‘ఆరోగ్యశ్రీ’ దార్శనికుడు | bandaru srinivasarao reminds YS rajashekar reddy services | Sakshi
Sakshi News home page

‘ఆరోగ్యశ్రీ’ దార్శనికుడు

Published Mon, Aug 31 2015 1:04 AM | Last Updated on Sat, Jul 7 2018 2:56 PM

‘ఆరోగ్యశ్రీ’ దార్శనికుడు - Sakshi

‘ఆరోగ్యశ్రీ’ దార్శనికుడు

 బడుగు ప్రజలు ఒక నాయకుడ్ని చిరకాలం గుర్తుంచుకోవడానికీ, గుండెల్లో దాచుకోవడానికీ ఆరోగ్యశ్రీ వంటి కొన్ని పథకాలు చాలు. వై.ఎస్ గతించి అప్పుడే ఆరేళ్లైనా సామాన్య జనం దృష్టిలో నేటికీ జీవించే ఉన్నారు.  పాలకులు వస్తుంటారు, పోతుంటారు. కానీ వారు చేసిన మంచి పనులు మాత్రం కలకాలం నిలబడి ఉంటాయి. చిరకాలం వారిని గుర్తు చేస్తుం టాయి. కారే రాజులు  రాజ్య ముల అంటూ బలి చక్రవర్తి కాలంలో చెప్పిందీ అదే. ఈ కలియుగంలో సైతం వర్తించే వాస్తవం కూడా ఇదే.

 వై.ఎస్. రాజశేఖరరెడ్డి గతించి అప్పుడే ఆరేళ్లయిం ది. సామాన్య జనం ఈనాటికీ ఆయన్ని ఏదో ఒకరకంగా గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. దానికి ప్రధాన కారణం, ఆయన అధికారంలో ఉండగా ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ వంటి కొన్ని కొత్త పథకాలు. ఆరోగ్యశ్రీ పథకం రూపుదా ల్చడానికి ఓ నేపథ్యం ఉంది.  

అది ముఖ్యమంత్రి వైఎస్సార్ క్యాంపు కార్యాల యం. ఉదయం వేళల్లో సీఎం సాధారణ ప్రజలను కలుసుకునే సమయం. సీఎం ఒక్కొక్కర్నీ కలుసుకుం టూ, వారి నుంచి విజ్ఞప్తులు స్వీకరిస్తూ, వాటికి తగిన హామీలను ఇస్తూ, సంబంధిత పేషీ అధికారులకు సూచనలు ఇస్తూ ముందుకు సాగుతున్నారు.  సీఎంను స్వయంగా కలసి కష్ట సుఖాలను చెప్పు కోవడానికి వచ్చిన ఆ మహాజనంలో ఒక అమ్మాయి కూడా ఉంది. అయితే వచ్చిన కష్టం ఆ అమ్మాయిది కాదు. ఆ అమ్మాయి అమ్మది. అది కూడా మామూలు కష్టం కాదు. తీవ్రమైన ఆరోగ్య సమస్య. మామూలు మనుషులే కాదు బాగా కలిగిన వారిని సైతం కుదేలు చేసే క్యాన్సర్ వ్యాధితో ఆమె బాధపడుతోంది. ముఖ్యమంత్రి ఆ అమ్మాయి చెప్పింది సావధానం గా విన్నారు. స్వయంగా డాక్టర్ అయిన ఆయన ఆమె మెడికల్ రిపోర్టులు పరిశీలించారు. విషయం వెంటనే అర్థం అయింది. ఏం చేసినా ఆవిడ బతికే అవకాశాలు శూన్యం. కానీ మరో పక్క మా అమ్మ నాకు కావాలి. అనే ఆ అమ్మాయి ఆవేదనతో కూడిన అభ్యర్థన.

 ‘వైద్యం చేయిస్తాను. కానీ వ్యాధి ముదిరిపో యింది. ప్రయోజనం ఉండకపోవచ్చు’ అన్నారు వైఎస్.
 ‘ఆరు నెలలు బతికినా చాలు, కొన్నాళ్ళపాటయినా నా కన్నతల్లి నా కళ్ళ ముందు ఉంటే అదే పదివేలు’ అన్నదా అమ్మాయి. ‘చనిపోతుందని, ఇంకా ఎంతో కాలం బతకదనీ నాకూ తెలుసు. కానీ, చూస్తూ చూస్తూ వైద్యం చేయించకుండా ఉండలేము కదా’ అంది కూడా.

 ఆ మాటతో కంగుతిన్న వైఎస్ ఏమనుకున్నారో ఏమో తెలవదు. కాకపోతే, ఒక నిశ్చయానికి వచ్చినట్టు ఆయన ముఖమే చెబుతోంది. ఏం చేద్దాం అన్నట్టు అధికారుల వైపు చూశారు, ఏదైనా చేసి తీరాలి అన్న ట్టుగా. ఎవరికీ ఏం చేయాలో, ఏం జవాబు చెప్పాలో తెలియదు. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఎంతో కొంత సాయం చేసినా అది అరకొరే. ఆ అమ్మాయిని మరు నాడు రమ్మన్నారు. సీఎం అధికారులతో మాట్లాడారు. ఇలాటి అభాగ్యులకు ఏం చేస్తే బాగుంటుందో ఆలో చించి ఒక పరిష్కారంతో రమ్మన్నారు. ఈ ప్రశ్నకు దొరికిన సమాధానమే ‘ఆరోగ్యశ్రీ’. ఆ విధంగా ఆరోగ్యశ్రీ పథకం పురుడు పోసుకుంది.

 అప్పటికే -108- అంబులెన్స్‌లు రాష్ట్రాన్ని చుట్టబె డుతున్నాయి. అత్యవసర వైద్య సేవలు అందించడంలో దేశం మొత్తంలోనే అగ్రగామి అనిపించుకుంటున్నాయి. వైఎస్ సీఎం కాగానే సత్యం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆ అంబులెన్స్ సర్వీసుల నిర్వహణ బాధ్య తను ప్రభుత్వ భుజస్కంధాలకు ఎత్తుకున్నారు. ఈ సర్వీసు వచ్చేవరకు రోడ్డు ప్రమాద బాధితులకు ఎలాం టి రక్షణా లేదు. ప్రమాదాలకు గురైన వారిని సకాలంలో దగ్గరలోని ఆసుపత్రులకు చేర్చి వైద్యం అందించగలి గితే వారి ప్రాణాలు కాపాడడానికి వీలుంటుంది. కానీ అటువంటి వీలూచాలూ లేక అనేకమంది ప్రాణాలు నడిరోడ్డు మీదనే గాలిలో కలిసిపోతున్నాయి. వైఎస్సార్ ఆధ్వర్యంలో రాష్ర్టం నలుమూలలా రయ్యి రయ్యి మం టూ తిరిగిన ఈ అంబులెన్స్ వాహనాల పుణ్యమా అని ఎందరెందరో బతికి బట్టకట్ట కలిగారు.  అలాగే 104 గ్రామీణ ఆరోగ్య సర్వీసు. 108 అంబులెన్స్ రూపకల్పనలో పాలుపంచుకున్న డాక్టర్ అయితరాజు పాండురంగారావు, డాక్టర్ ఉట్ల బాలాజీ ఒక కొత్త ఆలోచనను సీఎం ముందుకు తెచ్చారు. అదే, ఎఫ్.డీ.హెచ్.ఎస్ అంటే (‘ఫిక్సెడ్ డేట్ హెల్త్ సర్వీస్’)  నిర్దేశిత దిన వైద్య సేవలు.

 వైద్య ఆరోగ్య రంగంపై ప్రభుత్వం ఖర్చు చేస్తున్న కోట్లాది రూపాయల్లో సింహభాగం నిర్వహణ వ్యయం కిందికే పోతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కొంత మేరకు ప్రజల ఆరోగ్య సేవల అవసరాలను తీరుస్తున్నప్పటికీ- డాక్టర్ల కొరత తీరని సమస్యగానే మిగిలిపోతున్నది. వైద్య కళాశాలలో పట్టా పుచ్చుకున్న ఏ ఒక్కరు కూడా పల్లెలకు వెళ్లి వైద్యం చేయడానికి సిద్ధంగా లేరంటే అతిశయోక్తి కాదు. ఇక మందుల విషయం చెప్పనక్కరలేదు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు దూరంగా ఉన్న పల్లెల్లో నివసించే వారికి ఈ అరకొర సదుపాయం కూడా అందుబాటులో లేదు. బయట ప్రపంచంతో సంబంధాలు లేకుండా కోయ గూడాలు, లంబాడి తండాల్లో ఉండే పేద వారికి రోగం రొస్టూ వస్తే ఇక ఇంతే సంగతులు. అలాంటి వారు సాధారణంగా షుగరు, రక్తపోటు, ఉబ్బసం, కీళ్ళ వ్యాధులతో బాధపడుతుంటారు. అసలు ఇలాంటి జబ్బులు తమకు ఉన్నట్టు కూడా వీరికి తెలియదు. ఎందుకంటె ఎలాంటి వైద్య పరీక్షలు ఎప్పుడూ చేయించుకుని ఎరుగరు కనుక.  

 హెచ్.ఎం.ఆర్.ఐ. వారు ఈ సమస్యపై దృష్టి సారించారు. అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ఒక పరిష్కారాన్ని కనుగొన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు మూడు కిలోమీటర్ల ఆవల ఉండే ప్రతి పల్లెకు- నెల నెలా క్రమం తప్పకుండా వెళ్లి - ఊరివారికి వైద్య పరీక్షలు చేసి ఉచి తంగా మందులు అందించే వాహనానికి రూపకల్పన చేశారు. ఇంతా చేసి ఈ పథకం కింద లబ్ది పొందేవారి సంఖ్యను లెక్కలోకి తీసుకుంటే- ఒక్కొక్కరిపై పెట్టే ఖర్చు ఏడాదికి కేవలం రూ.80 మాత్రమే. అంటే - వైద్య ఆరోగ్య రంగం బడ్జెట్ లో పది శాతం కన్నా తక్కువన్నమాట.

 చిన్నా చితకా రోగాలకు వైద్య సలహా చాలు. అందుకోసం ఇరవై నాలుగ్గంటలూ అందుబాటులో ఉండే 104 ఉచిత కాల్ సెంటరు. నిర్దేశిత దిన వైద్య పరీక్షలు నిర్వహించే 104 సంచార వాహనం. అత్యవసర వైద్య సాయం కోసం 108 అంబులెన్స్. ఇక విధి వికటించి పెద్ద రోగాల బారినపడి ఎవరు కాపాడుతారా అని ఎదురు చూపులు చూసేవారి కోసం ఆరోగ్యశ్రీ.
 పైగా, ఇవన్నీ పూర్తిగా ఉచితం. అన్నీ ఒక్క గొడుగులో. బడుగు ప్రజలు ఒక నాయకుడ్ని చిరకాలం గుర్తుంచుకోవడానికీ, గుండెల్లో దాచుకోవడానికీ ఇలాం టి పథకాలు చాలు. అందుకే వైఎస్సార్ చనిపోయి కూడా ప్రజల దృష్టిలో జీవించే ఉన్నారు.

http://img.sakshi.net/images/cms/2015-08/81440963432_Unknown.jpg
 (సెప్టెంబర్ 2న వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా)
 వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
 మొబైల్ : 98491 30595

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement