కన్నంతలో విన్నంతలో వైఎస్సార్‌ | ys rajashekarareddy death anniversary | Sakshi
Sakshi News home page

కన్నంతలో విన్నంతలో వైఎస్సార్‌

Published Sat, Sep 2 2017 4:30 AM | Last Updated on Sat, Jul 7 2018 3:00 PM

కన్నంతలో విన్నంతలో వైఎస్సార్‌ - Sakshi

కన్నంతలో విన్నంతలో వైఎస్సార్‌

సందర్భం
ఆ ఎమ్మెల్యేకు మాట పెగల్లేదు. బయటకు వచ్చి పేషీ అధికారులతో అన్నాడు, ‘‘చూశారా, సీఎం అంటే ఇలా ఉండాలి, మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరు వెళ్లి అడిగినా, అడిగిన దానిలో సగం కత్తిరించి శాంక్షన్‌ చేసేవాళ్లు. దాంతో ఖర్చు రెట్టింపు చూపించాల్సి వచ్చేది’’

సుదీర్ఘ రాజకీయ జీవితం గడిపిన వై.ఎస్‌. రాజశేఖరరెడ్డికి తనకు తానుగా ప్రజలందరికీ మేలు చేసే అవకాశం పూర్తిగా లభించింది ముఖ్యమంత్రి అయిన తరువాతనే. రాజకీయ ప్రవేశం చేసిన తొలినాళ్లలో నిర్వహించిన మంత్రి పదవులు మినహా ఆయన ఎక్కువ కాలం సచివాలయానికి, ఆఫీసు ఫైళ్ళకు దూరంగా, పార్లమెంటు సభ్యుడిగానో లేదా ప్రతిపక్ష నాయకుడిగానో ఉండిపోయారు. అలాగే వైద్య విద్య పూర్తి చేసుకున్న తొలినాళ్లలో చేసిన డాక్టరు ప్రాక్టీసు తప్పిస్తే తదనంతర కాలంలో ఆయన ఆ పనిచేసిన దాఖలాలు లేవు.

ఒక రాజకీయ నాయకుడిగా, ఒక వైద్యుడిగా తను అనుకున్న విధంగా చేస్తూ పోవడానికి వెసులుబాటు లభించింది ముఖ్యమంత్రి అయినప్పుడే. ఈ అరుదయిన అవకాశాన్ని (గతంలో కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులు ఎవ్వరూ ఒకే విడతలో నిరవధికంగా అయిదేళ్ల పదవీకాలం పూర్తి చేసుకోలేదు) వైఎస్‌ పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. ప్రజలకు పనికొచ్చే అనేక మంచి పనులు చేసిందీ ఆ సమయంలోనే. వై.ఎస్‌. చనిపోయిన ఇన్నేళ్ల తరువాత కూడా ఆయన వల్ల మేళ్లు పొందిన వాళ్లు మాత్రం వాటిని ఇంకా జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నారు. వీళ్లేమీ బడా బడా కాంట్రాక్టర్లు కాదు, గొప్ప గొప్ప రాజకీయ నాయకులు అంతకంటే కాదు. వారందరూ సామాన్యులు. ఇందుకు సంబంధించి కొన్ని ఉదాహరణలను– కన్నవి, విన్నవి, ఉదహరించడమే ఈ వ్యాసకర్త ఉద్దేశం.

ప్రింటింగు ప్రెస్సుల్లో అనవసరమైన కాగితాలు రద్దుగా పేరుకు పోతుంటాయి. కొంతమంది వాటిని అమ్ముకుని పొట్టపోసుకుంటూ ఉంటారు. అలా జీవనం సాగించే ప్రకాశ్‌ అనే వ్యక్తికి గుండె జబ్బు అని డాక్టర్లు చెప్పారు. వెంటనే ఆపరేషన్‌ చేయాలన్నారు. ఆ మాటతో అతడికి గుండె జారిపోయింది. ఆ ప్రెస్సు యజమాని, ఈ విషయాన్ని జర్నలిస్ట్‌ సంఘం నాయకుడు అమర్‌ చెవిన వేసి, ఏదైనా సాయం జరిగేలా చూడమన్నాడు. అమర్‌ వెంటనే వైఎస్‌ని కలసి విషయం చెప్పారు. తక్షణ సాయం అందించమని వైఎస్‌ తన పేషీ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అయితే సంబంధిత ఉత్తర్వులు వచ్చేలోగానే ఆ రోగి మరణించిన సంగతి సీఎంకు తెలిసింది. సహాయనిధి వ్యవహారాలు చూసే అధికారిని పిలిచి, వెంటనే ఆ రోగి ఇంటికి వెళ్లి ప్రభుత్వం తరపున రెండు లక్షల ఆర్థిక సాయం అందించి రావాలని కోరారు.

వైఎస్‌ ముఖ్యమంత్రి అయిన కొన్ని నెలలకే ముఖ్యమంత్రి సహాయ నిధి ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడింది. అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇదే పరిస్థితి తలెత్తిందని అధికారులు చెప్పేవారు. దీనికి కారణం వారిద్దరి చేతికీ ఎముక లేకపోవడం. ఒకసారి ఒక ప్రముఖ శాసనసభ్యుడు వారికి సంబంధించిన వారి వైద్యం కోసం ఆర్థిక సాయం కోరుతూ ఒక అర్జీ వైఎస్‌ చేతికి ఇచ్చారు. అదంతా చదివి వైఎస్‌ ఇలా అన్నారు. ‘నేను డాక్టరుగా చెబుతున్నా విను. ఈ జబ్బుకి నువ్వడిగిన యాభయ్‌ వేలు ఏమాత్రం సరిపోవు. రెండు లక్షలు లేనిదే వైద్యం జరగదు. అంచేత అంత డబ్బు ఇస్తాను, వైద్యం చేయించు’

ఆ ఎమ్మెల్యేకు మాట పెగల్లేదు. బయటకు వచ్చి పేషీ అధికారులతో అన్నాడు, ‘‘చూశారా, సీఎం అంటే ఇలా ఉండాలి, మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరు వెళ్లి అడిగినా, అడిగిన దానిలో సగం కత్తిరించి శాంక్షన్‌ చేసేవాళ్లు. దాంతో ఖర్చు రెట్టింపు చూపించాల్సి వచ్చేది’’

వైఎస్‌ఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఇంగ్లిష్‌ పత్రిక విలేకరి తన కుమార్తె పెండ్లికి పిలవడానికి భార్యను వెంటబెట్టుకుని క్యాంప్‌ ఆఫీసుకు వెళ్లారు. వైఎస్‌ వారిని కూర్చోబెట్టమని సిబ్బందికి చెప్పి లోపలకు వెళ్లారు. సిబ్బంది వారిని ప్రవేశ ద్వారం వద్ద కుర్చీల్లో కూర్చోబెట్టారు. సీఎం కాసేపటి తరువాత వచ్చి బయట కూర్చుని ఉన్న భార్యాభర్తలను చూసి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గబగబా విలేకరి భార్య దగ్గరికి వెళ్లి, ‘మీరు మాఇంటి ఆడపడుచు వంటివారు, మీకు సరిగా మర్యాద జరగలేదు, మన్నించమని’ఒకటికి రెండుసార్లు అనడంతో ఆవిడ విస్తుపోయారు. వారిని లోపలకు తీసుకుని వెళ్లి, ‘మీకు ఎంతమంది పిల్లలు, ఎందరి పెళ్లిళ్లు అయ్యాయి’అంటూ ఆప్యాయంగా వివరాలు కనుక్కున్నారు. ఇన్నేళ్ల తరువాత కూడా తెలంగాణ ప్రాంతానికి చెందిన ఆ విలేకరి ఈ సంగతి గుర్తు చేసుకుంటూ ఉంటారు.

పోతే, ఇది వైఎస్‌ వ్యవహార శైలితో ముడిపడివున్న ఒక విషయం. ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి మోహన్‌ కందా తన జీవితానుభవాలతో కూర్చిన ‘మోహన మకరందం’ అనే పుస్తకంలో ప్రస్తావించారు. అప్పుడు చంద్రబాబునాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి. వైఎస్‌ ప్రతిపక్ష నేత. 2003లో అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని చంద్రబాబు నిర్ణయించారు. కానీ ఎలక్షన్‌ కమిషనర్‌ లింగ్డో ఒప్పుకోలేదు. ఓటర్ల జాబితాలో సవరణల ప్రక్రియ పూర్తయిన తరువాతనే ఎన్నికలు జరగాలని నిర్ణయించారు. దాంతో కొన్ని నెలల పాటు ఆపద్ధర్మ ప్రభుత్వం నడవాల్సిన పరిస్థితి.

ఈలోగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం పని తీరుపై రోజువారీ నివేదికలు మీడియాలో ఇస్తుండేవారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రికి అలా ప్రజల డబ్బు ఖర్చు చేసే హక్కు లేదంటూ కాంగ్రెస్‌ యాగీ మొదలు పెట్టింది. చీఫ్‌ సెక్రటరీగా మోహన్‌ కందా బాబుకు సాయం చేస్తున్నారని వాళ్లు అనుమానించడం మొదలెట్టారు. అంతలో కేంద్ర ప్రభుత్వం కూడా ముందస్తు ఎన్నికలకు నగారా మోగించింది. అసెంబ్లీ, లోకసభ ఎన్నికలు జమిలిగా జరపాలని చంద్రబాబు కేబినెట్‌ తీర్మానించింది. కేబినెట్‌ నిర్ణయానికి అనుగుణంగా ప్రధాన కార్యదర్శి మోహన్‌ కందా కేంద్రానికి లేఖ రాయడం జరిగిపోయింది. సీఎస్‌ ఉత్తరం రాయడాన్ని వై.ఎస్‌. తప్పు పడుతూ పత్రికా ప్రకటన చేశారు. ‘ఇవన్నీ రాజకీయ నిర్ణయాలు, ఐ.ఎ.ఎస్‌. అధికారికి ఏం సంబంధం?’అనేది ఆయన వాదన.

ఎన్నికలు జరిగాయి. వైఎస్‌ ముఖ్యమంత్రి అయ్యారు. కందా వైఎస్‌ని కలసి ప్రధాన కార్యదర్శి బాధ్యతల నుంచి తప్పించమని కోరారు. కందా చేసిన పనులు ప్రతిపక్ష నేతగా వైఎస్‌కు నచ్చని మాట నిజమే. అయితే ఒక అధికారిగా తన బాధ్యత నిర్వర్తించారు తప్పితే రాజకీయ దురుద్దేశాలు ఆయనకు లేవన్న విషయాన్ని వైఎస్‌ గ్రహించారు. కనకనే ఆయనతో అన్నారు. ‘‘సీఎస్‌ పదవిలో కొనసాగాలని మిమ్మల్ని కోరాలని నేను నిర్ణయించుకున్నాను.’’వైఎస్‌ ఇంకో మాట కూడా అన్నారు మోహన్‌ కందాతో ఇంగ్లిష్‌లో. ‘నాతో వ్యవహారం చాలా సులువని మీరు త్వరలోనే గ్రహిస్తారు’అన్నది దాని భావం.

 పదవీ విరమణ అనంతరం కందా రాసుకున్న ఆ పుస్తకంలో ఆ ఇద్దరు ముఖ్యమంత్రుల వ్యవహార శైలి గురించి ఇలా ఉదహరించారు.
‘‘ఏదైనా ఆయన దృష్టికి తేకపోతే, ‘ఇది నాకు ఎందుకు చెప్పలేదు’అనేవారు బాబు.’’

‘‘అదే వైఎస్సార్‌ అయితే, ‘ఇది నాకెందుకు చెబుతున్నారు’ అని అడిగేవారు’’ వైఎస్‌ గురించిన ఇలాంటి విశేషాలు ఎన్నో ఉన్నాయని ఎరిగినవారు చెబుతుంటారు.     

(నేడు వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి వర్ధంతి)
వ్యాసకర్త ఆకాశవాణి మాజీ ప్రయోక్త  మొబైల్‌: 9849130595
భండారు శ్రీనివాసరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement