‘మత్తు వదలరా, ఆ మత్తులో పడితే గమ్మత్తుగ చిత్తవుదువురా’ అని 50 ఏళ్ల క్రితం ఓ సినీకవి రాసిననట్టుగా యువత పెడదారి పడుతోంది. తెలంగాణలో హైదరాబాద్‌తో పాటు పూర్వపు జిల్లాలైన మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, ఖమ్మం మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు కేంద్ర బిందువులుగా మారాయని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాలు అక్రమ రవాణా ప్రదేశాలలో ఉన్నాయి.
అఫ్గానిస్తాన్, మయన్మార్, కొలంబియా, మెక్సికో, పాకిస్తాన్‌తో పాటు ఇండియాను మాదక ద్రవ్య వాణిజ్య కూడలిగా అమెరికా ప్రభుత్వ నివేదిక గతంలో అభివర్ణించింది. అమెరికా డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ, యూకే జాతీయ నేర విభాగం, రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్, ఆస్ట్రేలియా మాదక ద్రవ్య నియంత్రణ విభాగాలు ఎక్కడికక్కడ ఉచ్చు బిగిస్తుండటం వల్ల– దక్షిణ అమెరికాలోని మత్తు వ్యవస్థలు భారత్ వైపు దృష్టి సారిస్తున్నట్లు విశ్లేషణలు స్పష్టీకరిస్తున్నాయి. వాటి ఎజెండాను అమలు కానిస్తే, దేశానికి అంతకు మించిన విపత్తు ఉండదు. యువశక్తిని నిర్వీర్యం చేస్తూ కోట్లాది జీవితాల్ని క్రూరంగా బలి గొంటున్న మాదక ఉగ్రవాదాన్ని ఉపేక్షించడం జాతి భవితకే తీరని చేటు.
– డాక్టర్ ఎం.డి. ఖ్వాజా మొయినొద్దీన్
Comments
Please login to add a commentAdd a comment