కృష్ణానదిలో యువతిని బయటకు తీసుకు వస్తున్న ఎస్‌ఐ రమేష్
తాడేపల్లిరూరల్: స్థానిక పోలీసులకు మరోసారి అభినందనలు వెల్లువెత్తాయి. గురువారం అర్థరాత్రి విజయవాడ రాణిగారి తోటకు చెందిన ఓ యువతి ఇంట్లో తల్లిదండ్రులతో గొడవ పడి.. ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై కనకదుర్గ వారధికి వచ్చింది. తాడేపల్లి వచ్చి గుంటూరు రోడ్డులో నుంచి విజయవాడ వెళ్లే వారధి రహదారిలో 26–27 పిల్లర్ల వద్ద బండి పార్క్ చేసి సదరు యువతి కృష్ణా నదిలోకి దూకింది. గమనించిన యువకుడొకరు పోలీసుల కు సమాచారం అందించడంతో అటు విజయవాడ పోలీసులు, ఇటు తాడేపల్లి పోలీసులు కనకదుర్గ వారధి వద్దకు చేరుకున్నారు. మొదటగా తాడేపల్లి ఎస్‌ఐ రమేష్, హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ, బీట్ కానిస్టేబుల్ షరీమ్ స్వామిలతో కలసి కృష్ణానదిలోకి వెళ్లారు.
కృష్ణానది కనకదుర్గ వారధిపై కొంతమంది సిబ్బందిని పంపి యువతి ద్విచక్రవాహనం ఉన్న ప్రాంతం వద్ద చూడాలని సూచించారు. సుమారు 1.5 కిలోమీటర్లు ఇసుకలో నడుచుకుంటూ వెళ్లి నది నీటిలో అపస్మారక స్థితిలో పడిఉన్న యువతిని గుర్తించారు. ఒడ్డుకు తీసుకు వచ్చి నీటిని కక్కించి, ప్రాథమిక చికిత్స చేశారు. అప్పటికీ ఆ యువతి తేరుకోకపోవడంతో దుప్పటి సాయంతో యువతినిమోసుకుంటూ వారధి వద్దకు తీసుకు వచ్చారు. 108 సిబ్బందిని సిద్ధంగా ఉంచడంతో ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యనిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అయితే యువతి ఆరోగ్యానికి ఎటువంటి ఢోకా లేదని డాక్టర్లు చెప్పడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అర్థరాత్రి యువతిని కాపాడిన సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు. తమ సిబ్బంది సకాలంలో స్పందించి అతి కష్టం మీద యువతిని బయటకు తీసుకు వచ్చి ప్రాణాలు కాపాడారంటూ ప్రశంసించారు. అలాగే పోలీసులకు సమాచారం ఇచ్చిన యువకుడికి కూడా పోలీస్‌శాఖ తరుపున అభినందనలు తెలియజేశారు.
తాడేపల్లి ఎస్‌ఐ రమే ష్, హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణలను జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్, అడినల్ ఎస్పీ శ్రీనివాసరావు, డీఎస్పీ రాంబాబు, సీఐ శేషగిరిరావు, పెదకాకాని సీఐ సురేష్ బాబులు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment