జనం మద్దతే జగన్‌ బలం | Imam Article On YS jagan Praja Sankalpa Yatra | Sakshi
Sakshi News home page

జనం మద్దతే జగన్‌ బలం

Published Fri, Nov 6 2020 8:20 AM | Last Updated on Fri, Nov 6 2020 8:32 AM

Imam Article On YS jagan Praja Sankalpa Yatra - Sakshi

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర మొదలు పెట్టి నేటికి సరిగ్గా మూడేళ్లయింది. గతంలో రాజశేఖరరెడ్డి లేపాక్షి నుండి పోతిరెడ్డి వరకు రాయలసీమ సాగు, తాగు నీటికోసం, హంద్రీనీవా, గాలేరు నగరి వెలిగొండ ప్రాజెక్టుల కోసం పాదయాత్ర,లు తలపెట్టారు. ఆ తరువాత ప్రజాప్రస్థానం పేరుతో  చేవెళ్ళ నుండి ఇచ్ఛాపురం వరకు చేపట్టిన పాదయాత్ర ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్‌ చరిత్రనే తిరగరాసింది. తరువాత జగనన్న వదలిన బాణాన్ని నేను అంటూ అన్నకు మద్దతుగా వైఎస్‌ షర్మిల చేపట్టిన పాదయాత్ర  ఇడుపులపాయ నుండి ఇచ్ఛాపురం వరకు విజయవంతంగా కొనసాగింది. వైఎస్సార్, షర్మిల చేపట్టిన పాదయాత్రలు ఉభయ రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు జరిగినవి. వైఎస్‌ జగన్‌ ప్రజాసంకల్ప యాత్ర మాత్రం రాష్ట్ర విభజనానంతరం జరిగింది. ఇది ప్రజలు పడే బాధలను తీర్చడానికి జరిపిన పాదయాత్ర. వారి బాధలు అక్కడికక్కడే తీర్చడానికి ఆయన చెప్పిన అంశాలు తరువాత ఒక ప్రజా మేనిఫెస్టోకు రూపమిచ్చాయి. ఆయన అధికారంలోకి వచ్చాక ప్రజల అవసరాలు తీర్చడానికి ఆ మేనిఫెస్టో ఎంతగానో ఉపయోగపడింది.

వ్యవసాయరంగం, సంక్షేమరంగం, ఫీజు రీయింబర్స్‌ మెంట్, పింఛన్, ఆరోగ్యశ్రీ... ఇలా సంక్షేమం, సుపరిపాలన పేరుతో వైఎస్‌ జగన్‌ అమలుచేస్తున్న అనేక పథకాలను నేడు జాతీయంగా చర్చిస్తున్నారు. ఏపీలో అవలంబిస్తున్న విధానాలు పరిపాలనా, వికేంద్రీకరణ కోసం గ్రామ స్వరాజ్యం పేరిట జగన్‌ ఏర్పాటుచేసిన నూతన పాలనా వ్యవస్థ, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, బీసీలకు ఇచ్చిన ప్రాధాన్యత, వారికి కల్పించిన సంక్షేమ కార్యక్రమాలు, వారి అభివృద్ధి కోసం ఏర్పాటుచేసిన కార్పొరేషన్లు ఏరకంగా చూసినా వినూత్నమైనవి. దేశచరిత్రలోనే తొలిసారిగా గ్రామ సచివాలయాల ఏర్పాటు, లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పిం చడం, గ్రామీణ పరిపాలనా వికేంద్రీకరణను అట్టడుగు ప్రజలకు  పరిపాలనను అందించే విధంగా చేయడం గొప్ప విషయం. ఇవన్నీ జగన్‌కు పాదయాత్ర కాలంలో స్ఫురించినవి.. పైగా ఆయన అర్థం చేసుకుని తీసుకొచ్చిన పాలనా సంస్కరణలే.

ఆరోజు జగన్‌ వదలిన బాణాన్ని నేను అంటూ వైఎస్సార్‌ తనయ షర్మిల జరిపిన పాదయాత్ర ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీ నిలదొక్కుకోవడానికి, వైఎస్‌ కుటుంబం ప్రతిష్ఠ పెంచడానికి, పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపడానికి ఇతోధికంగా దోహదపడింది. మరోవైపున సోనియాగాంధీ వత్తాసుతో కాంగ్రెస్, టీడీపీలు రెండూ కుమ్మక్కై చేసిన నేరారోపణల ఫలితంగా 16 నెలలు జైలులో గడిపారు వైఎస్‌ జగన్‌. కనీవినీ ఎరుగని కష్టాలకు, బాధలకు ఓర్చి తట్టుకున్న జగన్‌ మనోనిబ్బరం, మనోస్థైర్యం ప్రజల నుండి వచ్చినవే. వైఎస్సార్‌ తనయుడిని కడగండ్ల పాలు చేసి తండ్రి వారసత్వాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలని కాంగ్రెస్‌ చేసిన కుట్రపూరిత ప్రయత్నాలను ప్రజలు తిరస్కరించి వైఎస్సార్‌ తనయుడి వైపే మొగ్గు చూపారు. కాంగ్రెస్‌ పార్టీకి డిపాజిట్లు కూడా రాని పరిస్థితి. 2019లో జరిగిన విభజనానంతర ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశాన్ని కూడా ప్రజలు తిరస్కరించారు. స్వల్పతేడాతో 2014లో అధికారానికి దూరమైన వైఎస్‌ జగన్‌కు 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బ్రహ్మరథం పట్టి 151 అసెంబ్లీ సీట్లు ఇవ్వడం ఆయన చేసిన పాదయాత్రల ఫలితమే.

గ్రామ స్వరాజ్యం పేరుతో పరిపాలన సాగించడం వైఎస్‌ జగన్‌ సాధించిన పరిణతికి నిదర్శనం. పాదయాత్ర ద్వారా ప్రజలతో నిత్యం సంబంధాలు కొనసాగించిన జగన్‌ వారి నుంచి స్ఫూర్తి పొందిన ఫలితమే నేడు ఏపీలో సంక్షేమ పథకాలు ఆకాశమే హద్దు లాగా కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ముగ్గురు నాయకులు ఒకే కుటుంబం నుంచి వేలాది కిలోమీటర్ల దూరం పాదయాత్ర జరపడం ఒక విశేషం కాగా, వైఎస్‌ జగన్‌ పాదయాత్ర ఆంధ్రప్రదేశ్‌లో కీలకమైన పరిణామానికి కారణమైంది. ప్రస్తుత రాజకీయ వాతావరణంలో సంక్షేమానికి చిరునామాగా జగన్‌ మారారు. రాయలసీమలో ఈ రోజు ఇన్ని సేద్యపు నీటి పథకాలు రూపుదిద్దుకున్నాయి అంటే ఆనాడు రాజశేఖరరెడ్డి లేపాక్షి నుండి పోతిరెడ్డి పాడు వరకు చేపట్టిన పాదయాత్రకు కొనసాగింపు ఫలితమే అని గుర్తించాలి. రాష్ట్రం అభివృద్ధిలో నూతన మలుపు తిరగడానికి ఉపయోగపడిన పాదయాత్ర వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర. ఈ సందర్భంగా జగన్‌కు నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు.

ఇమామ్‌
వ్యాసకర్త కదలిక సంపాదకులు
‘ మొబైల్‌: 99899 04389

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement