సెకండ్ వేవ్‌లో విపరీతంగా పెరుగుతున్న కరోనా కేసులతో తలపడేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాల్సిన తరుణంలో.. టీకాల ఉత్పత్తికి పెట్టుబడి విస్తరణ అవసరాన్ని తీర్చడంలో కేంద్రప్రభుత్వం నత్తనడక సాగిస్తోంది. దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ తయారీ, సరఫరాపై నిర్ణయాధికారం ప్రధానంగా కొద్దిమంది ఉన్నతాధికారులకు కట్టబెట్టడంలోనే అసలు సమస్య దాగి ఉంది. మరోవైపు ప్రధాని మోదీ బిజినెస్ చేయడం బ్యూరోక్రాట్ల పని కాదని ధర్మపన్నాలు పలుకుతున్నారు. అదే సమయంలో వ్యాక్సిన్ల సేకరణ, పంపిణీ బిజినెస్‌ను పూర్తిగా కేంద్రీకరించేశారు. వ్యాక్సిన్ ప్లానింగ్ విషయంలో కేంద్రం స్పష్టంగా వైఫల్యం చెందిందనే చెప్పాలి.
దేశవ్యాప్తంగా కోవిడ్–19 నిరోధక వ్యాక్సిన్ కొరత సంక్షోభం అలుముకుంటోందని వార్తలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ కొరత లేనేలేదని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా తోసిపుచ్చుతోంది. పైగా అందుబాటులో ఉన్న టీకాల నిల్వను రాష్ట్ర ప్రభుత్వాలు సరిగా నిర్వహించడం లేదని కేంద్రం ఆరోపిస్తోంది. కానీ వాస్తవం ఏమిటంటే, అన్ని వ్యాక్సిన్‌ల కొనుగోలు, సరఫరాపై గుత్తాధిపత్యం వహిస్తున్న కేంద్రప్రభుత్వం.. 45 ఏళ్లకు పైబడిన వారికి అధిక సంఖ్యలో వ్యాక్సినేషన్ అందించే ప్రక్రియలో విఫలమైంది. ప్రస్తుతం దేశంలో తయారవుతున్న కోవి షీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ల మొత్తం ఉత్పత్తి సామర్థ్యం రోజుకు 24 లక్షలు మాత్రమే. కానీ, ఇప్పుడు రోజువారీ డిమాండ్ 37 లక్షలకు చేరుకుంది. అంటే రోజువారీ వేయాల్సిన వ్యాక్సిన్ టీకాల కొరత ఇప్పటికే చాలా ఎక్కువగా కనబడుతోంది.
మార్చి నెలలో వ్యాక్సిన్ తీసుకోవడానికి ప్రజలు వెనుకాడటం, కొత్త ఇన్ఫెక్షన్ రేట్లు నియంత్రణలో ఉండటం కారణంగా వ్యాక్సిన్ సరఫరాలకు మించి డిమాండ్ ఏర్పడలేదు. కానీ ఏప్రిల్ 1 నుంచి వైరస్ వ్యాప్తి ఉన్నట్లుండి పెరిగిపోవడం, వ్యాక్సిన్ అర్హుల వయస్సును 45 ఏళ్లకు కుదించడంతో డిమాండ్ అనూహ్యంగా పెరిగిపోయింది. ఇప్పటికే ఉత్పత్తి సామర్థ్యం పెంపుదల సంభవించి ఉండాలి. కానీ దాని ప్లానింగ్ విషయంలో కేంద్రం స్పష్టంగా వైఫల్యం చెందింది. వ్యాక్సిన్ నిల్వలు తరిగిపోయిన తర్వాత రోజువారీ డిమాండ్–సప్లయ్ అంతరం రోజుకు 15 నుంచి 20 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఈ నేపథ్యంలో గురువారం రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్సులో ప్రధాని మోదీ టీకా ఉత్సవ్ గురించి మాట్లాడటం అధివాస్తవికమే అనిపిస్తోంది.
విచిత్రమైన విషయం ఏమిటంటే చాలా రాష్ట్రాల వద్ద రెండు లేక మూడు రోజుల పాటు మాత్రమే వ్యాక్సిన్ సరఫరాలు ఉంటూండటమే. రాజకీయ కారణాల వల్ల మహారాష్ట్రలో వ్యాక్సిన్ కొరతపై తుపాను చెలరేగి ఉండవచ్చు కానీ ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు కూడా తమ వద్ద వ్యాక్సిన్ నిల్వలు హరించుకుపోతున్నాయని చెప్పాయి. ఏపీ, తెలంగాణల్లో జిల్లా స్థాయిలో ఇప్పటికే వ్యాక్సిన్ కొరత ఉంటోందని అపోలో హాస్పిటల్స్ గ్రూప్ సహ యజమాని సంగీతా రెడ్డి చెప్పారు. కాగా సెకండ్ వేవ్ సమయంలో వైరస్ విపరీతంగా పెరుగుతున్న 2 టయర్, 3 టయర్ పట్టణాల్లోని ఆసుపత్రుల్లో, ఇతర గుర్తింపు పొందిన వైద్య కేంద్రాల్లో పొడవాటి క్యూలు కనిపిస్తున్నాయి. అంటే ఏప్రిల్ చివరి నాటికి దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ వ్యాక్సిన్ కోటాను 50 శాతం మేరకు పెంచాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత వైరస్ వ్యాప్తి మే నెల మధ్య వరకు కొనసాగుతుందని నిపుణులు చెబుతుండటంతో వ్యాక్సిన్ డిమాండ్ మరింతగా పెరిగే అవకాశం కూడా ఉంది.
పెరుగుతున్న డిమాండును ఎదుర్కోవడానికి వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్న రెండు సంస్థల ప్రస్తుత ఉత్పత్తి సామర్థ్యం సరిపోతుందా అనేది ప్రధాన ప్రశ్న. సీరమ్ సంస్థ ఉత్పత్తి చేస్తున్న కోవిషీల్డ్, భారత్ బయోటెక్ తయారు చేస్తున్న కోవాగ్జిన్‌ను ఎంత వేగంగా తయారు చేస్తారన్నదానిపైనే ప్రధాని ఆశిస్తున్న టీకా ఉత్సవ్ కార్యక్రమం ఆధారపడి ఉంది. ప్రస్తుతం దేశంలోని మొత్తం వ్యాక్సిన్ సరఫరాలో కోవిషీల్డ్ 90 శాతంగా ఉంది. సీరమ్ ఇనిస్టిట్యూట్ ఒక నెలలో 6 కోట్ల టీకాల సామర్థ్యం కలిగి ఉంది. నెలకు పది కోట్ల టీకాలను తయారు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం ధనసహాయం చేయాలని సీరమ్ సంస్థ ప్రమోటర్ అదార్ పూనవాలా స్పష్టం చేశారు. ప్రస్తుతానికైతే సీరమ్ సంస్థ నెలవారీగా తయారు చేస్తున్న ఆరు కోట్ల టీకాల తయారీ కూడా చేయడం సాధ్యం కాని పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఇక కోవాగ్జిన్ టీకాను తయారు చేస్తున్న భారత్ బయోటిక్ సంస్థ నెలకు కోటి డోసుల కంటే తక్కువ తయారీ సామర్థ్యంతో ఉంది. తన ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి ఆర్థిక సహాయం చేయాలంటూ ఫిబ్రవరి నెలలోనే కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కానీ ఆ అదనపు పెట్టుబడి అవసరాన్ని తీర్చేందుకు మన బడా బాబులు యథాప్రకారమే జాగు చేశారు. వాస్తవమేమిటంటే పెరుగుతున్న కరోనా కేసులతో తలపడేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాల్సిన తరుణంలో టీకాల ఉత్పత్తికి పెట్టుబడి విస్తరణ అవసరాన్ని తీర్చడంలో కేంద్రప్రభుత్వం నత్తనడక సాగిస్తోంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ తయారీ, సరఫరాపై నిర్ణయాధికారం తీసుకునే అధికారాన్ని ప్రధానంగా కొద్దిమంది ఉన్నతాధికారులకు కట్టబెట్టడంలోనే అసలు సమస్య దాగి ఉంది. మరోవైపు ప్రధాని మోదీ బిజినెస్ చేయడం బ్యూరోక్రాట్ల పని కాదని ధర్మపన్నాలు పలుకుతున్నారు. అదే సమయంలో వ్యాక్సిన్ల సేకరణ, పంపిణీ బిజినెస్‌ను ప్రధానంగా పూర్తిగా కేంద్రీకరించేశారు.
ప్రభుత్వమే వ్యాక్సిన్ల ఏకైక కొనుగోలుదారు కాబట్టి సామర్థ్య విస్తరణపై నిర్ణయాలను అది ప్రభావితం చేస్తోంది. దీన్ని ప్రైవేట్ రంగానికి వదిలిపెట్టి దానికి ధర విధించి, పేదలకు సబ్సిడీ కింద అందించి ఉంటే పరిణామాలు మరొక రకంగా ఉండేవి. ప్రస్తుతం పరిణామాలు విషమిస్తున్నప్పుడు మాత్రం పంపిణీ సమస్యలను రాష్ట్రాలపైకి నెట్టేస్తోంది. పైగా కేంద్రం వ్యాక్సిన్‌లను సేకరిస్తుంది తప్ప జిల్లా స్థాయిలో పంపిణీ బాధ్యత రాష్ట్రాలదే అని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ చేతులెత్తేశారు. ప్రత్యేకించి ప్రతిపక్షాలు పాలిస్తున్న రాష్ట్రాలపై మంత్రి నిందమోపుతున్నారు. మరి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లోకూడా వ్యాక్సిన్ కొరత అంత తీవ్రంగా ఉంటున్నం దుకు బాధ్యులెవరో మంత్రిగారే చెప్పాలి మరి. కేంద్రం వ్యాక్సిన్ కొనుగోలుపై గుత్తాధిపత్యం వహిస్తున్నందున అటు కేంద్రం కానీ, ఇటు రాష్ట్రాలు కానీ ఎప్పటికీ వ్యాక్సిన్ సేకర్తలుగానూ, పంపిణీ దారులుగానూ సమర్థంగా వ్యవహరించలేవు. ఫైజర్, జాన్సన్–జాన్సన్, స్పుత్నిక్ వంటి బహుళ వ్యాక్సిన్ తయారీ సంస్థలకు అవకాశమిచ్చి వ్యాక్సిన్ ఉత్పత్తిదారులు, వికేంద్రీకృత ప్రైవేట్ పంపిణీదారుల మధ్య పోటీ నెలకొల్పిన పక్షంలో మాత్రమే వ్యాక్సిన్ సరఫరా సజావుగా సాగడానికి వీలవుతుంది. పైగా కేంద్ర, రాష్ట్రాల మధ్య ప్రస్తుతం నడుస్తున్న రాజకీయ క్రీడను నిరోధించవచ్చు కూడా.
ప్రస్తుతం అభిలషణీమైన వ్యవస్థపై వస్తున్న నిందలకు పరి ష్కారం ప్రధాని తలుపు ముందే ఉంది. లోపభూయిష్టమైన ప్రభుత్వ విధానంలో భాగంగా ఒకవైపు వ్యాక్సిన్ సామర్థ్యంలో కొరత, మరోవైపు మార్కెట్లో మరికొన్ని తయారీ సంస్థలు అందుబాటులో లేకపోవడం నేపథ్యంలో కూడా టీకా ఉత్సవ్ గురించి ప్రధాని మాట్లాడటమే కపట ధోరణిగా భావించాల్సి ఉంటుంది. ఫైజర్ సంస్థ గత డిసెంబర్‌లోనే భారత్‌లో వ్యాక్సిన్ తయారీ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకుంది. కానీ మన బ్యూరోక్రాట్లు ప్రశ్నల వర్షంతో విసిగించడంతో తన దరఖాస్తును ఫైజర్ సంస్థ వెనక్కు తీసుకుంది. అదేవిధంగా స్పుత్నిక్, జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థలు కూడా దేశంలో కరోనా టీకా పంపిణీకి ఆమోదించాల్సిందిగా మన అధికారులకు ఉత్తరం రాశారు. మార్కెట్లో ప్రవేశించాలని ఇతర సమర్థ సంస్థలు కోరుకుంటున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వ అధికారులు ఒకదాని తర్పాత ఒకటిగా సంధిస్తూ వచ్చారు. తాము మాత్రమే వాక్సిన్ ఉత్పత్తి, పంపిణీ బిజి నెస్ చేయగలమని మన సర్కారీ బాబులు ఆలోచిస్తున్నట్లయితే మనం కుప్పగూలిపోవడం తథ్యం. ఎందుకంటే కోట్లాది మనుషుల ప్రాణాలు వారి జీవితాలు ఆధారపడి ఉన్నాయి కాబట్టి వ్యాక్సిన్‌పై ఈ గుత్తాధిపత్యాన్ని మనం ఏమాత్రం భరించలేం. మార్కెట్లో అందుబాటులో ఉన్న అన్ని కరోనా వ్యాక్సిన్‌లనూ ప్రయోగించి యుద్ధాన్ని గెలవలేకపోతే, ప్రభుత్వం తన్ను తాను నిందించుకోవలసి ఉంటుంది.
ఎం.కె. వేణు
వ్యాసకర్త రచయిత, ది వైర్ వ్యవస్థాపకులు
(ది వైర్ సౌజన్యంతో)
వ్యాక్సిన్ కొరత ఎవరి బాధ్యత?
Published Tue, Apr 13 2021 1:12 AM | Last Updated on Tue, Apr 13 2021 2:27 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment