
రోనా విల్సన్
ఖైదీల హక్కుల కోసం పనిచేసిన రోనా విల్సన్ తానే ఒక ఖైదీలా ఏప్రిల్ 2018 నుంచి జైల్లో ఉన్నారు. ఆయన బెయిల్ చాలాసార్లు తిరస్కరణకు గురైంది. 2018 ఏప్రిల్ 17న పుణే పోలీసులు ఢిల్లీలోని ఆయన ఇంటిమీద దాడి చేసి, భీమా కోరేగావ్ హింసలో ఆయన పాత్ర ఉందని ఆరో పిస్తూ అరెస్ట్ చేశారు. ప్రభు త్వాన్ని కూలదోయడం కోసం రాజీవ్‌గాంధీ హత్య తరహాలో ప్రధాని నరేంద్ర మోదీని హత్య చేసేం దుకు నక్సలైట్లు పన్నిన బృహత్ కుట్రలో భాగమ య్యారని మరో ఆరోపణ చేశారు. దీన్ని నిరూపిం చడానికిగానూ ఆయన లాప్‌టాప్‌లో దొరికిందని చెబుతూ ఒక లేఖను చూపారు. కానీ సైబర్ ఫోరె న్సిక్ నిపుణులు, ఈ లేఖను మాల్వేర్ ద్వారా ద్రోహచింతనతో ఆయన లాప్‌టాప్‌లో చేర్చివుం డొచ్చని భావిస్తున్నారు. అయినప్పటికీ ఈ తీవ్ర ఆరోపణ బెయిల్ ఇవ్వకుండా ఆయన్ని జైల్లో ఉంచడానికి కారణమైంది.
రాజకీయ ఖైదీల విడుదల కోసం పనిచేసే సీఆర్‌పీపీ (ద కమిటీ ఫర్ ద రిలీజ్ ఆఫ్ పొలిటికల్ ప్రిజనర్స్) వ్యవస్థాపక సభ్యుడు రోనా విల్సన్. జాతీయ భద్రతా చట్టం, చట్టవ్యతిరేక కార్యకలా పాల నిరోధక చట్టం లాంటి వాటి ఆధారంగా తీవ్రవాద నేరారోపణలు ఎదుర్కొనే వారికి సీఆర్‌పీపీ న్యాయ సహాయం అందిస్తుంది. పది హేను, ఇరవై ఏళ్లుగా రోనా రాజకీయ ఖైదీల విడుదల కోసం పనిచేస్తున్నారు. రోనా లాంటివాళ్లు అసమ్మతివాదుల చివరి ఆశ, అంటారు రచయిత్రి మీనా కందసామి. భీమా కోరే గావ్ స్మారకోత్సవంలో దాడికి జనాన్ని సమీకరించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న హిందుత్వ నాయకులు మిలింద్ ఎక్‌బోటే, శంభాజీ భిడేను కాపాడుకోవడానికే వీళ్ల మీద ప్రభుత్వం ఈ నింద మోపిందని చాలామంది కార్యకర్తలు ఆరోపించారు.
స్వభావ రీత్యా ప్రచారాన్ని కోరుకోని రోనా గురించి పెద్దగా ఎవరూ రాయలేదని రచయిత్రి అరుంధతీ రాయ్ అంటారు. పాండి త్యమూ, పరిశ్రమా చేయగలిగిన పరిశోధకుడిగా ప్రొఫెసర్ జి.హరగోపాల్ ఆయన్ని అభివర్ణిం చారు. తన విలువల పట్ల ఆయన నిబద్ధత రాజీలేనిది. పేద ప్రజలు, ఖైదీలు, గిరిజనుల పట్ల గల చింతే ఆయన ప్రపం చాన్ని మలిచిందని కారవాన్ పత్రిక రాసింది. 2001 పార్లమెంట్ మీద దాడి కేసులో ముందు మరణదండన పడి, తగిన సాక్ష్యాధా రాలు లేని కారణంగా 22 నెలల తర్వాత ఎస్.ఎ.ఆర్.గిలానీ విడుదలయ్యాక సీఆర్‌పీపీ ఏర్పడింది. రాజకీయ కారణాల వల్ల నిర్బంధానికి గురయ్యేవారి విడుదల కోసం పనిచేయాల్సిన అవసరాన్ని గుర్తించిన గిలానీ, అమిత్ భట్టాచార్య, రోనా విల్సన్ దీన్ని స్థాపించారు. అయినా ఈ ధోరణి తగ్గుముఖం పట్టలేదు. తనకు వ్యతిరేకులు అనుకునేవారినందరినీ వ్యవస్థ బంధిస్తోంది. మేధావులు, రచయితలు, న్యాయవాదులు, పాత్రి కేయులు, పరిశోధకులు, విద్యార్థులు, కార్యకర్తలు ఎందరో పెద్ద సంఖ్యలో జైళ్లలో మగ్గడాన్ని చూస్తు న్నాం. అత్యవసర పరిస్థితి కాలంలో ఇందిరా గాంధీ సర్కారు టార్గెట్ చేసిన ఎందరో రెండేళ్ల పాటు జైళ్లలో ఉన్నారు. కానీ ఇప్పటి ప్రభుత్వ కాలంలో కొంతమంది రెండేళ్లకంటే ఎక్కువ కాలంగా జైళ్లలో మగ్గుతున్నారు. ఇలాంటివారి కోసం పనిచేయడానికి రోనా విల్సన్ లాంటివారి అవసరం ఎంతోవుంది.
అరెస్టుకు ముందు తన పీహెచ్‌డీ కోసం విదే శాలకు వెళ్లే సన్నాహాల్లో ఉన్నారాయన. ఇంగ్లండ్ లోని సర్రీ యూనివర్సిటీ, లెస్టర్ యూనివర్సిటీ లకు అప్లై చేసుకున్నారు. జైల్లో ఉన్నా కూడా ఆయన తృష్ణ ఆవిరి కాలేదు. రెండు విశ్వవిద్యా లయాల్లోని ఆచార్యగణంతో కాంటాక్టులో ఉండి తన అనిశ్చిత పరిస్థితి గురించి తెలియజేయవల సిందిగా కుటుంబ సభ్యులకు ఒక లేఖ రాశారు. ఈ దేశానికి చెందిన ఒక తెలివైన పరిశోధకుడి ఖైదు నిందార్హమైనది. ఆయనకు వ్యతిరేకంగా రాజ్యం చేసిన తీవ్ర ఆరోపణలను ఖండితంగా నిరూపించుకోవాలి లేదా మిగిలిన అందరు రాజకీయ ఖైదీలతో సహా ఆయన్ని కూడా విడుదల చేయాలి.
– సందీప్ పాండే, అతుల్
సందీప్ పాండే, సోషలిస్ట్ పార్టీకి
చెందినవారు. అతుల్, ఎల్‌ఎల్‌బీ విద్యార్థి