మాట్లాడుతున్న డీఎస్పీ మహబూబ్ బాషా, వెనుక ముసుగులో నిందితులు
గుంటూరు: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను తొలగించేందుకు భార్య, ప్రియుడు ఏకమై పథకం రచించారు. హత్యకు సహకరించిన వ్యక్తితో పాటు ఈ కేసులో ముగ్గురిని నల్లపాడు పోలీసులు అరెస్ట్ చేసినట్లు దక్షిణ సబ్ డివిజన్ డీఎస్పీ మహబూబ్ బాషా తెలిపారు. కలెక్టరేట్ రోడ్‌లోని దక్షిణ సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ వివరాలు వెల్లడించారు.
డీఎస్పీ మాట్లాడుతూ ఈనెల ఒకటో తేదీ రాత్రి గుంటూరు రూరల్ ఏటుకూరు పొలాల సమీపాన సాయి ఎస్టేట్స్ ఫ్లాట్స్ వద్ద కృష్ణబాబుకాలనీ మూడో వీధిలో ఉంటున్న షేక్ బాషా అలియాస్ అమీర్‌వలి (30) దారుణ హత్యకు గురయ్యాడు. భర్త మృతిపై భార్య షాహీనా నల్లపాడు పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. జిల్లా ఎస్పీ కె.ఆరిఫ్‌హఫీజ్ ఆదేశాల మేరకు హత్యానేరం కింద కేసు నమోదు చేసి, సీఐ బత్తుల శ్రీనివాసరావు, ఎస్‌ఐ డి.అశోక్ ప్రత్యేక బృందాలతో దర్యాప్తు ప్రారంభించారు. నిందితులు ఘటనా స్థలంలో ఏమాత్రం ఆధారాలు దొరక్కుండా జాగ్రత్తపడ్డారు. మృతుని భార్య ప్రవర్తనపై అనుమానాలు వ్యక్త మవడం.. సాంకేతిక పరిజ్ఞానంతో విచారణ వేగవంతం చేశారు. దీంతో అసలు విషయం బయటపడింది...
పథకం పన్నారిలా..
పదేళ్ల క్రితం షేక్ బాషా అలియాస్ అమీర్‌వలితో షాహీనకు పెళ్లయింది. వీరికి ఇద్దరు పిల్లలు. భర్త లారీలకు రంగులేసే పనులకు వెళ్లేవాడు. భార్య ఏటుకూరు పొలాల్లోని ఎస్టేట్స్ వద్ద ప్లాట్స్‌లో ఆయాగా పనిచేస్తుంది. అక్కడే ఆనందపేట ఎనిమిదో వీధిలో ఉంటున్న షేక్ షబ్బీర్ కారు డ్రైవర్‌గా పనిచేసేవాడు. ఈ క్రమంలో వారి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడి, దాదాపు ఆరు నెలలుగా నడుస్తోంది. అవివాహితుడైన షబ్బీర్ షాహీనాను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. దీంతో అడ్డుగా ఉన్న భర్తను హతమార్చేందుకు ఇద్దరు కలిసి పథకం రచించారు. ఈ క్రమంలో వారిద్దరూ కలిసి బంధువైన నల్లచెరువు 25వ వీధి దర్గా వెనుక ఉంటున్న షేక్ రఫీ సహకారం తీసుకున్నారు. దీంతో రఫీ కొత్త సిమ్ నంబర్‌తో బాషా అలియాస్ అమీర్‌వలితో మాట్లాడేవాడు.
తాను లారీల యాజమాని అని, పనులు ఇప్పిస్తానని పరిచయం చేసుకున్నాడు. ఈ క్రమంలో రఫీ, బాషా తరుచూ మద్యం తాగేవారు. ఈనెల ఒకటో తేదీన ముందస్తుగా రచించిన పథకం ప్రకారం బాషాను సాయి ఎస్టేట్స్ పొలాల వద్దకు పిలిచి అతిగా మద్యం తాగించారు. మత్తులో ఉండగా షేక్ షబ్బీర్, రఫీలు కలిసి బాషాను మోటారుసైకిల్ ఫోర్క్ రాడ్, కత్తితో అత్యంత క్రూరంగా హత్య చేసి పరారయ్యారు. మృతుడి భార్య ప్రవర్తనపై అనుమానం రావడం, మృతుడి సెల్‌ఫోన్ కాల్ లిస్ట్ బయటకు తీయడంతో అసలు కథ బయటపడింది. బుధవారం మృతుని భార్యతోపాటు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ద్విచక్ర వాహనం, ఫోర్క్‌రాడ్, కత్తి స్వాధీనం చేసుకున్నారు. సీఐ బత్తుల శ్రీనివాసరావు, ఎస్‌ఐ డి.అశోక్, హెచ్‌సీ కె.సుబ్బారావు, కానిస్టేబుళ్లు షేక్ జాన్‌సైదా, డి.పోతురాజు, కె.వెంకటనారాయణ, షేక్ మస్తాన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment