సమానత్వానికి ప్రతీక చాపకూడు | Sakshi Guest Column On Palnati Yuddham Chapakudu | Sakshi
Sakshi News home page

సమానత్వానికి ప్రతీక చాపకూడు

Published Mon, Dec 11 2023 4:59 AM | Last Updated on Mon, Dec 11 2023 4:59 AM

Sakshi Guest Column On Palnati Yuddham Chapakudu

పల్నాటి వీరారాధన ఉత్సవాలు

భారతదేశ చరిత్రలో మొట్టమొదటి ‘సమతా సమానతా వాదం’ పల్నాటి వీరుల మస్తిష్కంలో మనకు గోచరిస్తుంది. అప్పటి వరకు ఉన్న కుల నిచ్చెన మెట్లను ధ్వంసం చేసి సమతాస్మృతి నిర్మాణం జరిగేట్లు పల్నాటి వీరులు కృషిచేశారు. కాబట్టే వెయ్యేండ్ల క్రితం ఆ వీరులు నేలకొరిగిన ‘కార్యమపూడి’ (కారెంపూడి) రణక్షేత్రంలో నేటికీ వారిని స్మరించుకుంటూ, వారి ఆయుధాలను పూజించుకుంటూ, సమతావాదం కోసం పల్నాటి ఆచారవంతులు కృషి చేస్తున్నారు.

భారత దేశ చరిత్రలో అంటరానితనం నిర్మూలనకు వెయ్యేండ్ల క్రితమే పల్నాడులో బ్రహ్మనాయుడు కృషి చేశాడు. దళితులకు ఆలయ ప్రవేశం గావించాడు. ‘చాపకూడు సిద్ధాంతా’న్ని అమలు చేశాడు. రాజ్యాధికారంలో అన్ని కులాల వారికీ... అంటే శూద్రులకూ, రేచర్ల మాలలకూ సమ ప్రాధాన్యం ఇచ్చాడు. మొదటగా రేచర్ల మాలలకు రాజ్య సర్వసైన్యాధ్యక్ష పదవిని ఇచ్చింది పల్నాటి రాజ్యమే!

పల్నాడు ప్రాంతంలో 1182వ సంవత్సరంలో జరిగిన యుద్ధం ‘పల్నాటి యుద్ధం’గా చరిత్రలో నిలిచింది. మహాభారతానికీ, పల్నాటి వీర చరిత్రకూ దగ్గరి పోలికలు ఉండటం చేత పల్నాటి చరిత్రను ‘ఆంధ్ర భారతం’ అని కూడా అంటారు.

పల్నాటి చరిత్రలో నలగామరాజు, నరసింగ రాజు, మలిదేవరాజులు మువ్వురూ వేర్వేరు తల్లుల బిడ్డలు. వీరి తండ్రి అనుగురాజు. వీరి మధ్య కోడిపందాల మూలంగానూ, రాజకీయ కుట్ర మూలంగానూ ద్వేషాలు రగిలి యుద్ధానికి దారితీసింది. ఈ యుద్ధం కూడా రాజ్యభాగం కోసమే జరిగింది. బాలచంద్రుని మరణానికీ మహాభారతంలో అభిమన్యుని మరణానికీ మధ్య సారూప్యం ఉంది.

పల్నాటి యుద్ధంలో వాడిన ఆయుధాలను ప్రతి సంవత్సరం కార్తీకమాసం చివరి అమావాస్య రోజున నాగులేటిలో స్నానమాచరింప చేసి వీరారాధన ఉత్స వాలను ప్రారంభించటం ఆనవాయితీ. మార్గశిర మాసంలోని మొదటి రోజు నుంచి పంచమిరోజు వరకు 5 రోజులపాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. బ్రహ్మనాయుని ఆజ్ఞను పాటిస్తూ... పల్నాటి ‘వీరాచార పీఠం’ ఈ వేడుకలు నిర్వహిస్తూ వస్తోంది.

మొదటి రోజు ‘రాచగావు’, రెండవ రోజు ‘రాయబారం’ మూడవ రోజు ‘మందపోటు’ (చాపకూడు), నాల్గవ రోజు ‘కోడి పోరు’, ఐదవ రోజు  ‘కల్లిపాడు’ కార్యక్రమాలతో వీరా రాధన ఉత్సవాలుగా జరుపుతూ ఉన్నారు. ఈ ఉత్స వాల్లో ‘వీరవిద్యావంతులు’ ఆలపించే కథలు భావి తరాలకు ముందస్తు హెచ్చరికలు! తగిన జాగ్రత్తలు! మనో వికాస విజ్ఞానిక విపంచులు!

ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి పల్నాటి ఆచారవంతులంతా కారెంపూడిలో జరిగే ఈ వేడుకలకు కుటుంబ సమేతంగా వేలాదిగా హాజరవుతూ ఉంటారు. సమతా ధర్మం పాటించే వారికి ఇష్టమైన ప్రీతికరమైన దేవుడు చెన్న కేశవుడు. బ్రహ్మ నాయుడు వాడిన ‘నృసింహకుంతం’ రూపంలో చెన్న కేశవుని భక్తులు పూజిస్తారు. 

చాలా ఊళ్లలో ఈ రూపంలో పూజలందు కుంటున్న ఈ దైవాలు (నృసింహ కుంతాలు) ప్రతి కార్తీక చివరి అమావాస్య రోజున కార్యమ పూడిలోని నాగులేటి ఒడ్డున స్నాన మాచరించి భక్తులకు దర్శనమిస్తాయి. ఈ 5 రోజుల పల్నాటి వీరారాధన ఉత్సవాలలో ముచ్చటగా మూడవరోజు జరిపే ‘చాపకూడు’ ఉత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని గ్రామాల్లో అధికారికంగా నిర్వహించాలని భక్తులు కోరుతున్నారు. సమతా భావం మరింతగా వెల్లివిరియడానికి ఇది అవసరం.
– ధర్నాశి చిరంజీవి ‘ 70950 91228
(రేపటి నుంచి 16వ తేదీ వరకు కారెంపూడిలో ‘పల్నాటి వీరారాధన’ ఉత్సవాలు) 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement