సామాజిక మాధ్యమాల్లో అడుగుపెట్టింది మొదలుగా ఫేస్‌బుక్ గుత్తాధిపత్య ధోరణులను అమలు చేస్తూనే ఉంది. తనకు భవిష్యత్తులో పోటీకి రాగలవనే అనుమానంతో అప్పుడే వెలుగులోకి వస్తున్న స్టార్టప్ సంస్థలను వీలయితే కొనేయడం.. చిన్న సంస్థలను తొక్కేయడం దానికి అలవాటుగా మారిపోయింది. ఈ గుత్తాధిపత్య ధోరణులపై అమెరికా న్యాయస్థానాల్లో ఇప్పుడు దావాలు నడుస్తున్నాయి. 2012లో బిలియన్ డాలర్లతో ఫొటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్‌ని, 2014లో 19 బిలియన్ డాలర్లతో మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ని ఫేస్‌బుక్ కొనేయడం తీవ్ర వివాదాలకు దారితీసింది. అక్రమ వాణిజ్య వ్యూహాలను అమలుచేసిందంటూ ఫేస్‌బుక్‌పై అమెరికన్ ప్రభుత్వాలే కేసులు పెట్టాయి. అల్ఫాబెట్ ఇంక్‌ను లక్ష కోట్ల డాలర్లకు కొనివేసిన గూగుల్ ఇప్పటికే న్యాయవివాదాలను ఎదుర్కొంటోంది. గతంలో మైక్రోసాఫ్ట్ కూడా అప్పటి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌తోపాటు సొంత బ్రౌజర్ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌ను ఉచితంగా యూజర్లకు అందించడంతో అమెరికా న్యాయవిభాగం 1988లోనే దావా వేసి మైక్రోసాఫ్ట్ మెడలు వంచింది. ప్రభుత్వ ఆదేశాలను, నిబంధనలను ఫేస్‌బుక్ ఏమాత్రం పట్టిం చుకోవడం లేదని అది విలీనం చేసుకున్న ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ అనుబంధ విభాగాలను వేరు చేసి దాని గుత్తాధిపత్యాన్ని బద్దలు చేయడం ఒక్కటే పరిష్కారమని ఈ వ్యాసకర్త అభిప్రాయపడుతున్నారు. కనీవినీ ఎరుగని న్యాయవివాదాల పాలవడం ఫేస్‌బుక్ స్వయంకృతాపరాధమేనని చెబుతున్నారు.
సంస్థ కోర్ నాయకత్వంలో అంతర్గత చర్చ సందర్భంగా ఫేస్‌బుక్ అధినేత మార్క్ జుకర్‌బెర్గ్ 2012లో పంపిన ఒక ఈమెయిల్ ఎనిమిదేళ్ల తర్వాత ఆ సంస్థను అతిపెద్ద సంక్షోభంలోకి నెట్టివేసింది. ఆనాటికి కేవలం 13 మంది ఉద్యోగులతో నడుస్తూ పెద్దగా లాభాల బాటలో నడవని ఇన్‌స్ట్రాగామ్ అనే చిన్న స్టార్టప్ సంస్థ అతివేగంగా ఫొటో యాప్‌గా ఎదుగుతూ ఫేస్‌బుక్‌కు ప్రమాదకరంగా మారనుందని జుకర్‌బెర్గ్ పసిగట్టారు. ఆనాటికి ఇన్‌స్టాగ్రామ్ ఆవిర్భవించి రెండేళ్లయింది. సోషల్ మీడియాలో అప్పటికే ఆధిపత్యం చలాయిస్తున్న ఫేస్‌బుక్‌ను కచ్చితంగా ఇన్‌స్టాగ్రామ్ తదితర అంకుర సంస్థలు దెబ్బతీస్తాయని మార్క్ తన ఈ–మెయిల్‌లో పేర్కొన్నారు. ఇన్‌స్టాగ్రామ్ వంటి అంకుర సంస్థలకు వ్యతిరేకంగా మనం అవలబించబోయే ప్రాథమిక వ్యూహం ఏమిటి అని కంపెనీ ఆంతరంగిక సమావేశంలో చర్చ జరిగినప్పుడు ఇలాంటి కంపెనీలను కొనేయడమేనని జుకర్‌బెర్గ్ తేల్చి చెప్పారు. ‘ఇలాంటి కంపెనీలను కొనేసి వాటి ఉత్పత్తులను కొనసాగిద్దాం’ అదేసమయంలో ఈ కంపెనీల ఆవిష్కరణలను వీలైనంత త్వరగా మన కీలకమైన ఉత్పత్తులలోకి చొప్పిద్దాం’ అని ఫేస్‌బుక్ సంస్థాపకుడు చెప్పారు. దీంతో ఇన్‌స్టాగ్రామ్ సహ వ్యవస్థాపకుడు కెవిన్ సిస్ట్రోమ్ జరగబోయే పరిణామాలను ఊహించారు. ఫేస్‌బుక్ ప్రయత్నాలకు సహకరించకపోతే దాని అధినేత మార్క్ ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని, అప్పటికి అతి చిన్న సంస్థగా ఉన్న ఇన్‌స్టాగ్రామ్‌ను మార్క్ నాశనం చేసి తీరతాడని కెవిన్ తన తొలి మదుపుదారులకు ఆనాడే మెసేజ్ పంపారు.
అవును ఇన్‌స్టాగ్రామ్ ఏదో ఒక రోజున ఫేస్‌బుక్‌కు పోటీదారుగా మారుతుంది. అయితే ఇన్‌స్టాగ్రామ్ సాంకేతికతను ఫేస్‌బుక్ అనుకరించి దాన్ని వాణిజ్యం నుంచి పక్కకు నెట్టేయవచ్చు అని మార్క్ తలిచారు. దీంతో 2012 ఏప్రిల్‌లో ఇన్‌స్టాగ్రామ్ కంపెనీని కొనేయడానికి ఒక బిలియన్ డాలర్లు ఇస్తానని ప్రతిపాదించారు. దానికి కెవిన్ సిస్ట్రోమ్, ఇన్‌స్టాగ్రామ్ బోర్డ్ తలూపేశారు. అయితే ఈ విలీనాన్ని అమెరికాలోని ఫెడరల్ ట్రేడ్ కమిషన్, బ్రిటన్‌లోని ఆఫీస్ ఆఫ్ ఫెయిర్ ట్రేడింగ్ సంస్థలు ఆమోదించాల్సి ఉంది. దీంతో ఫేస్‌బుక్ వాదిస్తూ తనకు కెమెరా ఆసమ్ లాంటి ఇతర ఫొటో యాప్ నుంచి చాలా పోటీ ఉందని పేర్కొంది. ఇన్‌స్టాగ్రామ్‌కు ఆనాటికి పెద్దగా రాబడి లేనందున దాన్ని విలీనం చేసుకున్నంత మాత్రాన ఫేస్‌బుక్ మార్కెట్ వాటాకు అదనంగా ఏదీ వచ్చి చేరదని ఈ రెండు ప్రభుత్వ ఏజెన్సీలూ నమ్మాయి. దీంతో నాలుగు నెలలలోపే ఫేస్‌బుక్–ఇన్‌స్టాగ్రామ్ విలీ నంపై ఈ రెండు ప్రభుత్వ సంస్థలూ ఆమోదముద్ర వేశాయి. అయితే జుకర్‌బెర్గ్, సిస్ట్రోమ్‌ల మనస్సులో ఏముందనేది ఈ ప్రభుత్వ సంస్థలకు ఏమాత్రం తెలీదు.
ఈ బుధవారం సాయంత్రం అమెరికా ఫెడరల్ ట్రేడ్ కమిషన్, ఆ దేశంలోని 48 రాష్ట్రాలకు చెందిన అటార్నీ జనరల్స్ విడిగా యాంటీ ట్రస్ట్ కేసులను నమోదు చేస్తూ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, దాంతోపాటు వాట్సాప్ విలీనాన్ని రద్దు చేయాలని వాదించాయి. 2014లో ఫేస్‌బుక్ 19 బిలియన్ డాలర్లను వెచ్చించి వాట్సాప్‌ను కొనేసింది. అప్పటికి ఈ సంస్థ కూడా 55 మంది ఉద్యోగులతో ఎలాంటి రాబడీ లేకుండా కొనసాగుతూ ఉండేది. అయితే ఈ సంస్థల విలీనాన్ని రద్దు చేయమని కోరడం తీవ్రమైన అంశమే అవుతుంది. 1988లో మైక్రోసాఫ్ట్‌పై అమెరికా న్యాయవిభాగం కేసు పెట్టింది మొదలుగా అమెరికా ప్రభుత్వం ఏ కంపెనీని కూడా దాని అక్రమ విధానాలకుగాను విడదీయడం, వేరుచేయడానికి పూనుకోలేదు. అయితే ఇప్పుడు ఫేస్‌బుక్ అనుభవిస్తున్న తిరుగులేని గుత్తాధిపత్యాన్ని ఛేదించాలంటే సంస్థను విడదీయటం, చీల్చడం తప్ప మరొక మార్గం లేదని నా నమ్మకం.
మార్కెట్లో పోటీని తప్పించేలా సంస్థలను కొనుగోలు చేయడం లేదా తొక్కిపెట్టడం అనే వ్యూహాన్ని అమలుచేస్తూ అటు వినియోగదారులకూ, ఇటు ప్రకటనకర్తలకూ హాని చేకూరుస్తోందని అటార్నీ జనరల్స్, వాదులు ఆరోపిస్తే, వాదిస్తే ఎవరూ దాని పట్ల అనంగీకారం తెలుపలేరు. వెంచర్ కేపిటలిస్టులు ఫేస్‌బుక్ నిర్దాక్షిణ్యమైన ఎత్తుగడలకు ఎంతగా భయపడుతున్నారంటే, మార్క్ జుకర్‌బెర్గ్ తనకు పోటీ వస్తాయని భావిస్తున్న స్టార్టప్‌లలో.. అవెంత చిన్నవైనా సరే మదుపు చేయడానికి వీరు భీతిల్లుతున్నారు.
దీని ఫలితంగా సోషల్ మీడియా వినియోగదారులకు చట్టబద్ధంగా ఎంచుకునేందుకు వీలులేకుండా పోతోంది. వీరికి ఫేస్‌బుక్ గోప్యతా విధానాలు నచ్చకపోతే, తక్కువ ప్రకటనలు ఉండాలని కోరుకుంటే, ఫేస్‌బుక్ ప్లాట్‌ఫాంపై చేరుతున్న తప్పుడు సమాచారాన్ని తొలగించడం తన బాధ్యత కాదని ఫేస్‌బుక్ భావిస్తే, వారు ఫేస్‌బుక్‌ను వదిలి ఇన్‌స్టాగ్రామ్‌కో, వాట్సాప్‌కో మారిపోయే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఈ రెండు ప్రముఖ యాప్‌లు ఇప్పటికీ ఫేస్‌బుక్ ప్రపంచంలో భాగమై ఉన్నాయి. వీటి ద్వారా ఫేస్‌బుక్ తన వినియోగదారుల సమాచారాన్ని ఉపయోగించుకుంటూ డబ్బు సంపాదిస్తూనే ఉంది.
ఫేస్‌బుక్ చేసిన తప్పుడు చర్యలపై ఇప్పటికీ డజనుసార్లకు పైగానే జుకర్‌బెర్గ్ క్షమాపణ చెప్పడమే కాకుండా మంచిగా వ్యవహరిస్తామని హామీ ఇచ్చారు కూడా. కానీ ఏదీ మారింది లేదు. 2012లో గోప్యతా సంబంధిత ఉల్లంఘనలకు గాను ఫేస్‌బుక్.. ఫెడరల్ ట్రేడ్ కమిషన్‌తో పరిష్కారానికి అంగీకరించింది. కానీ ఆ పరిష్కార ఒప్పందాన్ని ఉల్లం ఘించినందుకు అది ఏడేళ్ల తర్వాత 5 బిలియన్ డాలర్లను చెల్లించాల్సి వచ్చింది. ఫేస్‌బుక్‌ని ఇప్పుడు పూర్తిగా విభజించాలని ఎందుకు పట్టుబడుతున్నారంటే అది చూపించిన పరిష్కారాల్లో ఏ వ్యత్యాసమూ లేనందునే. ప్రభుత్వ ఆదేశాలను ఫేస్‌బుక్ ఏమాత్రం పట్టించుకోలేదని సంస్థ పదేపదే రుజువు చేస్తూ వచ్చింది. ఫేస్‌బుక్ పోటీ వ్యతిరేక వైఖరి సాంప్రదాయిక విధానాలను తిరస్కరిస్తోందని ప్రముఖ ఆర్థిక వేత్త హల్ సింగర్ పేర్కొన్నారు.
ఇక రెండో కారణం ఏమిటంటే సోషల్ మీడియా వాణిజ్యంలో పోటీని సృష్టించడానికి ఫేస్‌బుక్‌ను విభజించడం ఒక్కటే మార్గం కాబట్టే. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ నెలకు వందకోట్ల మంది క్రియాశీలక యూజర్లను కలిగి ఉంది. వాట్సాప్‌కు 1.6 బిలియన్ల మంది అభిమానులు ఉన్నారు. పైగా ఫేస్‌బుక్‌లో విలీనం చెందకముందు ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లు గోప్యత, లాభదాయికత వంటి విషయాల్లో కాస్త భిన్నమైన వైఖరితో ఉండేవి. ఉదాహరణకు డేటాతో ఎలా వ్యవహరించాలి అనే విషయమై వాట్సాప్ సీఈఓ జాన్ కౌమ్ ఫేస్‌బుక్ నుంచి 2018లో బయటకొచ్చేశారు. వాట్సాప్ యూజర్ల డేటాను చాలా కాలం పాటు జాన్ కౌమ్ ప్రైవేటుగా ఉంచారు. కానీ పేస్‌బుక్ అధినేత జుకర్ బెర్గ్ మాత్రం ఆ డేటాను పర్యవేక్షించడం మొదలెట్టారు.
ఫేస్‌బుక్ నుంచి వాట్సాప్ విడిపోయినట్లయితే ఫేస్‌బుక్ డేటా విధానాలకు ప్రత్యామ్నాయంగా అది ఆవిర్భవించగలదు. 2014కి ముందు వాట్సాప్ అలాగే వ్యవహరించేది. ఇన్‌స్టాగ్రామ్ విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది. ధరల పరంగా ఇవి ఫేస్‌బుక్‌తో పోటీ పడలేకపోవచ్చు కానీ సోషల్ మీడియా యూజర్లు కోరుకునే ఇతర అంశాలన్నింటినీ అవి అందించగలవు. ప్రభుత్వ యాంటీ ట్రస్ట్ కేసులు కోర్టుల్లో గెలవటం చాలా కష్టమనేది తెలీని విషయం కాదు. కానీ ఫేస్ బుక్ ఆధిపత్యాన్ని తగ్గించే విషయమై రిపబ్లికన్లు, డెమోక్రాట్లు ఇరువురికీ ఏకాభిప్రాయమే ఉంటోంది. ఫేస్‌బుక్‌తో మొదలుపెట్టి బడా టెక్నా లజీ కంపెనీల ఆధిపత్యాన్ని తగ్గించే బిల్లును ప్రవేశపెట్టడం ఇప్పుడు అమెరికాలో చాలా సులువు. పైగా యాంటీ ట్రస్ట్ వివాదాలకు సంబంధించినంతవరకు ఫేస్ బుక్‌ను ఛేదించడం అనేది సరైన పరిష్కారం మాత్రమే కాదు.. అదే ఏకైక పరిష్కారం కూడా.
జో నొకెరా, రచయిత, కాలమిస్ట్
Comments
Please login to add a commentAdd a comment