున్న ఆ ఉగ్రవాదిని మట్టుబెట్టింది. ఇరవై ఏళ్ళ క్రితం 2001 సెప్టెంబర్ 11 తేదీన (9/11) అప్పటి అల్‌ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ కారణంగా జరిగిన దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన 2,997 మంది అమెరికన్ కుటుంబాల బాధకు, ఆవేదనకు జవాహిరీ మరణం ఓ ముగింపు అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. 9/11గా ప్రసిద్ధమైన ఆనాటి విధ్వంసానికి ప్రతీకారంగా, అమెరికా పదేళ్ల తర్వాత, 2011లో బిన్ లాడెన్‌ను వధించి పగ తీర్చుకుంది. అప్పట్లో లాడెన్‌కు కుడి భుజంగా వ్యవహరించిన జవాహిరీని కూడా వదిలిపెట్టలేదు. మరో పదేళ్ల తర్వాత ఇప్పుడు అల్ జవాహిరీని చంపి, తమది పాము పగ అని అమెరికా యావత్ ప్రపంచానికీ మరోమారు చాటి చెప్పింది. ఈ నేపథ్యంలో గతంలో ఏం జరిగిందో చూద్దాం. ‘మతం కోసం ఎలాంటి మారణహోమానికి అయినా సిద్ధం’ అనే సిద్ధాంతం అల్‌ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్‌ది. ‘ప్రపంచం మీద పెత్తనం కోసం ఎంతటి దురాగతానికయినా సంసిద్ధం’ అనే తత్వం అమెరికాది. ‘పాముకు పాలుపోసి పెంచుతాను, కానీ ఆ పాము తనను తప్ప ఎవరిని కాటేసినా ఫరవాలేదు అనే థియరీ’ అమెరికాది. ‘కోరల్లో దాచుకున్న విషం కక్కేటప్పుడు స్వపర భేదాల ప్రసక్తి పనికి రాదనే భావజాలం’ ఒసామాది. ఒకానొక కాలంలో అమెరికా తన అవసరాల కోసం పెంచి పోషించిన ఒసామా బిన్ లాడెన్ అనే ఈ విషనాగు, ఇరవై ఏళ్ళ క్రితం అమెరికాపైనే ఎదురుతిరిగి, పాలు పోసి పెంచిన చేతినే కాటేసింది. సోవియట్ యూనియన్ అంతర్ధానం తరువాత ఏర్పడ్డ ఏకధృవ ప్రపంచానికి... లేని పెద్దరికాన్ని ఆపాదించుకుని అనేక అకృత్యాలకు పాల్పడుతున్న అమెరికా అహంభావాన్ని... బిన్ లాడెన్ తనదైన శైలిలో దెబ్బ తీశాడు. అప్పుడు కానీ ‘పాము – పాలు’ కథ లోని అంతరార్థం అమెరికాకు అవగతం కాలేదు. తన దాకా వస్తేగాని తత్వం బోధపడదన్నట్టుగా... అల్‌ఖైదా తీవ్ర వాదులు 2001, సెప్టెంబర్ 11న వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట టవర్లను విమానాలతో ఢీ కొట్టించి కనీ వినీ ఎరగని భయోత్పాతాన్ని సృష్టించిన ఘటన తర్వాత గానీ ఉగ్రవాదం వల్ల పొంచి వున్న ముప్పు ఎలా ఉంటుందన్నది అమెరికాకు అర్థం కాలేదు. ఆనాటి పరాభవం అమెరికాలో పట్టుదలను పెంచింది. ఆ దురాగతానికి రూపశిల్పి అయిన ఒసామా బిన్ లాడెన్ అంతం చూడడానికి దశాబ్ద కాలంగా అమెరికా చేయని ప్రయత్నం అంటూ లేదు. చిట్టచివరికి, పదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, పాకిస్తాన్ భూభాగంలో ఆ దేశ పాలకులకే తెలియకుండా తలదాచుకుంటున్న ఒసామా బిన్ లాడెన్‌ను, జల్లెడ పట్టి గాలించి పట్టుకుని మట్టు పెట్టేదాకా మాజీ అగ్ర రాజ్యాధినేత బరాక్ హుస్సేన్ ఒబామాకు కంటిమీద కునుకు లేకుండాపోయింది. ఒసామా మరణించిన విషయాన్ని స్వయంగా అమెరికన్ అధ్యక్షుడే ప్రకటించిన అంశాన్ని గమనిస్తే ఈ విషయానికి ఆ దేశం ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో విశదమవుతుంది. లాడెన్ మరణ వార్తను ధృవ పరచుకోవడానికి వీలుగా అమెరికా వ్యూహకర్తలు పకడ్బందీగా అమలు చేసిన హైటెక్ పద్ధతులు టీవీల్లో చూసినవారికి జేమ్స్ బాండ్ సినిమాలు జ్ఞప్తికి వచ్చాయి. వైట్ హౌస్‌లో కూర్చుని పథకం అమలవుతున్న తీరు తెన్నులను ఎప్పటి కప్పుడు ఉపగ్రహ సాయంతో గమనిస్తున్న ప్రెసిడెంట్ ఒబామా హావభావాలను బట్టి అన్ని దేశాలలోని టీవీ వీక్ష కులూ లాడెన్ మృతి పట్ల ఆ దేశానికి వున్న పట్టుదలను అర్థం చేసుకోగలిగారు. (క్లిక్: జవహరీ మృతిపై తాలిబన్ల సంచలన ప్రకటన) ఒసామా బిన్ లాడెన్ పూర్వీకులు ఎమెన్‌లో కడు నిరుపేదలు. అతడి తండ్రి మహమ్మద్ బిన్ లాడెన్, ఎమెన్ నుంచి ఉదర పోషణార్థం సౌదీ అరేబియాకు వలస వెళ్లి నిర్మాణ రంగంలో కాలుపెట్టి కోట్లకు పడగలెత్తాడు. గల్ఫ్ యుద్ధం సహాయక చర్యల్లో భాగంగా... అమెరికా మిలిటరీ స్థావరం ఏర్పాటుకు సౌదీ ప్రభుత్వం తన భూభాగంలో అనుమతించడాన్ని ఒసామా విమర్శించాడు. దీంతో కోపగించిన సౌదీ ప్రభుత్వం అతడి పౌరసత్వాన్నీ, పాస్‌పోర్ట్‌నూ రద్దు చేసింది. అప్పటికే లాడెన్ కుటుంబం కూడా ఒసామాను తమ నుంచి వెలి వేసింది. ఆ తర్వాత ప్రపంచంలోనే భయంకర ఉగ్రవాదిగా తయారయ్యి అమెరికా చేతిలో హతుడయ్యాడు. ఒసామా తర్వాత అల్‌ఖైదా పగ్గాలు చేపట్టిన అల్ జవాహిరీ కూడా లాడెన్ తరహాలోనే మరణించడం కాకతాళీయం. - భండారు శ్రీనివాసరావు సీనియర్ జర్నలిస్ట్ -
అస్వతంత్ర స్వతంత్రుడు
తొలిసారి చంద్రబాబు నాయుడు ముఖ్య మంత్రి అయినప్పుడు, మళ్ళీ తరువాత రోశయ్య ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించి నప్పుడు, వారికి ముందున్న ముఖ్య మంత్రులు– అంటే నందమూరి తారక రామా రావు, రాజశేఖరరెడ్డి ఇరువురు కూడా ప్రజల మనస్సులను ముందు గెలుచుకుని తరువాత ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చినవారే. ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిన పథకాలే కాకుండా, అధికారంలోకి వచ్చిన తరువాత కూడా అనేక ప్రజాకర్షక పథకాలను ప్రకటించి, అమలు చేసిన ఘనత వారిది. తాము మాత్రమే వాటిని అమలు చేయగలరన్న విశ్వాసాన్ని ప్రజల్లో కలిగించి, పార్టీ శ్రేణుల్లో ఆత్మ విశ్వాసాన్ని రగిలించి అధికార పీఠం అధిరోహించిన చరిత్ర కూడా వారిదే. పోతే, ఇక ప్రస్తుతానికి వస్తే, ఒక విపత్కర, అనూహ్య దారుణ సంఘటన కారణంగా రాష్ట్రం యావత్తూ చేష్టలుడిగివున్న పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం, హెలికాప్టర్ దుర్ఘటనలో మరణించిన రాజ శేఖరరెడ్డి స్థానంలో, వయస్సు పైబడుతున్న కారణంగా క్రమేపీ రాజకీయాల నుంచి తప్పుకోవాలన్న నిర్ణయానికి ఏనాడో వచ్చి, ఆ దృష్టి తోనే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా శాసన మండలికి పరిమితమై మంత్రిమండలిలో సీనియర్ సభ్యుడిగా కొనసాగుతున్న రోశయ్యను ముఖ్యమంత్రిగా నామినేట్ చేసింది. ఈ విషయంలో ఆయన ఎంతో అదృష్టవంతుడైన కాంగ్రెస్ నాయకుడనే చెప్పాలి. ఎందుకంటే, రాజకీయాల్లో ఈనాడు ఎంతో ప్రధానంగా పరిగణిస్తున్న కులం, ధనం, వర్గం వీటిల్లో ఏ కోణం నుంచి చూసినా, ఏ రకమయిన ప్రాథమిక అర్హతా లేకుండా, రోజు రోజుకూ మీదపడుతున్న వయస్సు ఒక అడ్డంకి కాకుండా, అధిష్ఠాన దేవతలను ప్రసన్నం చేసుకునేందుకు ఛోటా మోటా కాంగ్రెస్ నాయకులందరూ హస్తిన చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన సంప్రదాయం బలంగా వేళ్ళూనుకునివున్న పార్టీలో ఉంటూ కూడా, ఢిల్లీలో ఒక్క మారు కూడా కాలుపెట్టకుండా ముఖ్య మంత్రి పీఠం ఎక్కగలిగారంటే ఆయనకు వున్న సీనియారిటీకి తోడు అదృష్టం కూడా కలిసివచ్చిందనే అనుకోవాలి. ఈ వాస్తవాన్ని బయట వారు కాకుండా ఆయనే స్వయంగా పలుమార్లు ప్రస్తావించడం గమనార్హం. ఇటు ప్రభుత్వాన్నీ, అటు పార్టీ అధిష్ఠానాన్నీ తన కనుసన్నల్లో ఉంచుకోగల శక్తియుక్తులు, ప్రతిభా సామర్థ్యాలు కలిగిన రాజశేఖర రెడ్డి వారసుడిగా పాలన సాగించడం అంటే కత్తి మీద సాము అన్న వాస్తవం తెలిసిన మనిషి కనుక, పార్టీలో ఎవరు ఏమిటీ? అన్న విష యాలు పుక్కిట పట్టిన దక్షుడు కనుక, అధిష్ఠానం మనసెరిగి మసలుకునే తత్వం ఒంటబట్టించుకున్న వ్యవహారశీలి కనుక, బలం గురించి బలహీనతల గురించి స్పష్టమయిన అంచనాలు వేసుకోగలి గిన సమర్థుడు కనుక, అన్నింటికీ మించి రాజకీయాలలో ‘కురు వృద్ధుడు’, ‘పెద్దమనిషి’ అన్న ముద్ర ఉన్నవాడు కనుక పరిశీలకులు తొలినాళ్ళలో ఊహించిన స్థాయిలో ఆయన పట్ల వ్యతిరేకత పెద్దగా వెల్లువెత్తలేదు. కాకలు తీరిన నాయకులకు ఏ మాత్రం కొదవలేని కాంగ్రెస్ పార్టీలోని సహజసిద్ధ వర్గ రాజకీయాలు సైతం, రోశయ్య ముఖ్య మంత్రిత్వానికి ఎవరూ ఎసరు పెట్టకుండా కాపాడుకుంటూ వచ్చాయి. మూన్నాళ్ళ ముఖ్యమంత్రి అనీ, మూన్నెళ్ల ముఖ్యమంత్రి అనీ ఎవరెన్ని రాగాలు తీసినా, మంత్రులను మార్చకుండా, వైఎస్సార్ పథకాలను ఏమార్చకుండా గుంభనగా నెట్టుకొస్తూనే వచ్చారు. కనీవినీ ఎరుగని ప్రకృతి వైపరీత్యాలు, ప్రాంతీయ ఉద్యమాలు రాష్ట్రాన్ని చుట్టు ముట్టినా, ఆయన తనదైన శైలిలో నిబ్బరంగా పాలనపై క్రమంగా పట్టుబిగించే ప్రయత్నం చేశారు. వై.ఎస్. మరణం తర్వాత ముఖ్యమంత్రిగా రోశయ్య చేసిన నియామకాలు వేళ్ళమీద లెక్కపెట్టదగినవే. కానీ వాటి విషయంలో ఆయన ఎవరినీ సంప్రదించి చేసిన దాఖలాలు లేవు. ఉదాహరణకు ప్రెస్ అకాడమి చైర్మన్‌గా తిరుమలగిరి సురేంద్రను, సాంస్కృతిక మండలి అధ్యక్షునిగా రమణమూర్తిని, ఏపీఐఐడీసీ అధినేతగా శివ సుబ్రమణ్యంను నియమిస్తూ జారీ చేసిన ఆదేశాలు ఈ కోవలోకే వస్తాయి. అలాగే, జర్నలిస్టు సంఘాలన్నీ ముక్తకంఠంతో వద్దన్నప్పటికీ విజయవాడ పోలీసు కమిషనరుగా పీఎస్సార్ ఆంజనేయులును బదిలీ చేసిన తీరును కూడా ఈ సందర్భంలో గుర్తుచేసుకోవచ్చు. ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగాలని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా రోశయ్య పల్లెత్తు మాట అనకుండా సుశిక్షితుడైన పార్టీ కార్యకర్తగా ఆ ఆదేశాన్ని ఔదల దాల్చారు. బహుశా ఆయనలోని ఈ సుగుణాన్ని గుర్తించే కాబోలు తమిళనాడు వంటి ప్రధానమైన రాష్ట్రానికి గవర్నర్‌గా నియమించారు. కేంద్రం మీద కాలు దువ్వే తత్వం కలిగిన నాటి ముఖ్యమంత్రి జయలలితతో ఎలాంటి పొరపొచ్చాలకూ తావు రాకుండా చూసు కుంటూ, పదవికి మాట రాకుండా పదవీ కాలాన్ని జయప్రదంగా పూర్తి చేయడం ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవానికి అద్దం పడుతుంది. దాదాపు నలభై ఏళ్ళపాటు సన్నిహిత పరిచయం వున్న రోశయ్య మరణం నాకు తీరని బాధ కలిగిస్తోంది. భండారు శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
అనంత ఏకాంతంలో ‘లోపలి మనిషి’
పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నం తకాలం అందరూ ‘ఆహా! ఓహో!!’ అన్నారు. పీకలలోతు సమస్యల్లో కూరుకుపోయివున్న దేశ ఆర్థిక వ్యవస్థను నూతన సంస్కరణలతో ఒడ్డున పడేసిన మేధావిగా కీర్తించారు. సంఖ్యా బలం బొటాబొటిగా ఉన్న పాలకపక్షాన్ని అయిదేళ్ళ పాటు ‘పూర్తి కాలం’ అధికార పీఠంపై ఉంచిన ‘అపర చాణక్యుడ’ని వేనోళ్ళ పొగిడారు. అధికారం దూరం అయిన తరువాత, పొగిడిన ఆ నోళ్లతోనే ఆయన్ని తెగడటం ప్రారంభించారు. పదవికి ప్రాణం ఇచ్చే పార్టీ నాయకులు ఆయన పదవికి దూరం కాగానే వాళ్ళూ దూరం జరిగారు. మాజీగా మారిన పీవీపై విమర్శల దాడి పార్టీకి ఆయన దేశానికి చేసిన ‘మేళ్ళు’ కానరాలేదు. అయిదేళ్ళు ‘తెలుగువాడి’లోని ‘వాడినీ, వేడినీ’ లోకానికి చాటిచెప్పిన ‘వృద్ధ రాజకీయవేత్త’, నిస్సహాయంగా న్యాయస్థానాలలో ‘బోనులో’ నిలబడినప్పుడు, ఆయన పార్టీ వాళ్ళెవ్వరూ ఆయనను పట్టించుకోకపోగా ఏమీ తెలియనట్టు ‘కళ్ళు’, ‘నోళ్ళు’ మూసుకున్నారు. ప్రధానిగా ఆయన హయాంలో జరిగిన తప్పులో, పొరబాట్లనో సమర్ధించడం నా ఉద్దేశం కాదు. రాజకీయాల్లో ‘కృతజ్ఞత’, ‘విధేయత’ అనే పదాలకి తావు లేకుండా పోయిందన్న విషయాన్ని విశదం చేయడానికే ఈ ఉదాహరణ. పీవీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఏటా బేగంపేటలోని ఒక సందులో ఉన్న స్వామి రామానంద తీర్ధ ట్రస్టు కార్యాలయానికి వచ్చేవారు. ప్రధాని పదవి నుంచి దిగిపోయిన తరువాత అక్కడ జరిగిన ట్రస్టు సమావేశాలకు కూడా ఆయన హాజరయ్యేవారు. వాటిని కవర్ చేయడానికి వెళ్ళినప్పుడు ‘అధికారాం తమునందు..’ అనే పద్యపాదం జ్ఞాపకం చేసుకోవాలో, ‘ఈ కర్మభూమిలో పదవి, అధికారం ముందు అన్నీ దిగదుడుపే’ అనే నిజాన్ని హరాయించుకోవాలో నాకు అర్ధం అయ్యేది కాదు. పీవీ గురించిన మరో జ్ఞాపకం నా మదిలో పదిలంగా ఉండిపోయింది. మాజీ ప్రధానిగా పీవీ రాజ్‌భవన్‌లో వున్నప్పుడు, నేనూ, ఆకాశవాణిలో నా సీనియర్ కొలీగ్ ఆర్వీవీ కృష్ణారావు గవర్నర్ రికార్డింగ్ నిమిత్తం వెళ్లి, ఆ పని పూర్తిచేసుకున్నతరవాత, రాజ్‌భవన్ గెస్ట్ హౌస్ మీదుగా తిరిగి వెడుతూ అటువైపు తొంగి చూసాము. ఒకరిద్దరు సెక్యూరిటీ వాళ్ళు మినహా రాజకీయుల హడావిడి కనిపించక పోవడంతో మేము లోపలకు వెళ్ళాము. ‘పీవీ గారిని చూడడం వీలుపడుతుందా’ అని అక్కడవున్న భధ్రతాధికారిని అడిగాము. అతడు తాపీగా ‘లోపలకు వెళ్ళండి’ అన్నట్టు సైగ చేసాడు. ఆశ్చర్యపోతూనే లోపలకు అడుగు పెట్టాము. పెట్టిన తరవాత, మా ఆశ్చర్యం రెట్టింపు అయింది. పీవీ ఒక్కరే కూర్చుని టీవీలో ఫుట్ బాల్ మ్యాచ్ చూస్తూ కని పించారు. డిస్టర్బ్ చేశామేమో అన్న ఫీలింగుతోనే, మమ్మల్ని పరి చయం చేసుకున్నాము. లుంగీ మీద ఒక ముతక బనీను మాత్రమే వేసుకునివున్న పీవీగారు నా వైపు చూస్తూ, ‘మీ అన్నయ్య పర్వతాల రావు ఎలా వున్నాడయ్యా!’ అని అడిగేసరికి నాకు మతిపోయినంత పనయింది. ఎప్పుడో దశాబ్దాల క్రితం, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, రాష్ట్ర సమాచార శాఖలో పనిచేస్తున్న మా పెద్దన్నయ్య భండారు పర్వతాలరావు ఆయనకు పీఆర్వోగా కొద్దికాలం పనిచేశారు. అసలు పీవీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నదే అతి కొద్దికాలం. అయినా ఆప్యాయంగా గుర్తు పెట్టుకుని మరీ అడిగారు. అదీ పీవీగారి గొప్పతనం. ఇది జరిగి ఏళ్ళు గడిచిపోయాయి కానీ ఈ చక్కని జ్ఞాపకం మాత్రం మా గుండెల్లో ఇంకా తాజాగానే వుంది. మరో సందర్భంలో పీవీ గారిని ఢిల్లీలో కలిసాను. రేడియో మాస్కోలో పనిచేయడానికి మాస్కో వెడుతూ అప్పుడు కేంద్రమంత్రిగా అత్యంత ఉచ్ఛస్థానంలో ఉన్న పీవీ గారిని కలుద్దామని వెళ్లాను. బంగ్లా అంతటా నిశ్శబ్దం. కాసేపటి తరువాత ఎవరో అటుగా వస్తే ‘పీవీ గారిని కలవడానికి వీలుంటుందా’ అని వచ్చీరాని హిందీలో అడిగాను. అతగాడు బంగ్లాలో ఓ గది చూపించి వెళ్ళిపోయాడు. నెమ్మదిగా తలుపు తోసి చూస్తే ఎదురుగా పీవీ గారు. ఎవ్వరూ లేరు. పరిచయం చేసుకుని మాస్కో వెడుతున్నట్టు చెప్పాను. అప్పుడు ఆయన విదేశాంగ మంత్రి అనుకుంటాను. నా మొహంలో భావాలు పసిగట్టినట్టున్నారు. ‘పనులు చేసి పెడుతూ వుంటే కదా పదిమంది వచ్చేది’ అన్నారు ఆయన తన మొహంలో భావాలు ఏమీ తెలియకుండా. ‘మాస్కో ఎందుకయ్యా వేరే దేశంలో... మీ రేడియో ఉద్యోగాలు లేవా? బాగా చలిదేశం. పెళ్ళాం పిల్లలతో ఎలా ఉంటావ్?’ అని అడిగారు. చాలా ముక్తసరిగా మాట్లాడేవారని పేరున్న పీవీ గారు నేను ఊహించని విధంగా చనువుగా ఆ రెండు ముక్కలు మాట్లాడ్డం నా అదృష్టం అనే భావిస్తాను. పీవీ స్మృతికి నా నివాళి. (నేడు హైదరాబాద్‌లోని దసపల్లా హోటల్లో ఉదయం 11 గంటలకు సుప్రసిద్ధ జర్నలిస్టు, ‘ది ప్రింట్’ సంపాదకులు శేఖర్ గుప్తా దివంగత ప్రధాని పీవీపై స్మారకోపన్యాసం చేయనున్నారు) భండారు శ్రీనివాసరావు వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు ‘ 98491 30595 -
కన్నంతలో విన్నంతలో వైఎస్సార్
సందర్భం ఆ ఎమ్మెల్యేకు మాట పెగల్లేదు. బయటకు వచ్చి పేషీ అధికారులతో అన్నాడు, ‘‘చూశారా, సీఎం అంటే ఇలా ఉండాలి, మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరు వెళ్లి అడిగినా, అడిగిన దానిలో సగం కత్తిరించి శాంక్షన్ చేసేవాళ్లు. దాంతో ఖర్చు రెట్టింపు చూపించాల్సి వచ్చేది’’ సుదీర్ఘ రాజకీయ జీవితం గడిపిన వై.ఎస్. రాజశేఖరరెడ్డికి తనకు తానుగా ప్రజలందరికీ మేలు చేసే అవకాశం పూర్తిగా లభించింది ముఖ్యమంత్రి అయిన తరువాతనే. రాజకీయ ప్రవేశం చేసిన తొలినాళ్లలో నిర్వహించిన మంత్రి పదవులు మినహా ఆయన ఎక్కువ కాలం సచివాలయానికి, ఆఫీసు ఫైళ్ళకు దూరంగా, పార్లమెంటు సభ్యుడిగానో లేదా ప్రతిపక్ష నాయకుడిగానో ఉండిపోయారు. అలాగే వైద్య విద్య పూర్తి చేసుకున్న తొలినాళ్లలో చేసిన డాక్టరు ప్రాక్టీసు తప్పిస్తే తదనంతర కాలంలో ఆయన ఆ పనిచేసిన దాఖలాలు లేవు. ఒక రాజకీయ నాయకుడిగా, ఒక వైద్యుడిగా తను అనుకున్న విధంగా చేస్తూ పోవడానికి వెసులుబాటు లభించింది ముఖ్యమంత్రి అయినప్పుడే. ఈ అరుదయిన అవకాశాన్ని (గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఎవ్వరూ ఒకే విడతలో నిరవధికంగా అయిదేళ్ల పదవీకాలం పూర్తి చేసుకోలేదు) వైఎస్ పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. ప్రజలకు పనికొచ్చే అనేక మంచి పనులు చేసిందీ ఆ సమయంలోనే. వై.ఎస్. చనిపోయిన ఇన్నేళ్ల తరువాత కూడా ఆయన వల్ల మేళ్లు పొందిన వాళ్లు మాత్రం వాటిని ఇంకా జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నారు. వీళ్లేమీ బడా బడా కాంట్రాక్టర్లు కాదు, గొప్ప గొప్ప రాజకీయ నాయకులు అంతకంటే కాదు. వారందరూ సామాన్యులు. ఇందుకు సంబంధించి కొన్ని ఉదాహరణలను– కన్నవి, విన్నవి, ఉదహరించడమే ఈ వ్యాసకర్త ఉద్దేశం. ప్రింటింగు ప్రెస్సుల్లో అనవసరమైన కాగితాలు రద్దుగా పేరుకు పోతుంటాయి. కొంతమంది వాటిని అమ్ముకుని పొట్టపోసుకుంటూ ఉంటారు. అలా జీవనం సాగించే ప్రకాశ్ అనే వ్యక్తికి గుండె జబ్బు అని డాక్టర్లు చెప్పారు. వెంటనే ఆపరేషన్ చేయాలన్నారు. ఆ మాటతో అతడికి గుండె జారిపోయింది. ఆ ప్రెస్సు యజమాని, ఈ విషయాన్ని జర్నలిస్ట్ సంఘం నాయకుడు అమర్ చెవిన వేసి, ఏదైనా సాయం జరిగేలా చూడమన్నాడు. అమర్ వెంటనే వైఎస్‌ని కలసి విషయం చెప్పారు. తక్షణ సాయం అందించమని వైఎస్ తన పేషీ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అయితే సంబంధిత ఉత్తర్వులు వచ్చేలోగానే ఆ రోగి మరణించిన సంగతి సీఎంకు తెలిసింది. సహాయనిధి వ్యవహారాలు చూసే అధికారిని పిలిచి, వెంటనే ఆ రోగి ఇంటికి వెళ్లి ప్రభుత్వం తరపున రెండు లక్షల ఆర్థిక సాయం అందించి రావాలని కోరారు. వైఎస్ ముఖ్యమంత్రి అయిన కొన్ని నెలలకే ముఖ్యమంత్రి సహాయ నిధి ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడింది. అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇదే పరిస్థితి తలెత్తిందని అధికారులు చెప్పేవారు. దీనికి కారణం వారిద్దరి చేతికీ ఎముక లేకపోవడం. ఒకసారి ఒక ప్రముఖ శాసనసభ్యుడు వారికి సంబంధించిన వారి వైద్యం కోసం ఆర్థిక సాయం కోరుతూ ఒక అర్జీ వైఎస్ చేతికి ఇచ్చారు. అదంతా చదివి వైఎస్ ఇలా అన్నారు. ‘నేను డాక్టరుగా చెబుతున్నా విను. ఈ జబ్బుకి నువ్వడిగిన యాభయ్ వేలు ఏమాత్రం సరిపోవు. రెండు లక్షలు లేనిదే వైద్యం జరగదు. అంచేత అంత డబ్బు ఇస్తాను, వైద్యం చేయించు’ ఆ ఎమ్మెల్యేకు మాట పెగల్లేదు. బయటకు వచ్చి పేషీ అధికారులతో అన్నాడు, ‘‘చూశారా, సీఎం అంటే ఇలా ఉండాలి, మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరు వెళ్లి అడిగినా, అడిగిన దానిలో సగం కత్తిరించి శాంక్షన్ చేసేవాళ్లు. దాంతో ఖర్చు రెట్టింపు చూపించాల్సి వచ్చేది’’ వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఇంగ్లిష్ పత్రిక విలేకరి తన కుమార్తె పెండ్లికి పిలవడానికి భార్యను వెంటబెట్టుకుని క్యాంప్ ఆఫీసుకు వెళ్లారు. వైఎస్ వారిని కూర్చోబెట్టమని సిబ్బందికి చెప్పి లోపలకు వెళ్లారు. సిబ్బంది వారిని ప్రవేశ ద్వారం వద్ద కుర్చీల్లో కూర్చోబెట్టారు. సీఎం కాసేపటి తరువాత వచ్చి బయట కూర్చుని ఉన్న భార్యాభర్తలను చూసి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గబగబా విలేకరి భార్య దగ్గరికి వెళ్లి, ‘మీరు మాఇంటి ఆడపడుచు వంటివారు, మీకు సరిగా మర్యాద జరగలేదు, మన్నించమని’ఒకటికి రెండుసార్లు అనడంతో ఆవిడ విస్తుపోయారు. వారిని లోపలకు తీసుకుని వెళ్లి, ‘మీకు ఎంతమంది పిల్లలు, ఎందరి పెళ్లిళ్లు అయ్యాయి’అంటూ ఆప్యాయంగా వివరాలు కనుక్కున్నారు. ఇన్నేళ్ల తరువాత కూడా తెలంగాణ ప్రాంతానికి చెందిన ఆ విలేకరి ఈ సంగతి గుర్తు చేసుకుంటూ ఉంటారు. పోతే, ఇది వైఎస్ వ్యవహార శైలితో ముడిపడివున్న ఒక విషయం. ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి మోహన్ కందా తన జీవితానుభవాలతో కూర్చిన ‘మోహన మకరందం’ అనే పుస్తకంలో ప్రస్తావించారు. అప్పుడు చంద్రబాబునాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. వైఎస్ ప్రతిపక్ష నేత. 2003లో అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని చంద్రబాబు నిర్ణయించారు. కానీ ఎలక్షన్ కమిషనర్ లింగ్డో ఒప్పుకోలేదు. ఓటర్ల జాబితాలో సవరణల ప్రక్రియ పూర్తయిన తరువాతనే ఎన్నికలు జరగాలని నిర్ణయించారు. దాంతో కొన్ని నెలల పాటు ఆపద్ధర్మ ప్రభుత్వం నడవాల్సిన పరిస్థితి. ఈలోగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం పని తీరుపై రోజువారీ నివేదికలు మీడియాలో ఇస్తుండేవారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రికి అలా ప్రజల డబ్బు ఖర్చు చేసే హక్కు లేదంటూ కాంగ్రెస్ యాగీ మొదలు పెట్టింది. చీఫ్ సెక్రటరీగా మోహన్ కందా బాబుకు సాయం చేస్తున్నారని వాళ్లు అనుమానించడం మొదలెట్టారు. అంతలో కేంద్ర ప్రభుత్వం కూడా ముందస్తు ఎన్నికలకు నగారా మోగించింది. అసెంబ్లీ, లోకసభ ఎన్నికలు జమిలిగా జరపాలని చంద్రబాబు కేబినెట్ తీర్మానించింది. కేబినెట్ నిర్ణయానికి అనుగుణంగా ప్రధాన కార్యదర్శి మోహన్ కందా కేంద్రానికి లేఖ రాయడం జరిగిపోయింది. సీఎస్ ఉత్తరం రాయడాన్ని వై.ఎస్. తప్పు పడుతూ పత్రికా ప్రకటన చేశారు. ‘ఇవన్నీ రాజకీయ నిర్ణయాలు, ఐ.ఎ.ఎస్. అధికారికి ఏం సంబంధం?’అనేది ఆయన వాదన. ఎన్నికలు జరిగాయి. వైఎస్ ముఖ్యమంత్రి అయ్యారు. కందా వైఎస్‌ని కలసి ప్రధాన కార్యదర్శి బాధ్యతల నుంచి తప్పించమని కోరారు. కందా చేసిన పనులు ప్రతిపక్ష నేతగా వైఎస్‌కు నచ్చని మాట నిజమే. అయితే ఒక అధికారిగా తన బాధ్యత నిర్వర్తించారు తప్పితే రాజకీయ దురుద్దేశాలు ఆయనకు లేవన్న విషయాన్ని వైఎస్ గ్రహించారు. కనకనే ఆయనతో అన్నారు. ‘‘సీఎస్ పదవిలో కొనసాగాలని మిమ్మల్ని కోరాలని నేను నిర్ణయించుకున్నాను.’’వైఎస్ ఇంకో మాట కూడా అన్నారు మోహన్ కందాతో ఇంగ్లిష్‌లో. ‘నాతో వ్యవహారం చాలా సులువని మీరు త్వరలోనే గ్రహిస్తారు’అన్నది దాని భావం. పదవీ విరమణ అనంతరం కందా రాసుకున్న ఆ పుస్తకంలో ఆ ఇద్దరు ముఖ్యమంత్రుల వ్యవహార శైలి గురించి ఇలా ఉదహరించారు. ‘‘ఏదైనా ఆయన దృష్టికి తేకపోతే, ‘ఇది నాకు ఎందుకు చెప్పలేదు’అనేవారు బాబు.’’ ‘‘అదే వైఎస్సార్ అయితే, ‘ఇది నాకెందుకు చెబుతున్నారు’ అని అడిగేవారు’’ వైఎస్ గురించిన ఇలాంటి విశేషాలు ఎన్నో ఉన్నాయని ఎరిగినవారు చెబుతుంటారు. (నేడు వై.ఎస్. రాజశేఖరరెడ్డి వర్ధంతి) వ్యాసకర్త ఆకాశవాణి మాజీ ప్రయోక్త మొబైల్: 9849130595 భండారు శ్రీనివాసరావు -
అక్షరమైన విభజన చరిత్ర
పరిచయం సమైక్య ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయి రెండేళ్లు దాటిపోయింది. విభజనకు పూర్వం, తరువాత హైదరాబా దులో స్థిరపడిన సీమాంధ్రుల మనస్సుల్లో వున్న కొన్ని భయ సందేహాలు సద్దుమణిగాయి. ఏవో రాజకీయపరమైన చిటపటలు మినహాయిస్తే మొత్తం మీద అటూ, ఇటూ జనాలు సర్దుకుపోయారనే చెప్పాలి. ఇలాంటి నేపథ్యంలో విభజన కథ పేరుతో అలనాటి విషయాలను తవ్వి తీస్తూ ఒక పుస్తకం రాయడం ఎందుకనే ప్రశ్న తలెత్తడం సహజం. గ్రంథ రచయిత ఉండవల్లి అరుణ్ కుమార్. వై.ఎస్. రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి వివాహానికి హైదరాబాదు నుంచి కొందరు పాత్రికేయులం రైల్లో పులివెందుల వెడుతున్నప్పుడు ఆయనతో నాకు తొలి పరిచయం. కాంగ్రెస్ అగ్రనాయకుల ఇంగ్లిష్, హిందీ ప్రసంగాలకు తెలుగు అనువాదం చేసే అవకాశాన్ని వైఎస్ఆర్ కల్పించినది మొదలుగా ఇక ఆయనకు అడ్డులేకుండా పోయింది. అంగబలం, అర్ధబలం, సామాజిక బలం లేని ఉండవల్లి రెండుసార్లు ఎంపీ కాగలిగారు. ‘మాట మార్చను, మడమ తిప్పను’ అంటుండే వైఎస్సార్ ఆప్తవర్గంలోని మనిషి కావడం వల్లనేమో ఆయనకూ తాను మాట మార్చను అనే ఓ నమ్మకం. విభజన బిల్లు పాసవ్వదు అనేది ఆయన నమ్మకం. బిల్లు ఆమోదం పొందినా కూడా ఆయనది అదే మాట, కాకపొతే అది ‘బిల్లు పాసవ్వలేదు’ గా మారింది. బిల్లు పాసు కాకుండానే తెలంగాణ ఏర్పడిందా! అదెలా సాధ్యం? అది చెప్పడానికే ఈ రచన. ‘‘బిల్లు పాసవలేదు అని చెప్పడం అంటే తెలం గాణను వ్యతిరేకించడం కాదు. ఆనాడు చట్ట సభలో చోటుచేసుకున్న పొరబాట్లను ఎత్తి చూపి అటువంటివి పునరావృతం కాకుండా వుండేందుకు మాత్రమే ఈ గ్రంథరచన అని అంటారాయన. డైరీలో రాసుకున్న విశే షాల ఆధారంగా ఆయన ఈ పుస్తకం రాశారు. కొన్ని తేదీల వారీగా వున్నాయి. మరి కొన్ని తనకు సంబంధం లేని, అంటే తాను ప్రత్యక్షంగా లేని, చూడని సన్నివేశా లను, సంభాషణలను ఆయా వ్యక్తుల స్వభావాలను అర్థం చేసుకున్న వ్యక్తిగా, వారు కొన్ని సందర్భాలలో ఎలా, యేమని మాట్లాడుకుని వుంటారో ఊహించి రాశారు. అదీ జీవించి వున్న వ్యక్తుల విషయంలో ఇటువంటి ప్రయోగం చేయడం నిజంగా సాహసమే. ముఖ్యంగా విభజన బిల్లు ఓటింగు విషయంలో స్పీకర్ చాంబర్లో జరిగిన సమావేశం. స్పీకర్, జైపాల్‌రెడ్డి నడుమ జరిగిన సంభాషణ ఉండవల్లి కల్పనాశక్తికి చక్కని ఉదాహరణ. ఒక్క ముక్కలో చెప్పాలంటే చక్కని స్క్రీన్ ప్లే. అది చదివితే, ఒక స్థాయికి చేరిన తరువాత రాజకీయాలు ఏ తీరుగా సాగుతాయో అనే అనుమానం కలుగుతుంది. సభలో ఏం జరగాల్సింది జైపాల్ రెడ్డి ఎటువంటి శషభిషలు లేకుండా సూటిగా స్పీకర్‌తోనే చెప్పేసినట్టు ఉండవల్లి రాశారు. సభ మొదలు కాగానే టీవీ ప్రసారాలు నిలిచిపోతాయనీ, వాటిని బాగుచేసేలోగా బిల్లు పాసయిపోతుందనీ ఆయన చెప్పారు. పాలక పక్షం, ప్రతిపక్షం కలిస్తే బిల్లు ఆమోదం పొందడం చిటికెలో పని అని నచ్చచెప్పారు. జైపాల్ రెడ్డి స్పీకర్ చాంబర్ నుంచి బయటకు వచ్చిన తరువాత టీ. కాంగ్రెస్ ఎంపీలతో కూడా ఇదే తీరులో మాట్లాడారు. స్పీకర్ చాంబర్లో జరిగింది మరిచి పొండి. ఆ మాటలు నేను అనలేదు, మీరు వినలేదు. ఇప్పుడు అయితే అయినట్టు. లేకపోతే తెలంగాణ ఎప్ప టికీ రాదని వారితో అన్నారు. ఏతావాతా ఉండవల్లి ఈ పుస్తకం ద్వారా చెప్ప దలచింది ఒక్కటే. రాష్ట్ర విభజన జరిగిన తీరు నియ మానుసారంగా లేదని. ఏదిఏమైనా, ఈ పుస్తకంలోని విషయాలతో ఏకీభవించినా లేకపోరుునా, తెలుగు ప్రజల జీవితాలతో ముడిపడిన ఒక చారిత్రక సందర్భానికి సంబంధించిన అనేక అంశాలకు అక్షర రూపం కల్పించడం శ్లాఘనీయం. భండారు శ్రీనివాసరావు, వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు 98491 30595 -
‘ఆరోగ్యశ్రీ’ దార్శనికుడు
బడుగు ప్రజలు ఒక నాయకుడ్ని చిరకాలం గుర్తుంచుకోవడానికీ, గుండెల్లో దాచుకోవడానికీ ఆరోగ్యశ్రీ వంటి కొన్ని పథకాలు చాలు. వై.ఎస్ గతించి అప్పుడే ఆరేళ్లైనా సామాన్య జనం దృష్టిలో నేటికీ జీవించే ఉన్నారు. పాలకులు వస్తుంటారు, పోతుంటారు. కానీ వారు చేసిన మంచి పనులు మాత్రం కలకాలం నిలబడి ఉంటాయి. చిరకాలం వారిని గుర్తు చేస్తుం టాయి. కారే రాజులు రాజ్య ముల అంటూ బలి చక్రవర్తి కాలంలో చెప్పిందీ అదే. ఈ కలియుగంలో సైతం వర్తించే వాస్తవం కూడా ఇదే. వై.ఎస్. రాజశేఖరరెడ్డి గతించి అప్పుడే ఆరేళ్లయిం ది. సామాన్య జనం ఈనాటికీ ఆయన్ని ఏదో ఒకరకంగా గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. దానికి ప్రధాన కారణం, ఆయన అధికారంలో ఉండగా ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ వంటి కొన్ని కొత్త పథకాలు. ఆరోగ్యశ్రీ పథకం రూపుదా ల్చడానికి ఓ నేపథ్యం ఉంది. అది ముఖ్యమంత్రి వైఎస్సార్ క్యాంపు కార్యాల యం. ఉదయం వేళల్లో సీఎం సాధారణ ప్రజలను కలుసుకునే సమయం. సీఎం ఒక్కొక్కర్నీ కలుసుకుం టూ, వారి నుంచి విజ్ఞప్తులు స్వీకరిస్తూ, వాటికి తగిన హామీలను ఇస్తూ, సంబంధిత పేషీ అధికారులకు సూచనలు ఇస్తూ ముందుకు సాగుతున్నారు. సీఎంను స్వయంగా కలసి కష్ట సుఖాలను చెప్పు కోవడానికి వచ్చిన ఆ మహాజనంలో ఒక అమ్మాయి కూడా ఉంది. అయితే వచ్చిన కష్టం ఆ అమ్మాయిది కాదు. ఆ అమ్మాయి అమ్మది. అది కూడా మామూలు కష్టం కాదు. తీవ్రమైన ఆరోగ్య సమస్య. మామూలు మనుషులే కాదు బాగా కలిగిన వారిని సైతం కుదేలు చేసే క్యాన్సర్ వ్యాధితో ఆమె బాధపడుతోంది. ముఖ్యమంత్రి ఆ అమ్మాయి చెప్పింది సావధానం గా విన్నారు. స్వయంగా డాక్టర్ అయిన ఆయన ఆమె మెడికల్ రిపోర్టులు పరిశీలించారు. విషయం వెంటనే అర్థం అయింది. ఏం చేసినా ఆవిడ బతికే అవకాశాలు శూన్యం. కానీ మరో పక్క మా అమ్మ నాకు కావాలి. అనే ఆ అమ్మాయి ఆవేదనతో కూడిన అభ్యర్థన. ‘వైద్యం చేయిస్తాను. కానీ వ్యాధి ముదిరిపో యింది. ప్రయోజనం ఉండకపోవచ్చు’ అన్నారు వైఎస్. ‘ఆరు నెలలు బతికినా చాలు, కొన్నాళ్ళపాటయినా నా కన్నతల్లి నా కళ్ళ ముందు ఉంటే అదే పదివేలు’ అన్నదా అమ్మాయి. ‘చనిపోతుందని, ఇంకా ఎంతో కాలం బతకదనీ నాకూ తెలుసు. కానీ, చూస్తూ చూస్తూ వైద్యం చేయించకుండా ఉండలేము కదా’ అంది కూడా. ఆ మాటతో కంగుతిన్న వైఎస్ ఏమనుకున్నారో ఏమో తెలవదు. కాకపోతే, ఒక నిశ్చయానికి వచ్చినట్టు ఆయన ముఖమే చెబుతోంది. ఏం చేద్దాం అన్నట్టు అధికారుల వైపు చూశారు, ఏదైనా చేసి తీరాలి అన్న ట్టుగా. ఎవరికీ ఏం చేయాలో, ఏం జవాబు చెప్పాలో తెలియదు. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఎంతో కొంత సాయం చేసినా అది అరకొరే. ఆ అమ్మాయిని మరు నాడు రమ్మన్నారు. సీఎం అధికారులతో మాట్లాడారు. ఇలాటి అభాగ్యులకు ఏం చేస్తే బాగుంటుందో ఆలో చించి ఒక పరిష్కారంతో రమ్మన్నారు. ఈ ప్రశ్నకు దొరికిన సమాధానమే ‘ఆరోగ్యశ్రీ’. ఆ విధంగా ఆరోగ్యశ్రీ పథకం పురుడు పోసుకుంది. అప్పటికే -108- అంబులెన్స్‌లు రాష్ట్రాన్ని చుట్టబె డుతున్నాయి. అత్యవసర వైద్య సేవలు అందించడంలో దేశం మొత్తంలోనే అగ్రగామి అనిపించుకుంటున్నాయి. వైఎస్ సీఎం కాగానే సత్యం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆ అంబులెన్స్ సర్వీసుల నిర్వహణ బాధ్య తను ప్రభుత్వ భుజస్కంధాలకు ఎత్తుకున్నారు. ఈ సర్వీసు వచ్చేవరకు రోడ్డు ప్రమాద బాధితులకు ఎలాం టి రక్షణా లేదు. ప్రమాదాలకు గురైన వారిని సకాలంలో దగ్గరలోని ఆసుపత్రులకు చేర్చి వైద్యం అందించగలి గితే వారి ప్రాణాలు కాపాడడానికి వీలుంటుంది. కానీ అటువంటి వీలూచాలూ లేక అనేకమంది ప్రాణాలు నడిరోడ్డు మీదనే గాలిలో కలిసిపోతున్నాయి. వైఎస్సార్ ఆధ్వర్యంలో రాష్ర్టం నలుమూలలా రయ్యి రయ్యి మం టూ తిరిగిన ఈ అంబులెన్స్ వాహనాల పుణ్యమా అని ఎందరెందరో బతికి బట్టకట్ట కలిగారు. అలాగే 104 గ్రామీణ ఆరోగ్య సర్వీసు. 108 అంబులెన్స్ రూపకల్పనలో పాలుపంచుకున్న డాక్టర్ అయితరాజు పాండురంగారావు, డాక్టర్ ఉట్ల బాలాజీ ఒక కొత్త ఆలోచనను సీఎం ముందుకు తెచ్చారు. అదే, ఎఫ్.డీ.హెచ్.ఎస్ అంటే (‘ఫిక్సెడ్ డేట్ హెల్త్ సర్వీస్’) నిర్దేశిత దిన వైద్య సేవలు. వైద్య ఆరోగ్య రంగంపై ప్రభుత్వం ఖర్చు చేస్తున్న కోట్లాది రూపాయల్లో సింహభాగం నిర్వహణ వ్యయం కిందికే పోతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కొంత మేరకు ప్రజల ఆరోగ్య సేవల అవసరాలను తీరుస్తున్నప్పటికీ- డాక్టర్ల కొరత తీరని సమస్యగానే మిగిలిపోతున్నది. వైద్య కళాశాలలో పట్టా పుచ్చుకున్న ఏ ఒక్కరు కూడా పల్లెలకు వెళ్లి వైద్యం చేయడానికి సిద్ధంగా లేరంటే అతిశయోక్తి కాదు. ఇక మందుల విషయం చెప్పనక్కరలేదు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు దూరంగా ఉన్న పల్లెల్లో నివసించే వారికి ఈ అరకొర సదుపాయం కూడా అందుబాటులో లేదు. బయట ప్రపంచంతో సంబంధాలు లేకుండా కోయ గూడాలు, లంబాడి తండాల్లో ఉండే పేద వారికి రోగం రొస్టూ వస్తే ఇక ఇంతే సంగతులు. అలాంటి వారు సాధారణంగా షుగరు, రక్తపోటు, ఉబ్బసం, కీళ్ళ వ్యాధులతో బాధపడుతుంటారు. అసలు ఇలాంటి జబ్బులు తమకు ఉన్నట్టు కూడా వీరికి తెలియదు. ఎందుకంటె ఎలాంటి వైద్య పరీక్షలు ఎప్పుడూ చేయించుకుని ఎరుగరు కనుక. హెచ్.ఎం.ఆర్.ఐ. వారు ఈ సమస్యపై దృష్టి సారించారు. అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ఒక పరిష్కారాన్ని కనుగొన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు మూడు కిలోమీటర్ల ఆవల ఉండే ప్రతి పల్లెకు- నెల నెలా క్రమం తప్పకుండా వెళ్లి - ఊరివారికి వైద్య పరీక్షలు చేసి ఉచి తంగా మందులు అందించే వాహనానికి రూపకల్పన చేశారు. ఇంతా చేసి ఈ పథకం కింద లబ్ది పొందేవారి సంఖ్యను లెక్కలోకి తీసుకుంటే- ఒక్కొక్కరిపై పెట్టే ఖర్చు ఏడాదికి కేవలం రూ.80 మాత్రమే. అంటే - వైద్య ఆరోగ్య రంగం బడ్జెట్ లో పది శాతం కన్నా తక్కువన్నమాట. చిన్నా చితకా రోగాలకు వైద్య సలహా చాలు. అందుకోసం ఇరవై నాలుగ్గంటలూ అందుబాటులో ఉండే 104 ఉచిత కాల్ సెంటరు. నిర్దేశిత దిన వైద్య పరీక్షలు నిర్వహించే 104 సంచార వాహనం. అత్యవసర వైద్య సాయం కోసం 108 అంబులెన్స్. ఇక విధి వికటించి పెద్ద రోగాల బారినపడి ఎవరు కాపాడుతారా అని ఎదురు చూపులు చూసేవారి కోసం ఆరోగ్యశ్రీ. పైగా, ఇవన్నీ పూర్తిగా ఉచితం. అన్నీ ఒక్క గొడుగులో. బడుగు ప్రజలు ఒక నాయకుడ్ని చిరకాలం గుర్తుంచుకోవడానికీ, గుండెల్లో దాచుకోవడానికీ ఇలాం టి పథకాలు చాలు. అందుకే వైఎస్సార్ చనిపోయి కూడా ప్రజల దృష్టిలో జీవించే ఉన్నారు. (సెప్టెంబర్ 2న వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా) వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు మొబైల్ : 98491 30595