ఇటీవల రాష్ట్రంలో గంజాయి రాజకీయం నడుస్తోంది. గంజాయిని రాష్ట్ర ప్రభుత్వానికి ఆపాదించి మచ్చతెచ్చేందుకు ప్రధాన ప్రతిపక్షం కుటిలనీతిని అవలంబిస్తోంది. దీనిని ఢిల్లీ స్థాయిలోకి తీసుకువెళ్లి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం చేయడం రాష్ట్ర ప్రజలను అవమాన పరిచేదిగా ఉంది. దేశ, విదేశాలకు ఆంధ్రప్రదేశ్ గంజాయి ఎగుమతి కేంద్రంగా ఉన్నదనే అపోహ సృష్టించే ప్రయత్నం అత్యంత ప్రమాదకరం. రాజకీయంగా వైరి వర్గాలు ఆరోపణలు చేసుకోవడం సహజమే. ప్రతిపక్షాలు అధికార పక్షంపై విమర్శలు చేయడం కూడా సహజమే. కానీ గంజాయి విషయం ఒక సున్నితమైన అంశం. దీనిని ఒక రాజకీయ అస్త్రంగా మార్చుకోవాలనే ప్రయత్నం వలన దేశానికీ, ప్రపంచానికీ ఒక తప్పుడు సంకేతం ఇవ్వడమే కాక ఇక్కడి ప్రజల మనోభావాల పైన ప్రభావం చూపిస్తుంది. ఆంధ్ర ప్రజలను దోషులుగా నిలబెట్టే ప్రయత్నంగా భావించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
గతంలో మన రాష్ట్రానికి సీఎంగా పనిచేసిన ఒక నాయకుడు ‘కేంద్రం ఒక మిథ్య’ అంటూ విమర్శించేవారు. కేంద్రం ఒక మిథ్య అంటే రాష్ట్రం ఒక మి«థ్య కాదా? ఈ తరహా విమర్శలు మంచిది కాదంటూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకమైన పార్టీలతో సహా రాజకీయ విజ్ఞులు దానిపై ఘాటుగా స్పందిం చడంతో ఆయన ఆ మాటను మాట్లాడకుండా హుందాతనాన్ని కాపాడుకున్నారు. సరిగ్గా ఇప్పుడు గంజాయి విషయంలో ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం చేస్తున్న విమర్శలు ఇదే కోవకు చెందుతాయి. గంజాయిని రాష్ట్ర ప్రభుత్వమే ఎగుమతులు చేస్తున్నట్లుగా ఉన్న వారి విమర్శలు ప్రజాస్వామ్యంలో అత్యంత ప్రమాదకరం
గంజాయి వంటి మత్తు పదార్థాలను ఎవరూ ప్రోత్సహించరు. ఇది అంతర్రాష్ట్ర సమస్య. ఒక రాష్ట్రం కట్టుదిట్టంగా అమలు చేసినా మరో రాష్ట్రంలోనో ఇంకో రాష్ట్రంలోనో ఎగుమతులు జరగవచ్చు. వాటిని సమూలంగా నిర్మూలించేందుకు కొంత సమయం పట్టవచ్చు. ముఖ్యంగా అటవీ ప్రాంతాలలో జరిగే ఈ తరహా విషయాలను నిర్మూలించేందుకు తప్పకుండా సమయం పడుతుంది. స్మగ్లర్లు ఆ ప్రాంతాలలో నివసించే నిరుపేదలను ఇందుకు పావులుగా వాడుకొనే పరిస్థితులలో దీనిని నిర్మూలించే ప్రక్రియలో సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి.
గంజాయి విషయం కూడా కొత్తగా ఏర్పడిన సమస్య కాదు. గత ప్రభుత్వ హయాంలో ఒక మంత్రి మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు, వీడియో టేపులు ఇటీవల ప్రచారంలోకి వచ్చాయి. గంజాయి ఎగుమతులలో రాష్ట్రం నంబర్ వన్‌గా ఉన్నదంటూ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంత్రివర్గ సమావేశంలో వ్యాఖ్యానించారు అంటూ ఆ మంత్రి వ్యాఖ్యలు చేయడం ఆ వీడియో సారాంశం. అంటే గంజాయిని అప్పటి ప్రభుత్వమే ప్రోత్సహిం చినట్లా? ఈ వ్యాఖ్యల ద్వారా గత ప్రభుత్వ హయాంలో ఈ సమస్య ఏ స్థాయిలో ఉందో ఊహించవచ్చు. ఇది రాత్రికి రాత్రి పరిష్కారం అయ్యే సమస్య కాదు. కావాలని బురద చల్లే ప్రయత్నం వల్ల రాష్ట్రానికీ, ప్రభుత్వానికీ, ప్రజలకు చెడ్డపేరు తెస్తే చరిత్ర క్షమించదు. ప్రజలు అంతకన్నా క్షమించరు. బాధ్యతగల ప్రతిపక్షం, ఆ పక్ష నాయకుడు వ్యవహరించాల్సిన తీరు ఇది కాదని రాజకీయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
గంజాయి విషయంలో గత ప్రభుత్వంపై అనేక ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ఆ సమయంలో ఒక పక్క గంజాయితో పాటు, మరోపక్క ఎర్రచందనం స్మగ్లింగ్ విషయంలో అప్పటి మంత్రులు, సాక్షాత్తు ముఖ్యమంత్రి తనయుడిపై ఆరోపణలు వచ్చాయి. ఈ పరిణామాలను ఎదుర్కొనేందుకు గంజాయి దొంగలంటూ అమాయకులైన నిరుపేదలను ఎన్‌కౌంటర్ చేసింది ప్రభుత్వం.
ఈ విషయంలో అప్పటి తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ సమావేశంలో ఒక లోక్‌సభ సభ్యుడు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబును సూటిగా ప్రశ్నిస్తూ ‘స్మగ్లర్లను వదిలేసి అమాయకులైన నిరుపేదలను పొట్టన పెట్టుకున్నది మన ప్రభుత్వం, ఇది చాలా దారుణం’ అంటూ ప్రశ్నించగా ఆయన సమాధానం దాటవేశారంటూ వార్తలు వచ్చాయి. ఈ పరిణామాలతో అప్పటి స్మగ్లర్లతో ప్రభుత్వంలో ఉన్న నేతల సంబంధాలు బయటపడ్డాయి. దీనిని మళ్ళీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఆపాదించే ప్రయత్నాన్ని విజ్ఞులు ఎవరు సమర్థించరు. ఈ తరహా విష సంస్కృతి రాజకీయాలలో తప్పుడు సంకేతాలను ఇస్తుంది. రాజ్యాంగ బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని గౌరవించాలనే కనీస విలువలు మంటగలపడం దురదృష్టకరం.
నేలపూడి స్టాలిన్ బాబు
వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకులు
మొబైల్: 83746 69988
Comments
Please login to add a commentAdd a comment