ప్రైవేటీకరణ విధానాలు, ప్రభుత్వ సంస్థల విక్రయాలు అమలు జరపటంలో చంద్రబాబు నాయుడుకు ఉన్న నైపుణ్యం దేశంలోని ఏ ముఖ్యమంత్రికీ లేదు. చంద్రబాబు చెప్పే మాటలకు రెండు అర్థాలు ఉంటాయి. ఆయన నోటి నుండి ఫలానా పని చేస్తానని వచ్చిందంటే, ఆచరణలో చేయనని చెప్ప టమే. గత ఎన్నికల ప్రణాళికలో రైతు భరోసా ముందస్తు పెట్టుబడిని 13,500 నుంచి 20 వేలకు పెంచుతాననీ, కరెంట్ చార్జీలు పెంచననీ చెప్పారు.
రైతు భరోసా డబ్బులు ఇంతవరకూ ఇవ్వలేదు. కరెంట్ చార్జీలు విపరీతంగా పెంచారు. అమ్మకు వందనం కింద ప్రతి పిల్ల, పిల్లవాడికి 15 వేలు ఇస్తాననీ, నిరుద్యోగ భృతి నెలకు 3 వేలు ఇస్తాననీ, వాలంటీర్లను కొనసాగించి వారి గౌరవ వేతనం 10 వేలకు పెంచి ఇస్తాననీ చెప్పారు. వాటిల్లో ఏదీ అమలు చేయక పోగా, ప్రభుత్వ రంగసంస్థలను ప్రైవేట్ పరం చేస్తున్నారు.
ఏపీ ఆయిల్ ఫెడ్ ప్రైవేటీకరణ: ఏపీ ఆయిల్ ఫెడ్ 1980లో ఏపీ కో–ఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ కింద ఏర్పాటయ్యింది. దీనికి అనుబంధంగా పశ్చిమ గోదావరి జల్లా పెదవేగిలో 1992లో ప్రత్యేకంగా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేశారు. ఈ యూనిట్ 2019–23 మధ్య రికార్డు స్థాయిలో లక్షా 25 వేల టన్నుల పామాయిల్‌ను ప్రాసెస్ చేసే స్థాయికి ఎదిగింది. ప్రస్తుతం ఎఫ్‌ఎఫ్‌జీ (తాజా గెలలు) ప్రాసెసింగ్ ద్వారా టన్నుకు 3,500 రూపాయల లాభం ఆర్జిస్తోంది. నేడు 168 కోట్ల లాభాల్లో ఉంది.
దీని ద్వారా 2.50 లక్షల మంది ఆయిల్ పామ్ రైతులు ప్రయోజనం పొందుతున్నారు. ఆయిల్ ఫెడ్ ఆధునీకరణకు నిధులు లేవనే సాకుతో చంద్రబాబు ప్రభుత్వం టీడీపీకి చెందిన బడా పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ప్లాంట్ ఆధునీకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయా ల్సిన పని లేదు. జాతీయ పామాయిల్ మిషన్ ద్వారా నిధులు సాధించుకోవచ్చు.
ఆ ప్రయత్నం చేయకుండా పబ్లిక్, ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ పద్ధతిలో ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తోంది.ఇందుకు చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని వ్యవసాయ శాఖమంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. కాకినాడ, ఏలూరు జిల్లాల్లో ఆయిల్ పామ్ రైతులు మండల, గ్రామ స్థాయి సమావేశాలు జరిపి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానాలు చేశారు.
స్టేట్ సెంట్రల్ లేబొరేటరీ ప్రైవేటీకరణ: పులివెందులలో ఉన్న ఏపీ స్టేట్ సెంట్రల్ లేబొరేటరీ నిర్వహణ భారంగా ఉందన్న పేరుతో ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అత్యాధునిక పరికరాలతో కూడిన ఈ ల్యాబ్ పాలు, పాల ఉత్పత్తులలో విషపూరిత రసాయనాలను, ఆహార పదార్థాలు, మంచి నీరు, మాంసం, గుడ్లు, రొయ్యలు, ఎరువులు, మందుల్లో కల్తీని గుర్తిస్తుంది.
ఇది ఏర్పాటు కాకముందు వీటి శాంపిల్స్‌ను కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ ల్యాబులకు పంపేవారు. ఒక్కోశాంపిల్‌కు 2,500 నుంచి 30 వేల వరకు ఖర్చయ్యేది. ఆ సొమ్మంతా ఈ ల్యాబ్ వల్ల ఆదా అయ్యింది. ఈ ల్యాబ్‌ను ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టడం వెనుక చంద్రబాబు ప్రయోజనాలు ఇమిడి ఉండగా, 2.5 లక్షల మంది రైతుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది.
పోర్టుల ప్రైవేటీకరణ: ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయ డంలో నిష్ణాతుడైన చంద్రబాబు, ప్రభుత్వ ఆధ్వర్యంలోని మూడు ప్రధాన పోర్టులను ప్రైవేట్ పరం చేసేందుకు వేగంగా చర్యలు చేపట్టారు. పనులు జరుగుతూ 50 శాతం పైగా పూర్తయిన రామాయ ణపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు టెండర్లు పిలవటం చర్చనీయాంశంగా మారింది.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ: తెలంగాణలో నాలుగు మెడికల్ కాలేజీలకు నేషనల్ మెడికల్ కమిషన్ అనుమతించింది. ఆంధ్ర ప్రదేశ్‌కు అనుమతి ఇస్తామంటే ఏపీ ప్రభుత్వం వద్దంటోంది. పులివెందుల ప్రభుత్వ మెడికల్ కళాశాలకు అనుమతిస్తూ 50 మెడికల్ సీట్లు నేషనల్ మెడికల్ కౌన్సిల్ కేటాయించింది.
కళాశాల నిర్వహణ తమ వల్ల కాదంటూ అనుమతి వెనక్కి తీసుకోవాలని చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కౌన్సిల్‌కు లేఖ రాయటం జరిగింది. ఒక్క మెడి కల్ కాలేజీ నిర్వహణే చేతగాని కూటమి ప్రభుత్వం, రాష్ట్ర పాలనను ఎలా చేయగలుగుతుంది? పేద కుటుంబాల పిల్లలు రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వల్ల వైద్య విద్యకు దూరమయ్యారు.
ప్రభుత్వమే వైద్య విద్యను అందించటం చంద్రబాబుకు ఇష్టం ఉండదు. అందుకే గుజరాత్ తరహాలో పీపీపీ మోడల్‌లో ప్రైవేట్ వ్యక్తులకు వైద్య కళాశాలను కట్టబెడుతున్నారు. పాడేరు, మార్కాపురం, ఆదోని, మదనపల్లె, పులివెందుల కాలేజీలను 2024లో ప్రారంభించాల్సి ఉంది.
ఈ కాలేజీల తనిఖీలకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ వస్తుందని తెలిసినా, అందుకు ప్రభుత్వం వసతులు సమకూర్చలేదు. వసతులు సమకూర్చి ఉంటే, ప్రతి కళాశాలకు 150 సీట్ల చొప్పున అనుమతులు వచ్చేవి. తాను అధికారంలోకి వస్తే మొత్తం సీట్లు ఫ్రీగా ఇస్తానని చెప్పిన చంద్రబాబు సీట్లు కాదు,ఏకంగా మెడికల్ కాలేజీలనే అమ్మివేస్తున్నాడు.
ప్రైవేట్ చేతుల్లోకి ఆరోగ్యశ్రీ: ఆరోగ్యశ్రీ పథకాన్ని 2007లో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశ పెట్టారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాన్ని వైఎస్‌ఆర్ ఆరోగ్యశ్రీగా మార్చి 25 లక్షల వరకు వైద్యం అందేలా మార్పులు చేశారు.చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే దాన్ని ఎన్‌టీఆర్ వైద్య సేవగా మార్చారు. పేదలకు మెరుగైన వైద్యం అందిస్తానని చెప్పారు. కానీ ఈ సేవల కింద డాక్టర్లకు 3 వేల కోట్ల రూపాయల బకాయిలు చెల్లించక పోవటంతో వైద్య సేవలు ఆపివేస్తున్నట్లు డాక్టర్ల సంఘం ప్రకటించింది.
ఈ పరిణామాల నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఎన్‌టీఆర్ వైద్య సేవలను బీమా కంపెనీలకు అప్పగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఇన్సూరెన్స్ కంపెనీలకు ముందుగానే ప్రీమియం డబ్బులు చెల్లిస్తుంది. ఆరోగ్యశ్రీ పథకం కింద 25 లక్షల వరకు పేదలు వైద్యం ఉచితంగా పొందే అవకాశం ఉంటే, ఇన్సూరెన్స్ కంపెనీలకు 2.5 లక్షల వరకే బీమా ప్రీమియం చెల్లిస్తుంది. నేడు ప్రమాదకరమైన జబ్బులకు ఆపరేషన్ చేయాలంటే 10 లక్షలకు పైగానే ఖర్చవుతోంది. దీనివల్ల పేదలకు వైద్యం సమస్యగా మారుతుంది.
చంద్రబాబు మొదటి నుంచీ ప్రభుత్వ రంగానికి వ్యతిరేకంగా, ప్రైవేట్ రంగానికి అనుకూలంగా ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆయన పాలనలో ప్రైవేటీకరణ వేగంగా సాగింది. అది రెండు దశల్లో ఉంది. 1999–2002 వరకు మొదటి దశ. ఈ దశలో 19 సంస్థలను ప్రైవేటీకరణకు లక్ష్యంగా పెట్టుకుని వాటిలో 18 సంస్థలను ప్రైవేటు పరం చేశారు. 2002 –2004 మార్చి వరకు సాగిన రెండవ దశలో 68 సంస్థలను టార్గెట్‌గా పెట్టుకుని, వాటిల్లో 30 సంస్థలను ప్రైవేట్ పరం చేయటం జరిగింది.
మూసి వేసిన సంస్థలు 22 కాగా, పెట్టుబడులు ఉపసంహరించినవి 9. ప్రైవేట్ పరమైన వాటిల్లో ఉమ్మడి రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ, ఏపీ జౌళి అభివృద్ధి సంస్థ, ఆల్విన్ వాచెస్ లిమిటెడ్, నెల్లూరు కో ఆపరేటివ్ స్పిన్నింగ్ మిల్, ఏపీ ఫిషరీస్ డెవలఫ్‌మెంట్ కార్పోరేషన్, ఏపీ ఎలక్ట్రానిక్ డెవలప్‌మెంట్ కార్పొ రేషన్, కరీంనగర్ కో– ఆపరేటివ్ స్పిన్నింగ్ మిల్లు, షుగర్ మిల్లులు, పేపర్ మిల్లులు ఉన్నాయి. చంద్రబాబు మోసపూరిత మాటలను, ప్రైవేటీకరణ విధానా లను వ్యతిరేకిస్తూ, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ఐక్యంగా ఉద్యమించాలి.
-వ్యాసకర్త రైతు కూలీ సంఘం (ఆం.ప్ర.) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ‘ 98859 83526
-బొల్లిముంతసాంబశివరావు
Comments
Please login to add a commentAdd a comment