
ఏవైనా విషయాలు తమ సాధారణ పరిజ్ఞానాన్ని ఛాలెంజ్ చేసినప్పుడు మనిషి అధిక తెలివిని సంపాదించాలనుకుం టాడు. కానీ కొంత మంది అర్ధ తెలివి లేదా మూర్ఖ త్వానికి దిగిపోతారు. ఇది ఎప్పుడు సాధ్యమౌతుం దంటే–తమ ఆడియెన్స్ కూడా అర్ధ తెలివిని ఆమోదించేవారు అయినప్పుడు! తాము సుప్రీం అని, తాము ఏది చెప్పినా చెల్లుతుందని, తమకు మెజారిటీ సపోర్ట్ ఉందనే వాతావరణం వల్ల ఇదంతా జరుగుతుంది. ప్రణాళికా బద్ధంగా ద్వేష పూరితమైన యాటిట్యూడ్ బలపడటం వల్ల కలెక్టివ్ విచక్షణ చచ్చిపోతుంది.
ముస్లిం స్త్రీలను ఆన్‌లైన్ సేల్‌కు పెట్టి, దాని మీద మార్కెట్ క్రియేట్ చేద్దామనుకున్న వాళ్ళ మానసిక తత్వం కూడా ఇందులో భాగమే! ఒక అమ్మాయిని ఊహత్మకంగా సేల్‌కు పెట్టి, ఆమెను ఓన్ చేసుకున్నట్టుగా చూపే ఈ మానసిక వైపరీత్యం పైన చెప్పిన కారణాల వల్ల పుట్టుకొస్తుంది. ఇది సాధారణ ఎమోషన్ మాత్రమే కాదు. ఒక ప్రణాళికాబద్ధమైన కమ్యూనికేషన్. మనిషిలో ఒక హేతు రహితమైన బయాస్‌ను సృష్టించడానికి ఇదంతా ఉపయోగపడుతుంది. (చదవండి: తప్పు చేసినా శిక్షకు అతీతులా?)
‘సల్లీడీల్స్’, ‘బుల్లీబాయి’ యాప్‌లతో ముస్లిం స్త్రీల మీద చేస్తున్న అమానవీయ దాడి ఇటువంటిదే. ఇప్పటికి ఈ కేసులో 21 ఏళ్ళ అబ్బాయి, 18 ఏళ్ళ అమ్మాయి అరెస్ట్ అయ్యారు. దీని వెనుక ఇంకా పెద్ద స్థాయివాళ్లు ఉంటారు. ఈ యాప్‌లను ‘గిట్ హబ్’ అనే వెబ్‌సైట్ హోస్ట్ చేసింది.
జూలైలోనే కొంత మంది వికృత మానసిక వాదులు సల్లీ డీల్స్ యాప్‌ను మొదలు పెట్టారు. అప్పుడు కొంత దీనికి వ్యతిరేకత వచ్చే సరికి తీసివేసినా, ఆ తర్వాత ఎవరి మీదా ఎటువంటి చట్టపరమైన చర్యలూ తీసుకోలేదు. ఆ ధైర్యం తోటే మళ్ళీ ఈ కొత్త యాప్ జనవరి 1, 2022న తిరిగి ప్రారంభించారు. కనీస ప్రతిస్పందన కరువైన రోజుల్లో ఇటువంటి వైపరీత్యాలు నార్మలైజ్ కావడం మామూలే. (చదవండి: నిజాలకు పాతరేసి.. అబద్ధాన్ని అందలం ఎక్కిస్తే...)
ముస్లింలు మైనారిటీగా ఉన్న ఈ దేశంలో లోక్ సభలో వారి సంఖ్య 27. అందులో తృణమూల్, కాంగ్రెస్ నుండే ఎక్కువ. అదే 1980లో చూస్తే, మన పార్లమెంట్‌లో 47 మంది ముస్లిం ఎంపీలు ఉండేవాళ్ళు. పార్లమెంట్‌లో మెజారిటీ కలిగిన బీజేపీలో ముస్లింల సంఖ్య సున్న. మొత్తం మీద తాజా సంఘటనను తాలిబన్లు ప్రత్యక్షంగా ఆడవాళ్ళను బానిసలుగా తీసుకోవడం లాంటి వికృత చర్యకు సారూప్యంగా చూడవచ్చు. ద్వేషం, బలహీనుల పట్ల మదమెక్కిన ఆధిపత్యం ఎంత దాకా తీసుకెళ్తాయో ఇటువంటి చర్యల వల్ల తెలుస్తుంది. అసలు ఈ యాప్‌లకు పోర్న్ యాప్‌ల పేర్లు పెట్టడంలోనే తమను ఎవరూ ఏమీ చేయలేరనే మనిషి ధీమా అర్థమవుతోంది.
దీని పూర్వాపరాలు చూడ్డానికి కావాల్సిన హైపోథసిస్ చేసే విచక్షణ జ్ఞానాన్ని మనిషిలో చంపే ఫాసిస్ట్ మనస్తత్వం ఇది. తమ మతం లేదా తమ కులపు ఆడవాళ్ళు వేరు, ఇతర ఆడవాళ్ళు వేరు. అదో విభిన్నమైన జాతిగా ఒక వైరుధ్యాన్ని ఊహాకల్పన చేయడం ఈ యాప్‌ల ప్రధాన లక్ష్యం. ఇటువంటి చర్యలను మనం ఒక ప్రజా బాహుళ్యంగా ఆపకపోతే, దీనికి వ్యతిరేకంగా కనీస ప్రతి స్పందన చూపకపోతే, అంబేడ్కర్ నొక్కివక్కాణించిన ‘రాజ్యాంగ నీతి’ ఏదైతే ఉందో దాన్ని తుంగలో తొక్కినవారం అవుతాము. రేపు బాధ్యతగా తయారు చేయాల్సిన తరాన్ని ఈ రోజే మనం నాశనం చేసిన వాళ్ళమౌతాము. (చదవండి: సిగ్గు పడాల్సిన భారత జాతీయ నేరం వధూహత్య)
- పి. విక్టర్ విజయ్ కుమార్
రచయిత, విమర్శకుడు
pvvkumar@yahoo.co.uk
Comments
Please login to add a commentAdd a comment